2, జులై 2010, శుక్రవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' తెలుగు అనువాదం



రాజు-రాజ్యం


ఉపోద్ఘాతం:

‘ప్రోజెక్ట్ గుటెన్‌బర్గ్’ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పేరుతో చరిత్రలో ఇంతవరకూ ఆంగ్లభాషలో రచించబడిన లేదా ఆభాషలోకి అనువదించబడిన అనేకమంది ప్రఖ్యాతవ్యక్తులయొక్క వివిధరచనల పూర్తిపాఠాన్ని ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్రోజెక్ట్ అయిదారు సంవత్సరాల క్రిందట ప్రారంభించబడి శరవేగంతో ముందుకు పోతున్నది. దీనితో పాటుగా ‘ఇంటర్నెట్ ఆర్చివ్’ అనబడే మరో ప్రోజెక్ట్ కూడా ప్రారంభమై గతంలో ఆంగ్లంలో ప్రచురింపబడిన అనేక పాత గ్రంథాల యొక్క స్కానింగ్ కాపీలను అందుబాటులో ఉంచుతున్నది. ఈ రెండు ప్రోజెక్ట్‌ల వలన మనకు ఈరోజున కాపీరైట్‌లేని అనేక విలువైన రచనలు ఉచితంగా లభిస్తున్నాయి. ఈ రెండు ప్రోజెక్టులంత విస్తృతస్థాయిలో కాకపోయినా ఆంగ్లభాషలో ఇంకా అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా మనకు కొన్ని ప్రఖ్యాత రచనలను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నాయి.

మన తెలుగుభాషలో ఒక్కపుస్తకం యొక్క పూర్తిపాఠమైనా ఇలా నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటే బాగుండన్న ఆలోచన నాకు కలిగినది. అది కూడా ఏ తెలుగుగ్రంథమో అయితే అది మార్కెట్లోనో లేక మరోవిధంగానో లభిస్తుంది కనుక అలా దొరకని పరభాషాగ్రంథాన్నీ, విలువైన సమాచారం ఉన్న గ్రంథాన్నీ, నాకున్న సమయానికి సరిపడేటట్లుగా చిన్న గ్రంథాన్నీ, అలాగే కాపీరైట్ సమస్యలు లేని గ్రంథాన్నీ ఎంచుకోవాలనుకున్నాను. ఈ లక్షణాలన్నింటికీ తగినవిధంగా ఉన్న 15వ శతాబ్దపు ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ ఎంపిక చేశాను.

ఈ గ్రంథం మాతృక ఇటాలియన్ భాషలో రచించబడినది. నాకు ఆ భాష రాదు. కనుక దీని ఆంగ్లానువాదాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలనుకున్నాను. ఇది 26 అధ్యాయాలు కలిగిన చిన్న గ్రంథం.

గ్రంథపరిచయం:

ఇది జగత్‌ప్రసిద్ధిచెందిన ఒక విశిష్టమైన రాజనీతిశాస్త్ర గ్రంథం. ప్రపంచ రాజకీయాలమీద ఎనలేని ప్రభావాన్ని చూపి ఆధునికరాజకీయాలకు పునాది వేసినటువంటిది. ఇందులోని విషయాలు ఎంతైనా తెలుసుకోదగ్గవి. ఇది సగటు మానవుడు తలదాల్చే ఆశయాలతో, అలాగే సాధారణ సాంప్రదాయక రచయితలు బోధించే నీతులు, ఆదర్శాలతో కూడుకున్న ఆచరణసాధ్యంకాని పంచదారపలుకులున్న గ్రంథం కాదు. జీవన గమనంలో మానవుడు తన మనుగడకోసం అనుసరించకతప్పని చేదునిజాలను, కఠిన వాస్తవాలను వివరించిన గ్రంథం.

ఈ గ్రంథం మీద అనేక అపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ నిజంకాదు. ఎందుకంటే మనుషులను చిలకపలుకులు, తప్పుడు మాటలు, మోసపూరితమైన మాటలు ఆకట్టుకున్నంతగా, వాస్తవాలు ఆకట్టుకోలేవు. ఎవరికైనా నిజం చెబితే నిష్టూరంగానే ఉంటుంది. ఈ అపోహలన్నింటికీ కారణం అది మాత్రమే. ఈ గ్రంథంలో బోధించినది లౌక్యం, వ్యవహార దక్షత, రాజకీయ దక్షత మాత్రమే.

