10, సెప్టెంబర్ 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---25 (గీతా వ్యాసాలు)





IV B: గుణాతీత స్థితి

రాగమున్న చోట ద్వేషముంటుంది. కామమున్నచోట క్రోధముంటుంది. రాగద్వేషాలు, కామక్రోధాలు బింబప్రతిబింబాలు. ఒక విషయాన్ని మనం ఇష్టపడితే తద్వ్యతిరిక్తమైనదాన్ని వ్యతిరేకించటం సహజమే.కనుక ఇష్టాన్ని తొలగిస్తే అనిష్టతకూడా తొలగిపోతుంది. అలా ఇష్టానిష్టాలు (లేక రాగద్వేషాలు) లేకుండా చేసే కర్మే.. అంటే కామం లేకుండా చేసే కర్మే నిష్కామకర్మ.

ఇష్టానిష్టాలు లేని ఇటువంటి నిష్కామ మానసిక స్థితినే ‘గుణాతీత స్థితి’ అంటారు. గుణాతీతం అంటే అతనికి ప్రత్యేకించి ఏ ఒక్క గుణం మీద కోరిక, ఆసక్తి లేదు. ఏ ఒక్క గుణం యొక్క ఆకర్షణకూ అతను లొంగిపోవటం లేదు. ఏ ఒక్క గుణాన్ని అతను ద్వేషించటంలేదు. అన్ని గుణాలను గుణాతీతుడు సమదృష్టితో చూస్తున్నాడు.

గీతలో ఈ గుణాతీత స్థితి గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడు.

అర్జున ఉవాచ:

కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ! |

కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే || (అ.14-శ్లో.21)

అర్జునుడు : ప్రభూ! ఈ త్రిగుణములను అతిక్రమించిన వాని (గుణాతీతుని) లక్షణములేవి? వాని ప్రవర్తన ఎట్లుండును? ఈ గుణములను అతిక్రమించుటెట్లు?


శ్రీ భగవానువాచ:

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ! |

న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || (అ.14-శ్లో.22)

భగవానుడు: అర్జునా! గుణాతీతుడు తనకు సంప్రాప్తించిన సత్వ గుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజో గుణ ధర్మమైన కర్మ ప్రవృత్తినిగానీ, తమోగుణలక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు; అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు.


ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |

గుణా వర్తంత ఇత్యేవ యో పతిష్ఠతి నేఙ్గతే || (అ.14-శ్లో.23)

ఏమీ సంబంధంలేని వాడిలాగా తటస్తుడిగా ఉండి గుణాలవల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు.


సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః |

తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః || (అ.14-శ్లో.24)

సుఖదుఃఖాలయందు సమదృష్టి కలిగి ఉంటాడు. మట్టి, రాయి, బంగారం మొదలైన వస్తువులను సమభావంతో చూస్తాడు. ఇష్టమైన దానియందును, అనిష్టమైన దానియందును సమభావననే కలిగి ఉంటాడు. మరియు దూషణలయందు, భూషణలయందు కూడా సమభావననే కలిగి ఉంటాడు.


మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |

సర్వారంభపరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే || (అ.14-శ్లో.25)

మానావమానములయందు సమదృష్టి కలిగి ఉండి; శత్రువులయందును, మిత్రులయందును కూడా సమదృష్టినే కలిగి ఉండి తనకు తానుగా ఏ పనినీ ప్రారంభించని వాడు గుణాతీతుడనబడును.


అంటే సత్వగుణకర్మ ఎడల, రజోగుణకర్మ ఎడల, తమోగుణకర్మ ఎడల గుణాతీతుడు సమదృష్టినే కలిగిఉన్నాడు. వాటిలో ఏ ఒక్కదాని మీద ప్రత్యేకించి ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు. వాటి ఆకర్షణకు లోబడకుండా వాటిని కేవలం జగత్సంబంధమైన గుణకార్యాలుగానే చూస్తున్నాడు. మట్టిని, రాయిని, బంగారాన్ని ఒకే దృష్టితో చూస్తున్నాడు. అంటే వస్తువుల భౌతిక విలువను పరిగణనలోకి తీసుకోవటంలేదు. యజ్ఞానికి అవసరమైతే ఎంత అల్ప వస్తువునైనా అతను స్వీకరిస్తాడు. యజ్ఞానికి అవసరంలేకపోతే ఎంత విలువైన వస్తువైనా, ఎంత ఆకర్షణీయమైన విషయమైనా స్వీకరించడు. అంటే అతని దృష్టి యజ్ఞం మీద, సత్యం మీదే తప్ప ఆకర్షణీయమైన గుణకార్యాల మీద లేదు. శత్రుమిత్రులను, మానావమానములను, సుఖదుఃఖాలను, దూషణభూషణలను ఒకే దృష్టితో చూస్తున్నాడు.. అంటే వైరుధ్యాలను సమదృష్టితో చూస్తున్నాడు అని అర్థం. అంటే తద్విషయం మరియు తద్‌వ్యతిరిక్త విషయం అతని దృష్టిలో ఒకటే. అంటే పరస్పర విరుద్ధమైన గుణాలు మూడునూ అతని దృష్టిలో ఒకటే. తనకు తానుగా ఏ పనినీ ప్రారంభించడు అంటే యజ్ఞం యొక్క ప్రేరేపణతో తప్ప తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ఏ పనినీ ప్రారంభించడు అని అర్థం.

మరి ఇటువంటి మానవుడు దేనికొరకు కర్మ చేస్తాడు. రాగద్వేషాలతో కర్మలాచరించే మానవుడంటే కర్మలను తానిష్టపడే గుణాన్ని మరియు దానికి ప్రాతినిథ్యం వహించే వస్తువును లేక విషయాన్ని పొందటం కొరకు కర్మాచరణకు పూనుకుంటాడు. మరి గుణాతీతుడు ఏ ఒక్క గుణాన్నీ ప్రత్యేకించి ఇష్టపడటం లేదు కనుక మరి దేని కొరకు కర్మలాచరిస్తాడు?.. దేనికొరకంటే సత్యం కొరకు.. ఆ సత్యాన్ని మాత్రమే కోరే ‘జీవేచ్ఛ’ నెరవేర్చుకొనుట కొరకు. ‘జీవేచ్ఛ అంటే మానవుడు అసలు వాస్తవంగా ఏ కార్యనిర్వహణకొరకు ఈ భూమిమీద జన్మించాడో అదే అతని జీవేచ్ఛ’. అది మాత్రమే అతనికి సత్యం. అది మాత్రమే అతని జీవన లక్ష్యం. జీవేచ్ఛ దోషరహితం; జీవేచ్ఛ సత్య స్వరూపం.

ఏ మానవుడైనా జీవేచ్ఛ నెరవేర్చుకోవాలనే కోరుకుంటాడు. కానీ కామం వలన దీనికి మారుగా గుణకర్మల యెడల సమ్మోహితుడై వాటిని చేయాలనుకుంటాడు. ‘తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వలన పాపాలు చేస్తున్నాడు?’ అని అర్జునుడు శ్రీ కృష్ణుణ్ణి ప్రశ్నించటంలోని ఆంతర్యం ఇదే. (ఈ జీవేచ్ఛ అనేది జ్ఞానయోగానికి సంబంధించిన విషయం. కర్మయోగంలో ఇంతకు మించిన వివరణ అప్రస్తుతం.)… (సశేషం)


9, సెప్టెంబర్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---24 (గీతా వ్యాసాలు)



అలాగే మరో ఉదాహరణ చూద్దాం. జీవన విధానానికి సంబంధించి తమోగుణ కర్మను ఇష్టపడేవారు మానవుడు సాంప్రదాయకంగా, ఆచారపరాయణత్వంతో జీవించాలని కోరుకుంటారు. అలాగే రజోగుణకర్మను ఇష్టపడే వారు మానవుడు అభ్యుదయ భావాలతో, ఆధునికంగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సత్వగుణకర్మను ఇష్టపడేవారు మానవుడు సంప్రదాయాలను, ఆచారాలను కాలరాచి, కాలానుగుణమైన మార్పుతో జీవించాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ఏ ఒక్కరూ మిగతా వారి జీవన విధానం యొక్క ఆవశ్యకతను ఏ మాత్రం గుర్తించకపోగా వారిని తీవ్రంగా ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు.తమ జీవన విధానం మాత్రమే మానవునికి మేలు చేస్తుంది అని ఈ మూడు వర్గాలలో ప్రతి ఒకరు గాఢంగా నమ్ముతారు.

బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో ఈ విషయానికి సంబంధించి మనకు స్పష్టమైన ఉదాహరణలు దొరుకుతాయి. పూర్వాచార పరాయణులైన వారు సతీసహగమనం, బాల్యవివాహాలు చేయటం, సముద్రయానాన్ని అంగీకరించకపోవడం ఇత్యాది మూఢనమ్మకాలతో జీవించేవారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు ఆంగ్ల విద్య నభ్యసించి, ఇంగ్లీష్ వారి కట్టూబొట్టూ నేర్చి భారతీయతను హేళన చేసేవారు; చులకనగా చూసేవారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు సంఘసంస్కరణ పేరుతో వారివాదనలను సమర్ధించుకొనడానికి అపౌరుషేయాలైన వేదముల యొక్క ప్రామాణ్యాన్నే ధిక్కరించి తూలనాడేవారు. అంటే వీరు సత్వ గుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

భాషకు సంబంధించి ఒక ఉదాహరణ. సత్వ గుణకర్మను ఇష్టపడేవారు సాధారణ జనులకు సైతం అర్ధమయ్యే వాడుక భాషనే ప్రతి సందర్భంలోనూ వాడాలని కోరుకుంటారు. రజోగుణకర్మను ఇష్టపడేవారు విద్యావంతులైన కొందరికి మాత్రమే అర్ధమయ్యే ఇంగ్లీషు లాంటి భాషనే ప్రతి సందర్భంలోనూ వాడాలని కోరుకుంటారు. తమోగుణ కర్మను ఇష్టపడేవారు పురోహిత వర్గానికి తప్ప మరెవరికీ అర్ధం కాని వాడుకలో లేని సంస్కృతం లాంటి భాషనే వాడాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ప్రతి ఒక్కరూ మిగతా వారు ప్రతిపాదించే భాషలమీద తీవ్రస్థాయిలో దాడి చేస్తారు.

హేతువాదులు వివాహసందర్భంలో కూడా సంస్కృత మంత్రాలను వ్యతిరేకించి, అప్పుడు కూడా వాడుక భాషే వాడాలని పట్టుబడతారు. వారు జరిపించే వివాహాలు ఇలానే జరుగుతాయి. అంటే వీరు సత్వగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. ఛాందస పండితులు సామాన్య జనులందరికీ ఉపయోగపడవలసిన గ్రంథాలను సైతం కఠినమైన సంస్కృతంలోనో, గ్రాంథికంలోనో రాస్తారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు ఉన్నత స్థాయి విద్యావంతులు ప్రతి సందర్భంలోనూ ఇంగ్లీషు భాషే వాడతారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

పిల్లల పెంపకమే తీసుకోండి.. కొందరు క్రమశిక్షణ పేరుతో పిల్లలను తీవ్రనిర్భంధానికి గురిచేస్తారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు అతి గారాబం చేసి వారు కోరిందల్లా సమకూర్చుతారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు పిల్లలను వారిమానాన వారిని గాలికి వదిలేస్తారు. అంటే వీరు సత్వగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

సమాజంలో మనుగడ సాగించే మానవుడు అలవరచుకోవలసిన లక్షణాల విషయమే తీసుకోండి. కొందరు విజ్ఞానాన్ని సముపార్జిస్తే చాలనుకుంటారు. అంటే వీరు సత్వగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు లౌక్యాన్ని, వ్యవహారదక్షతను అలవరచుకుంటే చాలనుకుంటారు. అంటే వీరు రజోగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరికొందరు మంచి నడవడిక (శీలం) కలిగి ఉంటే చాలనుకుంటారు. అంటే వీరు తమోగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణలన్నింటిలో కూడా మనకు కనిపిస్తున్నది ఒకటే. వీరంతా గుణాలకు మౌలిక స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎందుకంటే గుణాలు మూడింటిలో ప్రతి ఒకటి కూడా మౌలిక స్థాయిలో మిగతా గుణాలకు చోటు పెట్టకుండా దేనికదే పూర్తిస్థాయి ప్రమాణంగా (Unit) కొనసాగతుంది. ఈ కారణం చేత మౌలిక స్థాయిలో గుణాలు మూడూ పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి. దీనికనుగుణంగా ఈ మూడు వర్గాలూ కూడా తమదే సరైన మార్గమంటే తమదే సరైన మార్గమంటూ పరస్పరం ద్వేషించుకుంటూ, కలహించుకుంటూ ఉంటాయి.

మౌలిక స్థాయి కనుక ముగ్గురిలోనూ మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. కానీ ప్రతి ఒకరు తమలోని మంచిని, ఎదుటివారిలోని చెడుని మాత్రమే చూస్తారు. దీనికి కారణం రాగద్వేషపూరితమైన మనస్సే. అంటే తమకిష్టమైన గుణకర్మల ఎడల రాగం, తద్వ్యతిరిక్తమైన మిగతా రెండు గుణకర్మల ఎడల ద్వేషం. రాగం తమలోని చెడుని చూడనివ్వదు; ద్వేషం ఎదుటివారిలోని మంచిని చూడనివ్వదు. వీరి కలహానికి అంతే ఉండదు. వీరినిలాగే వదిలేస్తే యుగాంతం వరకూ ద్వేషించుకుంటూనే ఉంటారు.

ఈ విధంగా వీరంతా సత్యానికి దూరమయ్యారు. దీనికంతటికీ కారణం వీరు మూడు గుణాలలో ఒకానొక గుణం యొక్క ఆకర్షణకు లోబడి దాని మీద కోరికను పెంచుకోవడం. దాని ప్రలోభానికి లొంగిపోవటం. తద్వ్యతిరిక్త గుణాలమీద అనిష్టత పెంచుకోవటం. దీనినే ‘కామం’ అంటారు.


V: కామం

‘కామం’ గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది.

అర్జున ఉవాచ:

అథ కేన ప్రయు క్తోయం పాపం చరతి పూరుషః |

అనిచ్ఛ న్నపి వార్ష్ణేయ బలా దివ నియోజితః || (అ.3-శ్లో.36)

అర్జునుడు: కృష్ణా! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు?(తనకు ఇష్టం లేకపోయినా అంటే తన ‘జీవేచ్ఛ’కు వ్యతిరేకంగా అని; ఈ ‘జీవేచ్ఛ’ అంటే ఏమిటో ముందు ముందు వివరించబడుతుంది.)


శ్రీ భగవానువాచ:

కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః |

మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం || (అ.3-శ్లో.37)

భగవానుడు: రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకు మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామమూ, మహా పాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మానవుడికి మహా శత్రువులు.



ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ |

యథోల్బేనావృతో గర్భః తథా తేనేద మావృతం || (అ.3-శ్లో.38)

పొగ అగ్నినీ, మురికి అద్దాన్నీ, మావి గర్భంలోని శిశువునూ కప్పివేసినట్లు కామం ఆత్మ జ్ఞానాన్ని ఆవరించింది.



ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా |

కామరూపేణ కౌంతేయ ! దుష్పూ రేణానలేన చ || (అ.3-శ్లో.39)

అర్జునా! ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మ జ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది.



ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్టానముచ్యతే |

ఏతై ర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినం || (అ.3-శ్లో.40)

ఈ కామానికి ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహధారులకు మోహం కలగజేస్తున్నది.



తస్మాత్త్వ మింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ! |

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశినం || (అ.3-శ్లో.41)

అర్జునా ! అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని, జ్ఞాన విజ్ఞానాలను నాశనంచేసే కామమనే పాపిని పారద్రోలు.



ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః |

మనస్తసు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || (అ.3-శ్లో.42)

దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటే మనస్సు శ్రేష్టం. మనస్సు కంటే బుద్ధి అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ.



ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మన మాత్మనా |

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం || (అ.3-శ్లో.43)

అర్జునా ! ఇలా బుద్ధికంటే ఆత్మ గొప్పదని గుర్తించి, బుద్ధితోనే మనస్సు నిలకడచేసుకుని, కామరూపంలో ఉన్న జయించరాని శత్రువును రూపుమాపు… (సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---23 (గీతా వ్యాసాలు)



పాశ్చాత్య (గ్రీకు) తత్త్వశాస్త్రంలోని Synthesis భారతీయ తత్త్వశాస్త్రంలోని యజ్ఞం; ఈ రెండు భావాలూ ఒకటే. ఐతే పాశ్చాత్యులు ఈ ప్రక్రియలో రెండు వైరుధ్యాలు (Thesis మరియు Anti Thesis) మాత్రమే పాలు పంచుకుంటాయని భావించారు. కానీ భారతీయులు మూడు వైరుధ్యాలు (త్రిగుణాలు) పాలుపంచుకుంటాయని ఖచ్చితంగా చెప్పారు.

త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే గుణకర్మలే ఈ యజ్ఞంలో హవిస్సులు. ‘మౌలిక స్థాయి గుణకర్మలు ’ ఆ విధంగా యజ్ఞంలో హవిస్సులుగా దగ్ధమై ‘అంశీభూత గుణకర్మలు ’గా ఆవిర్భవిస్తాయి. ఇలా ఆవిర్భవించిన మూడు అంశలూ పరస్పరం సమన్వయం చెంది ఆ విషయంలో (ఏ విషయంలోనైనా సరే) ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది.

సత్యాన్ని అందరూ అంగీకరించినా వాస్తవమైన సత్యస్వరూపాన్నెరిగి తదాచరణకు అందరూ పూనుకోరు. గుణకర్మలు చేస్తూ అదే సత్యమని వ్యాఖ్యానిస్తారు. ‘యజ్ఞం’ వలన మాత్రమే ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. గుణకర్మల వలన సత్యం లభించకపోగా మానవుడు కర్మ బంధాలలో చిక్కుకుంటాడు.

జగత్తులోని మూడు గుణాలూ వేటికవే ఆకర్షణీయమైనవి. దేని భౌతిక ఔన్నత్యం దానిదే. దేని సమ్మోహనత్వం దానిదే. ఇవి సాధారణ మానవుడి మనస్సును సులభంగా ప్రలోభపెడతాయి. ఆ గుణాన్ని లేక ఆ గుణానికి ప్రాతినిథ్యం వహించే వస్తువును పొందాలనే కాంక్షను మానవుడిలో ప్రేరేపిస్తాయి. అలానే ఇవి మూడు గుణాలూ కూడా పరస్పర విరుద్ధమైనవి కావడం వలన ఏదో ఒక గుణం యొక్క ఆకర్షణలో పడిన మానవుడు మిగతా రెండు గుణాల యెడల అనిష్టత చూపటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అవి తానిష్టపడే గుణానికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక.

మానవుడు మూడు గుణాలలో ఏ ఒక్క గుణాన్నైనా ఇష్టపడటం జరగవచ్చు. అది అతని స్వభావాన్ననుసరించి ఉంటుంది. కానీ దేన్ని ఇష్టపడినా మిగతా రెండింటి ఎడలా అయిష్టత చూపటం అనివార్యం. ఇష్టానిష్టాలనే ‘రాగద్వేషాలు’ అంటారు. ఈ విధంగా రాగద్వేషపూరితమైన మనస్సుతో కర్మాచరణకు పూనుకున్నపుడు మానవుడు తానిష్టపడే గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మనే అధికంగా చేస్తాడు. తాను అయిష్టత చూపే తద్వ్యతిరిక్త గుణాలకు ప్రాతినిధ్యం వహించే కర్మలను ద్వేషభావం వలన సాధ్యమైనంతవరకూ ఆచరించడు. ఇలా అతని కర్మాచరణలో ఒక గుణకర్మ అధికమై సత్యనిర్మాణం జరగదు. ఎందుకంటే సత్యంలో మూడుగుణ కర్మలకూ సమాన ప్రాతినిధ్యం ఉండవలసినదే కనుక.

కానీ గుణాల ఆకర్షణకు లోబడకుండా, రాగద్వేషాలు లేకుండా కర్మనాచరించినపుడు మానవుడు ప్రత్యేకించి ఏ గుణకర్మనూ ఇష్టపడడు మరియు ఏ గుణకర్మనూ ద్వేషించడు. సందర్భౌచిత్యాన్ననుసరించి మూడు గుణకర్మలనూ ఆచరిస్తాడు. ఈ విధంగా అతని జీవితంలో మూడు గుణాలకూ సమాన ప్రాతినిధ్యం ఏర్పడుతుంది. ఏ ఒక్క గుణం కూడా మిగతా గుణాలకన్నా ఆధిక్యత నొందదు.. అంటే మౌలిక స్థాయికి ఎదగదు. ప్రతి గుణం కూడా మిగతా రెండు గుణాలకు చోటు పెట్టేంత పరిమిత స్థాయిలోనే అంటే ఆంశిక స్థాయిలోనే ఉండి అవి మూడునూ సమన్వయం చెందటం వలన సత్యావిష్కరణ జరుగుతుంది. ఈ విధంగా రాగద్వేషాలు లేకుండా కర్మాచరణ చేయటాన్నే ‘యజ్ఞం’ అంటారు.

సోదాహరణంగా మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ‘వ్యవస్థ’ అనే విషయాన్నే తీసుకుంటే తమోగుణ కర్మను ఇష్టపడే వారు ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. అలాగే రజోగుణ కర్మను ఇష్టపడే వారు ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. అలాగే సత్వగుణ కర్మను ఇష్టపడే వారు ‘వ్యక్తి’ ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ఏ ఒక్కరూ మిగతావారు ప్రతిపాదించే ప్రయోజనాల ఆవశ్యకతను ఏమాత్రం గుర్తించకపోగా వాటిని తీవ్రంగా ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు. తాము కోరుకునే ప్రయోజనాలతోటే వ్యవస్థ పరిపూర్ణమౌతుందని వీరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఫ్యూడల్ భావాలు కలిగిన పరిపాలకులు (తాలిబన్లు లాంటి ఇస్లామిక్ ఛాందసవాదులు) అనేక నిర్బంధాలతో తమ పరిపాలనను కొనసాగిస్తారు. స్త్రీజాతి మీద మరియు సాధారణ ప్రజానీకం యొక్క జీవనవిధానం మీద వీరు అనేక కట్టుబాట్లు, నిర్బంధాలు విధిస్తారు. అంటే వీరు ప్రజల మీద అధికారం ప్రదర్శిస్తూ ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. అంటే వీరు ‘తమోగుణ కర్మ’ యెడల వ్యామోహితులయ్యారు.

పెట్టుబడిదారీ పరిపాలకులు సమాజాన్ని, సమాజంలోని ఉత్పత్తి వనరులను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ఐతే వీరు అలా అభివృద్ధి చెందిన సమాజంలోని ఉత్పత్తి వనరులను సమాజంలో కొద్ది సంఖ్యలో ఉండే బూర్జువా వర్గపు స్వంత ఆస్థిగా మార్చి, సామాన్య ప్రజానీకాన్ని అమ్ముకోవటానికి తమ శరీర శ్రమ తప్ప మరేమీ లేని పేదవారిగా మార్చివేస్తారు. అంటే వీరు సమాజాన్ని అభివృద్ధి చేసి దాని యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. అంటే వీరు ‘రజోగుణకర్మ’ యెడల వ్యామోహితులయ్యారు.

సామ్యవాద పరిపాలకులు సమానత్వం పేరుతో, సామాన్య జనుల ప్రయోజనాల పేరుతో తమవైన ప్రతిభాపాటవాలు కలిగిన వ్యక్తులకు వాటిని నిరూపించుకునే అవకాశం (స్వేచ్ఛ) ఈయరు. అంటే వీరు ‘వ్యక్తి’ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. ఎందుకంటే వీరు ‘సత్వగుణకర్మ’ యెడల వ్యామోహితులయ్యారు… (సశేషం)


8, సెప్టెంబర్ 2008, సోమవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---22 (గీతా వ్యాసాలు)





IV: యజ్ఞం (నిష్కామ కర్మ)

‘సత్యం’ సిద్ధ వస్తువు కాదు. అంటే సత్యం సహజ సిద్ధం (ready made) గా ఎక్కడా దొరకదు. మనకు అందుబాటులో ఉండేది త్రిగుణాత్మకమైన ఈ ‘జగత్తు’ మాత్రమే. ఈ జగత్తు నుండే సత్యాన్ని ‘నిష్కామకర్మ’ ద్వారా ఆవిష్కరించాలి. ఈ నిష్కామకర్మే గీతా శాస్త్రం (3వ అధ్యాయం) లో ‘యజ్ఞం’గా చెప్పబడింది.

దీనికొరకు మనం త్రిగుణాలకు సంబంధించి అతి ముఖ్యమైన ధర్మం ఒక దాని గురించి తెలుసుకోవాలి. అదేమంటే ‘త్రిగుణాలు మౌలిక స్థాయిలో పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆంశిక స్థాయిలో పరస్పరం సమన్వయం చెందుతాయి’. ఈ సమన్వయం ఫలితంగానే సత్యావిష్కరణ జరుగుతుంది.

త్రిగుణాలు మౌలిక స్థాయిలో వేటికవే ఒక ప్రమాణం (Single Unit) గా కొనసాగుతాయి. దీనివలన అవి తమకు విరుద్ధంగా ఉన్న ఏ ఇతర ప్రమాణాన్ని అంగీకరించవు; దేనినైనా ద్వేషిస్తాయి. ఈ కారణం చేతనే పరస్పర విరుద్ధమైన త్రిగుణాలు మౌలిక స్థాయిలో పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఈ పరస్పర సంఘర్షణ వలనే మౌలిక స్థాయిలో అవి సత్యావిష్కరణ చేయలేవు. అందుకే జగత్తు సత్యం కాదు. (జగత్తు త్రిగుణాల మౌలిక మిశ్రమం; సత్యం త్రిగుణాల ఆంశిక సమ్మేళనం)

ఆంశిక స్థాయిలో గుణాలు వేటికవే ఒక ప్రమాణంగా కొనసాగలేవు. అందువలన ప్రతి గుణం కూడా తనకు విరుద్ధంగా ఉన్న మిగతా రెండు గుణాలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. వాటితో సమన్వయం చెంది ఒకే ప్రమాణాన్ని ఏర్పరచాలని ఉవ్విళ్ళూరుతుంది. అంటే వైరుధ్యం అనే ఒకే లక్షణం మౌలిక స్థాయిలో సంఘర్షణకు, ఆంశిక స్థాయిలో సమన్వయానికీ కారణమగుచున్నది. అందువలనే పరస్పర విరుద్ధమైన త్రిగుణాలు ఆంశిక స్థాయిలో పరస్పరం సమన్వయం చెందుతాయి. ఆ సమన్వయం ఫలితంగా ఏర్పడేదే ‘సత్యం’.

అంటే ‘వైరుధ్యాల మధ్యన సమన్వయమే సత్యం’. విద్యుత్ శాస్త్రం (Electricity) లో ధన, ఋణ ఆవేశాల మధ్యన ఆకర్షణ; అయంస్కాంతత్వానికి (Magnetism) సంబంధించి సజాతి, విజాతి ధృవాల మధ్యన ఆకర్షణ; రసాయన బంధం (Chemical Bond)లో ఎలక్ట్రాన్, ప్రొటాన్‌ల మధ్యన ఆకర్షణ.. ఇవన్నీ కూడా వైరుధ్యాల మధ్యన సమన్వయానికి నిదర్శనాలే.

భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు మూడు.. అవి త్రిగుణాలు. కానీ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు రెండే.. అవి ‘వాదం’ (Thesis) మరియు ‘ప్రతి వాదం’ (Anti Thesis). ఈ రెంటి ‘సంశ్లేషణ’ (Synthesis) తో సత్యాన్ని సాధించడానికి పాశ్చాత్య తత్త్వశాస్త్రం (గతితార్కిక సిద్ధాంతం లేక Dialectic Theory) ప్రయత్నిస్తుంది. అంటే ‘వైరుధ్యాల మధ్యన సమన్వయమే సత్యం’ అనే విషయాన్ని అది కూడా అంగీకరిస్తుంది. కానీ వైరుధ్యాలు మూడు కాక రెండు అని అనుకోవడమే పాశ్చాత్య తత్త్వశాస్త్రం సత్యశోధనలో వైఫల్యం చెందటానికి కారణం.

భారతీయ తత్త్వశాస్త్రాన్నే పాశ్చాత్య పరిభాషలో చెబితే వైరుధ్యాలలో మూడవ దాని పేరు ‘విశ్లేషణ’ ( Analysis). అపుడు మూడు వైరుధ్యాల మధ్యన అంటే Thesis, Anti Thesis మరియు Analysis మధ్యన Synthesis జరిగి సత్యం ఆవిష్కరింపబడుతుంది. (సత్వ రజస్తమో గుణాలు మూడునూ యజ్ఞంలో పాల్గొని సత్యాన్ని ఆవిష్కరిస్తాయి అనే విషయాన్నే పాశ్చాత్య పరిభాషలో చెప్పామన్న మాట.)

సత్యాన్ని విశదీకరించే మూడు సూత్రాలలో చివరిసూత్రం ప్రకారం ‘జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే సాధనం యజ్ఞం’. అంటే గుణాలు మౌలిక రూపంలో మిశ్రమంగా ఉండే జగత్తు నుండి అంశీభూత రూపంలో సమ్మేళనంగా ఉండే సత్యాన్ని ఆవిష్కరించడమే ‘యజ్ఞం’. సాధారణంగా యజ్ఞం అంటే మనకు తెలిసినది మండే యజ్ఞగుండం నలువైపులా ఋషులు పద్మాసన స్థితులై మంత్ర పఠనం చేస్తూ హవిస్సులు సమర్పిస్తారు. గీతలో చెప్పబడిన యజ్ఞం ఇది కాదు.అది సత్యావిష్కరణ కొరకు ఉద్దేశించిన నిష్కామ కర్మ. నిష్కామ కర్మే గీతా శాస్త్రంలో యజ్ఞం గా చెప్పబడింది.

యజ్ఞః కర్మసముద్భవః (అ.3-శ్లో.14)

యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తున్నది.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|

కర్మజాన్విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే|| (అ.4-శ్లో.32)

ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరించబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుండి విముక్తి పొందుతావు… (సశేషం)


7, సెప్టెంబర్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---21(గీతా వ్యాసాలు)





II: జగత్ స్వరూపం

జగత్ స్వరూపాన్ని తెలుసుకొనటానికి ముందు మనం సత్యం గురించి చెప్పిన మూడు సూత్రాలలో మొదటి సూత్రాన్ని మరలా ఒకసారి చూద్దాం.

సత్వము, రజస్సు, తమస్సు అను పరస్పర విరుద్ధమైన మూడు గుణాల ‘మౌలిక మిశ్రమం’ ఈ జగత్తు.

ఈ సూత్రం ద్వారా మనం కర్మస్వరూపాన్ని మరియు జగత్ స్వరూపాన్ని రెంటినీ తెలుసుకోవచ్చని మొదటనే చెప్పుకున్నాం. ఇంతవరకూ కర్మస్వరూపం గురించి విపులంగా తెలుసుకున్నాం. ఇప్పుడు జగత్తు యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం.

జగత్తు త్రిగుణాత్మకమైనది. జగత్తులో గుణాలు మూడునూ వాటి మూల (Raw or Fundamental) రూపంలో మిశ్రమంగా ఉంటాయి. ఈ విషయమే పై సూత్రంలో ‘మౌలిక మిశ్రమం’అనే మాటద్వారా తెలియచేయబడింది. సత్యంలో ఈ గుణాలు ‘ఆంశిక’ (Componental) రూపంలొకి మారతాయి. ఇక ‘మిశ్రమం’ అంటే ఒకే ప్రకృతిలో అంతర్భాగాలుగా కొనసాగుతున్నా ఈ గుణాల మధ్యన ఏ విధమైన బంధమూ (Bond) ఉండదు. ఇవన్నీ విడివిడిగా ఉండి, అన్నీ కలసి ఒక రాశిగా ఉంటాయి. అందుకే దీన్ని ‘మిశ్రమం’ అన్నాము. సత్యంలో ఈ గుణాలు విడివిడిగా ఉండక అంశలుగా మారి ఒకటిగా బంధింపబడి ఒకే ‘ప్రమాణం’ (Single Unit) గా కొనసాగుతాయి. సత్యస్వరూపం గురించి చర్చించేటపుడు ఈ విషయాన్ని విపులంగా పరిశీలిద్దాం.

జగత్తులోని మూడు గుణాలలో ప్రతి ఒక గుణానికి కూడా ప్రాతినిథ్యం వహిస్తూ లెక్కకు మిక్కిలిగా గుణకర్మలు ఉంటాయి. ఈ విధంగా సత్వ రజస్తమో గుణాలు మూడింటికీ ప్రాతినిథ్యం వహిస్తూ అనంతమైన సంఖ్యలో గుణకర్మలుంటాయి (కొన్ని రకాల గుణకర్మలను ‘కర్మ స్వరూపం’ గురించి వివరించేటపుడు పేర్కొనడం జరిగినది). ఇవన్నీ కూడా అవి ప్రాతినిథ్యం వహించే త్రిగుణాల వలెనే ‘మౌలిక మిశ్రమం’గా జగత్తులో ఉంటాయి. ఒక గుణానికి ప్రాతినిథ్యం వహించే గుణకర్మలన్నీ కలసి ఒక గుణం. అటువంటి గుణాలు మూడు కలసి జగత్తు. ఈ విధంగా 'అనంతమైన గుణకర్మల సమూహమే జగత్తు’. ఇదే జగత్ స్వరూపం.

III: సత్య స్వరూపం

సత్యం మరియు భగవంతుడు ఒక్కటే అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే సత్యం అందరూ అంగీకరించిన విషయం. కానీ భగవంతుడిని నాస్తికులు అంగీకరించరు. సత్యం సర్వజనామోదమైనది. ‘మానవుడు సత్యాన్ని మాత్రమే ఆచరించాలి’ అనే విషయంలో సర్వమానవులూ సర్వకాలాలలోనూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ భగవంతుడి అస్తిత్వానికి సంబంధించిన విషయంలో ఇటువంటి ఏకాభిప్రాయం లేదు. దేవుడు ఉన్నాడు, లేడు అనే ఇరువర్గాలూ కూడా సర్వకాలాలోనూ ఉన్నాయి. దీనిని బట్టి మనం సత్యాన్ని భగవంతుడికన్నా వేరైనదిగా చర్చించవలసి ఉంటుంది. సత్యం ‘దైవ స్వరూపం’ అని మనం వ్యాఖ్యానిస్తే ఆస్తికులు మాత్రమే అంగీకరిస్తారు కానీ నాస్తికులు అంగీకరించరు. ఆఖరికి సత్యం ‘భగవంతుని చేరే మార్గం’అని కూడా మనం ఆస్తికులతోనే అనగలం కానీ నాస్తికులతో అనలేము.

మనకు ఆచరించటానికి కావలసినది సత్యమే. సర్వజనులకూ కావలసినది కూడా సత్యమే. కనుక ఆ సత్యాన్ని గురించే చర్చిద్దాం. సత్యాన్ని విశదీకరిస్తూ ఈ రెండవ అధ్యాయం యొక్క ప్రారంభంలో చెప్పిన మూడు సూత్రాలలో రెండవది ‘సత్య స్వరూపం’ గురించి చర్చిస్తుంది. దాని ప్రకారం ‘త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం’.

జగత్తును గుణాల ‘మౌలిక మిశ్రమం’ అన్నాం. సత్యాన్ని గుణాల ‘ఆంశిక సమ్మేళనం’ అన్నాం. మిశ్రమం (Mixture), సమ్మేళనం (Compound) అనే పదాలు రసాయన శాస్త్రం (Chemistry) నుండి తీసుకోబడ్డాయి.

‘మౌలిక’ అంటే జగత్తులో గుణాలు వాటి మూల రూపంలో ఉంటాయి. అంటే ముడిపదార్థాలుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మూలపదార్థాలైన గుణాల మధ్యన ఏ విధమైన సంబంధమూ (Bond) ఉండదు. దేనికదే విడివిడిగా ఉండి అన్నీ కలసి ఒక రాశిగా ఉంటాయి.అందుకే దీన్ని ‘మిశ్రమం’ అన్నాం. మిశ్రమంలో ఉండేవన్నీ భౌతికంగా కలగాపులగంగా కలసి ఉంటాయేగానీ వాటి మధ్యన ఏ విధమైన సంబంధం ఉండదు. వాటిని సులభంగా విడదీయవచ్చు. ఉదాహరణకు బియ్యం, రాళ్ళ మిశ్రమం.

‘ఆంశిక’ అంటే సత్యంలో గుణాలు వాటి ‘అంశ’(Component) ల రూపంలో ఉంటాయి.’అంశ’ అనేది తనలాంటి మరికొన్ని అంశలతో కలసి ఒక ‘ప్రమాణం’ (Single Unit)గా ఏర్పడుతుందే గానీ స్వయంగా తానే ఒక ప్రమాణంగా ఉండలేదు.అంశ అనేది ఒక పూర్ణత్వంలో ఒకానొక భాగస్వామి మాత్రమే గానీ తానొక్కటే స్వయంగా పూర్ణత్వం కాలేదు. ఈ విధమైన అంశల కలయిక వలన ఏర్పడిన ప్రమాణాన్నే ‘సమ్మేళనం’ అంటాం. సమ్మేళనంలో ఉండే మూలకాలన్నీ రసాయనచర్య ద్వారా బంధింపబడి ఉంటాయి. వాటిని సాధారణ పరిశ్రమతో విడదీయలేము. మిశ్రమంలో మూలకాలు వేటికవి విడిగానే ఒక ‘ప్రమాణం’గా చెప్పబడతాయి. సమ్మేళనంలోని వాటిని వేటికవి విడిగా చూడలేము. సమ్మేళనంలో మూలకాలన్నీ కలసి ఒకే పదార్థంగా చెప్పబడతాయి. ఉదాహరణకు ‘ఉదజని’ (Hydrozen), ‘ఆమ్లజని’ (Oxyzen) సమ్మేళనంగా కలిస్తే ‘నీరు’ (Water) ఏర్పడుతుంది. నీటిలో ఉదజని ఒక అంశ, ఆక్సిజన్ మరో అంశ. నీటిలో ఇవి రెండూ విడివిడిగా ఉండవు. అవి రసాయన బంధం ద్వారా బంధింపబడి ఉంటాయి. దాన్ని మనం నీరు అనే ఒకే పదార్ధంగా చూస్తాము.

అలాగే సత్యంలో గుణాలు ఆంశిక రూపంలో ఉండి సమ్మేళనంగా బంధింపబడి ఉంటాయి. జగత్తులో మూలరూపంలో మిశ్రమంగా ఉన్న మూడుగుణాలూ అంశలు (Components) గా మారి అవి మూడునూ సమానంగా కలసి ఒక సమ్మేళనంగా మారితే అంటే సత్వగుణం యొక్క అంశ, రజోగుణం యొక్క అంశ, మరియు తమోగుణం యొక్క అంశ.. ఇలా సమాన స్థాయి కలిగిన మూడు అంశలూ కలసిపోయి ఒక ప్రమాణం (Single Unit) గా, ఒక పూర్ణత్వంగా మారితే అదే ‘సత్యం’.

ఏ విషయానికైనా ఈ నిర్థారణను అనువర్తనం (application) చేయవచ్చు. ఏ విషయానికి చెందిన మూడు గుణకర్మలైనా పై విధంగానే అంశలుగా మారి సమాన స్థాయిలో కలిస్తే ఆ విషయంలో సత్యం ఆవిష్కరింపబడినట్లే. ఉదాహరణకు ‘మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరి’ అనే విషయాన్నే తీసుకుంటే తామస గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘అదుపు’, రాజస గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘స్వేచ్ఛ’, సాత్విక గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘ఉపేక్ష’.. ఇవి మూడునూ సమాన స్థాయి కలిగిన అంశలుగా మారి ఒకే ప్రమాణంగా కలిసిపోతే ఆ ప్రమాణమే ‘సత్యం’. సాధారణమైన మాటలలో చెప్పాలంటే ఆ వైఖరిలో అదుపు-స్వేచ్ఛ-ఉపేక్ష.. ఈ మూడు ధోరణులునూ సమానంగా వ్యక్తమైతే అదే సత్యం. గుణాలు అవి మిశ్రమంగా ఉండే మౌలిక స్థాయినుండి సమ్మేళనంగా ఉండే ఆంశిక స్థాయికి ఎలా మారతాయనేది ‘యజ్ఞ స్వరూపం’ లేక ‘నిష్కామ కర్మ’ను గురించి చర్చింటేటపుడు మనకు తేటతెల్లమవుతుంది…(సశేషం)


6, సెప్టెంబర్ 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---20 (గీతా వ్యాసాలు)





I.C: వైరుధ్యం

కర్మ యొక్క ధర్మాలను నిర్దేశించే మరో ముఖ్యమైన విషయమేమంటే జగత్తులోని సత్త్వ రజ స్తమో గుణాలు మూడునూ పరస్పర విరుద్ధమైనవి (Mutual Opponents).

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|

రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా|| (అ.14-శ్లో.10)

అర్జునా! రజోగుణాన్నీ, తమోగుణాన్నీ అణచివేసి సత్వ గుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్త్వ తమోగుణాలను అణచివేసి రజోగుణమూ, సత్వరజో గుణాలను అణగ ద్రొక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.

అంటే ఈ మూడు ప్రకృతి గుణాలలో ప్రతి ఒక్కటి మిగతా రెండింటికీ విరుద్ధంగా ఉంటుంది. ఇవి మూడునూ ఒకే ప్రకృతిలో భాగస్వాములైననూ పరస్పరం విరుద్ధమైనవిగా ఉంటాయి. అలానే ఈ గుణాల వలన జరిగే కర్మలు అనగా ఈ గుణాలకు ప్రాతినిథ్యం వహించే కర్మలు మూడునూ కూడా ప్రతిఒక్కటి మిగతా రెండింటికీ విరుద్ధంగా ఉంటాయి. ఐనా కూడా ఇవి మూడునూ కలసి ఒకే విషయాన్ని లేక ఒకే పరిస్థితిని సూచిస్తాయి.

ఉదాహరణకు మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరినే తీసుకుంటే తమోగుణం అదుపు చేయమంటే రజోగుణం అందుకు విరుద్ధంగా స్వేచ్ఛనీయమంటుంది. సత్త్వగుణం ఈ రెంటికీ కూడా విరుద్ధంగా ఉపేక్ష చూపమంటుంది. అలానే జీవన విధానానికి సంబంధించి తమోగుణం గతంలో ఉన్నదానినే ఆచరిస్తూ సంప్రదాయబద్ధంగా జీవించమంటే రజోగుణం దీనికి విరుద్ధంగా గతంలో ఉన్నదానిని అభివృద్ధిపరచి అభ్యుదయంతో ఆధునికంగా జీవించమంటుంది. సత్వగుణం ఈ రెండు విధానాలకూ కూడా విరుద్ధంగా గతంలో ఉన్నదానిని సమూలంగా మార్చి (Radical Change), సంస్కరించి మార్పుతో జీవించమంటుంది. ఈ విధంగా ఏ గుణకర్మ ఐనకూడా తన అనురూపాలైన మిగతా రెండు గుణకర్మలకు విరుద్ధంగా ఉంటుంది.

I.D: రాగద్వేషాలు

ఇప్పుడు ఈ గుణకర్మల మరో ధర్మమైన ‘సమ్మోహనత్వం’ గురించి చర్చించుకుందాం. అంటే ఈ గుణకర్మలు మూడింటికి కూడా మానవుడి మనసును ఆకర్షించగల, సమ్మోహన పరచగల లక్షణం ఉంది. ప్రతి గుణకర్మ కూడా తనదైన ఆకర్షణను కలిగి ఉంటుంది. దేని ఆకర్షణ దానిదే.

ప్రకృతే ర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు |

తా నకృత్స్నవిదో మందాన్ కృత్సవిన్న విచాలయేత్|| (అ.3-శ్లో.29)

ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులూ, మందబుద్ధులూ అయిన వాళ్ళ మనస్సులను జ్ఞానులు చలింపచేయకూడదు.

త్రిభిర్గుణమయై ర్భావై ఏభిస్సర్వమిదం జగత్|

మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయం|| (అ.7-శ్లో.13)

ఈ మూడుగుణాల ప్రభావం వల్ల ప్రపంచమంతా భ్రమ చెంది, వాటి కంటే విలక్షణుడిగా, వినాశం లేని వాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది.

స్వాధీన మనస్కులు కాని వారెవరైనా కూడా తన స్వభావానుసారంగా ఏదో ఒక గుణం యొక్క వ్యామోహంలో చిక్కుకొని ఆ గుణానికి చెందిన కర్మలనే అధికంగా చేస్తారు. ఐతే ఒక గుణ కర్మ యొక్క వ్యామోహంలో చిక్కుకున్న మానవుడు దాని అనురూపాలైన మిగతా రెండు గుణకర్మల ఆకర్షణకు లోబడడు; పైగా తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నందువలన వాటిని ద్వేషిస్తాడు.

ఉదాహరణకు జీవన విధానానికి సంబంధించి తమోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే సంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న సత్వ, రజో గుణాలను, వాటికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ జీవన విధానాన్ని మరియు సంస్కరణయుత జీవన విధానాన్ని ద్వేషిస్తాడు.

అదే రజోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ మరియు ఆధునిక జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న సత్వ, తమో గుణాలను మరియు వాటికి ప్రాతినిథ్యం వహించే సంస్కరణయుత జీవన విధానాన్ని మరియు సంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని ద్వేషిస్తాడు.

అలాగే సత్వగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే సంస్కరణయుత జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న రజస్తమో గుణాలను మరియు వాటికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ మరియు సాంప్రదాయక జీవన విధానాలను ద్వేషిస్తాడు.

అలాగే ఆలోచనా విధానానికి సంబంధించి తమోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు విశ్వాసాలను, నమ్మకాలను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన శాస్త్రీయతను, హేతుబద్దతనూ ద్వేషిస్తాడు. రజోగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు శాస్త్రీయతను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన విశ్వాసం, హేతుబద్దతలను ద్వేషిస్తాడు. సత్వగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు హేతుబద్దతను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన విశ్వాసం, శాస్త్రీయతలను ద్వేషిస్తాడు.

ఏ గుణకర్మ విషయమైనా ఇదే విధంగా ఉంటుంది. మానవుడు తనను సమ్మోహన పరచిన లేక తాను వ్యామోహానికి లోనైన గుణకర్మను ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ తాను ద్వేషించే దాని యొక్క మిగతా రెండు అనురూపాలను సాధ్యమైనంతవరకు ఆచరించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు.

ఈవిధంగా మూడు గుణకర్మలూ పరస్పర విరుద్ధంగా ఉండి, ప్రతి గుణకర్మ కూడా తనదైన సమ్మోహనత్వాన్ని కలిగి మానవులలో రాగద్వేషాలకు కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని ‘నిష్కామకర్మ’ గురించి చర్చించుకునేటపుడు మరింత విపులంగా తెలుసుకుందాము.

ఇంతటితో ‘కర్మస్వరూపం’ గురించిన చర్చ ముగిసినట్లే. సంక్లిష్టమైన కర్మస్వరూపం గురించి తెలుసుకున్న తరువాత జగత్ స్వరూపం, సత్యస్వరూపం మరియు నిష్కామకర్మ స్వరూపం మొదలైన వాటి గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు సుదీర్ఘమైన ఈ చర్చలోని ప్రధానాంశాలను ఒకసారి పరికిద్దాం.

1.’గుణం వలన జరిగే కర్మ’ అంటే ‘గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మ’ అని అర్థం. సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయని అంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాయని అర్థం.

2.ఏ కర్మైనా త్రిగుణాలలో ఏదో ఒక గుణానికి తప్పనిసరిగా ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ మూడింటిలో దేనికీ చెందని కర్మ మూడులోకాలలో ఎక్కడా ఉండదు.

3.ఏదేనీ ఒక గుణానికి చెందిన కర్మ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది.

4.సత్వ రజస్తమో గుణాలు మూడునూ పరస్పర విరుద్ధమైనవి (Mutual Opponents). అదే విధంగా ఏ గుణకర్మ ఐనా కూడా తన అనురూపాలైన మిగతా రెండు గుణకర్మలకు విరుద్ధంగా ఉంటుంది.

5.ఈ గుణకర్మలు మూడింటికి కూడా మానవుడి మనసును ఆకర్షించగల, సమ్మోహనపరచగల లక్షణం ఉంది. ప్రతి గుణకర్మ కూడా తనదైన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఈ లక్షణమే మానవులలో రాగద్వేషాలకు కారణమగుచున్నది… (సశేషం)


4, సెప్టెంబర్ 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---19 (గీతా వ్యాసాలు)



పరమాణు నిర్మాణంలో సాత్విక కర్మ ‘న్యూట్రాన్’, రాజస కర్మ ‘ప్రోటాన్’, తామస కర్మ ‘ఎలక్ట్రాన్’.

శరీర పోషకాలలో సాత్విక కర్మ ‘లిపిడ్లు’, రాజస కర్మ ‘ప్రొటీన్లు’, తామస కర్మ ‘కార్బోహైడ్రేట్లు’.

శరీర సౌష్టవం విషయంలో సాత్విక కర్మ ‘కొవ్వుపట్టి ఉండుట’ (సుమో యోధుడు) ,రాజస కర్మ ‘కండపట్టి ఉండుట’ (కుస్తీ పహిల్వాన్, బాడీ బిల్డర్ మొదలగు వారు), తామస కర్మ ‘సన్నగా ఉండుట’(మారథాన్ క్రీడాకారుడు).

మానవుడి తలలో పై దవడతో పోల్చినపుడు క్రింది దవడ చిన్నగా ఉంటే (మంగోలాయిడ్) అది సాత్విక కర్మ, సమానంగా ఉంటే(యూరోపియన్) అది రాజస కర్మ, పెద్దగా ఉంటే (నీగ్రోయిడ్) అది తామస కర్మ.

మానవుడి జీవితంలో జననం, శైశవం, బాల్యం సాత్విక కర్మలు, కౌమారం, యవ్వనం రాజస కర్మలు, వార్ధక్యం, మరణం తామస కర్మలు.

పెద్దవారు చిన్నవారిని గారాబం చేస్తే అది సాత్విక కర్మ, స్నేహభావంతో చూస్తే అది రాజస కర్మ, దండిస్తే అది తామస కర్మ.

చిన్నవారు పెద్దవారిని ఎదిరిస్తే అది సాత్విక కర్మ, తమతో సములన్నట్లుగా ప్రవర్తిస్తే అది రాజస కర్మ, భయభక్తులతో, వినయ విధేయతలతో గౌరవిస్తే అది తామస కర్మ.

ద్విచక్ర వాహనాలలో మోపెడ్ సాత్విక కర్మ, స్కూటర్ రాజస కర్మ, బైక్ తామస కర్మ.

మార్దవం, లాలిత్యం కలిగిన కుందేలు, జింక, లేడి లాంటి జంతువులు సాత్విక కర్మకు, దర్జా, దర్పం,ఠీవి కలిగిన గుఱ్ఱం, ఏనుగు లాంటి జంతువులు రాజస కర్మకు, క్రౌర్యం, శౌర్యం లాంటి లక్షణాలు కలిగిన తోడేలు, పులి, సింహం లాంటి జంతువులు తామస కర్మకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

‘తండ్రి’ తామస కర్మ, ‘తల్లి’ రాజస కర్మ, ‘సంతానం’ సాత్విక కర్మ.

‘సృష్టి’ సాత్విక కర్మ, ‘స్థితి’ రాజస కర్మ, ‘లయం’ తామస కర్మ.

‘పరోపకారం’ సాత్విక కర్మ, ‘స్వార్థం’ రాజస కర్మ, ‘భగవత్ సేవ’ తామస కర్మ.

‘జ్ఞాన సముపార్జన’ (జ్ఞాన యోగం) సాత్విక కర్మ, ‘ఐహిక సమృద్ధిని సాధించుట’ (రాజయోగం) రాజస కర్మ, ‘పారమార్థిక చింతన’ (భక్తి యోగం)తామస కర్మ.

‘సాదాజుట్టు’ సాత్విక కర్మ, ‘అలల వంటి జుట్టు’ (వేవీ హైర్) రాజస కర్మ, ‘ఉంగరాల జుట్టు’ తామస కర్మ.

మనం ఇతరులతో ‘సున్నితంగా ప్రవర్తిస్తే’ అది సాత్విక కర్మ, ‘యుక్తిగా ప్రవర్తిస్తే’ అది రాజస కర్మ, ‘క్రూరంగా ప్రవర్తిస్తే’ అది తామస కర్మ.

విందు చేసే సందర్భంలో ‘పంక్తి భోజనం’ తామస కర్మ, ‘టేబుల్ మీల్స్’ రాజస కర్మ, ‘బఫే’ సాత్విక కర్మ.

మనం ‘సంతోషంగా ఉంటే’ అది సాత్విక కర్మ, ‘గంభీరంగా ఉంటే’ అది రాజస కర్మ, ‘కోపంగా ఉంటే’ అది తామస కర్మ.

ఆంతరిక ప్రపంచంలో ‘బుద్ధి’ సాత్విక కర్మకు, ‘మనసు’ రాజస కర్మకు, ‘ఇంద్రియాలు’ తామస కర్మకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాయి.

‘ఫ్యూడలిజం’ తామస కర్మ, ‘కాపిటలిజం’ రాజస కర్మ, ‘కమ్యూనిజం’ సాత్విక కర్మ.

మనం అవలంబించే వృత్తులలో సాత్విక కర్మ ‘ఉద్యోగం’, రాజస కర్మ ‘వ్యాపారం’, తామస కర్మ ‘సైనిక వృత్తి’.

మానవుడిని కర్మకు ప్రేరేపించే వాటిలో ‘సంకల్పం’ సత్వగుణానికి, ‘స్వభావం’ రజోగుణానికి ‘జీవేచ్ఛ’ తమోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

మానవుడు చేసే కర్మలు విజయవంతమయ్యేటట్లు సహకరించే శక్తులలో ‘మానవ ప్రయత్నం’ సత్వగుణానికి, ‘విధి అనుకూలత’ రజోగుణానికి, ‘దైవానుగ్రహం’ తమోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

ఈ విధంగా ప్రతి కర్మ కూడా మూడు గుణాలలో ఏదో ఒక గుణానికి ప్రాతినిథ్యం వహిస్తూ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది.

ఈ గీతాశాస్త్రం ఐదువేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణునిచే చెప్పబడింది. గీతాబోధ అనంతరం ప్రపంచంలో అనేక సంఘటనలు జరిగాయి.. ఎన్నో మతాలు ఉద్భవించాయి. అనేక విజ్ఞాన శాస్త్రపు ఆవిష్కరణలు జరిగాయి, రాజకీయంగా చరిత్ర అనేక మలుపులు తిరిగింది. అనేక విషయాల మీద ఎన్నో సిద్ధాంతాలు వెలువడ్డాయి. ప్రపంచం ఎంతో సంక్లిష్టంగా మారింది. ఇదంతా వెరసి లెక్కకు మిక్కిలిగా ఉన్న లక్షల కొలదీ కర్మల సమూహం. ఎన్ని ఉన్నా ఈ కర్మలన్నీ కూడా త్రిగుణాల పరిధిలోకే వస్తాయి.ప్రతి కర్మ కూడా ఈ మూడు గుణాలలో ఏదోఒక గుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ మూడు గుణాలకు అన్యమైన కర్మ ఉండదు, ఉండబోదు.

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః|

సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః|| (అ.18-శ్లో.40)

ప్రకృతి వలన కలిగిన ఈ మూడు గుణాలతో ముడిపడని వస్తువేదీ భూలోకంలో గానీ, స్వర్గలోకంలో గానీ, దేవతలలో కానీ లేదు.

మునుముందు ఈ ప్రపంచం మరింతగా సంక్లిష్టతనొందనీ.. అపుడు సైతం ఆయా కర్మలన్నీ కూడా ఈ త్రిగుణాల పరిధిలోకే వస్తాయి. ఎందుకంటే కర్మలకు త్రిగుణాలే పరమావధి. ఆ అవధిని దాటి అవి ఎక్కడకూ వెళ్ళలేవు… (సశేషం)