23, ఆగస్టు 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---16 (మొదటి అధ్యాయం చివరి భాగం)





ఎందుకీ వైఫల్యం..?!


ఇస్లాం,కాపిటలిజం,కమ్యూనిజం.. ఇవి మూడునూ మానవుడు యావత్ మానవాళినంతటినీ ఉద్దేశించి ఒక చక్కటి సామాజిక, రాజకీయ వ్యవస్థ కొరకు ఒకదాని తరువాత ఒకటిగా చేసిన మూడు మహా ప్రయత్నాలు. ఇవి మూడునూ విఫలమయ్యాయి. అయితే ఇవి విఫలమైనది అంతిమ లక్ష్య సాధనలో మాత్రమే. వీటి ఫలితంగా ప్రపంచంలో అనేక మార్పులు జరిగాయి.. అనేక అద్భుతాలు సంభవించాయి. తుదకు నేటి రూపం ఏర్పడింది. ఈ విధంగా ఇవి చాలా ప్రయోజనాన్నే సాధించాయి. ఐతే మానవుని ఆ చిరకాల స్వప్నం మాత్రం నెరవేరలేదు. ఆ విషయంలో మాత్రం మానవుడు వైఫల్యాన్నే చవి చూశాడు.

తన వైఫల్యానికి కారణాన్ని సమీక్షించుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు మానవునికి ఏర్పడింది.ఈ విధంగా ఒకదాని తరువాత ఒకటిగా విఫలయత్నాలు చేసుకుంటూ పోయే అవకాశం ఇక మానవునికి లేదు. అది ఆ మూడింటితోనే సరి.మానవుని వైఫల్యానికి ప్రధాన కారణం ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా మానవుడు ప్రతిక్రియాత్మక ధోరణితోనే వ్యవహరించాడు గానీ అసలు సత్యమేమిటనిగానీ, రాగద్వేష రహితంగా సరైన విధానమేమిటనిగానీ ఆలోచించలేదు. తన ప్రతిక్రియాత్మక ధోరణినే మానవుడు సరియైన విధానంగా, సత్యంగా భావించాడు. నేటి పరిభాషలో చెప్పాలంటే మానవుడు Proactiv గా కాక Reactive గా కృషి చేశాడు.అందువలనే విఫలం చెందాడు.

ఒక చక్కటి సామాజిక, రాజకీయ వ్యవస్థ కొరకు ప్రయత్నించేటపుడు ‘సరి అయిన వ్యవస్థ అంటే అసలు ఎలా ఉండాలి?’.. అని ఆలోచింపక అప్పటికి సమస్యగా పరిణమించిన విషయాలకు పరిష్కారంగా తోచిన ప్రతిక్రియాత్మక ధోరణితో నూతనమైన వ్యవస్థలను నిర్మించాడు. అందువలన అవి అప్పటికి సమస్యలను పరిష్కరించినా, కాలక్రమంలో ఈ పరిష్కారాలే మరలా కొత్త రూపంలో సమస్యలుగా రూపాంతరం చెందాయి. తిరిగి మానవుడు ఆ వ్యవస్థను కాదని తిరిగి కొత్త వ్యవస్థను నిర్మించేటపుడు కూడా మరలా ప్రతిక్రియాత్మక ధోరణితోనే వ్యవహరించాడు. దానితో అవికూడా అప్పటికి సమస్యలను పరిష్కరించినా కొంత కాలానికి తిరిగి స్వయంగా అవే సమస్యలుగా పరిణమించాయి.

అరాచకానికి వ్యతిరేకంగా జనించిన ఇస్లాం విషయంలో ఇలానే జరిగింది. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జనించిన కాపిటలిజం విషయంలో ఇలానే జరిగింది. కాపిటలిజానికి వ్యతిరేకంగా జనించిన కమ్యూనిజం విషయంలో ఇలానే జరిగింది. కనుక ఇకనైనా మానవుడు తన ప్రతిక్రియాత్మక ధోరణికి స్వస్థి పలికి రాగద్వేష రహితంగా అంటే ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా ఇష్టాన్ని కానీ అనిష్టాన్ని కానీ ప్రదర్శించకుండా అసలు సత్యమేమిటని ఆలోచించాలి. తనకు సమస్యగా పరిణమించిన వ్యవస్థను ద్వేషించడం మానుకుని ‘అసలు సత్యస్వరూపమైన వ్యవస్థ ఎలా ఉంటుంది?’ అని ఆలోచించాలి. ద్వేషించడం కనుక జరిగితే ఆ వ్యవస్థకు ప్రతిక్రియనే మానవుడు కోరుకుంటాడు.. ఆ ప్రతిక్రియనే సత్యమనుకుంటాడు.

మానవుడు చరిత్రలో ఏ వ్యవస్థను నిర్మించేటపుడైనా మొదట తాత్విక విచారణ చేసేవాడు. ఆ తాత్విక పునాదిపైనే ఆయా వ్యవస్థలను నిర్మించేవాడు. ఐతే ఆ తాత్విక విచారధారలన్నీ సత్యాన్ని కాక అప్పటి తన ప్రతిక్రియాత్మక ధోరణినే ప్రతిబింబించేవి. ఆ ధోరణే పునాదిగా గలిగిన వ్యవస్థలు కూడా అలానే వ్యవహరించేవి.. తుదకు విఫలం చెందేవి.

ఇస్లాం ఆవిర్భవించిన నేపథ్యం అరాచకం. ఆ రోజులలో ప్రపంచంలో అనాగరిక జాతులు అల్లకల్లోలం సృష్టిస్తుండేవి.కనుక మానవుడి ఆలోచనాధోరణిని ఆ అరాచకం ప్రభావితం చేసింది. అరాచకానికి ప్రతిక్రియగా పటిష్ఠమైన రాజ్యశక్తి నిర్మాణానికి మానవుడు మొగ్గుచూపాడు. ఆ ధోరణి కలిగిన తాత్వికచింతనే చేశాడు. అదే సత్యంగా భావించాడు. అలా ఏర్పడినదే ఇస్లాం.

కానీ మితిమీరిన రాజ్యశక్తి కాలక్రమంలో సామాజిక వికాసానికి ఆటంకంగా పరిణమించినది.దానితో మానవుడు మరలా ఆలోచనలో పడ్డాడు. ఈ సారి సామాజిక వికాసానికి అనుకూలమైన తాత్విక విచారణ చేశాడు. రాజ్యశక్తిని సమస్యగా భావించాడు. ఈ పునాది మీద ఏర్పడినదే కాపిటలిజం. కానీ కాలక్రమంలో మితిమీరిన సామాజిక స్వేచ్ఛ వ్యక్తి ప్రయోజనానికి భంగకరంగా మారింది. దానితో మానవుడు మరలా ఆలోచనలో పడ్డాడు. తిరిగి సామాజిక వికాసాన్ని సమస్యగా భావించి వ్యక్తి ప్రయోజనానికి అనుగుణమైన తాత్విక చింతన చేశాడు. ఆ తాత్విక పునాది మీదనే సామ్యవాదాన్ని నిర్మించాడు.కానీ కాలక్రమంలో ఈ సామ్యవాదం వలన అసలు మానవుని సామాజిక జీవనం యొక్క మౌలిక లక్ష్యాలే దెబ్బతినటంతో తిరిగి ఆ సామ్యవాదాన్ని కూడా వదిలేశాడు.

ఇప్పుడు ప్రపంచంలో ఒక రకమైన భావశూన్యత ఏర్పడింది. ఇటువంటి శూన్యత సమీప గతంలో ఎప్పుడూ ఏర్పడలేదు. ఇస్లాం ప్రపంచాన్ని డామినేట్ చేసిన రోజుల్లో ఇస్లామిక్ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శంగా ప్రజాదరణ పొందాయి. తరువాతి కాలంలో ఆ సిద్ధాంతం వెనుకబడగానే కాపిటలిస్టు అభ్యుదయభావాలు ప్రపంచాన్ని డామినేట్ చేశాయి. అవి కూడా వెనుకడుగు వేయగానే సామ్యవాద ఆదర్శ భావజాలం ప్రపంచాన్ని డామినేట్ చేసింది. ఇప్పుడు అలా డామినేట్ చేసిన భావజాలమేదీ ప్రపంచంలో లేదు. ఇప్పుడు మానవుని ముందున్నది మూడు విఫలయత్నాలు మాత్రమే.

ఈ విధంగా మానవుడు గతకాలంలో సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఒక సమస్య పోతే మరో సమస్యనెదుర్కొన్నడు. ఏది సమస్యకు పరిష్కారమని ఢంకా భజాయించి చెప్పాడో అదే తిరిగి సమస్యగా పరిణమించడంతో నివ్వెరపోయాడు. ప్రతీసారీ ఇలానే జరగటంతో మానవుడు మ్రాన్పడిపోయాడు.

మానవుడు చరిత్రలో చాలా హడావుడి చేశాడు. కానీ ఏదీ నిలబడలేదు.దీనివలన ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట వాస్తవమైనా .. నేటి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సంపత్తి కలిగిన ప్రపంచం ఆయా ప్రయత్నాల ఫలితమే అయినా.. మానవుని అసలు లక్ష్యమైన ‘వ్యవస్థలోని అన్ని అంగాల ప్రయోజనం సమంగా నెరవేరే’ రాజకీయ, సామాజిక వ్యవస్థ మాత్రం నిర్మింపబడలేదు. కనుక ఇకనైనా మానవుడు తన ప్రతిక్రియాత్మక ధోరణిని వదలి.. రాగద్వేషపూరితమైన ఆలోచనాధోరణిని వదలి సరియైన తాత్విక విచారధారతో సత్యాన్ని కనుగొనాలి. తనకు తోచిన దానిని, తన భావాలకు అనుకూలంగా ఉన్నదానిని, అప్పటి సమస్యకు పరిష్కారంగా ఉన్నదానిని సత్యంగా భావించే ధోరణిని విరమించుకోవాలి.

ఈ జగత్తులో ఎవ్వరి భావాలతో ఎవ్వరి ఒప్పుకోలుతో నిమిత్తంలేని సత్యమనేది ఒకటి ఉన్నది.దానిని చేరే మార్గం కూడా ఉన్నది. దానిని మానవుడు తెలుసుకోవాలి.దానిని ఆచరిస్తేనే మానవుడికి ప్రయోజనం. దాని ద్వారానే మానవుని చిరకాల లక్ష్యం నెరవేరుతుంది. అటువంటి అనిమిత్త సత్యాన్ని తెలుసుకోకుండా తనకు నచ్చిన దానిని సత్యంగా ప్రకటించకూడదు. అదే మానవుడు చేసిన తప్పు. దాని ప్రతిఫలమే ఈ వైఫల్యం…(సశేషం)

(ఇంతటితో ‘ప్రపంచ చారిత్రక, రాజకీయ పరిణామాల సంగ్రహ అధ్యయనం’ అనే మొదటి అధ్యాయం సమాప్తం)



21, ఆగస్టు 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---15



(గమనిక: ‘మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమే’ అనబడు గత టపాలోని అంశానికి ఇది కొనసాగింపు)

ఏకధృవ ప్రపంచం-నయా దోపిడి

తరువాతి దశ సోవియట్ పతనానంతర దశ. ఇది కాపిటలిజం యొక్క నాల్గవ మరియు అంతిమ దశ. ఈ దశలో కాపిటలిజానికి కమ్యూనిస్టు భయం తొలగిపోయింది. ఈ దశకు కూడా అమెరికానే నాయకత్వం వహిస్తున్నది. అయితే ఈ సారి తానొక్కటే అగ్రరాజ్యంగా ఏకధృవ ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా మారింది. కమ్యూనిస్టు భీతి తొలగిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ దశలో సంస్కరణల పేరుతో తిరిగి నయా దోపిడీ విధానాలను తెరపైకి తెస్తున్నది. ఈ సంస్కరణల వలన పేదవారు యధావిధిగా దోపిడీ పాలౌతుంటే బూర్జువా సామాజిక శక్తులు, ఇతర మధ్య తరగతి వర్గం ఎనలేని లాభాలను పొందుతున్నాయి.

మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో సామాజిక మైన ఉత్పత్తి వనరులను, మౌలిక సదుపాయాలను బూర్జువా వర్గం అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థ సామాజిక ప్రయోజనాలను మాత్రమే ఉద్దేశించినది కనుక. కానీ అలా అభివృద్ధి చేసిన సామాజిక వనరులను బూర్జువా వర్గాలు తమ స్వంత ఆస్థిగా మార్చుకుంటాయి లేదా తమ స్వలాభం ఉన్నపుడే అలా అభివృద్ధి చేస్తాయి. ఆ అభివృద్ధిని చూపి అదే దేశాభివృద్ధి అంటుంది. ఆ ఉత్పత్తి వనరులలో ఉద్యోగాలను వ్యక్తి ప్రయోజనం గా చూపుతుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనం కల్ల. ఇద్దరికి ఉద్యోగాలు లభిస్తే పది మంది బ్రతుకులు వీధిన పడుతుంటాయి. సామ్యవాద ఉద్యమ ఫలితంగా ఇప్పుడు కొల్లదారీ బూర్జువా వర్గం బాహాటమైన దోపిడీ విధానం మానుకున్నది. అంత మాత్రాన అది వ్యక్తి ప్రయోజనం కొరకు పాటుపడుతున్నదనీ.. ఈ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనం నెరవేరుతున్నదనీ అనుకోవటం మూర్ఖత్వమే.

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కొరకు పేదల పంటపొలాలను గుంజుకొనే ధైర్యం ఈ బూర్జువా వర్గానికి సామ్యవాద సిద్ధాంతపు ఓటమి వల్లనే వచ్చింది. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకత్వాలతో కడుతున్న సాగునీటి ప్రాజెక్టులు వందలాది ఎకరాల పంటపొలాలను, వేలాదిమంది సామాన్య ప్రజలు నివసిస్తున్న గ్రామాలను, పల్లెలను ముంపునకు గురిచేస్తుంటే అది బూర్జువా వర్గానికి మేలు చేసే ఉత్పత్తి వనరుల అభివృద్ధింగానే ఉంటుంది తప్ప వ్యక్తి ప్రయోజనం దిశగా అవి జరగటంలేదు. రోడ్డుమార్గాలవంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి సైతం కొల్లదారీ బూర్జువా వర్గం యొక్క ప్రయోజనాలను ఉద్దేశించినవే.

ఈ అభివృద్ధి జరగాల్సిందే. కానీ వ్యక్తి అందుకొరకు బలికాకూడదు. ఎందుకంటే సరైన వ్యవస్థలో సమాజం యొక్క అభివృద్ధితో పాటు వ్యక్తి సైతం ప్రయోజనం పొందుతాడు. కానీ ప్రస్తుత భారతదేశంలో ఇంతటి సామాజిక అభివృద్ధి జరుగుతున్నా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి.ఇందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే మరి ఇంకెందరు చావలేక బ్రతకలేక దుర్భర దారిద్ర్యంతో అల్లాడుతున్నారో కదా!

ఈ విధంగా కాపిటలిజం చరిత్రలో జరిగే మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తటం వలనే నేటికీ స్థిరంగా నిలబడి తనకన్నా పురోగామి అయిన కమ్యూనిజాన్నే ఓడించగలిగినది.

ప్రస్తుత దశ కాపిటలిజం యొక్క అంతిమ దశ.ఈ దశ మీద పోరాడే మానవుడు తన అంతిమ రాజకీయ, సామాజిక వ్యవస్థను నిర్మిస్తాడు. కాపిటలిజం యొక్క ఈ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకునే మానవుడు దాన్ని శాశ్వతంగా అంతమొందించే వ్యూహాన్ని రచించాలి. అపుడు మాత్రమే మానవుడు తన చిరకాల స్వప్నాన్ని-వ్యవస్థలోని మూడు అంగాలూ సమానంగా ప్రయోజనం పొందే రాజకీయ, సామాజిక వ్యవస్థను- సాకారం చేసుకోగలుగుతాడు… (సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---14





మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమే

గడచిన చరిత్రను పరిశీలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభంజనంతో ఫ్యూడల్ ఇస్లాం తన ప్రాభవాన్ని దాదాపూ కోల్పోయింది. కానీ ఆ విధంగా కమ్యూనిజం యొక్క ప్రభంజనంతో కాపిటలిజం తన ప్రాభవాన్ని కోల్పోలేదు.

ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిజం ఆవిర్భవించింది. అంటే ఫ్యూడలిజం కన్నా కాపిటలిజం ప్రగతిశీలమైనది.కాపిటలిజం కన్నా కమ్యూనిజం ప్రగతిశీలమైనది. చరిత్రలో ఫ్యూడలిజం తనకన్నా పురోగామి అయిన కాపిటలిజం చేతిలో చావుదెబ్బ తిన్నది. కానీ అదే విధంగా కాపిటలిజం మాత్రం తనకన్నా పురోగామిశీలియైన కమ్యూనిజం వలన నష్టపోయింది కానీ చావు దెబ్బ మాత్రం తినలేదు.పైగా కాలగతిలో పురోగామిశీలియైన కమ్యూనిజమే దెబ్బతిన్నది.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఖలీఫేట్ రద్దుతో ఇస్లాం ఆధిపత్య చరిత్ర ముగిసిపోయింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లు అగ్ర రాజ్య హోదా కోల్పోయినా అమెరికా, రష్యాలు యుద్ధానంతరం అగ్ర రాజ్యాలుగా అవతరించడంతో అమెరికా రూపంలో కాపిటలిజం తన ప్రాభవాన్ని యుద్ధానంతరం కూడా చాటుతూనే ఉన్నది. కాలక్రమంలో సోవియట్ రష్యాలోనే కమ్యూనిజం దెబ్బతిని రష్యా అగ్ర రాజ్య హోదా కోల్పోయినా కూడా అమెరికా రూపంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాభవం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అమెరికా ఒక్కటే ఇప్పుడు అగ్రరాజ్య హోదా కలిగి ఉండటంతో ఇప్పటి ప్రపంచాన్ని ఏకధృవ ప్రపంచం గా పిలుస్తున్నారు.

దీనివలన మనకు ఒక విషయం స్పష్టంగా బోధపడుతున్నది. అదేమంటే మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమేనని. ఎందుకంటే ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం లు మూడునూ కూడా మానవాళికి సరిసమానంగా మేలు-కీడులు చేసినప్పటికీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ప్రాభవం లేనివీ, ఈ సరికే చావుదెబ్బతిన్నవీ అయిన ఇస్లాం మరియు సామ్యవాదాలు మానవాళికి ఏవిధంగా శత్రువులు కాగలవు? ఒక వేళ ఫ్యూడలిజం కాపిటలిజం చేతిలో దెబ్బతిన్నట్లుగా కాపిటలిజం కమ్యూనిజం చేతిలో దెబ్బతిని నేడు కమ్యూనిజం ప్రాభవం కలిగిన ప్రపంచం ఏర్పడినట్లైతే మానవజాతి తన అంతిమశత్రువుగా కమ్యూనిజాన్ని పరిగణించవలసివచ్చేది. ఎందుకంటే చరిత్రలో మానవుడు అంతిమ వ్యవస్థను అప్పటికి ప్రాభవం కలిగిన వ్యవస్థను కూల్చి మాత్రమే కదా నెలకొల్పేది. కాబట్టి ఇప్పుడు అమెరికా రూపంలో కాపిటలిజం తన ప్రాభవాన్ని చాటుతున్నది కనుక ఆ కాపిటలిజాన్ని కూల్చి మాత్రమే మానవుడు తన అంతిమ సామాజిక, రాజకీయ వ్యవస్థను నెలకొల్పుతాడు. ఈ కారణ వలన మానవాళి అంతిమ శత్రువు కాపిటలిజమే.. పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే.

తనకన్నా పురోగామి వ్యవస్థ చేతిలో ఫ్యూడల్ వ్యవస్థ కూలిపోయినట్లుగా కాపిటలిజం తన కన్నా పురోగామి అయిన కమ్యూనిజం చేత దెబ్బ తిని ఎందుకు కూలిపోలేదు. పైగా ఆ పోరాటంలో తుదకు పురోగామి కమ్యూనిజమే ఎందుకు కూలిపోయింది? అని ప్రశ్నించుకున్నట్లైతే మనకు ఈ విధమైన సమాధానం లభిస్తుంది.

ఇస్లాంలో గానీ, కమ్యూనిజంలో గానీ లేని ఒక లక్షణం కాపిటలిజంలో ఉన్నది కనుననే కాలగతిలో కాపిటలిజం ఈనాటికీ నిలబడగలిగింది. ఆ లక్షణం వలననే తనకన్నా పురోగామి అయిన కమ్యూనిజంతో జరిగిన పోరాటంలో ఎంత నష్టపోయినా అంతిమంగా గెలిచింది. ఆ లక్షణమేమంటే కాలానుగుణంగా మారటం.. మారిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తన వ్యూహాలను తగిన విధంగా మార్చుకోవడం.

మొదట కాపిటలిజం జనించిన కాలంలో అప్పటికి కాపిటలిజం అనే పేరును కూడా సంతరించుకోలేదు. ఆ కాలంలో స్పెయిన్, పోర్చుగల్‌లు అగ్రరాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో దోపిడీ ప్రత్యక్షంగా జరిగేది. తమ వలసల నుండి కొల్లగొట్టిన సంపదను ప్రత్యక్షంగా దోపిడీ దొంగల మాదిరిగా నౌకలలో స్వదేశాలకు తరలించేవారు. ఇది ఆ వ్యవస్థ యొక్క మొదటి దశ. ఈ దశలో నౌకాబలం నిర్ణాయక శక్తిగా ఉండేది. ఆ బలం అధికంగా ఉన్న స్పెయిన్ అప్పట్లో అగ్రరాజ్యంగా చెలామణీ అయినది. పారిశ్రామిక విప్లవం సంభవించేవరకూ ఈ దశ కొనసాగింది.

కాలక్రమంలో ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు జరిగి వస్తూత్పత్తి యంత్రాల సాయంతో జరగటం ప్రారంభమైనపుడు ఈ వ్యవస్థ తన వ్యూహం మార్చినది. తన వలసలను తన దేశంలోని పరిశ్రమలకు ముడిసరకు సరఫరాదారులుగా, తమదేశ పారిశ్రామికోత్పత్తులకు మార్కెట్లుగా వాడుకున్నది. దీనివలన దోపిడీ మరింత తీవ్రంగా జరిగినది. ఈ కాలంలోనే ఈ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ అనే పేరును సంతరించుకున్నది. ఈ కాలమే ఈ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలం. ఈ దశకు బ్రిటన్, ఫ్రాన్స్‌లు అగ్రరాజ్యాలుగా వ్యవహరించటం జరిగినది. పారిశ్రామిక ప్రగతి ఈ కాలంలో నిర్ణాయక శక్తిగా ఉండేది. ఈ దశ రెండవ ప్రపంచ యుద్ధకాలం వరకు కొనసాగింది.

తరువాత దశ వలసలను పోగొట్టుకున్నకాలం. ఈ దశ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడి సోవియట్ రష్యాలో కమ్యూనిజం పతనమయ్యేవరకూ కొనసాగింది. ఈ దశలో అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా కొనసాగాయి.ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రధానంగా ఆత్మరక్షణ దశ. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షేమ రాజ్యం అవతార ఎత్తింది. కమ్యూనిజం తనమీద చేసిన ప్రధాన విమర్శలనన్నింటినీ దిద్దుకున్నది. వలసలకు స్వతంత్ర్యమిచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే సోషలిస్టు లక్ష్యాలను సాధించవచ్చంటూ సోషలిస్టు మంత్రాన్ని తానే జపిస్తూ వచ్చింది. ఈ విధంగా ప్రజలకు ప్రత్యేకించి సామ్యవాదాన్ని కోరుకునే అవసరం లేకుండా జాగ్రత్త పడింది.

సరిగా ఈ దశనే స్వాతంత్ర్యానంతరం భారతదేశం అవలంబించింది. ఈ దశ యొక్క ప్రధాన లక్షణం ‘కమ్యూనిస్టు భీతి’.

ప్రచ్ఛన్న యుద్ధం

కమ్యూనిస్టు భీతి ప్రధాన లక్షణంగా గల ఈ దశలో నిర్ణాయక శక్తి సైనిక బలం. ఈ దశలో కాపిటలిజం యొక్క ప్రధాన లక్ష్యం కమ్యూనిజాన్ని అంతమొందించడం. తుదకు తూర్పు ఐరోపా దేశాలలో మరియు సోవియట్ రష్యాలో సామ్యవాదం కూలిపోవటంతో ఈ దశ అంతరించింది. ఈ సామ్యవాద పతనం అన్నది చరిత్రలో ఇటీవలి పరిణామమే. 80వ దశకం చివరిలోనూ 90వ దశకం ప్రారంభంలోనూ ఈ పరిణామాలు జరిగాయి. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న అమెరికా మరియు సామ్యవాద వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న రష్యాకు మధ్యన సిద్ధాంతపరమైన ఆధిపత్యం కొరకు 'ప్రచ్ఛన్న యుద్ధం'(Cold War) జరిగినది. అందుకే ఈ దశ ప్రచ్ఛన్నయుద్ధ కాలంగా కూడా సుప్రసిద్ధం…(సశేషం)


20, ఆగస్టు 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---13





జగతి రూపును మార్చిన రెండు మహాయుద్ధాలు

గడచిన శతాబ్దంలో సంభవించిన రెండు సంఘటనలు చరిత్ర సాధించిన మార్పులకు తుదిరూపాన్నిచ్చాయి. అవే రెండు ప్రపంచ యుద్ధాలు.

ప్రపంచంలో ఫ్యూడల్ వ్యవస్థ మొదటి ప్రపంచ యుద్ధకాలం వరకు కొనసాగింది. 'మొదటి ప్రపంచ యుద్ధం' ఫ్యూడల్ వ్యవస్థకు భరత వాక్యం పలికితే రెండవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాద కొల్లదారీ వలస పాలనకు చరమగీతం పాడింది. సుదీర్ఘ చరిత్రలో మానవుడు సాధించిన సామాజిక మార్పులకు ఈ రెండు యుద్ధాలు అంతిమ ఘట్టాలుగా పనిచేసి నేటి ప్రపంచం రూపుదాల్చింది.

మొదటి ప్రపంచ యుద్ధం 1914వ సం||లో ప్రారంభమై 1918వ సం||వరకు కొనసాగింది.ఆ కాలం వరకూ ప్రపంచంలో ఫ్యూడల్ రాజ్యాలుండేవి.టర్కీలో 'ఆటోమన్ సామ్రాజ్యం', చైనాలో 'మంచూ సామ్రాజ్యం', రష్యాలో 'జార్ సామ్రాజ్యం',ఐరోపాలో 'ప్రష్యా రాజ్యం'. ఇవన్నీ కూడా ఫ్యూడల్ వ్యవస్థలే.అంటే నిన్నమొన్నటి వరకు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మధ్యయుగాలనాటి ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది. ఈ సామ్రాజ్యాలలో ఒక్క చైనా లోని మంచూ సామ్రాజ్యం మినహాయించి మిగిలిన రాజ్యాలన్నీ మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా కూలిపోయాయి. మంచూ రాజ్యం మాత్రం యుద్ధానికి రెండుమూడు సంవత్సరముల ముందు ‘సన్ యెట్ సెన్’ నాయకత్వంలో సంభవించిన ప్రజావిప్లవంలో కూలిపోయింది.ఏది ఏమైనా మొదటి ప్రపంచ యుద్ధం సంభవించినకాలం మానవజాతి చరిత్రలో ఫ్యూడల్ వ్యవస్థ అంతరించిన కాలం.

టర్కీలో అట్టోమన్ సామ్రాజ్యం అంతరించడమేకాక ప్రపంచ ముస్లిం ప్రజల నాయకత్వ పదవి లేక ఇస్లాం మతపెద్ద పదవి అయిన 'ఖలీఫా' పదవి (ఖలీఫేట్) రద్దవటం ఇస్లాం యొక్క సుదీర్ఘకాల ప్రాభవానికి అంతిమ ఘట్టంగా చెప్పవచ్చు.

రష్యాలో జార్ సింహాసనం ప్రజావిప్లవం ద్వారా కూల్చివేయబడి ముందుగా ఒక బూర్జువా ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది.అది ఇంకా నిలదొక్కు కోక ముందే లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్కులు ఆ తాత్కాలిక బూర్జువా ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రపంచంలో మొట్టమొదటి సామ్యవాద ప్రభుత్వాన్ని ఏర్పరచారు.

ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ప్రపంచానికి ఫ్యూడల్ పీడ విరగడైనది.ఇక మిగిలినది వలస పాలకుల పీడ.ఈ కార్యం 'రెండవ ప్రపంచ యుద్ధం' నెరవేర్చినది.రెండవ ప్రపంచ యుద్ధం(1939-45)లో సంభవించిన కొన్ని సంఘటనలు మరియు ఆ యుద్ధ ఫలితాలు వలస పాలన అంతరించడానికి దారితీశాయి.అవి:

ౘ ప్రపంచంలో చాలా భాగాన్ని తమ వలసలుగా పాలిస్తూ అప్పటి వరకూ అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న బ్రిటన్,ఫ్రాన్స్‌లు యుద్ధంలో నాజీ జర్మనీకి మోకరిల్లాయి.వాటిని అమెరికా మరియు సామ్యవాద రష్యా రక్షించాల్చిన పరిస్థితి ఏర్పడింది.దీనితో వాటికి ఉన్న పరపతి, ఖ్యాతి అంతరించాయి.అందువలన అవి వలసలుగా అంతటి సువిశాలమైన అనేక దేశాలతో కూడిన సామ్రాజ్యాలను పాలించే నైతిక హక్కును మరియు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి.

ౘ నాజీ జర్మనీని సామ్యవాద రష్యా ఓడించడంతో కమ్యూనిజం యొక్క ఖ్యాతి ఆకాశాన్నంటింది.కమ్యూనిస్టు సిద్ధాంతానికి విపరీతమైన ప్రచారం,జనాదరణ లభించి సామ్రాజ్యవాదానికి ప్రపంచంలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.దానితో సామ్రాజ్యవాద దేశాలు గత్యంతరంలేక ప్రజలను సంతృప్తి పరచడం కొరకు సోషలిస్టు మంత్రం జపిస్తూ వలసలను వదిలేశాయి.

ౘ పెట్టుబడిదారీ వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన ఐరోపాలోనే రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం తూర్పు ఐరోపా దేశాలలో కమ్యూనిష్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.దానితో తూర్పు నుండి దూసుకొస్తున్న ఎర్ర కెరటం తమను కూడా ముంచెత్తుతుందేమో నన్న భయంతో ఆత్మరక్షణలో పడిన బ్రిటన్,ఫ్రాన్స్ తదితర దేశాలు వలసల సంగతి దేముడెరుగు ముందు తమ దేశాలలోని కనీసం తమ అస్తిత్వాన్నైనా రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో అవి వలసలను వదిలేసుకున్నాయి.

ౘ యుద్ధం వలన బ్రిటన్,ఫ్రాన్స్ తదితర దేశ ప్రజలలో సైతం సామ్రాజ్యవాదం మీద వ్యతిరేకత ఏర్పడి యుద్ధానంతరం జరిగిన ఎన్నికలలో సోషలిస్టు భావాలు కలిగిన పార్టీలను గెలిపించడంతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీల ప్రభుత్వాలు వలసలకు స్వాతంత్ర్యమొసగాయి. బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చిన 'లేబర్ పార్టీ' ఇదే విధంగా భారతదేశానికి స్వాతంత్ర్యమిచ్చింది.

ౘ అప్పటికే భారత దేశం లాంటి దేశాలలో స్వాతంత్ర్యం కొరకు అహింసాయుతంగా జరుగుతున్న ప్రజాపోరాటం ముమ్మరమై అది ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తున్నది.స్వాతంత్ర్యం కొరకు ఆయాదేశాలలోని ప్రజలు ఆయా పోరాటాలలో పెద్దయెత్తున పాల్గొంటున్నారు. ఈది కూడా వలసలకు స్వాతంత్ర్యం ఈయడానికి ఒక ప్రధాన కారణం.

ఏది ఏమైతేనేం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఒక పది,ఇరవై సంవత్సరాలలోనే దాదాపు వలస పాలన అంతా అంతరించింది.

ఈ సమయంలో ఒక విషయం చెప్పుకోవాలి.ఫ్యూడల్ వ్యవస్థలోని అన్ని రాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే అంతరించలేదు.అప్పటికి ముందే కొన్ని రాజ్యాలు అంతరించాయి. కానీ ఆ సమయానికి కూడాఎంతో విస్తారమైన భూభాగం ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే ఉన్నది.ఆ మిగిలి ఉన్నది మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

అలాగే రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగా వలస పాలన అంతరించినా మొత్తం ఆ కాలంలోనే అంతరించలేదు.అంతకు మునుపే కొంత వలస పాలన అంతమైనది.అదే 'అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య పోరాటం'.ఇది 18 వ శతాబ్దపు చివరికాలంలో జరిగినది.అమెరికా సాయుధ పోరాటం ద్వారా బ్రిటన్ పాలన నుండి విముక్తి పొందింది.దీనితో స్ఫూర్తి పొందిన దక్షిణ అమెరికా ఖండపు లాటిన్ అమెరికా దేశాలు 19వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాల కాలంలో అప్పటికే ప్రాభవాన్ని కోల్పోయిన స్పెయిన్ దేశపు వలస పాలన నుండి తిరుగుబాట్ల ద్వారా, సాయుధ పోరాటాల ద్వారా విముక్తి పొందాయి.ఇక మిగిలిన వలస పాలన రెండవ ప్రపంచ యుద్ధానంతరం అంతరించింది.

ఈ విధంగా రెండు ప్రపంచ యుద్ధాల వలన నేటి స్వేచ్ఛాయుత ప్రపంచం ఏర్పడింది.అంటే యుద్ధాలవలన ఒక పార్శ్వంలో ప్రజలు నష్ట పోయినా అంటే ప్రాణ నష్టం,ఆస్థి నష్టం సంభవించినా మరో పార్శ్వంలో మానవాళికి అంతకు మించిన మేలే జరిగినది.కానీ నేటి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఈ రెండు యుద్ధాలలోని నెగెటివ్ పార్శ్వాన్నే ఎక్కువగా ప్రచారం చేశాయి. ఎందుకంటే అవి ఈ యుద్ధాలవలన ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం వలన నష్టపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిథులు కనుక… (సశేషం)


19, ఆగస్టు 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---12





అక్టోబర్ విప్లవం

ఈ విధంగా సమాజం యొక్క దోపిడీ నుండి వ్యక్తిని రక్షించటం కొరకు మానవుడు ఆలోచించాడు. తుదకు ఈ సిద్ధాంతం ప్రాతిపదికగా 1917వ సం||లో ‘లెనిన్’ నాయకత్వంలో రష్యాలో జరిగిన ‘బోల్షివిక్ విప్లవం’ లేక ‘అక్టోబర్ విప్లవం’ వలన ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. లెనిన్ మరణానంతరం ‘స్టాలిన్’ నాయకత్వంలో కమ్యూనిస్టు రష్యా (సోవియట్ యూనియన్) గణనీయమైన అభివృద్ధి సాధించింది. చివరకు రెండవ ప్రపంచ యుద్ధంలో యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'హిట్లర్' సైన్యాన్ని రష్యా ఓడించటంతో కమ్యూనిస్టు రష్యా శక్తి ప్రపంచానికి తేటతెల్లమైనది. రష్యా కీర్తి గగనతలాన్నంటింది. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఎక్కడలేని బలం వచ్చింది. దాని ప్రభావం చెప్పలేనంతగా ప్రపంచ రాజకీయ వ్యవస్థ మీద పడింది.

రష్యా యొక్క సరిహద్దులలోగల విస్తారమైన భూభాగాన్ని స్టాలిన్ 'సోవియట్ యూనియన్‌'లో విలీనం చేశాడు. అంతేకాక రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తన ఆక్రమణలోకి వచ్చిన తూర్పు ఐరోపా దేశాలన్నింటినీ స్టాలిన్ కమ్యూనిస్టు దేశాలుగా మార్చివేశాడు. ఆ దేశాలన్నీ సోవియట్ యూనియన్‌కు మిత్రదేశాలుగా మారాయి. ప్రపంచంలో కమ్యూనిజం ఒక బలమైన శక్తిగా మారింది.

దీనితో పశ్చిమ ఐరోపా దేశాలు తూర్పు నుండి దూసుకొస్తున్న ఎర్ర కెరటం నుండి కనీసం తాము బయటపడటానికి మరియు అప్పటికే తమ మీద దోపిడీదారీ సామ్రాజ్యవాద దేశాలుగా ముద్రపడి సామ్యవాదానికి ప్రపంచమంతటా ప్రజాదరణ పెరగటంతోనూ, అదీగాక రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చేతిలో చావుదెబ్బ తినడం వలన జరిగిన అవమానం.. తుదకు అమెరికా మరియు కమ్యూనిస్టు రష్యాల సహాయంతో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందాన బ్రతికి బయటపడటం… ఇలా ఈ కారణాలన్నింటివలన అవి తమ వలస దేశాలన్నింటికీ త్వరలోనే స్వాతంత్ర్యాన్ని ప్రకటించేసాయి.

ఈ విధంగా కమ్యూనిజం మానవాళికి ఎనలేని మేలు చేసి నేటి ఆధునిక ప్రపంచం ఏర్పడటానికి ప్రధాన కారణమైనది. కమ్యూనిజమే లేకపోతే నేటికి కూడా ప్రపంచంలో మూడువంతుల ప్రజలు ఒక వంతు ప్రజల చేతిలో వలస ప్రజలుగా బ్రతుకుతూ ఉండవలసి వచ్చేది. క్రమంగా చైనా, మంగోలియా, ఉత్తర కొరియా, కంబోడియా, వియత్నాం, లావోస్ లాంటి ఆసియా దేశాలు మరియు మరికొన్ని లాటిన్ అమెరికా దేశాలు కూడా సామ్యవాద వ్యవస్థను అవలంబించాయి.

ఈ సామ్యవాద ఆలోచనావిధానం వలన మానవుడు రాజకీయంగా మరియు ఆర్థికంగానే కాక, సాంస్కృతికంగా కూడా విముక్తి చెందాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని 'శాస్త్రీయ దృక్పథం' మూఢత్వాన్నుండి ఏ కొద్దిమంది విద్యావంతులనో మార్చింది. కానీ 'తార్కికమైన' లేక 'హేతుబద్ధమైన' ఆలోచనతోకూడుకున్న ఈ సామ్యవాద దృక్పథం యావత్‌ప్రపంచంలోని విస్తారమైన జనబాహుళ్యాన్ని మూఢత్వాన్నుండి బయటపడవేసింది. ప్రతి మనిషి తన విలువ తెలుసుకుని మసలటం ప్రారంభించాడు. అప్పటి వరకు బలహీనులుగా భావించబడినవారంతా ప్రాబల్యాన్ని సాధించారు. స్త్రీలు పురుషుల ఎదుట తమ ప్రాబల్యాన్ని చాటారు. పేదలు ధనవంతుల ఎదుట తమ ప్రాబల్యాన్ని చాటారు. పాలేరు కామందు ఎదుట, నిమ్నవర్ణాలవారు అగ్రవర్ణాల ఎదుట, పాలితులు పాలకుల ఎదుట, రైతుకూలీ భూస్వామి ఎదుట, పిల్లలు పెద్దల ఎదుట తమ ప్రాబల్యాన్ని చాటారు.

సామ్యవాద వ్యవస్థలో సమాజంలో దోపిడీ నిర్మూలించబడింది. 'స్వంత ఆస్తి' రద్దు చేయబడి ఫాక్టరీలు మరియు వ్యావసాయిక భూమి లాంటి ఉత్పత్తి సాధనాలు, వనరులు ప్రజలందరి ఉమ్మడి సొత్తుగా మార్చివేయబడ్డాయి. ఆధునిక విజ్ఞానశాస్త్ర ఫలాలు ప్రజలందరకూ సమానంగా అందుబాటులోకి వచ్చాయి. స్త్రీలు ఉన్నత విద్యనభ్యసించారు. ఫురుషులతో సమానంగా అన్ని పదవులనూ అలంకరించారు. జాతికులభేదాలు లేకుండా సమాజంలోని ప్రతిఒక్కరికీ సమాన అవకాశాలు ఈయబడ్డాయి. బూర్జువా సంస్కృతికి కాక సామాన్య ప్రజల సంస్కృతికి పెద్దపీట వేయడం జరిగినది. ఈ విధంగా సామాజిక శక్తుల దోపిడీ పీడ విరగడై వ్యక్తి ప్రయోజనం కొరకు పాటుపడే సామ్యవాద వ్యవస్థ ఏర్పడింది.

అంతర్జాతీయ స్థాయిలోనైతే ధనిక దేశాలు బడుగు దేశాలను తమ వలసలుగా చేసుకుని దోపిడీ చేయటం అంతమొందిన విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. అలా విముక్తి పొందిన దేశాలలో కానీయండి, చివరికి దోపిడీదారీ పశ్చిమ ఐరోపా దేశాలలో కానీయండి… అవి పెట్టుబడిదారీ దేశాలైనాకూడా సామ్యవాద ఆలోచనా విధానాన్ని నిర్లక్ష్యం చేయటం వాటికి సాధ్యపడలేదు.

(సామ్యవాదం ఒక వ్యవస్థగా కొన్ని దేశాలకే పరిమితమైనా ఒక ఆలోచనా విధానంగా (సోషలిజం) మాత్రం విశ్వవ్యాప్తమైనది. సోవియట్ యూనియన్ పతనంతో సామ్యవాదం ఒక వ్యవస్థగా మాత్రమే అపజయం పొందింది.కానీ ఒక ఆలోచనా విధానంగా అది వేసిన బలమైన ముద్ర నేటికీ ప్రపంచమంతటా సజీవంగానే కాక బలంగా కొనసాగుతున్నది.)

అయితే ఈ వ్యవస్థలో కూడా వ్యక్తి ప్రయోజనాలు మాత్రమే నెరవేరాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా వ్యవస్థలో రాజ్యం, సమాజం, వ్యక్తి అనబడే మూడు అంగాలుంటాయి. ఈ మూడింటి ప్రయోజనాలు సమానంగా నెరవేరినపుడే అది సక్రమమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. కనీ ఈ సామ్యవాద వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనాలు మాత్రమే నెరవేరాయి. రాజ్యం యొక్క, సమాజం యొక్క ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడినాయి.

సిద్ధాంతపరంగా సామ్యవాదం రాజ్యానికి బద్ధ వ్యతిరేకి. రాజ్యాన్ని పీడక వర్గం పీడిత వర్గాన్ని అణచి ఉంచటానికి ఉపయోగించే సాధనంగా అభివర్ణించింది. రాజ్యం డుల్లిపోవాలని ఆకాంక్షించింది. సమాజంలో రాజ్యం ఏర్పడటం అనేది సహజమైన మరియు అనివార్యమైన పరిణామం. దీనిని గుర్తించకుండా సామ్యవాదం సమాజాన్ని మాత్రమే అంగీకరించి రాజ్యాన్ని వ్యతిరేకించటం విడ్డూరం.

అలాగే సామ్యవాదం వ్యక్తి యొక్క సామాజిక ప్రవృత్తిని కూడా నిరోధించింది. తనదైన విశిష్టత కలిగిన వ్యక్తి, తనవైన ప్రతిభాపాటవాలు కలిగిన వ్యక్తి వాటిని ప్రదర్శించుకొని, సమాజంలో వాటిని నిరూపించుకుని తనకంటూ సమాజంలో ఒక గుర్తింపును, తనకు తగిన ఒక ఉన్నత స్థానాన్ని పొందటానికి అవకాశం లేకుండా పోయింది. సమానత్వం పేరుతో అందరూ ఒకేగాటన కట్టివేయబడ్డారు. సామాజికమైన ఉత్పత్తి వనరుల అభివృద్ధి జరిగినా స్వంత ఆస్తికి అవకాశం లేకపోవటంతో అందరూ తిండిగింజలకు మాత్రమే పనిచేయవలసిన పరిస్థితి తలయెత్తినది. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలే సమాజంలోని ప్రజలందరకూ జీవన లక్ష్యాలుగా నిర్దేశించబడినాయి. ఈ విధంగా దైహిక స్థాయి అవసరాలే మానవుడి జీవన లక్ష్యాలైతే అందుకు సామాజిక జీవితమే అవసరంలేదు. ఆటవిక జీవితంలో అవి ఇంతకంటే సులువుగా లభిస్తాయి. ఈ విధంగా సామ్యవాద వ్యవస్థలో మానవుడి సామాజిక జీవితం యొక్క మౌలిక లక్ష్యాలే నిర్లక్ష్యం చేయబడ్డాయి.

తూర్పు ఐరోపా, రష్యా, చైనా లాంటి దేశాలలో సిద్ధాంత విషయంలో కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించబడింది. కానీ కంబోడియా లాంటి చోట్ల సిద్ధాంతాలను మూర్ఖంగా ఆచరించటానికి ప్రయత్నించి 'పోల్‌పాట్' లాంటి పాలకులు ఎంతో విధ్వంసాన్ని సృష్టించారు… ఎంతో మారణకాండకు పాల్పడ్డారు.

(స్టాలిన్ హయాంలో రష్యాలో కూడా మారణ హోమం జరిగినది. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలకు భూములివ్వ నిరాకరించిన ప్రజలను స్టాలిన్ పెద్దయెత్తున వధించాడు. కొందరికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. మరికొందరు నిర్బంధ శ్రామిక శిబిరాలకు తరలింపబడ్డారు. తన విధానాలను వ్యతిరేకించిన తన స్వంత సహచరులు అనేక మందిని సైతం స్టాలిన్ ‘గ్రేట్ పర్జ్’ పేరుతో పాశవికంగా వధించాడు. చైనాలో కూడా మావో కాలంలో ‘గొప్ప ముందడుగు’, ‘సాంస్కృతిక విప్లవం’ మొదలైన కార్యక్రమాల మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు.)

ఈ విధంగా సామ్యవాదం వ్యక్తి యొక్క సామాజిక ప్రవృత్తిని నిరోధించటంతో అనేక సామ్యవాద దేశాలలోని ప్రజలు స్వేచ్ఛకోసం తహతహలాడి అటువంటి స్వేచ్ఛ కలిగిన పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాన్ని కోరుతూ తమ దేశాలలోని సామ్యవాద వ్యవస్థలను కూలదోసారు. ఇది చరిత్రలో ఇటీవలి పరిణామమే. ఒకనాడు ఏ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామ్యవాదం జనించిందో ఆ పెట్టుబడిదారీ వ్యవస్థనే ప్రజలు తిరిగి కోరుకోవటంతో ఇది ఒకరకంగా తిరోగమనంగానే భావించవలసి ఉన్నది. దీనికి కారణాలను ముందుముందు పరిశీలిద్దాం……(సశేషం)