ఈ గ్రంథం మీద దురభిప్రాయాలు తలయెత్తడానికి మరో ముఖ్యకారణం ఇందులోని బోధనలు విజేతలు అనుసరించే విధానాలవడంతో సహజంగానే ఆ విధానాలను పరాజితజాతులు ద్వేషించడం జరిగినది. కానీ ఇది సరియైన పద్దతికాదు. విజేతలలో ఉన్న లక్షణాలు తమలో లేకపోవడం వలనే తాము పరాజితులుగా మిగిలిపోవలసి వచ్చింది అన్న విషయాన్ని వీరు గ్రహించాలి. అనుసరించదగిన విధానాలు ఎవ్వరివద్ద ఉన్నాకూడా అవి నేర్చుకోవలసినదే. అది తమను జయించిన వారైనాసరే. అప్పుడే తాముకూడా విజయపథంలో నడవగలరు. అందుకే ఈ గ్రంథం లోని విషయాలను భారతీయులవంటి పరాజితజాతులు తప్పనిసరిగా తెలుసుకొని తమ ఆలోచనావిధానాన్ని తగినవిధంగా మార్చుకోవలసిన అవసరం ఉన్నది.

మాకియవెల్లి పరిచయం:

మాకియవెల్లి (1469-1527) ఇటలీదేశపు రాజనీతిజ్ఞుడు మరియు రచయిత. ఈయనను అనేకమంది ‘ఆధునిక రాజనీతిశాస్త్ర పితామహుడు’ గా భావిస్తారు. ఐరోపాలో 14వ మరియు 17వ శతాబ్దాల మధ్యన గొప్పగా మేధోవికాసం జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవన కాలపు అత్యంత ప్రముఖ రాజనీతివేత్తలలో ఒకడిగా ఈయన స్థానం పొందాడు. ఈయన ఒక ప్రభుత్వాధికారిగా అనుభవాన్ని గడించడం మరియూ చరిత్రను అధ్యయనం చేయడం అనేవి ఈయన రాజకీయాలను ఒక కొత్తకోణంలో చూడటానికి దారితీసాయి. మధ్యయుగపు రాజకీయ రచయితలందరూ రాజకీయాలను మతం యొక్క పరిధిలో ఆదర్శవంతమైనవిగా పరిగణించారు. కానీ మాకియవెల్లి రాజకీయాలను మానస్వభావం ఆధారంగా చరిత్ర యొక్క పరిధిలో వాస్తవదృష్టితో వివరించాలని కోరుకున్నాడు.

మాకియవెల్లి తన ఆలోచనలలో చాలా వాటిని ‘ద ప్రిన్స్’ అనే ఈ ప్రఖ్యాత గ్రంథంలోనే వివరించాడు. ఇది 1513 లో రచించబడి మాకియవెల్లి మరణించిన 5 సంవత్సరాల తర్వాత 1532 లో ప్రచురింపబడింది. ఈ గ్రంథం ఒక రాజు తాను శక్తివంతుడిగా రూపొందటం కొరకూ; అలానే తన రాజ్యాన్ని బలమైనదిగా రూపొందించడం కొరకు అనుసరించవలసిన విధానాలను వివరిస్తుంది.

మాకియవెల్లిని కొందరు అర్థశాస్త్ర రచయిత అయిన మన చాణక్యునితో పోలుస్తారు. ఒక రాజు తన రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇతర విధానాలన్నీ విఫలమైనపుడు క్రూరత్వం, మోసం, బలవంతం లాంటి వాటిలో అవసరమైన ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చని మాకియవెల్లి బోధించాడు. ఫలితంగా అనేకమంది ఇతను రాజకీయాలలో క్రూరత్వాన్నీ, మోసాన్నీ ప్రోత్సహించాడని భావించారు. చాణక్యుని మరోపేరైన కౌటిల్యుడు నుండి భారతీయభాషలలో ‘కౌటిల్యం’, ‘కుటిలత్వం’ లాంటిపదాలు ఎలా వచ్చాయో అలానే ఆంగ్లంలో ‘మాకియవెల్లియన్’ అనే పదం జిత్తులమారితనానికీ, కుట్రపూరిత స్వభావానికీ పర్యాయపదమైపోయింది.

1 కామెంట్‌:

  1. చాలా రోజుల తరువాత బ్లాగు లోకానికి తిరిగి వచ్చినందుకు చాలా ఆనందం గా ఉంది. మంచి సబ్జెక్ట్ తో వచ్చారు.

    రిప్లయితొలగించండి