7, నవంబర్ 2018, బుధవారం

యోగభావనలు (Concepts of Yoga) - 5



పుణ్యం - పాపం


భారతీయుల ఆలోచనా విధానంలోని ప్రముఖమైన భావాలలో పుణ్యం పాపం అనే భావన కూడా ఒకటి. పరపీడనను పాపకార్యంగా, పరోపకారాన్ని పుణ్యకార్యంగా చాలామంది భారతీయులు భావిస్తుంటారు. 

దానధర్మాలు చేయడం, గుళ్ళూ గోపురాలు కట్టించడం, తీర్థయాత్రలు చేయడం, నోములు, వ్రతాలు చేయడం మొదలైన పనులు పుణ్యకార్యాలనీ, ఇతరులకు అన్యాయం చేయడం పాపకార్యమనీ సాధారణంగా అందరు భావిస్తుంటారు.

సమాజంలో ఈ భావనలెలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సదాచారణ, సద్గుణసంపత్తిద్వారా మానవుడు శక్తిని ఆర్జించడాన్ని యోగమార్గమంటారని మనం తెలుసుకున్నాం. ఈ సద్గుణసంపత్తినే పతంజలి మహర్షి  యమనియమాలని పేర్కొన్నాడు. 

ప్రేమ, సహనం, శ్రద్ధ, విధేయత, ఐకమత్యం, ఉదారత, మితాహారం, మితభాషణ మొదలైన సద్గుణాలను కలిగి ఉండటం, దురలవాట్లకు దూరంగా ఉండటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, శుచిశుభ్రత పాటించడం, విద్యను, విజ్ఞానాన్ని ఆర్జించడం, నాగరికత అలవరచుకోవడం, కోపాన్ని జయించడం, స్త్రీలను, పెద్దలను గౌరవించడం, సత్సంప్రదాయాలను పాటించడం, కుటుంబ విలువలు, సామాజిక విలువలను పాటించడం ….ఇలా సద్గుణ సంపత్తి అనేది చాలా విస్తారమైన పరిధిని కలిగి ఉంటుంది.

పైన పేర్కొన్నటువంటి కొన్ని సదాచారాలను పాటించడం ద్వారా మానవుడు శక్తిని ఆర్జించడాన్ని ప్రాచీన భారతీయ ఋషులు తపస్సు అని అన్నారు. అలా ఆర్జించిన శక్తిని తపశ్శక్తి అనేవారు. ఈ ప్రక్రియనంతా వారు యోగమార్గంగా పేర్కొన్నారు. దీనికి పతంజలి మహర్షి యోగదర్శనం అనే శాస్త్రీయ రూపాన్నిచ్చాడు. నాటి భారతీయ సమాజం ఆ విలువలతోనే మనుగడ సాగించేది.

కాలక్రమంలో కొందరు దుర్మార్గులు శక్తి సముపార్జన కొరకు దగ్గర దారులను వెదకడం ప్రారంభించారు. ఈ మార్గాలను అనుసరించేవారు సులువుగా, స్వల్పకాలంలో శక్తివంతులౌతున్నారనే భావన వ్యాప్తిచెందడంతో ఎన్నో నియమనిష్ఠలతో కూడుకొని దీర్ఘకాలం పట్టే ఈ తపస్సును, సదాచారాలను, సద్గుణసంపత్తిని పాటించేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఆయా దగ్గర దారులను అనుసరించేవారి సంఖ్య పెరిగిపోయింది. చివరకు భారతీయ సమాజం మొత్తం తపస్సు అనే సాధనకు దూరమైపోయింది.

ఈ దగ్గర దారులు అనేకం ఉన్నాయి. ఆయా దారులలో శక్తిని సముపార్జించడానికి కొందరు ప్రత్యేక సాధకులు బయలుదేరారు. వాటిని ఇంతకు ముందరి వ్యాసాలలో పేర్కొనడం జరిగినది. 

సాధారణ ప్రజలు మాత్రం పుణ్యం పాపం అనే దారిని ఎంచుకున్నారు. వారు పరపీడనను పాపకార్యంగానూ, దానధర్మాల్లాంటి పరోపకార కార్యాలనూ, దైవభక్తితో కూడుకున్న పనులను పుణ్యకార్యాలుగానూ భావించడం ప్రారంభించారు. ఇహ మిగిలిన అన్ని సద్గుణాలకూ క్రమంగా తిలోదకాలిచ్చారు. 

ఒక వ్యక్తిలో సుగుణాలు సహజ సిద్ధంగా ఉంటే తప్ప వాటిని సాధనలో భాగంగా అలవరచుకోవడం అనేది కనుమరుగైపోయింది. పైగా సహవాస దోషంతో (Social Osmosis) ఒకరి నుండి మరొకరు దుర్గుణాలను అలవరచుకొని సమాజంలో హెచ్చుభాగం దుర్గుణాలతో నిండిపోయింది.