18, ఫిబ్రవరి 2009, బుధవారం

జ్ఞానయోగం -II

జీవుడు ఈ సృష్టి కార్యంలో, ఈ జగత్తులో తన ప్రకృతి యొక్క బింబాన్ని చూసుకోవాలంటే ముందుగా మానవ దేహధారణ చేయాలి. అంటే ఈ సృష్టిలో తను కూడా మనిషిగా జన్మించాలి. జన్మ వలన జీవునికి దేహం లభిస్తుంది. దేహం వలన జీవునికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి మొదలైన సాధనాలు సమకూరతాయి. 

అయితే జన్మించడంతోటే జీవుడు స్వస్వరూప సందర్శనం చేయటానికి పూనుకుంటాడని అనుకోవడం పొరపాటు. జన్మ అనేది, దేహధారణ అనేది స్వస్వరూప సందర్శనం కొరకు ఒక అవకాశం మాత్రమే. దేహధారణ చేసిన మానవుడు ఆ పరమ పురుషుడి మీద మనసు నిలిపి యజ్ఞం లేక నిష్కామ కర్మయోగం చేసి తద్వారా మాత్రమే తన జన్మ యొక్క పరమ ఉద్దేశ్యమైన స్వస్వరూప సందర్శనం నెరవేర్చుకుని ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు. కానీ ఎక్కువ సందర్భాలలో అలా జరగదు. 


ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత! | 

సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప! || (అ.7-శ్లో.27) 

పరంతపా! సమస్త భూతాలూ పుట్టుకతోనే అనురాగ ద్వేషాల మూలంగా కలిగే సుఖదుఃఖాదులవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి. 


ప్రవృత్తి-నివృత్తి 

జీవునికి స్వస్వరూప సందర్శనం విధాయకం కనుక ప్రతిసృష్టిలోను ఒకసారి జన్మించక తప్పదు.

దేహధారణ చేసిన మానవుడు బాహ్యప్రకృతి యొక్క మాయలో చిక్కుకుంటాడు. ఆ ప్రకృతి యొక్క, త్రిగుణాల యొక్క కర్మల వ్యామోహంలో చిక్కుకుంటాడు. అందులో ఏదో ఒక గుణకర్మయొక్క ఆకర్షణకు లోనై, ఆకర్మనే అధికంగా చేస్తూ కర్మబంధాలలో చిక్కుకుని, ప్రవృత్తి నివృత్తికి లోనై వ్యర్ధంగా ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. ప్రవృత్తి నివృత్తి అనేవి నేరము-శిక్ష వంటివి.    

ప్రవృత్తిలో తన ప్రకృతిని ప్రకటించే కర్మలు (స్వధర్మం) కాక లోకంలోని తనకు సంబంధంలేని ప్రకృతికర్మల (పరధర్మం) ఆకర్షణకు లోనై వాటినే ఆచరించి వాటి ఫలాలను పొందుతాడు. స్వస్వరూపసందర్శనానికి ఇతరమైన కర్మ ఏదైనప్పటికి అది మనిషికి అనవసర కార్యకలాపమే. దానితో అవి కర్మబంధానికి దారితీస్తాయి. దీనినే సంసారబంధమని కూడా అంటారు. అంటే అనవసరమైన దానిని నెత్తినపెట్టుకోవడం అన్న మాట. 

ఈ బంధాన్ని తెంచుకొని ఎప్పటికైన స్వస్వరూపసందర్శనం చేసుకుంటేనే మనిషి తన జన్మ ఉద్దేశం నెరవేరి ఇక ఆ సృష్టిలో మరలా జన్మించడు. దీనినే మోక్షం అంటారు. 

ఈ అనవసరమైన బంధాన్ని ఏర్పరచు కోవడం అనేది ప్రవృత్తి అయితే దానిని తెంచుకోవడం, దానినుండి విమోచన పొందడం నివృత్తి. ప్రవృత్తి చెందిన వాడికి నివృత్తి తప్పదు.    

ఈ ప్రవృత్తి నివృత్తి మూలంగా అనేకజన్మలు వృధాగా జన్మించవలసి ఉంటుంది. ఇది ఒక అనవసరమైన కాలయాపన. 

స్వస్వరూప సందర్శనానికి ఒక జన్మ చాలు. అది జరగనిదే జన్మ ఉద్దేశం నెరవేరదు. అది చేయకుండా మనం లౌకికమైన ఆకర్షణలకు లోనై ప్రవృత్తి నివృత్తి చక్రంలో కాలాన్ని వృధా చేస్తూ అనవసరంగా మరల మరల్ల జన్మిస్తూ ఉంటాము. ఎప్పటికైనా ఈ ఆకర్షణలనుండి బయటపడి తన స్వస్వరూప సందర్శనం చేసుకుంటేనే మనిషికి ఈ సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుంది. 

అయితే ఈ జన్మల సంఖ్య పెరగడంలోని నష్టమేమిటి? మోక్షంలోని లాభమేమిటి? 

ప్రవృత్తిలోని సుఖాన్ని ఆశించినవాడు నివృత్తిలోని దుఃఖంలో చిక్కుకుంటాడు. కనుక నివృత్తిలోని దుఃఖం నుండి తప్పించుకోవాలంటే ప్రవృత్తికి దూరంగా ఉండటమొక్కటే మార్గం.

ప్రవృత్తిలో ఉండే స్వేచ్ఛ నివృత్తిలో ఉండదు. ప్రవృత్తి స్వేచ్ఛావిహారం అయితే నివృత్తి కట్టి కుడపటం వంటిది. 

ప్రవృత్తి సుఖాలమయమైతే నివృత్తి కష్ఠాలమయమౌతుంది. 

ప్రవృత్తి విజయమైతే నివృత్తి అపజయమౌతుంది. 

ప్రవృత్తి సంతోషమైతే నివృత్తి దుఃఖమౌతుంది. 

ప్రవృత్తి అధికారమైతే నివృత్తి బానిసత్వమౌతుంది. 

ప్రవృత్తి స్వర్గమైతే నివృత్తి నరకమౌతుంది.

ఈ విధంగా ప్రవృత్తి నివృత్తి చక్రం ద్వంద్వాలతో కూడుకుని ఉంటుంది. ఇదంతా అడుసుతొక్కడం కాలుకడగటం లాంటిది. అడుసు తొక్కకపోతే కాలుకడిగే పని ఉండదు. 

మన స్వధర్మాన్ని ఆచరించడంలో మనకు ఈ ద్వంద్వాల బాధ ఉండదు. స్వస్వరూప సందర్శనం అనేది స్వీయప్రకృతి యొక్క ప్రకటనే గనుక 

దానిలో సుఖం ఉంటుంది కానీ అది కష్టానికి దారితీయదు. 

దానిలో విజయం ఉంటుంది కానీ అది అపజయానికి దారితీయదు.

సంతోషం ఉంటుంది కానీ అది దుఃఖానికి దారితీయదు.

అధికారం ఉంటుంది కానీ అది బానిసత్వానికి దారితీయదు.

అవేవీ ప్రవృత్తి కాదు గనుక వాటికి నివృత్తి అనేది ఉండకపోవడమే దీనికి కారణం.

    
ప్రవృత్తిం చ నివృత్తించ జనా న విదురాసురాః | 

న శౌచం నాపి చా చారో న సత్యం తేషు విద్యతే || (అ.16-శ్లో.7) 

ఆసురీ సంపదలోనివారు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అను రెండు మార్గములున్నట్లే ఎరుగరు. వారియందు పారిశుద్ధ్యము గానీ. మంచినడవడి గానీ, సత్యము గానీ ఉండవు. 


ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యా కార్యే భయాభయే| 

బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్ధ ! సాత్వికీ || (అ.18-శ్లో.30) 

పార్ధా! ప్రవృత్తి నివృత్తి మార్గములను, కర్తవ్యాకర్తవ్యాలను (చేయదగినవి, చేయకూడనివి), భయనిర్భయములను, బంధ మోక్షములను తెలియు బుద్ధి సాత్వికము. 


అంటే ఈ లోకం లోనికి ప్రవేశించిన మానవుడిని రెండు విషయాలు ఆకర్షిస్తాయి. ఒకటి నిశ్శబ్దంగా, సామగానంలా, మంద్రంగా ఉండే భగవదాకర్షణ. రెండవది అతి తీవ్రమైన సంచలనాలతో ఆకర్షణలతో ఉండే ప్రకృతి యొక్క ఆకర్షణ. మాయకు లోబడకుండా జ్ఞానాన్ని సాధించి భగవంతుడి మీద మనసు నిలిపి నిష్కామకర్మ ద్వారా తన జీవనలక్ష్యం నెరవేర్చుకున్న వారు ఈ లోకంలో ఆ సృష్టివరకు మరలా జన్మించరు. దానినే మోక్షం అంటారు. అలాకాక ప్రకృతి మాయలోపడి ప్రకృతి ఆకర్షణకు లోబడినవాడు గుణకర్మలు చేస్తూ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటాడు. అనేక బాధలు పడుతూనే ఉంటాడు. 


యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం | 

తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః || (అ.7-శ్లో.28) 

పుణ్యకర్మలు చేసి సకల పాపాలనూ పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖ రూపమైన మోహాల నుంచి విముక్తులై గట్టి పట్టుదలతో నన్ను భజిస్తారు. 


జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే | 

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం || (అ.7-శ్లో.29) 

ముసలితనం, మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించే వాళ్ళు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆత్మ స్వరూపాన్నీ, సమస్త కర్మలనూ గ్రహించగలరు. 


భగవంతుడు మాయకు అతీతుడు. ఆయన మాయకు లోబడకపోగా ఆ మాయనే తన చెప్పుచేతలలో పెట్టుకుంటాడు. తన మాయను తన ఇష్టానుసారం వ్యక్తీకరిస్తాడు, లయిస్తాడు. ఆ మాయ కాకుండా కేవలం పురుషుడుగానే తన ఉనికిని కలిగి ఉన్నాడు. 

జీవుడు అలాకాదు. మాయకు అతీతుడు కాదు. జీవుడు తన ప్రకృతిని తన నుండి విడదీయలేడు. ప్రకృతి కాకుండా విడిగా జీవునికి ఉనికి లేదు. అట్టి భావనే అసంగతం. కనుక జీవుడు ప్రకృతి లేక మాయకు అతీతుడు కాడు. కేవలం భగవంతుడి మీద మనసు నిలపటం వలన మాత్రమే ..ఆయన వలన మాత్రమే ఈ ప్రకృతి మాయను జీవుడు అతిక్రమిస్తాడు. అంటే నిష్కామకర్మ వలన మాత్రమే మానవుడు ప్రకృతి మాయను, ప్రకృతి కర్మబంధాలను అతిక్రమిస్తాడు. జ్ఞానం యెడల శ్రద్ధ, ధర్మం యెడల అనుతాపం, గుణకర్మల యెడల అనాసక్తి, భగవంతుని యెడల అనురక్తి ఇత్యాది గుణాల వలననే మానవుడు భగవంతుని సాయంతో ప్రకృతి మాయను అధిగమిస్తాడు. 


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | 

మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే || (అ.7-శ్లో.14) 

త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవ మాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు 


మోక్షం

మోక్షమంటే మానవుడు మరణించిన పిదప తదుపరి జన్మలు లేకుండా ఉండటం. 

మోక్షంలో పరబ్రహ్మంలో ఐక్యమౌతాముకనుక బ్రహ్మానందాన్ని అనుభవిస్తామని కొందరంటారు. ఇంద్రియాలు, మనసు, బుద్ధిలతో కూడుకున్న దేహం లేకుండా ఏ ఆనందమైనా మనం ఎలా అనుభవిస్తాము? అదే నిజమైతే స్వస్వరూపసందర్శనం పేరుతో ఆ ఒక్కసారి మాత్రం జన్మించడం దేనికి? అదికూడా లేకుండా మనం ఎల్లప్పుడూ మోక్షంలోనే ఉండవచ్చు గదా! 

కానీ మనం జన్మిస్తున్నాము. ఎందుకు జన్మిస్తున్నామంటే జీవునికి నిజమైన ఆనందం స్వస్వరూప సందర్శనంలోనే ఉన్నది గనుక!  

నివృత్తిలోని దుఃఖంలో చిక్కుకోకుండా ఉండటమొక్కటే మోక్షంలోని ఏకైక ప్రయోజనం. అంతకుమించి దానికి వేరే ప్రయోజనమంటూ ఏమీలేదు.

ఈ మోక్షమనేది అప్పుడు జరుగుతున్న సృష్టికాలానికి మాత్రమే పరిమితం. మరో సృష్టి మొదలైనపుడు మరలా జన్మించవలసిందే. శాశ్వత మోక్షం ఎవరికీ రాదు. పైగా అది అర్థరహితం కూడా!


...(మిగతా విషయం తరువాతి భాగాలలో)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి