19, నవంబర్ 2015, గురువారం

దేశభక్తే అసలైన మానవత్వం

ఇప్పుడు కూడలిలో ‘దేశభక్తి అంటే?’ అనే శీర్షికతో ఉన్న ఒక టపా చదివాను. కామెంట్ రాయాలనుకున్నాను. కానీ ఎందుకో టపా రాయాలనిపించింది.

ఆ టపాలో రాయబడిన ‘ఓషో’ గారి ఉవాచలకు సమాధానం:

దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు ఏర్పడింది మనిషి దుఃఖాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో కాదు… పరిపాలనా సౌలభ్యం కోసం.

దేశ జెండా యొక్క పరమ ప్రయోజనం పక్షుల చేత రెట్ట వేయించుకోవడం కాదు.

ఈ వ్యాఖ్య ఆయన చేసినది అమెరికన్ల దేశభక్తిని హేళన చేయడానికా?.. లేక తన దేశభక్తిని చాటడానికా?

చంద్రమండలం మీద ఎగురవేసినది అమెరికన్ల జండా అయినా, ఆ ఘనత సాధించినది అమెరికన్లయినా దానియెడల యావత్ మానవజాతే గర్వించినది. విశ్వమానవత్వాన్ని బోధించే కొందరికి మాత్రం ఆ చర్య మూర్ఖత్వం గా కనిపించినది.

ఇక JK గారి ఉవాచలను పరిశీలిద్దాం.

“The flag,is nothing but a piece of loin cloth,… ”ఏ అనుభూతులనూ,ఏ భావోద్వేగాలనూ అంగీకరించలేని వారికి జాతీయ జండా అయినా ఒకటే, గోచిగుడ్డ అయినా ఒకటే.

ఆలోచనలలో ‘స్వేచ్ఛ ’ ఉండాలని JK తరచూ ఇన్సిస్ట్ చేసేవారు.తరచూ ఏముంది లెండి!… ఆయన సారమదే. సిద్ధాంతాలు, నిర్థారణలు వగైరా ఆ స్వేచ్ఛకు ఆటంకమని ఆయన తలచేవారు.

దేశభక్తి లాంటి విషయం మీద ఓ అభిప్రాయానికి రావటానికి గ్రంథపఠనం ఆవశ్యకమనుకుంటే ఓషో,JKల రచనలేకాదు ఇంకా అనేక మంది రచనలు చదవాలి. అప్పుడే సరైన దృక్పథం అలవడుతుంది.

“సిద్ధాంతం గొప్పదా? మనిషి గొప్పవాడా?”… ఈ పోటీ ఎందుకు? మనిషికి దార్శనికత లభించేది సిద్ధాంతం వలనే కదా!

ఇక సాటి మనిషి అంటారా! సాటి మనుషులలో మనకు శత్రువులు ఉంటారు.. మిత్రులు ఉంటారు. మన ఎడల వారి స్పందనను బట్టే వారి ఎడల మన స్పందన ఉంటుంది.

“మనిషి ప్రస్థానం ఎటువైపు సాగుతోంది??”.. ఏది ఎలా జరిగినా మొత్తంమీద మనిషి ప్రస్థానం ఎల్లప్పుడూ సత్యం దిశగానే సాగుతుంది. ఈ విషయంలో సందేహం అనవసరం.

“Nationalism is a glorified form of tribalism”.. ఇది కూడా JK గారి ఉవాచే.

Nationalism ను వ్యతిరేకించి అంతర్జాతీయ తత్వాన్ని తలకెత్తుకున్న కమ్యూనిస్టు సోవియట్ రష్యానే రెండవ ప్రపంచ యుద్ధంలో దానికి తిలోదకాలిచ్చి దేశభక్తికి పట్టం కట్టింది.అలా చేయబట్టే ఆ దేశ సైనికులు సోవియట్ రష్యా కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రాణాలకు సైతం తెగించి పోరాడి విజయం సాధించగలిగారు. అటు ఫాసిజాన్ని కూల్చడంతో పాటు పనిలోపనిగా ఇటు సామ్రాజ్యవాదపు నడ్డి కూడా విరిచి నేటి స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని నిర్మించగలిగారు. కనుక దేశ భక్తి ఉపయోగకరమైనదే.

దేశభక్తి, మానవత్వం పరస్పర విరుద్ధమైన విలువలు. ఆ రెంటిలో ఒకటుంటే మరోటి ఉండదు’ అనే అభిప్రాయం సరికాదు.

తనకో భాషను, సంస్కృతిని,నాగరికతను,మతాన్ని అందించిన దేశాన్ని ఎవరైనా ప్రేమించకుండా ఉండగలరా?! తన జాతి మూలాలున్న ప్రాచీనతను, చరిత్రను కలిగి ఉన్న తన దేశం ఎడల ఎవరైనా భక్తి ప్రదర్శించకుండా ఉండగలరా?! తనకు ఉండటానికి నివాసాన్ని, తినడానికి తిండిని, తాగటానికి నీటిని, పీల్చటానికి గాలిని ఇస్తున్న దేశం యెడల ఎవరైనా కృతజ్ఞత చూఫకుండా ఉండగలరా?! శత్రువులనుండి తనకు,తనవారికి రక్షణ కల్పిస్తున్న దేశాన్ని అభిమానించకుండ ఎవరైనా ఉండగలరా?! సహజీవనం చేయడానికి తోటి మనుషులను.. ఇంకా తనకు విద్యను, విజ్ఞానాన్ని అందించిన దేశాన్ని మిగతా దేశాలతో సమానంగా, మామూలుగా ఎవరైనా చూడగలరా?! అలా ఉండగలిగితే… అలా చూడగలిగితే అది మానవత్వమా?!

ఒక్క దేశభక్తే కాదు… మనిషికి దీనితో పాటు ఇంకా అనేక రకాల భక్తులుంటాయి. వినాయక విగ్రహం పెట్టినపుడు ‘కాలనీభక్తి ’నో ‘వీధిభక్తి’నో వ్యక్తం చేస్తాడు. ఒలంపిక్స్ లో మన దేశమేమీ సాధించలేక పోయినా చైనా విజయాలను చూసి ‘ఖండభక్తి ’నో లేక ‘ప్రాచ్యభక్తి ’నో వ్యక్తం చేస్తాడు. అలానే మనిషి సందర్భాన్ని బట్టి ‘రాష్ట్రభక్తి ’ని, ‘జిల్లాభక్తి’ని, ‘స్వగ్రామభక్తి ’ని… ఇలా అన్నింటినీ చాటుతుంటాడు. ఒక్కోసారి విశ్వమానవ దృక్పథాన్నీ ప్రదర్శిస్తాడు.

అలానే ఒకోసారి తనకులం, తన మతం, తనుండే ప్రాంతం, తను చదివే విద్యాలయం.. ఇలా సందర్భాన్ని బట్టి తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఉంటాడు.

అయితే వీటన్నింటిలో కూడ దేశభక్తే సర్వశ్రేష్ఠమైనది.

ఇవేవీ కూడా మనిషిలో ఉండే మానవత్వానికి అడ్డుకావు. అయితే ఏదైనా సందర్భోచితంగానే ఉండాలి. ఏ భక్తైనా హద్దులు దాటి ఇతరుల ఎడల అన్యాయమైన అసహనాన్ని ప్రదర్శిస్తే మాత్రం వచ్చేది ముప్పే.

ఎవరైనా సరే ఎల్లవేళలా మానవత్వమే నా మతమంటూ, విశ్వమానవ దృష్టే నా దృక్పథమంటూ ఏ ఐడెంటిటీని ఇష్టపడక,ఏ విశిష్టతనూ అంగీకరించక పోతే అప్పుడు మనిషికి మిగిలేది ఏమిటి?అసలు చివరికి ఆ మానవత్వమైనా మిగులుతుందా? నిజం చెప్పాలంటే ఆ స్థితిలో మనిషైనా ఒకటే.. పశువైనా ఒకటే ? ఎందుకంటే పశువులకు కూడా కులాలు, మతాలు, దేశాలు, ప్రాంతాలు, జిల్లాలు ఉండవు. దేశ భక్తి అసలే ఉండదు.

1 కామెంట్‌:

  1. సరస్వతి కుమార్ గారూ,

    బాగా రాశారు.

    ఐతే ఒకటి! ఏమీ కండిషన్స్ లేని దేశభక్తికంటే, ఐడియాలజీ మీద ఆధారపడిన దేశభక్తి సరి అయినది. మానవతా విలువలు ఇంకా స్వేచ్ఛకోసం నిలిచే ఏ దేశాన్ని ఐనా, ఉదాహరణకు అమెరికా ఇజ్రాయెల్ లాంటివి, నేను సపోర్ట్ చేస్తాను. అది నా దేశం కాకపోయినా సరే.

    అందరూ జిడ్డు కృష్ణమూర్తిలా తయారయితే హ్యాపీగా జెండాలని గోచిగుడ్డల్లా కట్టుకు తిరగచ్చు. కాని అంత "అలౌకిక స్థితి" అందరూ సాధించలేరు కాబట్టి సమాజ రక్షణకోసం, సైద్ధాంతిక రక్షణకోసం దేశాలు అనేవి మనకు తప్పవూ, దేశభక్తీ తప్పదు.

    -మురళి

    రిప్లయితొలగించండి