14, సెప్టెంబర్ 2017, గురువారం

యోగభావనలు (Concepts of Yoga) -1



విజయరహస్యం 
(Success Mantra)

సమాజంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు సంపాదించుకోవడం తప్పనిసరి. ఆ అవసరాలు తీరిన తరువాత జీవితంలో ప్రయోజకులై సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపాలని కోరుకుంటారు. అది కూడా నెరవేరిన తరువాత సిరిసంపదలు, పేరుప్రతిష్ఠలు వంటి భోగభాగ్యాలను కోరుకుంటారు. వీటి సాధననే మనం విజయంగా చెబుతుంటాం. 

ఈ విజయాన్ని ఐదు రూపాలలో చూడవచ్చు. అవి యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం(సౌందర్యం)

ఇవన్నీ కూడా శక్తి రూపాలే.

శక్తికి కొన్ని లక్షణాలున్నాయి. 

అది అనేకరూపాలలో ఉంటుంది. ఒక రూపంనుండి మరో రూపంలోనికి రూపాంతరం చెందుతుంది. 

మనం సైన్సుని అధ్యయనం చేసేటపుడు కూడా 'శక్తినిత్యత్వనియమం' (law of conservation of energy) పేరుతో ఇవే విషయాలను తెలుసుకుంటాం. అదేమంటే శక్తిని సృష్టించలేము మరియు నశింపజేయలేము. అది అనేకరూపాలలో ఉండి ఒక రూపంనుండి మరో రూపంలోనికి మారుతుందే కానీ దాని యొక్క మొత్తం పరిమాణంలో మార్పుండదు.

విద్యుచ్ఛక్తి, ఉష్ణశక్తి, స్థితిశక్తి, గతిశక్తి, సౌరశక్తి, యాంత్రికశక్తి... ఇలా ప్రకృతిలో శక్తి అనేక రూపాలలో ఉంటుంది. ఆ ప్రకృతి యొక్క అంశతోనే యేర్పడిన ప్రాపంచిక జీవితంలో కూడా యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం.... ఇత్యాది వివిధ రూపాలో శక్తి ఉంటుంది. వాటిని పొందడాన్నే మనం ప్రాపంచిక విజయంగా చెబుతుంటాం.

సమాజంలో జీవనం సాగించే మానవుడు వీటిని (వీటన్నింటినీ కానీ, వీటిలో కొన్నింటినిగానీ లేక ఏదో ఒక దానిని కానీ) సాధించడానికి పూనుకున్నపుడు వాటికోసం ప్రత్యక్షంగా ప్రయత్నించకూడదు. అలాంటి ప్రయత్నం వ్యర్థ ప్రయాసగానే మిగిలిపోతుంది.

ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా లభించవు, వీటన్నింటికీ మూలరూపమైన యోగశక్తిని వీటి రూపాలలోకి రూపాంతరం చెందించడం ద్వారా మాత్రమే ఇవి లభిస్తాయి.

అంటే వాటిని సాధించాలనుకునే వ్యక్తి అందుకు పూనుకునే సమయానికే తగిన పరిమాణంలో యోగశక్తిని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యోగశక్తి రూపాంతరం చెందడం ద్వారా యశోసంపదాది విజయాలు లభిస్తాయి. అలా ముందుగానే యోగశక్తిని కలిగిలేని వ్యక్తి విజయ సాధనకు ఎంతగా ప్రయత్నించినా అవన్నీ వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి.

ప్రయత్నం అనేది యోగశక్తిని ప్రాపంచిక విజయంగా రూపాంతరం చెందించే ఒక Transforming Agent మాత్రమే. యోగశక్తి లోపించినపుడు అది చేయగలిగింది ఏమీ లేదు.ప్రయత్నపరులలో అనేకమంది అపజయాన్ని పొందడానికి కారణం ఇదే.

కనుక ఈ లోకంలో ఎటువంటి ప్రాపంచిక విజయాన్నయినా లక్ష్యంగా కలిగిన మానవుడు ఆ లక్ష్యం కోసం ప్రయత్నించడానికంటే ముందు చేయవలసిన పని ఆ లక్ష్యానికి తగిన స్థాయిలో యోగశక్తిని సమకూర్చుకొని వీర్యవంతుడవటం. 


యోగశక్తిని సంచయనం చేసే విషయంలో మాత్రమే మానవుని యొక్క ప్రయత్నం లేక ప్రత్యక్ష కృషి ఫలిస్తుంది.

(“యోగశక్తిని ఎవరైనా సాధించగలరు కానీ ఐహిక (లౌకిక లేక ప్రాపంచిక) విజయాన్ని మాత్రం యోగశక్తి ఉన్నవారు మాత్రమే సాధించగలరు”) 

ఈ విషయాన్ని గ్రహించడం వలనే ప్రాచీన భారతదేశంలో ఋషులు తమ జీవితంలో ప్రాపంచిక విజయం కోసం వేగిరపడక యోగశక్తిని ఆర్జించడం కోసం చిన్నవయస్సులోనే తపస్సుకు ఉపక్రమించేవారు. 


1 కామెంట్‌: