5, సెప్టెంబర్ 2017, మంగళవారం

యోగమార్గం - పరిచయం

ఇపుడు యోగమార్గం గురించి తెలుసుకుందాం.

మునుపటి వ్యాసంలో తెలిపినట్లుగా 'జగత్తు శక్తిమయం' అన్నవర్ణనను అనుసరించి యోగమార్గం ఏర్పడింది.

ఎలాగంటే

ప్రకృతి అనేది పదార్ధ (matter) రూపంలో ఈ జగత్తుకు భౌతికమైన అస్థిత్వాన్ని అందించడమేకాక యోగశక్తి (energy) రూపంలో కూడా జగత్తు అంతటా సమంగా వ్యాపించి ఉంటుంది. అందుకే జగత్తును శక్తిమయం అని వర్ణించడం జరిగినది.

ఆ విధంగా జగత్తులో సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న శక్తిని మన నియంత్రణలో ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతం వద్ద అధిక మొత్తంలో కేంద్రీకరించి దాని ద్వారా జగత్తులోని —శక్తి తక్కువగా ఉండే— మిగతా ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సాధించడమే యోగమార్గం. (అందుకే దీనిని రాజయోగం అని కూడా అంటారు)

అంటే లౌకిక శక్తిని ఆర్జించడం ద్వారా లౌకిక పరమైన దుఃఖం నుండి, కష్టనష్టాల నుండి బయటపడే విధానమే యోగమార్గం.

జగత్తులోని వైరుధ్యాలకు సమతుల్యత కల్పించడం ద్వారా దానిని ప్రభావరహితం చేసి దుఃఖ విముక్తి పొందటం సాంఖ్యపద్దతి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ప్రాపంచిక శక్తిని అధిక మొత్తంలో పోగుచేసి తద్వారా ప్రాపంచిక దుఃఖం నుండి విముక్తి పొందటం యోగపద్దతి.

ఈ యోగమార్గం ఎంతో సంక్లిష్టమైనది. నెమ్మదిగా ఒక క్రమ పద్దతిలో దీనిని అర్థం చేసుకోవాలి.

ఇది భారతీయుల ఆలోచనా విధానంలో, జీవన విధానంలో పెనవేసుకుపోయి ఉంటుంది.

భారతీయులు అమితంగా విశ్వసించే కర్మసిద్ధాంతం ఈ యోగమార్గాన్ని అనుసరించి రూపుదిద్దుకున్నదే.

భారతీయ సమాజానికి విలక్షణమైన కులవ్యవస్థ ఈ యోగమార్గాన్ని అనుసరించి సంతరించుకున్నదే.

అంతేకాక పాపం-పుణ్యం, స్వర్గం-నరకం వంటి భావనలు, జ్యోతిష్యశాస్త్రం మరియు దాని యొక్క అనేక ఉపవిభాగాలు, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, పరసువేది, ఇత్యాది అనేకమైన విషయాలు యోగమార్గం యొక్క వివిధ శాఖల రూపంలో తలయెత్తినవే.

ప్రకృతీ పురుషులు రెండింటిలో ఈ శక్తి ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి నుండి జగత్తు ఏర్పడినది. లోకం, ప్రపంచం జగత్తుకు పర్యాయ పదాలు. అందుకే ఇది జగత్సంబంధమైన శక్తి... లౌకిక శక్తి... ప్రాపంచిక శక్తి.

ఈ శక్తిని యోగమాయ లేక యోగశక్తి అని కూడా అంటారు. అందుకే దీనికి యోగమార్గం అనే పేరు వచ్చింది.

ఈ శక్తికి ప్రతీకగా ఉండే దేవతను దుర్గ, కాళి, చండి మొదలైన పేర్లతో పిలుస్తారు.


క్షేత్రాలు, ఉపాధులు:

ఈ జగత్తంతా సమంగా, స్వేచ్ఛగా ఉండే అనంతశక్తి స్థిరీకరణ పొందడం కోసం ప్రతి క్షేత్రాన్నీ లేక ప్రతి ఉపాధినీ తనలోని కొంత భాగానికి స్థావరంగా మార్చుకొంటుంది. అలా ప్రతీ క్షేత్రం లేక ప్రతీ ఉపాధిలో శక్తి కొంత అధికంగా పోగుచేయబడి (సంచితమై, బంధితమై (accumulated & locked) ఉంటుంది. 

అంటే ప్రకృతి ఒక క్షేత్రంలో దానికి భౌతికమైన అస్థిత్వాన్నిచ్చే పదార్ధంరూపంలోనేకాక యోగశక్తిరూపంలో కూడా కొలువై ఉంటుంది.

క్షేత్రాలు, ఉపాధులు అంటే అది ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఒక కుటుంబమైనా కావచ్చు, ఒక దేశమైనా కావచ్చు, ఒక వ్యవస్థ అయినా కావచ్చు, ఒక జంతువైనా కావచ్చు, ఒక నగరమైనా కావచ్చు, ఒక లోహమైనా కావచ్చు లేక మరేదైనా కావచ్చు. లౌకికమైనది ఏది అయినా కావచ్చు.    

హెచ్చుతగ్గులు:

స్వేచ్ఛగా ఉన్నపుడు సమంగా (అన్ని సమయాలలో ఒకే సాంద్రతతో, అంతటా ఒకే పరిమాణంతో) ఉన్న శక్తి ఏదైనా ఉపాధిని స్థావరంగా చేసుకొని స్థిరీకరణ పొందగానే దాని పరిమాణంలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఏర్పడుతుంది. 

అంటే ఒక క్షేత్రంలోని శక్తి పరిమాణం వేరువేరు సమయాలలో సమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాలక్రమంలో దాని పరిమాణంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. అలాగే వేరువేరు క్షేత్రాలలోని శక్తిపరిమాణం కూడా సమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

స్వేచ్ఛగా ఉన్నపుడు శక్తి పరిమాణం అన్ని ప్రదేశాలలో, అన్ని సమయాలలో ఖచ్చితంగా సమానంగా ఉంటుందిగానీ, శక్తి ఏదేనీ క్షేత్రంలో స్థిరీకరణ పొందినపుడు మాత్రం ఆ ఖచ్చితత్వం ఉండదు.

ఈ హెచ్చుతగ్గుల ప్రక్రియనూ దానికి గల కారణాలను మరియు ఈ హెచ్చుతగ్గులను నియంత్రించే పద్దతినీ చర్చించేదే యోగమార్గం.


కేంద్రీకరణ, సాంద్రీకరణ:

ఇలా శక్తి ప్రతీ క్షేత్రాన్ని తన స్థావరంగా చేసుకొనే లక్షణాన్ని ఆసరాగా చేసుకొని ఒక నిర్ధిష్ఠ ప్రదేశంలో స్థిరీకరణ పొందిన (లేక కేంద్రీకరింపబడిన) శక్తి పరిమాణాన్ని (లేక సాంద్రతను) క్రమంగా పెంపుచేయడం, ....అది మరలా ఆ ప్రదేశం నుండి నిర్గమనం చెందకూడా కాపాడడం ... ఇదే యోగమార్గం.    

తేజస్సు, తరచుదనం:

ఈ కేంద్రీకరణ, సాంద్రీకరణ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశానికి అంతటి అసాధారణత్వం సిద్ధిస్తుంది. ప్రాపంచికంగా దాని విలువ అంతగా పెరుగుతుంది. అలాగే ఈ శక్తి తగ్గే కొలదీ ఆ ప్రదేశం అదేవిధంగా సాధారణమైపోతూ ఉంటుంది.

అదేవిధంగా ఒక ప్రదేశంలో ఈ కేంద్రీకరణ, సాంద్రీకరణ పెరిగేకొలదీ ఈ జగత్తులో ఆ స్థాయి కలిగిన ప్రదేశాలు అరుదుగా ఉంటాయి. అంటే శక్తి సాంద్రత పెరిగే కొలదీ తరచుదనం తగ్గుతుంది. దాని తేజస్సు …..ఐహిక ప్రపంచంలో దాని యొక్క విలువ కూడా అదే స్థాయిలో క్రమంగా పెరుగుతాయి.

కేంద్రీకరణ, సాంద్రీకరణ తగ్గేకొలదీ ఈ జగత్తులో ఆ స్థాయి కలిగిన ప్రదేశాలు తరచుగా ఉంటాయి. అంటే శక్తి సాంద్రత తగ్గే కొలదీ తరచుదనం పెరుగుతుంది.  దాని తేజస్సు …..ఐహిక ప్రపంచంలో దాని యొక్క విలువ కూడా అదే స్థాయిలో క్రమంగా తగ్గుతాయి.

అంటే ఈ పరిస్థితిని ఒక పిరమిడ్‌తో పోల్చవచ్చు. శక్తి సాంద్రీకరణ తక్కువగా ఉన్న ప్రదేశాలు ఎక్కువ సంఖ్యలో ఉండి పిరమిడ్‌కు అడుగుభాగంలో ఉంటాయి. వాటికి పైన మరికొంత అధిక శక్తి సాంద్రత కలిగిన ప్రదేశాలు ఉండి వాటి సంఖ్య క్రింది వాటి కన్నా కొంత తక్కువ గా ఉంటుంది. ఈ విధంగా పిరమిడ్‌లో పైకి పోయే కొలదీ ఒక ప్రదేశంలోని శక్తి సాంద్రీకరణ పెరుగుతూ ప్రదేశాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి పిరమిడ్‌లో అడుగుభాగం నుండి అద్వితీయమైన శిఖరభాగాన్ని లక్ష్యంగా చేసుకొని —పైవైపుననున్న ఒక్కొక్క భాగాన్ని దాటుకుంటూ— ఊర్ధ్వగమనం చెందేటట్లుగా శక్తి సాంద్రీకరణను, కేంద్రీకరణను పెంచుకోవడమే యోగమార్గం.

ఉదాహరణకు ఒక దేశంలో జనావాసాలు ఏర్పడే విధానాన్ని మనం పరిశీలించవచ్చు. ఏ దేశంలోనైనా సరైన సౌకర్యాలు లేకుండా తక్కువ జనాభాను కలిగి ఉండే గుర్తింపులేని చిన్న చిన్న గ్రామాలు అసంఖ్యాకంగా ఉంటాయి. సకల నాగరిక సౌకర్యాలతో అధిక జనాభాతో అలరారుతూ విశ్వవ్యాప్తమైన గుర్తింపు కలిగిన మహానగరాలు అతి తక్కువగా ఉంటాయి. ఈ రెంటీకీ మధ్యస్థంగా అనేక చిన్నా పెద్దా పట్టణాలు, ద్వితీయ స్థాయి నగరాలు వాటికి తగిన మధ్య స్థాయి సౌకర్యాలతో ఉంటాయి. ఇదంతా కూడా ఆయా జనావాసాలలో కాలక్రమంలో ప్రజావసరాల మూలంగా నిర్దేశింపబడుతూ జరిగిన శక్తి కేంద్రీకరణ, సాంద్రీకరణల వలనే జరుగుతుంది.

అలాగే మరో ఉదాహరణ. ఇనుము, వెండి, బంగారం వంటి లోహాలలో ఇనుములో శక్తి సాంద్రీకరణ మిగతా రెంటికన్నా తక్కువగా ఉండటంవలన దానివిలువ ఆ రెంటికన్నా తక్కువగా ఉంటుంది. దాని లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారంలో శక్తి సాంద్రీకరణ అధికంగా ఉంటుంది. అలాగే దాని లభ్యత కూడా తక్కువగానూ ......లోకంలో దాని విలువ ఎక్కువగానూ ఉంటుంది. వెండి పరిస్థితి ఇనుముకన్నా ఎక్కువగానూ, బంగారంకన్నా తక్కువగానూ ఉంటుంది. ఇదంతా అనేక వేల లక్షల సంవత్సరాలపాటు భూగర్భంలో జరిగే మార్పుల వలన సహజసిద్ధంగా జరుగుతుంది.

అలాకాక ఈ మార్పును, ఈ శక్తి కేంద్రీకరణను కొన్ని రసాయన ప్రక్రియలద్వారా సాధ్యం చేసి ఇనుమువంటి నిమ్నలోహాలను బంగారంవంటి అధికస్థాయి లోహాలుగా మర్చవచ్చని రసవాదుల వాదన. అది వేరే సంగతి.

బొగ్గులో శక్తి సాంద్రీకరణ పెరిగితే బొగ్గు కాస్తా వజ్రంగా మారుతుంది.

ఇలా ఈ శక్తి కేంద్రీకరణ లేక సాంద్రీకరణ ఏ ప్రదేశంలోనైనా జరగవచ్చు.

ఇది ఒక దేశంలో జరిగితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.

ఒక సంస్థలో జరిగితే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది.

ఒక కుటుంబంలో జరిగితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది.

ఒక వ్యక్తిలో జరిగితే ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు.

సహజసిద్ధం, మానవప్రయత్నం:


ఈ శక్తి సాంద్రీకరణ కొన్ని సందర్భాలలో సహజ సిద్ధంగా జరుగుతుంది;

ఉదాహరణ: భూగర్భంలో బంగారం, వెండి వంటి ఉత్తమ లోహాలు, వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, రత్నాలు వంటి విలువైన రాళ్ళు ఏర్పడే విధానం.

మరి కొన్ని సందర్భాలలో మానవ ప్రయత్నంతో జరుగుతుంది.

ఉదాహరణ: ఒకానొక వ్యక్తి సాధనతో యోగశక్తిని సముపార్జించడం.

ప్రత్యక్షం, పరోక్షం:

అలాగే ఈ శక్తి సాధన కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగానూ జరగవచ్చు.

ఉదాహరణ: ఒకానొక వ్యక్తి సాధనతో యోగశక్తిని సముపార్జించడం.

మరి కొన్ని సందర్భాలలో పరోక్షంగానూ జరగవచ్చు.

ఉదాహరణ: ఒక కుటుంబ వాతావరణం వలన ఆ కుటుంబంలోని సభ్యులందరూ తమ ప్రమేయం లేకుండానే శక్తిని సముపార్జించడం.

అలాగే,

ఒక దేశంలోని పరిస్థితుల వలన ఆ దేశపౌరులు.... ఒక సంస్థలోని వాతావరణం వలన ఆ సంస్థలోని సభ్యులు తమ ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా, పరోక్షంగా శక్తిని ఆర్జించగలుగుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి