ఆదర్శవాదం - అనాదర్శవాదం - వాస్తవిక వాదం
Idealism - Cynicism - Realism
ఓ మనిషి తాను బ్రతికే సమాజంలో ఇతరులతో వ్యవహరించే విధానంలో మనం కొన్ని రకాలైన పోకడలను గమనించవచ్చు.
తన ప్రవర్తన తనకు ప్రయోజనకరంగా ఉన్నదా లేదా అన్నదానికన్నా ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా అన్నవిషయానికే అధిక ప్రాధాన్యత నిచ్చేవాడు Nice Guy.
తనను ఇబ్బందిపెట్టడానికి, నష్టపరచడానికి ఎదుటివారు కుయుక్తితో ప్రయత్నించే అవకాశమున్నదని భావించి, అందరితో ముందునుంచే అమర్యాదకరంగా, మొరటుగా వ్యవహరించేవాడు Badass.
ఎదుటివారితో వ్యవహరించేటపుడు వారెటువంటివారో గమనించి సజ్జనులైతే మర్యదపూర్వకంగానూ, దుష్టబుద్ధి కలిగినవారైతే వారి ఆటకట్టించే విధంగానూ సందర్భాన్నిబట్టి ప్రవర్తించేవాడు Perfect Person.
మనుషులలో మనం గమనించగలిగే ఈ విధమైన ప్రవర్తనల వెనుక ఉన్న తాత్విక నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే....
Nice Guy ను నడిపించేది ఆదర్శవాదం (Idealism).
Badass అనుసరించేది (Cynicism),
Perfect Person ఆచరించేది వాస్తవిక వాదం (Realism)
ఈ మూడింటినీ ఒకసారి పరిశీలిద్దాం
ఆదర్శవాదం (Idealism):
సమాజంలో మనం నడచుకోవలసిన విధానానికి సంబంధించి మనకు ఎప్పుడూ ఆదర్శవంతమైన ప్రవర్తనమాత్రమే బోధింపబడుతుంది. అంటే ఇక్కడ సమాజంలోని వ్యక్తులందరూ ఆదర్శంగా ఉన్నట్లు భావించబడి వారితో మనంకూడా వారికి తగినవిధంగా ఆదర్శంగా ఉండాలని భావం.
ఆదర్శవాదం (Idealism) అనేది ఆదర్శాన్ని తప్ప మరిదేనినీ బోధించదు, అంగీకరించదు. అది నీలోనూ, నాలోనూ అలానే మిగిలిన అందరిలోనూ కేవలం ఆదర్శాన్ని మాత్రమే ఆశిస్తుంది. అందుకే ఇది ఒక ఆశావాదం (Optimism).
ఇది వాస్తవికతను (Reality) పరిగణనలోకి తీసుకోదు. అంటే ఆచరణలో ఎదురయ్యే క్షేత్రస్థాయి పరిస్థితులను గురించి ఆలోచించదు. అందుకే ఆదర్శవాదం ఒక అవాస్తవికవాదం. అలాగని ఆదర్శవాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం.
వాస్తవిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు ఆదర్శవాదాన్ని ఆచరించగలిగితే అంతకన్న హర్షణీయమైన విషయం మరోటి ఉండదు. అంతకన్నా ఆశించదగినది కూడా మరోటి ఉండదు. ఆదర్శానికి వాస్తవానికి వైరుధ్యం లేని పరిస్థితి అంత గొప్పది.
కానీ విచారకరమైన విషయమేమిటంటే ఎక్కువ సందర్భాలలో ఆదర్శవాదానికి పరిస్థితులు సహకరించవు. ఆదర్శానికి వాస్తవానికి వైరుధ్యం ఉంటుంది. వాస్తవిక పరిస్థితులు అనుకూలంగా లేనపుడు కూడా ఆదర్శవాదాన్ని ఆచరించాలని ప్రయత్నించడం వెర్రితనమే అవుతుంది.
అనాదర్శవాదం (Cynicism):
(Cynicism అనే ఆంగ్లపదానికి సమానార్థకమైన తెలుగు పదం వాడుకలో లేదు. ఈ సినిసిజాన్ని ఆదర్శవాదానికి విరుద్ధమైనదానిగా పేర్కొంటున్నందున దీనికి అనాదర్శవాదం అనే పదాన్ని వాడదలచుకున్నాను.)
ఆదర్శవాదం (Idealism) మనిషిలోని సత్ప్రవర్తన మీద నమ్మకముంచితే ఈ అనాదర్శవాదం మనిషిలోని దుష్ప్రవర్తనను ఎత్తి చూపుతుంది. దానికి తగిన విధంగా నడచుకోమని బోధిస్తుంది.
ఈ వాదం కీడెంచి,మేలెంచమని చెబుతుంది. ఆదర్శవాదం ఆశావాదమైతే (Optimism) ఇది నిరాశావాదం (Pessimism). ఎందుకంటే ఇది ఆదర్శవాదం వలే మనుషులలో నీతిని, సత్ప్రవర్తనను ఆశించదు. అందుకు విరుద్ధంగా ఇది మనుషులను నీతిలేనివారిగా, దుష్ప్రవర్తనకలిగిన వారిగా మాత్రమే అంచనా వేస్తుంది. ఆవిధంగానే వారిని గుర్తిస్తుంది.
ఇది కూడా వాస్తవికతను (Reality) పరిగణనలోకి తీసుకోదు. అంతా సవ్యంగా ఉన్నప్పటికీ అనుమానాన్ని వ్యక్త పరుస్తుంది. ఎదుటి వ్యక్తికి దురాలోచనను అంటగడుతుంది. అందుకే అనాదర్శవాదం కూడా ఒక అవాస్తవికవాదమే. అలాగని అనాదర్శవాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. సమాజంలో వక్రంగా ఆలోచించేవారికి కొరతలేదు కనుక అనేక సందర్భాలలో దుష్టబుద్ధి కలిగిన వారి బారిన పడి నష్టానికీ, కష్టానికీ గురికాకుండా ఈ అనాదర్శవాదం మనలను కాపాడుతుంది.
కానీ ప్రతీసారీ ఈ అనాదర్శవాదాన్ని ఆచరించినందువలన మనకు మర్యదలేనివారిగా, వక్రంగా అలోచించేవారిగా, Bad Person గా ముద్ర పడుతుంది. సజ్జనుల యెడల కూడా అనాదర్శవాదాన్ని ఆచరించాలని ప్రయత్నించడం నిజంగా మూర్ఖత్వమే అవుతుంది.
ఈ విధంగా మనిషిలో ఉండే మంచి చెడులలో ఆదర్శవాదం మంచి అనే పార్శ్వాన్ని మాత్రమే గుర్తిస్తే అనాదర్శవాదం చెడు అనే పార్శ్వాన్ని మాత్రమే గుర్తిస్తుంది.
అందుకే ఈ వాదాలు రెండూ కూడా మనిషికి పాక్షికంగానే ఉపయోగపడతాయి. ఈ రెండూ కాకుండా మనిషికి పూర్తి ప్రయోజనం చేకూర్చేటటువంటి వాదం కూడా ఒకటున్నది... అదే వాస్తవికవాదం.
వాస్తవిక వాదం (Realism) :
ఈ వాదం ఆచరణలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన విధంగా మనం వ్యవహరించవలెనని చెబుతుంది. అంటే మన ప్రవర్తన ఎప్పుడూ ఒకే మూసలో కాకుండా ఎదుటివారినిబట్టి ఒక్కోసారి ఆదర్శవాదాన్ని (Idealism), ఒక్కోసారి అనాదర్శవాదాన్ని (Cynicism) ఆచరించాలని చెబుతుంది.
పేరులో ఆదర్శం లేకపోయినా నిజానికి ఇదే ఆదర్శవంతమైన ప్రవర్తన.