30, అక్టోబర్ 2018, మంగళవారం

యోగభావనలు (Concepts of Yoga) - 4




శీలము-బలము



సమాజంలో జీవనం సాగించే ప్రజలలో సింహభాగం బలాన్ని ఆర్జించడానికే కృషిచేస్తుంటారు. 

ఇక్కడ బలం అంటే ప్రాపంచికమైన ఆధిక్యం. యశస్సు, సంపద, విజయం, అధికారం మరియు భోగం; ఇవన్నీ ప్రాపంచికమైన అంశాలే, ఇవన్నీ కూడా బలం యొక్క వివిధరూపాలే. వీటిలోని ఏదో ఒక అంశంలో తమ ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచుకొని మరింత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి సాధారణ జన జీవన స్రవంతిలోని అందరూ ప్రయత్నిస్తుంటారు. 

కొందరు సిరిసంపదలను, కొందరు భోగభాగ్యాలను, కొందరు కీర్తిని, కొందరు అధికారాన్ని, కొందరు ఆధిపత్యాన్ని కొందరు విజయాన్ని సాధించడం కొరకు తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. ఇలా చేయడం ఆక్షేపణీయం కాకపోగా అభిలషణీయం కూడా.

అయితే అందరూ శ్రమిస్తుంటారు, అందరూ కృషిచేస్తుంటారు, అందరూ తపిస్తుంటారు, అందరూ ఆరాటపడుతుంటారు కానీ కొందరే ఆశించిన మేర కృతకృత్యులవుతుంటారు. 

ఎందుకంటే ఆయా ప్రయత్నాలు చేసే వారందరిలో ఎక్కువమంది తత్విషయాల సాధన కొరకు పూర్తిగా ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకుంటారు.

భౌతిక బలసంపత్తి సాధనలోని తాత్వికత ఏమిటో వీళ్ళలో చాలామందికి తెలియకపోవడమే దీనికి కారణం.

భౌతిక బలసంపత్తికి మూలం శీలసంపద. మన ప్రయత్నాలననుసరించి శీలమే కాలక్రమంలో వివిధరూపాలలో ఉండే భౌతిక బలంగామారుతుంది. (Character becomes Destiny)అందుకే ప్రాపంచిక బలాన్ని సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన యోగశాస్త్రాన్ని పతంజలిమహర్షి యమనియమాలనే పునాదుల మీద నిర్మించాడు. యమనియమాల సాధనంటే శీలనిర్మాణమే.

శీలమంటే సద్గుణ సంపత్తి, శీలమంటే మంచి నడవడిక, శీలమంటే క్రమశిక్షణ, శీలమంటే సదాచారం, శీలమంటే సత్సంప్రదాయం. .....ఇలా ఎన్ని రకాలుగానైనా శీలాన్ని మనం నిర్వచించవచ్చు. శీలస్వరూపాన్ని మనం విడిగా చర్చించుకుందాం. ఇప్పుడు దానికీ మరియు భౌతిక బలానికీ ఉండే సంబంధాన్ని మాత్రమే చర్చించుకుందాం.

శీలమంటే నేటి సమాజంలోని కొందరికి  చులకన, కొందరికి హేళన, మరి కొందరికి నిర్లక్ష్యం.

వయసులో ఉండగా అన్నీ అనుభవించి, ఇక ఏమీ అనుభవించలేని ముదుసళ్ళు చెప్పే శ్రీరంగనీతులుగా, జీవితంలో అనుభవించే అవకాశం లేనివారు పలికే చిలుక పలుకులుగా, జీవితమిచ్చే సుఖాలను అనుభవించడం చాతకాని చాదస్తపు మనుషుల ఆలోచనా విధానంగా చాలామంది శీలాన్ని గురించి చెప్పే మాటలను భావిస్తుంటారు.  

వీరి దృష్టిలో శీలమంటే ఏ గమ్యానికి చేర్చని ఒక మొండి రహదారిలో ప్రయాణం. జీవితంలో ఏ భాగ్యానికి మనలను నోచుకోనివ్వని ఒక శుష్క ప్రయత్నం. జీవితమిచ్చే అన్ని సుఖసంతోషాలను మననుండి లాగివేసుకొని మన బతుకును నిస్సారం చేసే ఒక చాదస్తపు వ్యధాభరిత ప్రయాస. కాబట్టి శీలం పేరుతో జీవితమందించే ఆనందాలను వదులుకోవడం మూర్ఖత్వం. 

ఇలాంటి ఆలోచనలతో వీరు జీవితంలో సద్గుణాలను అలవరచుకొని, శీలసంపత్తిని పెంచుకునే ప్రయత్నం ససేమిరా చేయరు. అయితే వీరికి ప్రాపంచికమైన బలసంపత్తి మాత్రం కావాలి. అందుకొరకు వీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రయత్నం మీద మాత్రమే ఆధారపడతారు. అంటే బలంకావాలి, దానిని అందించే శీలం మాత్రం అవసరం లేదు. బలానికి మూలం శీలమని కాక ప్రయత్నమని భావించడమే దీనికి కారణం.

వీరు అమితంగా కోరుకుంటూ, అపరిమితంగా శ్రమిస్తూ, తమ జీవిత సమయంలో సింహభాగాన్ని ఏ భౌతిక బలసంపత్తి సాధనకొరకు వెచ్చిస్తారో, వేటిని సాధించడంలోనే తమ జీవితానికి సార్ధకత ఉందనుకుంటారో, వాటన్నింటికీ మూలం తమ శీలమేననీ, తమ సద్గుణ సంపత్తే కాలక్రమంలో తాము కోరుకునే భౌతిక బలసంపత్తిగా, ప్రాపంచిక విజయంగా మారుతుందనీ వీరు తెలుసుకోలేరు. ఈ ధోరణే వీరి అపజయాలకు మూలకారణం గా మారుతుంది. 

శీలానికీ, బలానికీ ఉండే ఈ సంబంధాన్ని ఏ మేరకు అర్థం చేసుకుని తదనుగుణంగా నడచుకుంటారో ఆమేరకు మాత్రమే….

……ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా కూడా సంత్సంప్రదాయాలవలన ఏమేరకు శీలవంతులుగా ఉంటారో ఆమేరకు మాత్రమే జీవితంలో ఎవరైనా భౌతిక బలసంపత్తి సాధనలో కృతకృత్యులౌతుంటారు.

ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. 

సమాజంలో కొందరు దుర్మార్గులు కూడా విజయవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కనుక నడవడికకు, భౌతిక విజయాలకు సంబంధమే లేదని కొందరు వాదిస్తుంటారు. ఇది మరో చర్చ.  

వారు గతకాలపు సదాచారాలతో సాధించుకున్న బలసంపత్తిని సన్మార్గాన్ని విడనాడడం ద్వారా దుర్వినియోగం చేస్తూ, ఆ బలాన్నంతా పోగొట్టుకునే క్రమంలో ఉన్నారన్నదే వాస్తవం. వారి విజయాలన్నీ తాత్కాలికాలే. దీర్ఘకాలంలో వారు పతనం అవ్వడమేకాక తమను అనుసరిస్తూ అంటిపెట్టుకుని ఉండేవారికి కూడా దుర్గతి పట్టిస్తారు.

దీనికి మంచి ఉదాహరణ మన పురాణాలలోని అసురులు. వారు తపస్సు అనే సదాచారంతో సాధించిన బల సంపత్తిని దుర్మార్గపు పనులకోసం దుర్వినియోగం చేసి తుదకు అధోగతి పాలౌతుంటారు. 

అయితే సమాజంలో మనకు ఎదురయ్యే వ్యక్తులను మనం వారి జీవితంలో తుదికంటా పరిశీలించం. అప్పటికి వారేమి సాధిస్తున్నారో , వారేం చేస్తున్నారో, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో అంతవరకే చూస్తాం. కనుకనే మనకు అసలు తత్వం బోధపడదు.

మన నడవడికకు మెచ్చి ఏ దేవతో, ఏ దేవుడో మనకు వరమందించడం ద్వారా మనకు భౌతిక బల సంపత్తిని సమకూర్చరు. శీలమే బలంగా మారుతుంది. అది ప్రకృతి నియతి. ఇందులో ఏ దేవర ప్రమేయమూ లేదు.  ఎందుకంటే ప్రాపంచిక విజయపు పూర్వరూపం, మూల రూపం శీలం.

ఏ ఒక్కరూ కూడా ప్రాపంచిక విజయాన్ని ప్రత్యక్ష ప్రయత్నం ద్వారా సాధించలేరు. శీలసంపత్తి ద్వారా ప్రోదిచేసుకున్న మూలశక్తిని ప్రయత్నం యొక్క సహాయం ద్వారా తమకు కావలసిన రూపంలో ఉండే భౌతిక విజయంగా రూపుమార్చుకుంటారు ….అంతే. ప్రయత్నం అనేది ఈ మార్పిడికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. ఎంత ప్రయత్నించినా మూలశక్తి అనేదే లేనపుడు భౌతిక విజయంగా మనం దేనిని మార్చుకుంటాం. కనుకనే అటువంటి ప్రయత్నాలు వ్యర్థ ప్రయత్నాలుగా మిగిలిపోతాయి.

భౌతిక బలసంపత్తి సాధన కొరకు సమాజంలో దాదాపూ అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ కొందరే విజయం సాధించడానికి కారణం ఇదే.   

పైన వివరించిన నియమాన్ని ఎవరు ఏమేరకు తమ జీవితంలో పాటిస్తారో, ఆమేరకు మాత్రమే వారు విజయాలు సాధిస్తారు. ఒక్కొకరు ఒక్కో దశలో ఆగిపోతుంటారు, వారి సాధన మేరకే వారి విజయం కూడా ఉంటుంది. అందుకే సమాజంలో సాధారణమైన వ్యక్తులు ఎక్కువగానూ, గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులు తక్కువగానూ ఉంటారు. మధ్యస్థ విజయాలు సాధించిన వ్యక్తుల సంఖ్య కూడా వారి సాధనను బట్టి ఈ ఇరువురికీ మధ్యన ఎక్కడో ఓ చోట ఉంటుంది.

ఈ సూత్రం ఒక వ్యక్తికే కాదు ఒక కుటుంబానికి, ఒక సంస్థకి, ఒక సమాజానికి, ఒక జాతికి, ఒక దేశానికి ....ఇలా ఎవరికైనా వర్తిస్తుంది.