రాజు - రాజ్యం
అధ్యాయం - 2
అనువంశిక సంస్థానాల గురించి
చిరకాలంనుండి రాజకుటుంబపు ఆధీనంలో ఉన్నటువంటి అనువంశిక రాజ్యాలను ఆధీనంలో ఉంచుకోవడంలో నూతన రాజ్యాలను ఆధీనంలో ఉంచుకోవడంలో కన్నా చాలా తక్కువ కష్టనష్టాలు ఎదురౌతాయని నేను చెబుతున్నాను. ఎందుకంటే అనువంశిక రాజ్యంలో రాజు తన పూర్వీకుల వ్యవహారశైలిని అనుసరిస్తే సరిపోతుంది. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం లేదు. జరగబోయే సంఘటనలను ముందుగానే పసిగట్టి తగిన విధంగా వ్యవహరించగలిగే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా ఒక అసాధారణమైన, బలమైన శక్తి చేత తన రాజ్యాన్ని పోగొట్టుకుంటే తప్ప సాధారణమైన శక్తి సామర్థ్యాలు కలిగిన రాజు కూడా అనువంశికరాజ్యంలో తన స్థానాన్ని కాపాడుకోగలుగుతాడు. ఒకవేళ అలా పోగొట్టుకున్నా కూడా దురాక్రమణదారుడు ఏదేని ప్రతికూలతను ఎదుర్కొన్న సమయంలో దానిని తిరిగి సాధించుకోగలుగుతాడు.
ఊదాహరణకు ఇటలీలో Duke of Ferrara తన రాజ్యాన్ని చిరకాలంగా కలిగిఉన్న కారణంగానే అతని అధికారం సుస్థిరమై 1484 లో వెనెటియన్స్ దాడులను, 1510 లో పోప్ జూలియస్ దాడులను ఎదుర్కోగలిగాడు. ఒక అనువంశికమైన రాజు యొక్క జీవితంలో ప్రజలకు ఆగ్రహం కలిగించగలిగిన సందర్భాలు గానీ, కారణాలుగానీ పెద్దగా ఉండవు కనుక ఆ రాజు వారి ప్రేమకు సహజంగానే పాత్రుడౌతాడు. ఏవైనా అసాధారణమైన దుశ్చర్యలవలన అతను ప్రజాద్వేషానికి గురికానంతకాలం అతను ప్రజాభిమానానికి పాత్రుడౌతూనే ఉంటాడు. అంతేకాక అతని పరిపాలన యొక్క పురాతనత మరియు అవిచ్ఛిన్నత (antiquity and continuity) ఒకనాటి మార్పుయొక్క జ్ఞాపకాలనూ, ఉద్దేశాలను చెరిపివేస్తాయి. అయితే ఒకమార్పు మరోమార్పు తలయెత్తడానికి కావలసిన ప్రాతిపదికను ఎల్లవేళలా సిద్ధం చేస్తుంది.
(అనువాదకుడు: చిరకాలం నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న రాజ్యలు కూడా ఒకనాడు కొత్తగా ఏర్పడినవే అనే విషయాన్ని ప్రజలు మరచిపోతారని ఈ అధ్యాయం చివరిలో తెలియజేస్తూ మాకియవెల్లి మానవస్వభావాన్ని గురించిన తనయొక్క అనేక పరిశీలనలలో మొట్టమొదటిదాన్ని పేర్కొంటున్నాడు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి