25, సెప్టెంబర్ 2017, సోమవారం

యోగభావనలు (Concepts of Yoga) -3



శక్తి సముపార్జనా మార్గాలు


శక్తిని ఆర్జించే మార్గాలుగా భారతీయ సమాజంలో ఎప్పటినుండో కొన్ని పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. 

ప్రాచీన భారతదేశంలో ఋషులు, మునులు శక్తిని ఆర్జించడానికి తపస్సును ఆచరించేవారు. దీనిని వారు స్వార్థం కోసం కాక లోకకళ్యాణం కోసం చేసేవారు. అసురులు మాత్రమే స్వార్థం కోసం చేసేవారు.  

కాలక్రమంలో ఆ సంప్రదాయానికి భారతీయ సమాజం దూరమైన తరువాత కొందరు దిగువ స్థాయి సాధకులు, కొందరు సిద్ధులు, మరికొందరు దుర్మార్గులు కలసి రకరకాల పద్దతులను శక్తి సాధనా మార్గాలుగా ప్రచారం చేసారు. చివరికి ఈనాడు ఈ సాధన జాతకాలు చెప్పి జీవనం సాగించే వారి వ్యాపకంగా మిగిలిపోయింది. దీనికి కారణం కొంత అవగాహనా లోపమైతే, కొంత దురాశ. 

'బ్రహ్మచర్యం' ద్వారా శక్తిని ఆర్జించవచ్చు అనేది ప్రాచీనకాలంనుండి ఉన్న ఒక సూత్రీకరణ. 

దీనిని ఆసరాగాచేసుకొని బ్రహ్మచర్యం అనేపదానికి సంభోగానికి దూరంగా ఉండటం అనే సంకుచితార్థం కల్పించి దానికి విపరీత ప్రచారం కల్పించారు. ఒక వ్యక్తి వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించడానికి ముందుదశ బ్రహ్మచర్యం కాబట్టి ఆ అర్థానికి సమర్థన లభించినట్లయినది. నిజానికి బ్రహ్మచర్యం అంటే అనేక నియమనిష్ఠల సమాహారం. సంభోగానికి దూరంగా ఉండటం అనేది అందులో ఒకటి. అది కూడా అవివాహితులకు మాత్రమే ఆ నియమం బేషరతుగా వర్తిస్తుంది. గృహస్థులు కూడా బ్రహ్మచర్య వ్రతదీక్ష అవలంబించవచ్చు. ఐతే సంభోగానికి దూరంగా ఉండటం అనే నియమం అవివాహితులకు వర్తించినంత కఠినంగా గృహస్థులకు వర్తించదు. కానీ వీరి ప్రచారంవలన సంభోగానికి దూరంగా ఉంటే చాలు ఇంకెన్ని అవలక్షణాలను కలిగిఉన్నా బ్రహ్మచర్యదీక్షకు ఎలాంటి ఆటంకం కలగదనే అభిప్రాయం ఏర్పడింది. 

ఇంకొంత మంది మరింత ముందుకెళ్ళి వీర్యం స్ఖలించకుండా నిగ్రహించుకుంటే ఆ వీర్యం శక్తిగా మారుతుందనే ప్రచారం కల్పంచారు. ఇదే నిజమైతే మరి స్త్రీలెలా శక్తివంతులౌతారు. వీళ్ళదృష్టిలో శక్తిసముపార్జన మగవారికే పరిమితమన్నమాట; అసలు శక్తి స్వరూణిగా చెప్పబడే స్త్రీ ఇందుకు అనర్హులన్నమాట. వీరెంతకు దిగజారారంటే స్త్రీని శక్తిసాధనకు అనర్హురాలుగా ప్రకటించడంతో ఆగకుండా ఒక మగవాడు చేసే సాధనకు స్త్రీ ఒక ఆటంకం అనే అభిప్రాయాన్ని కూడా ప్రచారం చేశారు. ఇది మరింత సంకుచితమైన అర్థం.

యోగశక్తి అన్నివిధాలైన ప్రాపంచిక విజయాలకు మూలం. ఇది కలిగి ఉన్నవారు ఈ లోకంలో కార్యసాధకులై వర్ధిల్లుతారు.'వీర్యం' అనేది యోగశక్తికి పర్యాయపదం కనుక యోగశక్తి కలిగి ఉన్నవారిని వీర్యవంతుడు/రాలు అంటారు. యోగశక్తి కార్యసాఫల్యతకు దారితీసినట్లుగా పురుషుని రేతస్సు (semen) ఒక స్త్రీ గర్భసాఫల్యతకు దారితీస్తుంది కనుక ఆ రేతస్సును కూడా వీర్యమని పేర్కొనడం జరుగుతున్నది. ఇది కేవలం ఉపమానం మాత్రమే. అంతేకానీ వీర్యమంటే రేతస్సు అని కాదు అర్థం. కానీ ఈ అర్థాన్నే అనేకమంది వ్యాప్తిచేశారు. ఈ అర్థాన్ని బట్టే వారు రేతస్సు (వారి దృష్టిలో వీర్యం) స్ఖలించకుండా సంరక్షించబడితే అది యోగశక్తిగా మారుతుందని ప్రచారం చేశారు. 

ఇంత విడ్డూరమైన ప్రచారాలన్నీ శక్తి సాధనా మార్గంనుండి బుధజనులు తప్పుకొని దిగువస్థాయి వ్యక్తులు ప్రవేశించడం వలనే జరిగినది.

మరికొంత మంది ప్రాణాయామాన్ని శక్తి సాధనా మార్గంగా ప్రచారం చేశారు. 

వీరు చెప్పేదేమంటే మానవుని వెన్నెముక అథోభాగంలో 'కుండలిని' అనే శక్తి ఉంటుంది. అది చుట్టచుట్టుకిని నిదురించే సర్పాన్ని పోలి ఉంటుంది. వెన్నెముక మధ్య భాగంలో కటిస్థానంనుండి శిరస్సు యొక్క పైభాగం వరకూ ప్రయాణిస్తూ సుషుమ్న అనే నాడి ఉంటుంది. దానికి ఇరువైపులా ఇడ, పింగళ అనే రెండు నాడులుంటాయి. ఈ రెండు నాడులకు రెండు నాసికా రంధ్రాలకు సంబంధం ఉంటుంది. ఇడానాడి ఎడమ నాసికా రంధ్రం ఆధీనంలో ఉంటుంది. పింగళా నాడి కుడి నాసికా రంధ్రం ఆధీనంలో ఉంటుంది. ఆయా నాసికా రంధ్రాలద్వారా ఓ క్రమపద్దతిలో మార్చి మార్చి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను చేయడం ద్వారా ఇడాపింగళా నాడులద్వారా వెన్నెముక అధోబాగంలో ఉన్న కుండలిని మేల్కొని సుషుమ్నద్వారా ఊర్ధ్వగమనం చెంది శిరోభాగాన్ని చేరేక్రమంలో మానవుడు శక్తివంతుడవుతాడు. అతడికి అణిమ,గరిమ,లఘిమ మొదలైన ఎనిమిది మహిమాన్విత శక్తులు సమకూరతాయి. వీటిని 'అష్టసిద్ధులు' అని అంటారు. వీటిని సాధించినవాడిని సిద్ధుడు అని అంటారు.   

వీరు చెప్పే పద్దతిలో అష్టాంగయోగం రూపంలో యోగమార్గాన్ని వివరించిన పతంజలి మహర్షి ఉద్దేశం ఎంతవరకు నెరవేరుతుందో మనం చెప్పలేము. 

పతంజలి యోగదర్శనాన్ని యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం మరియు సమాధి అనే ఎనిమిదిదశలుగా వివరించాడు. అందుకే ఇది అష్టాంగయోగంగా పిలువబడుతుది. ఆ ఎనిమిదింటిలో ప్రాణాయామం ఒకటి. 

అయితే యోగమార్గానికి యమనియమాలు పునాది వంటివి.

ఈ రెంటినీ శ్రద్ధగా పాటిస్తే మిగతా ఆరుదశలూ వాటంతటవే జరిగిపోతాయి. అంటే వీటి మధ్యన సంబంధం కార్యకారణ సంబంధం (cause & effect) అన్నమాట. యమనియమాలు కారణమైతే మిగిలిన ఆరుదశలు కార్యం. 

భారత స్వాతంత్ర్య సమర నాయకుడు గాంధీ 'యమం'లోని సత్యం, అహింసలనే తన జీవితాదర్శాలుగా గైకొన్నాడు. అయితే అనేకమంది యమనియమాలను నామమాత్రంగా ఉదహరించి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం మొదలైన అంగాలను మాత్రమే శ్రద్ధగా సాధన చేస్తూ అదే యోగసాధనగా చెబుతుంటారు.

దీనికి కారణం మధ్యయుగాలలో కేవలం వీటికే అధిక ప్రాధాన్యతనిస్తూ 'హఠయోగం' అనే ప్రక్రియ తలయెత్తి జనబాహుళ్యంలో విస్తృతంగా వ్యాప్తిచెందింది. ఆ ప్రభవంతో నేటికీ యోగసాధన అంటే వివిధరకాలైన ఆసనాలు, వివిధరకాలైన శ్వాసించే పద్ధతులు, వివిధరకాలైన ధ్యానించే పద్ధతులు అని మాత్రమే భావించబడుతున్నది. వీటి మధ్యన యమనియమాలను గురించి ఆలోచించే తీరుబడి కూడా ఎవరికీ లేకుండా పోయింది.

శక్తి సముపార్జనకు కొందరు నవరత్నాలను ఉంగరాలుగా చేతివేళ్ళకు ధరిస్తుంటారు. రత్నాలనేవి అధిక శక్తికి కేంద్రాలుకనుక అవి ధరించినవారు శక్తివంతులుగా ఉండి కార్యసాధకులౌతారని దీని ఉద్దేశ్యం. 

మరికొందరు ఒక రాగిరేకుమీద యంత్రం గీసి కొన్ని మంత్రాలను ఉచ్ఛరించడంద్వారా అందులోకి శక్తిని ఆవాహన చేసి, అలా వచ్చిన శక్తిని ఆయంత్రంలో బంధించి ఇంటి ఆవరణలో ఏదో ఓ చోట దానికి గుప్తంగా దాచిపెడతారు. ఇక ఆ శక్తి ఆ ఇంటిని వదిలిపోదన్నమాట; దుష్టశక్తులేవీ దరిచేరవన్నమాట.

అంటే శక్తిని మనం సదాచారంద్వారా, సుగుణాలద్వారాకాక ఇలా రత్నాలను ధరించడం ద్వారా, యంత్రాలలో బంధించడంద్వారా సంపాదించడమన్నమాట.

భోగలాలసులైన రాజులు, జమీందారులలో సత్ప్రవర్తన, సదాచారం అనేవి కుందేటికొమ్ము లాంటివి. అటువంటివారివలనే ఇలాంటి చిట్కా మార్గాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

కొందరు శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి మానవదేహంలో శక్తికేంద్రాలైన మర్మాంగాలను పూజిస్తారు. వీరు పురుషాంగాన్ని, స్త్రీ యోనిని శిలలపై చెక్కి వాటిని పూజిస్తారు. వీరిని శాక్తేయులని పిలుస్తారు.

శక్తిని వశం చేసుకొనేది సిరిసంపదలకోసమే కనుక కొందరు ఇనుము వంటి విస్తారంగా దొరికే విలువ తక్కువ లోహాలను బంగారం వంటి అరుదైన, విలువైన లోహాలుగా మార్చి ధనవంతులవటానికి రసవాదాన్ని (Alchemy) ఆశ్రయిస్తారు.

ఇటీవలికాలంలో వ్యాప్తిలోకి వచ్చిన న్యూమరాలజీ కూడా ఈ కోవలోకే వస్తుంది. వారు ఒక వ్యక్తి పేరునులోని అక్షరాలను శక్తి ఆవాహనకు అనుకూలంగా మార్పు చేస్తారు. ఆ మార్పుతో అతడు శక్తివంతుడై కార్యసాధకుడు అవుతాడన్నమాట.

ఇప్పటివరకూ పేర్కొన్న మార్గాలన్నీ మంచిశక్తి లేక దైవశక్తి (Positive Energy) ని ఆర్జించే మార్గాలు. ఇవికాక దుష్టశక్తిని (Negative Energy) సాధించే పద్దతులకూడా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చర్చించడం అనవసరం. ఇవన్నీ కూడా యోగమార్గం లోని అనేకానేక ఉపశాఖలే.

ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఋషులు, మునులు తపస్సు చేసే సంప్రదాయం కనుమరుగైన తరువాత కొందరు దిగువస్థాయి వ్యక్తులు, మరికొందరు దుర్మార్గులు వలన ఒకదాని తరువాత ఒకటిగా క్రమంగా భారతీయ సమాజంలోనికి ప్రవేశించాయి.

వీటిలో శాస్త్రీయత ఎంతన్నది, మూఢత్వం ఎంతన్నది, నైతికత ఎంతన్నది ఎవరికీ తెలియదు.

సదాచారమే శక్తి సముపార్జనకు సర్వోత్తమ మార్గం. ప్రాచీన భారతదేశంలోని ఋషులు ఒనరించిన తపస్సుయొక్క సారం కూడా అదే.

యమనియమాలంటే సదాచారం తప్ప మరేమీ కాదు.  




22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

యోగభావనలు (Concepts of Yoga) -2



యోగశక్తి సంచయనం 
(Accumulation of Cosmic Energy)

శక్తి ప్రతీ క్షేత్రంలోనికీ ఎంతో కొంత మొత్తంలో తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకొంటుందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం.

ఈ కారణంగా ప్రతీ ప్రదేశంలోనూ స్వతఃసిద్ధంగా ఎంతోకొంత శక్తి ఉంటుంది. అలా ఉన్న శక్తి వలన ఏ ప్రదేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు లభించదు. ఎందుకంటే అది సాధారణమైన పరిమాణంలోనే ఉంటుంది. ఆపాటి శక్తి అన్ని ప్రదేశాలలోనూ ఉంటుంది. ఒక ప్రదేశంలోని శక్తి పరిమాణం అసాధారణంగా వృద్ధిచెందినపుడే ఆ ప్రదేశం తేజోవంతమై అది ఒక ప్రత్యేకమైన విలువను, గుర్తింపును సంతరించుకొంటుంది.

శక్తి ప్రతీ ప్రదేశంలోనికీ తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకుంటుందనే ధర్మాన్ని ఆసరాగా చేసుకొని మానవుని నియంత్రణలో ఉన్న ప్రదేశాలలోనికి చేరిన శక్తిని కొన్ని సాధనలద్వారా పెంపు చేయడం ద్వారా మానవుడు శక్తివంతుడు కాగలడు.

ఇలా ఆర్జించిన యోగశక్తిని ఓజోశక్తి అనీ, కుండలినీశక్తి అనీ రకరకాలుగా పిలుస్తారు. ఈ శక్తి కలిగిన మానవుడిని ఓజోవంతుడనీ, వీర్యవంతుడు అని పేర్కొంటారు. 

ఈ సాధనలలో సన్మార్గమైనవీ ఉన్నాయీ, దుర్మార్గమైనవీ ఉన్నాయి. సన్మార్గంలో చేసే సాధనలు ఫలించడానికి దీర్ఘకాలం పడుతుంది. అందుకే కొందరు దురాశాపరులు స్వల్పకాలంలో ఫలితాలనందించే అడ్డదారులలో శక్తి సముపార్జనకు పూనుకుంటారు. 

సన్మార్గంలో శక్తిని ఆర్జించడానికి దీర్ఘకాలం సాధన చేయవలసి ఉంటుంది. దీనికొరకు ప్రాచీన భారతదేశంలో తపస్సు అనే వ్యవస్థీకృత సాధనా రూపం ఉండేది. దీనిని బుధజనులైన ఋషులు, మునులు ఆచరించి శక్తిని ఆర్జించేవారు. ఇది శక్తిని ఆర్జించడానికి ఒక శాస్త్రీయ సాధన ...ఒక Full time Job.

తపస్సు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నట్లైతే శాస్త్రీయంగా తపస్సు చేయకపోయినప్పటికీ తపస్సులో భాగమైన అంశాలను ఆచరించడం ద్వారా సమాజంలో ఒకరిగా ఉంటూ సాధారణమైన కుటుంబజీవితం గడిపేవారు కూడా శక్తిని ఆర్జించవచ్చు.

ఆ ప్రకారంగా చాలా సులువైన మార్గంలో, సులభమైన పద్దతిలో ఈ శక్తిని మనం స్వంతం చేసుకోవచ్చు. కావలసిందల్లా ఆకాంక్ష, పరిశీలన, విశ్వాసం మాత్రమే.

శక్తి అనంతమైనది, అపారమైనది. అది ఈ జగత్తులో ఎల్లెడలా విస్తారంగా వ్యాపించి ఉంటుంది. కానీ దానిలో మనం ఎంత వశం చేకున్నామన్నదాని మీదే మన శక్తి ఆధారపడి ఉంటుంది.

శక్తిని వశం చేసుకోవడానికి అనేక పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువ పద్దతులు దుర్మార్గమైనవి. అవన్నీ శక్తిని ఆర్జించడనికి ఉన్న అడ్డదారులు. 

దురలవాట్లతో (పంచ మకారాలు: మద్యం, మాంసం, మత్స్యం, మిథునం, ముద్ర) కూడుకున్న తాంత్రిక సాధన, 

పరపీడనతో (జంతుబలి, నరబలి) కూడుకున్న క్షుద్రపూజలు, 

దురాశతో కూడుకున్న రసవాదం. 

ఇటువంటివన్నీకూడా శక్తినార్జించే మార్గాలుగా ప్రచారంలో ఉన్నాయి. 

కానీ ఇటువంటి దుర్మార్గమైన పద్దతులను దిగజారిన మనుషులు, అన్నిరకాలుగా దిగువస్థాయి వ్యక్తులు మాత్రమే ఆశ్రయిస్తారు. బుధజనులు ఇటువంటి పద్దతులను కలలో కూడా తలంచరు.

శక్తి సముపార్జనకు బుధజనసమూహానికి ఆమోదయోగ్యమైన ఉత్తమ మార్గం సదాచరణ. ఇది మనుషులను శక్తివంతులను చేయటమేకాక సకలజనులకూ మేలు చేసి, ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిస్తుంది.

శక్తివంతులైన వ్యక్తులు శక్తివంతమైన కుటుంబాలను నిర్మిస్తారు. 

శక్తివంతమైన కుటుంబం శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది. 

శక్తివంతమైన సమాజం శక్తివంతమైన జాతిని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తుంది. 

శక్తివంతమైన దేశం శక్తివంతమైన ప్రపంచాని నిర్మిస్తుంది.

సదాచారమే శక్తికి మూలం!

సదాచరణే ఈ యోగశక్తిని సంచయనం చేసే (శక్తిని వశం చేసుకోవడానికి) ఉత్తమ మార్గం.

సదాచారాన్ని పాటించే మానవుడు శక్తివంతుడవుతున్నాడు ...వీర్యవంతుడవుతున్నాడు. 


14, సెప్టెంబర్ 2017, గురువారం

యోగభావనలు (Concepts of Yoga) -1



విజయరహస్యం 
(Success Mantra)

సమాజంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు సంపాదించుకోవడం తప్పనిసరి. ఆ అవసరాలు తీరిన తరువాత జీవితంలో ప్రయోజకులై సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపాలని కోరుకుంటారు. అది కూడా నెరవేరిన తరువాత సిరిసంపదలు, పేరుప్రతిష్ఠలు వంటి భోగభాగ్యాలను కోరుకుంటారు. వీటి సాధననే మనం విజయంగా చెబుతుంటాం. 

ఈ విజయాన్ని ఐదు రూపాలలో చూడవచ్చు. అవి యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం(సౌందర్యం)

ఇవన్నీ కూడా శక్తి రూపాలే.

శక్తికి కొన్ని లక్షణాలున్నాయి. 

అది అనేకరూపాలలో ఉంటుంది. ఒక రూపంనుండి మరో రూపంలోనికి రూపాంతరం చెందుతుంది. 

మనం సైన్సుని అధ్యయనం చేసేటపుడు కూడా 'శక్తినిత్యత్వనియమం' (law of conservation of energy) పేరుతో ఇవే విషయాలను తెలుసుకుంటాం. అదేమంటే శక్తిని సృష్టించలేము మరియు నశింపజేయలేము. అది అనేకరూపాలలో ఉండి ఒక రూపంనుండి మరో రూపంలోనికి మారుతుందే కానీ దాని యొక్క మొత్తం పరిమాణంలో మార్పుండదు.

విద్యుచ్ఛక్తి, ఉష్ణశక్తి, స్థితిశక్తి, గతిశక్తి, సౌరశక్తి, యాంత్రికశక్తి... ఇలా ప్రకృతిలో శక్తి అనేక రూపాలలో ఉంటుంది. ఆ ప్రకృతి యొక్క అంశతోనే యేర్పడిన ప్రాపంచిక జీవితంలో కూడా యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం.... ఇత్యాది వివిధ రూపాలో శక్తి ఉంటుంది. వాటిని పొందడాన్నే మనం ప్రాపంచిక విజయంగా చెబుతుంటాం.

సమాజంలో జీవనం సాగించే మానవుడు వీటిని (వీటన్నింటినీ కానీ, వీటిలో కొన్నింటినిగానీ లేక ఏదో ఒక దానిని కానీ) సాధించడానికి పూనుకున్నపుడు వాటికోసం ప్రత్యక్షంగా ప్రయత్నించకూడదు. అలాంటి ప్రయత్నం వ్యర్థ ప్రయాసగానే మిగిలిపోతుంది.

ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా లభించవు, వీటన్నింటికీ మూలరూపమైన యోగశక్తిని వీటి రూపాలలోకి రూపాంతరం చెందించడం ద్వారా మాత్రమే ఇవి లభిస్తాయి.

అంటే వాటిని సాధించాలనుకునే వ్యక్తి అందుకు పూనుకునే సమయానికే తగిన పరిమాణంలో యోగశక్తిని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యోగశక్తి రూపాంతరం చెందడం ద్వారా యశోసంపదాది విజయాలు లభిస్తాయి. అలా ముందుగానే యోగశక్తిని కలిగిలేని వ్యక్తి విజయ సాధనకు ఎంతగా ప్రయత్నించినా అవన్నీ వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి.

ప్రయత్నం అనేది యోగశక్తిని ప్రాపంచిక విజయంగా రూపాంతరం చెందించే ఒక Transforming Agent మాత్రమే. యోగశక్తి లోపించినపుడు అది చేయగలిగింది ఏమీ లేదు.ప్రయత్నపరులలో అనేకమంది అపజయాన్ని పొందడానికి కారణం ఇదే.

కనుక ఈ లోకంలో ఎటువంటి ప్రాపంచిక విజయాన్నయినా లక్ష్యంగా కలిగిన మానవుడు ఆ లక్ష్యం కోసం ప్రయత్నించడానికంటే ముందు చేయవలసిన పని ఆ లక్ష్యానికి తగిన స్థాయిలో యోగశక్తిని సమకూర్చుకొని వీర్యవంతుడవటం. 


యోగశక్తిని సంచయనం చేసే విషయంలో మాత్రమే మానవుని యొక్క ప్రయత్నం లేక ప్రత్యక్ష కృషి ఫలిస్తుంది.

(“యోగశక్తిని ఎవరైనా సాధించగలరు కానీ ఐహిక (లౌకిక లేక ప్రాపంచిక) విజయాన్ని మాత్రం యోగశక్తి ఉన్నవారు మాత్రమే సాధించగలరు”) 

ఈ విషయాన్ని గ్రహించడం వలనే ప్రాచీన భారతదేశంలో ఋషులు తమ జీవితంలో ప్రాపంచిక విజయం కోసం వేగిరపడక యోగశక్తిని ఆర్జించడం కోసం చిన్నవయస్సులోనే తపస్సుకు ఉపక్రమించేవారు. 


5, సెప్టెంబర్ 2017, మంగళవారం

యోగమార్గం - పరిచయం

ఇపుడు యోగమార్గం గురించి తెలుసుకుందాం.

మునుపటి వ్యాసంలో తెలిపినట్లుగా 'జగత్తు శక్తిమయం' అన్నవర్ణనను అనుసరించి యోగమార్గం ఏర్పడింది.

ఎలాగంటే

ప్రకృతి అనేది పదార్ధ (matter) రూపంలో ఈ జగత్తుకు భౌతికమైన అస్థిత్వాన్ని అందించడమేకాక యోగశక్తి (energy) రూపంలో కూడా జగత్తు అంతటా సమంగా వ్యాపించి ఉంటుంది. అందుకే జగత్తును శక్తిమయం అని వర్ణించడం జరిగినది.

ఆ విధంగా జగత్తులో సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న శక్తిని మన నియంత్రణలో ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతం వద్ద అధిక మొత్తంలో కేంద్రీకరించి దాని ద్వారా జగత్తులోని —శక్తి తక్కువగా ఉండే— మిగతా ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సాధించడమే యోగమార్గం. (అందుకే దీనిని రాజయోగం అని కూడా అంటారు)

అంటే లౌకిక శక్తిని ఆర్జించడం ద్వారా లౌకిక పరమైన దుఃఖం నుండి, కష్టనష్టాల నుండి బయటపడే విధానమే యోగమార్గం.

జగత్తులోని వైరుధ్యాలకు సమతుల్యత కల్పించడం ద్వారా దానిని ప్రభావరహితం చేసి దుఃఖ విముక్తి పొందటం సాంఖ్యపద్దతి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ప్రాపంచిక శక్తిని అధిక మొత్తంలో పోగుచేసి తద్వారా ప్రాపంచిక దుఃఖం నుండి విముక్తి పొందటం యోగపద్దతి.

ఈ యోగమార్గం ఎంతో సంక్లిష్టమైనది. నెమ్మదిగా ఒక క్రమ పద్దతిలో దీనిని అర్థం చేసుకోవాలి.

ఇది భారతీయుల ఆలోచనా విధానంలో, జీవన విధానంలో పెనవేసుకుపోయి ఉంటుంది.

భారతీయులు అమితంగా విశ్వసించే కర్మసిద్ధాంతం ఈ యోగమార్గాన్ని అనుసరించి రూపుదిద్దుకున్నదే.

భారతీయ సమాజానికి విలక్షణమైన కులవ్యవస్థ ఈ యోగమార్గాన్ని అనుసరించి సంతరించుకున్నదే.

అంతేకాక పాపం-పుణ్యం, స్వర్గం-నరకం వంటి భావనలు, జ్యోతిష్యశాస్త్రం మరియు దాని యొక్క అనేక ఉపవిభాగాలు, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, పరసువేది, ఇత్యాది అనేకమైన విషయాలు యోగమార్గం యొక్క వివిధ శాఖల రూపంలో తలయెత్తినవే.

ప్రకృతీ పురుషులు రెండింటిలో ఈ శక్తి ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి నుండి జగత్తు ఏర్పడినది. లోకం, ప్రపంచం జగత్తుకు పర్యాయ పదాలు. అందుకే ఇది జగత్సంబంధమైన శక్తి... లౌకిక శక్తి... ప్రాపంచిక శక్తి.

ఈ శక్తిని యోగమాయ లేక యోగశక్తి అని కూడా అంటారు. అందుకే దీనికి యోగమార్గం అనే పేరు వచ్చింది.

ఈ శక్తికి ప్రతీకగా ఉండే దేవతను దుర్గ, కాళి, చండి మొదలైన పేర్లతో పిలుస్తారు.


క్షేత్రాలు, ఉపాధులు:

ఈ జగత్తంతా సమంగా, స్వేచ్ఛగా ఉండే అనంతశక్తి స్థిరీకరణ పొందడం కోసం ప్రతి క్షేత్రాన్నీ లేక ప్రతి ఉపాధినీ తనలోని కొంత భాగానికి స్థావరంగా మార్చుకొంటుంది. అలా ప్రతీ క్షేత్రం లేక ప్రతీ ఉపాధిలో శక్తి కొంత అధికంగా పోగుచేయబడి (సంచితమై, బంధితమై (accumulated & locked) ఉంటుంది. 

అంటే ప్రకృతి ఒక క్షేత్రంలో దానికి భౌతికమైన అస్థిత్వాన్నిచ్చే పదార్ధంరూపంలోనేకాక యోగశక్తిరూపంలో కూడా కొలువై ఉంటుంది.

క్షేత్రాలు, ఉపాధులు అంటే అది ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఒక కుటుంబమైనా కావచ్చు, ఒక దేశమైనా కావచ్చు, ఒక వ్యవస్థ అయినా కావచ్చు, ఒక జంతువైనా కావచ్చు, ఒక నగరమైనా కావచ్చు, ఒక లోహమైనా కావచ్చు లేక మరేదైనా కావచ్చు. లౌకికమైనది ఏది అయినా కావచ్చు.    

హెచ్చుతగ్గులు:

స్వేచ్ఛగా ఉన్నపుడు సమంగా (అన్ని సమయాలలో ఒకే సాంద్రతతో, అంతటా ఒకే పరిమాణంతో) ఉన్న శక్తి ఏదైనా ఉపాధిని స్థావరంగా చేసుకొని స్థిరీకరణ పొందగానే దాని పరిమాణంలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఏర్పడుతుంది. 

అంటే ఒక క్షేత్రంలోని శక్తి పరిమాణం వేరువేరు సమయాలలో సమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాలక్రమంలో దాని పరిమాణంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. అలాగే వేరువేరు క్షేత్రాలలోని శక్తిపరిమాణం కూడా సమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

స్వేచ్ఛగా ఉన్నపుడు శక్తి పరిమాణం అన్ని ప్రదేశాలలో, అన్ని సమయాలలో ఖచ్చితంగా సమానంగా ఉంటుందిగానీ, శక్తి ఏదేనీ క్షేత్రంలో స్థిరీకరణ పొందినపుడు మాత్రం ఆ ఖచ్చితత్వం ఉండదు.

ఈ హెచ్చుతగ్గుల ప్రక్రియనూ దానికి గల కారణాలను మరియు ఈ హెచ్చుతగ్గులను నియంత్రించే పద్దతినీ చర్చించేదే యోగమార్గం.


కేంద్రీకరణ, సాంద్రీకరణ:

ఇలా శక్తి ప్రతీ క్షేత్రాన్ని తన స్థావరంగా చేసుకొనే లక్షణాన్ని ఆసరాగా చేసుకొని ఒక నిర్ధిష్ఠ ప్రదేశంలో స్థిరీకరణ పొందిన (లేక కేంద్రీకరింపబడిన) శక్తి పరిమాణాన్ని (లేక సాంద్రతను) క్రమంగా పెంపుచేయడం, ....అది మరలా ఆ ప్రదేశం నుండి నిర్గమనం చెందకూడా కాపాడడం ... ఇదే యోగమార్గం.    

తేజస్సు, తరచుదనం:

ఈ కేంద్రీకరణ, సాంద్రీకరణ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశానికి అంతటి అసాధారణత్వం సిద్ధిస్తుంది. ప్రాపంచికంగా దాని విలువ అంతగా పెరుగుతుంది. అలాగే ఈ శక్తి తగ్గే కొలదీ ఆ ప్రదేశం అదేవిధంగా సాధారణమైపోతూ ఉంటుంది.

అదేవిధంగా ఒక ప్రదేశంలో ఈ కేంద్రీకరణ, సాంద్రీకరణ పెరిగేకొలదీ ఈ జగత్తులో ఆ స్థాయి కలిగిన ప్రదేశాలు అరుదుగా ఉంటాయి. అంటే శక్తి సాంద్రత పెరిగే కొలదీ తరచుదనం తగ్గుతుంది. దాని తేజస్సు …..ఐహిక ప్రపంచంలో దాని యొక్క విలువ కూడా అదే స్థాయిలో క్రమంగా పెరుగుతాయి.

కేంద్రీకరణ, సాంద్రీకరణ తగ్గేకొలదీ ఈ జగత్తులో ఆ స్థాయి కలిగిన ప్రదేశాలు తరచుగా ఉంటాయి. అంటే శక్తి సాంద్రత తగ్గే కొలదీ తరచుదనం పెరుగుతుంది.  దాని తేజస్సు …..ఐహిక ప్రపంచంలో దాని యొక్క విలువ కూడా అదే స్థాయిలో క్రమంగా తగ్గుతాయి.

అంటే ఈ పరిస్థితిని ఒక పిరమిడ్‌తో పోల్చవచ్చు. శక్తి సాంద్రీకరణ తక్కువగా ఉన్న ప్రదేశాలు ఎక్కువ సంఖ్యలో ఉండి పిరమిడ్‌కు అడుగుభాగంలో ఉంటాయి. వాటికి పైన మరికొంత అధిక శక్తి సాంద్రత కలిగిన ప్రదేశాలు ఉండి వాటి సంఖ్య క్రింది వాటి కన్నా కొంత తక్కువ గా ఉంటుంది. ఈ విధంగా పిరమిడ్‌లో పైకి పోయే కొలదీ ఒక ప్రదేశంలోని శక్తి సాంద్రీకరణ పెరుగుతూ ప్రదేశాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి పిరమిడ్‌లో అడుగుభాగం నుండి అద్వితీయమైన శిఖరభాగాన్ని లక్ష్యంగా చేసుకొని —పైవైపుననున్న ఒక్కొక్క భాగాన్ని దాటుకుంటూ— ఊర్ధ్వగమనం చెందేటట్లుగా శక్తి సాంద్రీకరణను, కేంద్రీకరణను పెంచుకోవడమే యోగమార్గం.

ఉదాహరణకు ఒక దేశంలో జనావాసాలు ఏర్పడే విధానాన్ని మనం పరిశీలించవచ్చు. ఏ దేశంలోనైనా సరైన సౌకర్యాలు లేకుండా తక్కువ జనాభాను కలిగి ఉండే గుర్తింపులేని చిన్న చిన్న గ్రామాలు అసంఖ్యాకంగా ఉంటాయి. సకల నాగరిక సౌకర్యాలతో అధిక జనాభాతో అలరారుతూ విశ్వవ్యాప్తమైన గుర్తింపు కలిగిన మహానగరాలు అతి తక్కువగా ఉంటాయి. ఈ రెంటీకీ మధ్యస్థంగా అనేక చిన్నా పెద్దా పట్టణాలు, ద్వితీయ స్థాయి నగరాలు వాటికి తగిన మధ్య స్థాయి సౌకర్యాలతో ఉంటాయి. ఇదంతా కూడా ఆయా జనావాసాలలో కాలక్రమంలో ప్రజావసరాల మూలంగా నిర్దేశింపబడుతూ జరిగిన శక్తి కేంద్రీకరణ, సాంద్రీకరణల వలనే జరుగుతుంది.

అలాగే మరో ఉదాహరణ. ఇనుము, వెండి, బంగారం వంటి లోహాలలో ఇనుములో శక్తి సాంద్రీకరణ మిగతా రెంటికన్నా తక్కువగా ఉండటంవలన దానివిలువ ఆ రెంటికన్నా తక్కువగా ఉంటుంది. దాని లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారంలో శక్తి సాంద్రీకరణ అధికంగా ఉంటుంది. అలాగే దాని లభ్యత కూడా తక్కువగానూ ......లోకంలో దాని విలువ ఎక్కువగానూ ఉంటుంది. వెండి పరిస్థితి ఇనుముకన్నా ఎక్కువగానూ, బంగారంకన్నా తక్కువగానూ ఉంటుంది. ఇదంతా అనేక వేల లక్షల సంవత్సరాలపాటు భూగర్భంలో జరిగే మార్పుల వలన సహజసిద్ధంగా జరుగుతుంది.

అలాకాక ఈ మార్పును, ఈ శక్తి కేంద్రీకరణను కొన్ని రసాయన ప్రక్రియలద్వారా సాధ్యం చేసి ఇనుమువంటి నిమ్నలోహాలను బంగారంవంటి అధికస్థాయి లోహాలుగా మర్చవచ్చని రసవాదుల వాదన. అది వేరే సంగతి.

బొగ్గులో శక్తి సాంద్రీకరణ పెరిగితే బొగ్గు కాస్తా వజ్రంగా మారుతుంది.

ఇలా ఈ శక్తి కేంద్రీకరణ లేక సాంద్రీకరణ ఏ ప్రదేశంలోనైనా జరగవచ్చు.

ఇది ఒక దేశంలో జరిగితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.

ఒక సంస్థలో జరిగితే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది.

ఒక కుటుంబంలో జరిగితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది.

ఒక వ్యక్తిలో జరిగితే ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు.

సహజసిద్ధం, మానవప్రయత్నం:


ఈ శక్తి సాంద్రీకరణ కొన్ని సందర్భాలలో సహజ సిద్ధంగా జరుగుతుంది;

ఉదాహరణ: భూగర్భంలో బంగారం, వెండి వంటి ఉత్తమ లోహాలు, వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, రత్నాలు వంటి విలువైన రాళ్ళు ఏర్పడే విధానం.

మరి కొన్ని సందర్భాలలో మానవ ప్రయత్నంతో జరుగుతుంది.

ఉదాహరణ: ఒకానొక వ్యక్తి సాధనతో యోగశక్తిని సముపార్జించడం.

ప్రత్యక్షం, పరోక్షం:

అలాగే ఈ శక్తి సాధన కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగానూ జరగవచ్చు.

ఉదాహరణ: ఒకానొక వ్యక్తి సాధనతో యోగశక్తిని సముపార్జించడం.

మరి కొన్ని సందర్భాలలో పరోక్షంగానూ జరగవచ్చు.

ఉదాహరణ: ఒక కుటుంబ వాతావరణం వలన ఆ కుటుంబంలోని సభ్యులందరూ తమ ప్రమేయం లేకుండానే శక్తిని సముపార్జించడం.

అలాగే,

ఒక దేశంలోని పరిస్థితుల వలన ఆ దేశపౌరులు.... ఒక సంస్థలోని వాతావరణం వలన ఆ సంస్థలోని సభ్యులు తమ ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా, పరోక్షంగా శక్తిని ఆర్జించగలుగుతారు.