25, సెప్టెంబర్ 2017, సోమవారం

యోగభావనలు (Concepts of Yoga) -3శక్తి సముపార్జనా మార్గాలు


శక్తిని ఆర్జించే మార్గాలుగా భారతీయ సమాజంలో ఎప్పటినుండో కొన్ని పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. 

ప్రాచీన భారతదేశంలో ఋషులు, మునులు శక్తిని ఆర్జించడానికి తపస్సును ఆచరించేవారు. దీనిని వారు స్వార్థం కోసం కాక లోకకళ్యాణం కోసం చేసేవారు. అసురులు మాత్రమే స్వార్థం కోసం చేసేవారు.  

కాలక్రమంలో ఆ సంప్రదాయానికి భారతీయ సమాజం దూరమైన తరువాత కొందరు దిగువ స్థాయి సాధకులు, కొందరు సిద్ధులు, మరికొందరు దుర్మార్గులు కలసి రకరకాల పద్దతులను శక్తి సాధనా మార్గాలుగా ప్రచారం చేసారు. చివరికి ఈనాడు ఈ సాధన జాతకాలు చెప్పి జీవనం సాగించే వారి వ్యాపకంగా మిగిలిపోయింది. దీనికి కారణం కొంత అవగాహనా లోపమైతే, కొంత దురాశ. 

'బ్రహ్మచర్యం' ద్వారా శక్తిని ఆర్జించవచ్చు అనేది ప్రాచీనకాలంనుండి ఉన్న ఒక సూత్రీకరణ. 

దీనిని ఆసరాగాచేసుకొని బ్రహ్మచర్యం అనేపదానికి సంభోగానికి దూరంగా ఉండటం అనే సంకుచితార్థం కల్పించి దానికి విపరీత ప్రచారం కల్పించారు. ఒక వ్యక్తి వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించడానికి ముందుదశ బ్రహ్మచర్యం కాబట్టి ఆ అర్థానికి సమర్థన లభించినట్లయినది. నిజానికి బ్రహ్మచర్యం అంటే అనేక నియమనిష్ఠల సమాహారం. సంభోగానికి దూరంగా ఉండటం అనేది అందులో ఒకటి. అది కూడా అవివాహితులకు మాత్రమే ఆ నియమం బేషరతుగా వర్తిస్తుంది. గృహస్థులు కూడా బ్రహ్మచర్య వ్రతదీక్ష అవలంబించవచ్చు. ఐతే సంభోగానికి దూరంగా ఉండటం అనే నియమం అవివాహితులకు వర్తించినంత కఠినంగా గృహస్థులకు వర్తించదు. కానీ వీరి ప్రచారంవలన సంభోగానికి దూరంగా ఉంటే చాలు ఇంకెన్ని అవలక్షణాలను కలిగిఉన్నా బ్రహ్మచర్యదీక్షకు ఎలాంటి ఆటంకం కలగదనే అభిప్రాయం ఏర్పడింది. 

ఇంకొంత మంది మరింత ముందుకెళ్ళి వీర్యం స్ఖలించకుండా నిగ్రహించుకుంటే ఆ వీర్యం శక్తిగా మారుతుందనే ప్రచారం కల్పంచారు. ఇదే నిజమైతే మరి స్త్రీలెలా శక్తివంతులౌతారు. వీళ్ళదృష్టిలో శక్తిసముపార్జన మగవారికే పరిమితమన్నమాట; అసలు శక్తి స్వరూణిగా చెప్పబడే స్త్రీ ఇందుకు అనర్హులన్నమాట. వీరెంతకు దిగజారారంటే స్త్రీని శక్తిసాధనకు అనర్హురాలుగా ప్రకటించడంతో ఆగకుండా ఒక మగవాడు చేసే సాధనకు స్త్రీ ఒక ఆటంకం అనే అభిప్రాయాన్ని కూడా ప్రచారం చేశారు. ఇది మరింత సంకుచితమైన అర్థం.

యోగశక్తి అన్నివిధాలైన ప్రాపంచిక విజయాలకు మూలం. ఇది కలిగి ఉన్నవారు ఈ లోకంలో కార్యసాధకులై వర్ధిల్లుతారు.'వీర్యం' అనేది యోగశక్తికి పర్యాయపదం కనుక యోగశక్తి కలిగి ఉన్నవారిని వీర్యవంతుడు/రాలు అంటారు. యోగశక్తి కార్యసాఫల్యతకు దారితీసినట్లుగా పురుషుని రేతస్సు (semen) ఒక స్త్రీ గర్భసాఫల్యతకు దారితీస్తుంది కనుక ఆ రేతస్సును కూడా వీర్యమని పేర్కొనడం జరుగుతున్నది. ఇది కేవలం ఉపమానం మాత్రమే. అంతేకానీ వీర్యమంటే రేతస్సు అని కాదు అర్థం. కానీ ఈ అర్థాన్నే అనేకమంది వ్యాప్తిచేశారు. ఈ అర్థాన్ని బట్టే వారు రేతస్సు (వారి దృష్టిలో వీర్యం) స్ఖలించకుండా సంరక్షించబడితే అది యోగశక్తిగా మారుతుందని ప్రచారం చేశారు. 

ఇంత విడ్డూరమైన ప్రచారాలన్నీ శక్తి సాధనా మార్గంనుండి బుధజనులు తప్పుకొని దిగువస్థాయి వ్యక్తులు ప్రవేశించడం వలనే జరిగినది.

మరికొంత మంది ప్రాణాయామాన్ని శక్తి సాధనా మార్గంగా ప్రచారం చేశారు. 

వీరు చెప్పేదేమంటే మానవుని వెన్నెముక అథోభాగంలో 'కుండలిని' అనే శక్తి ఉంటుంది. అది చుట్టచుట్టుకిని నిదురించే సర్పాన్ని పోలి ఉంటుంది. వెన్నెముక మధ్య భాగంలో కటిస్థానంనుండి శిరస్సు యొక్క పైభాగం వరకూ ప్రయాణిస్తూ సుషుమ్న అనే నాడి ఉంటుంది. దానికి ఇరువైపులా ఇడ, పింగళ అనే రెండు నాడులుంటాయి. ఈ రెండు నాడులకు రెండు నాసికా రంధ్రాలకు సంబంధం ఉంటుంది. ఇడానాడి ఎడమ నాసికా రంధ్రం ఆధీనంలో ఉంటుంది. పింగళా నాడి కుడి నాసికా రంధ్రం ఆధీనంలో ఉంటుంది. ఆయా నాసికా రంధ్రాలద్వారా ఓ క్రమపద్దతిలో మార్చి మార్చి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను చేయడం ద్వారా ఇడాపింగళా నాడులద్వారా వెన్నెముక అధోబాగంలో ఉన్న కుండలిని మేల్కొని సుషుమ్నద్వారా ఊర్ధ్వగమనం చెంది శిరోభాగాన్ని చేరేక్రమంలో మానవుడు శక్తివంతుడవుతాడు. అతడికి అణిమ,గరిమ,లఘిమ మొదలైన ఎనిమిది మహిమాన్విత శక్తులు సమకూరతాయి. వీటిని 'అష్టసిద్ధులు' అని అంటారు. వీటిని సాధించినవాడిని సిద్ధుడు అని అంటారు.   

వీరు చెప్పే పద్దతిలో అష్టాంగయోగం రూపంలో యోగమార్గాన్ని వివరించిన పతంజలి మహర్షి ఉద్దేశం ఎంతవరకు నెరవేరుతుందో మనం చెప్పలేము. 

పతంజలి యోగదర్శనాన్ని యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం మరియు సమాధి అనే ఎనిమిదిదశలుగా వివరించాడు. అందుకే ఇది అష్టాంగయోగంగా పిలువబడుతుది. ఆ ఎనిమిదింటిలో ప్రాణాయామం ఒకటి. 

అయితే యోగమార్గానికి యమనియమాలు పునాది వంటివి.

ఈ రెంటినీ శ్రద్ధగా పాటిస్తే మిగతా ఆరుదశలూ వాటంతటవే జరిగిపోతాయి. అంటే వీటి మధ్యన సంబంధం కార్యకారణ సంబంధం (cause & effect) అన్నమాట. యమనియమాలు కారణమైతే మిగిలిన ఆరుదశలు కార్యం. 

భారత స్వాతంత్ర్య సమర నాయకుడు గాంధీ 'యమం'లోని సత్యం, అహింసలనే తన జీవితాదర్శాలుగా గైకొన్నాడు. అయితే అనేకమంది యమనియమాలను నామమాత్రంగా ఉదహరించి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం మొదలైన అంగాలను మాత్రమే శ్రద్ధగా సాధన చేస్తూ అదే యోగసాధనగా చెబుతుంటారు.

దీనికి కారణం మధ్యయుగాలలో కేవలం వీటికే అధిక ప్రాధాన్యతనిస్తూ 'హఠయోగం' అనే ప్రక్రియ తలయెత్తి జనబాహుళ్యంలో విస్తృతంగా వ్యాప్తిచెందింది. ఆ ప్రభవంతో నేటికీ యోగసాధన అంటే వివిధరకాలైన ఆసనాలు, వివిధరకాలైన శ్వాసించే పద్ధతులు, వివిధరకాలైన ధ్యానించే పద్ధతులు అని మాత్రమే భావించబడుతున్నది. వీటి మధ్యన యమనియమాలను గురించి ఆలోచించే తీరుబడి కూడా ఎవరికీ లేకుండా పోయింది.

శక్తి సముపార్జనకు కొందరు నవరత్నాలను ఉంగరాలుగా చేతివేళ్ళకు ధరిస్తుంటారు. రత్నాలనేవి అధిక శక్తికి కేంద్రాలుకనుక అవి ధరించినవారు శక్తివంతులుగా ఉండి కార్యసాధకులౌతారని దీని ఉద్దేశ్యం. 

మరికొందరు ఒక రాగిరేకుమీద యంత్రం గీసి కొన్ని మంత్రాలను ఉచ్ఛరించడంద్వారా అందులోకి శక్తిని ఆవాహన చేసి, అలా వచ్చిన శక్తిని ఆయంత్రంలో బంధించి ఇంటి ఆవరణలో ఏదో ఓ చోట దానికి గుప్తంగా దాచిపెడతారు. ఇక ఆ శక్తి ఆ ఇంటిని వదిలిపోదన్నమాట; దుష్టశక్తులేవీ దరిచేరవన్నమాట.

అంటే శక్తిని మనం సదాచారంద్వారా, సుగుణాలద్వారాకాక ఇలా రత్నాలను ధరించడం ద్వారా, యంత్రాలలో బంధించడంద్వారా సంపాదించడమన్నమాట.

భోగలాలసులైన రాజులు, జమీందారులలో సత్ప్రవర్తన, సదాచారం అనేవి కుందేటికొమ్ము లాంటివి. అటువంటివారివలనే ఇలాంటి చిట్కా మార్గాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

కొందరు శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి మానవదేహంలో శక్తికేంద్రాలైన మర్మాంగాలను పూజిస్తారు. వీరు పురుషాంగాన్ని, స్త్రీ యోనిని శిలలపై చెక్కి వాటిని పూజిస్తారు. వీరిని శాక్తేయులని పిలుస్తారు.

శక్తిని వశం చేసుకొనేది సిరిసంపదలకోసమే కనుక కొందరు ఇనుము వంటి విస్తారంగా దొరికే విలువ తక్కువ లోహాలను బంగారం వంటి అరుదైన, విలువైన లోహాలుగా మార్చి ధనవంతులవటానికి రసవాదాన్ని (Alchemy) ఆశ్రయిస్తారు.

ఇటీవలికాలంలో వ్యాప్తిలోకి వచ్చిన న్యూమరాలజీ కూడా ఈ కోవలోకే వస్తుంది. వారు ఒక వ్యక్తి పేరునులోని అక్షరాలను శక్తి ఆవాహనకు అనుకూలంగా మార్పు చేస్తారు. ఆ మార్పుతో అతడు శక్తివంతుడై కార్యసాధకుడు అవుతాడన్నమాట.

ఇప్పటివరకూ పేర్కొన్న మార్గాలన్నీ మంచిశక్తి లేక దైవశక్తి (Positive Energy) ని ఆర్జించే మార్గాలు. ఇవికాక దుష్టశక్తిని (Negative Energy) సాధించే పద్దతులకూడా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చర్చించడం అనవసరం. ఇవన్నీ కూడా యోగమార్గం లోని అనేకానేక ఉపశాఖలే.

ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఋషులు, మునులు తపస్సు చేసే సంప్రదాయం కనుమరుగైన తరువాత కొందరు దిగువస్థాయి వ్యక్తులు, మరికొందరు దుర్మార్గులు వలన ఒకదాని తరువాత ఒకటిగా క్రమంగా భారతీయ సమాజంలోనికి ప్రవేశించాయి.

వీటిలో శాస్త్రీయత ఎంతన్నది, మూఢత్వం ఎంతన్నది, నైతికత ఎంతన్నది ఎవరికీ తెలియదు.

సదాచారమే శక్తి సముపార్జనకు సర్వోత్తమ మార్గం. ప్రాచీన భారతదేశంలోని ఋషులు ఒనరించిన తపస్సుయొక్క సారం కూడా అదే.

యమనియమాలంటే సదాచారం తప్ప మరేమీ కాదు.  
3 వ్యాఖ్యలు: