12, ఫిబ్రవరి 2012, ఆదివారం

సన్-జు 'యుద్ధకళ': 8వ అధ్యాయం




యుద్ధకళ




8వ అధ్యాయం: ఎత్తుగడలలో మార్పు









సన్జు చెప్పాడు :

1) యుద్ధానికి సంబధించి సేనాని తన సార్వభౌముడు నుండి ఆదేశాలను స్వీకరించి, తదనుగుణంగా సైన్యాన్ని సమీకరించి, తన బలగాలను ఏకీకృతం చేస్తాడు.

2) కష్టాలమయమైన ప్రదేశంలో శిబిరాన్ని ఏర్పాటు చేయకు. ప్రధాన రహదారుల కూడలి ఉండే సరిహద్దుప్రాంతంలో మిత్రులతో చేయి కలుపు. ప్రమాదకరంగా వేరుపడి ఉన్న ప్రాంతంలో రోజులు వెళ్ళదీయకు, దిగ్బంధం చేయబడిన పరిస్థితులలో నీవు తప్పనిసరిగా ఎత్తుగడమీద ఆధారపడు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న స్థితిలో నీవు తప్పక పోరాడు.

3) కొన్ని రహదారులుంటాయివాటిలో ప్రయాణించకూడదు; కొన్ని సైన్యాలుంటాయివాటిమీద దాడి చేయకూడదు; కొన్ని పట్టణాలుంటాయివాటిని ముట్టడించకూడదు; కొన్ని స్థావరాలుంటాయివాటి కొరకు పోటీపడకూడదు; సార్వభౌముని ఆదేశాలు కొన్ని ఉంటాయివాటిని పాటించకూడదు.

4) ఎత్తుగడలలో మార్పుతో ఒనగూడే ప్రయోజనాలను చక్కగా అవగతం చేసుకున్న సేనాని తన బలగాలను ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటాడు.

5) అలా అవగతం కాని సేనాని యుద్ధం జరిగే దేశపు భూస్వరూపం గురించి బాగా తెలిసి ఉన్నప్పటికీ, ఆ విజ్ఞానం నుండి అతడు ఆచరణాత్మకంగా ఎటువంటి ప్రయోజనాన్నీ పొందలేడు.

6) ఎత్తుగడలను మార్చే యుద్ధకళలో నేర్పరితనం లేని యుద్ధవిద్యార్థికి "ఐదు సానుకూలతల"ను గురించి తెలిసి ఉన్నప్పటికీ అతడు తన సైనికులను ఉత్తమంగా ఉపయోగించుకోవడంలో విఫలమౌతాడు.

[ఐదు సానుకూలతలు:

(1) ఏదైనా ఒక రహదారి దగ్గరదారి ఐతే, దానిలో తప్పక ప్రయాణించాలి.

(2) ఒక పటాలం వేరు పడి ఉంటే, దానిమీద తప్పక దాడి చేయలి.

(3) ఒక పట్టణం ప్రమాదకర పరిస్థితిలో ఉంటే, దానిని తప్పక ముట్టడించాలి.

(4) ఒక స్థావరం దాడికి అనుకూలంగా ఉంటే, తప్పక దాడికి పాల్పడాలి.

(5) సైనిక కార్యకలాపాలకు సరిపోయే విధంగా ఉంటే, సార్వభౌముని ఆదేశాలను తప్పక పాటించాలి.

ఐతే ఒక సేనాని ఇటువంటి సానుకూలతల నుండి ప్రయోజనాన్ని పొందకూడని పరిస్థితులు కూడా తలయెత్తుతాయి. ఉదాహరణకు ఒక రహదారి దగ్గర దారి అయినా కూడా ఆ దారి గుండా ఎన్నో ఆటంకాలుంటాయని తెలిసిన పక్షంలో లేక శత్రువు ఆ మార్గంలో మాటువేసి ఉన్నాడని తెలిసిన పక్షంలో ఆ దారిలో వెళ్ళకూడదు; అలాగే శత్రుసైన్యం దాడిచేయ వీలైనదిగా ఉన్నాకూడా అది నిస్పృహతో కూడిన తెగింపుతో ఉన్నదని తెలిస్తే తప్పక దానినుండి దూరంగా ఉండాలిఇలా సేనానికి పరిస్థితిని బట్టి ఎత్తుగడలను మార్చగల నేర్పరితనం ఉండాలి.]

7) అందువలన వివేకవంతుడైన సేనానాయకుడి పథకాలలో సానుకూలతల గురించిన ఆలోచనలు, ప్రతికూలతల గురించిన ఆలోచనలు రెండూ కలగలసి ఉంటాయి.

8) సానుకూలతలు గురించిన మన ఆశలను, ఊహలను ఈ విధంగా* మితిమీరకుండా ఉంచగలిగితే మన పథకాలలోని ముఖ్యమైన భాగాన్ని నెరవేర్చడంలో మనం సఫలమైనట్లే.

(ఈ విధంగా*: ప్రతికూలతల గురించి కూడా యోచించడం ద్వారా)

 9) మరోప్రక్క, కష్టాలమధ్యలో ఒక సానుకూలతను చేజిక్కించుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లైతే మనల్ని మనం దురదృష్టం బారినుండి విముక్తి చేసుకోగలం.

10) కష్టాన్నీ, నష్టాన్నీ కలిగించడం ద్వారా శత్రుసేనానులను బలహీనపరచు, వారు నిరంతరం పనితో సతమతమయ్యేటట్లు చేయి, ఊరించే ఆకర్షణలను వారి ముందు ఉంచు, ఏ దైనా ప్రదేశానికి వారు అనాలోచితంగా దూసుకొచ్చేటట్లు చేయి.

11) శత్రువు రాకుండా ఉండే సంభావ్యత మీద కన్నా, శత్రువు వచ్చినపుడు అతడిని ఎదుర్కొనే మన స్వీయ సంసిద్ధత మీద మనం అధారపడటం; అలాగే అతడు దాడిచేయకపోయే అవకాశం మీదకన్నా, మన పరిస్థితిని దుర్నిరీక్ష్యంగా చేసుకోవడం మీద మనం ఆధారపడటం యుద్ధకళ మనకు నేర్పుతుంది.

12) ఒక సేనానిని ప్రభావితం చేయగల ప్రమాదకర లోపాలు ఐదు ఉన్నాయి:

a. నిర్లక్ష్యంఇది వినాశనానికి దారితీస్తుంది.

b. పిరికితనంఇది పట్టివేతకు దారితీస్తుంది.

c. త్వరగా ఆవేశపడే లక్షణంఅవమానాల ద్వారా రెచ్చగొట్టబడుతుంది.

d. సున్నిత మనస్తత్వంనిందలను తట్టుకోలేదు.

e.తన సైనికుల మీద వల్లమాలిన ప్రేమఅతనిని చింతకు, కష్టానికి గురిచేస్తుంది.

[నిర్లక్ష్యం: ముందుచూపులేని మొరటుధైర్యం గలిగిన సేనాని పిచ్చెక్కిన ఎద్దువలే గుడ్డిగా, ప్రమాదకరంగా పోరాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. అటువంటి సేనానిని ప్రత్యర్ధులు తాము మాటువేసి ఉన్న ప్రాంతంలోకి ఎరవేసి రప్పించి, అక్కడ వధిస్తారు.

పిరికితనం: పిరికితనం వలన సేనాని ఏదైనా ఒక ప్రయోజనాన్ని చేజిక్కించుకోవడానికి ముందడుగు వేయలేడు, ప్రమాదం కనబడిన వెంటనే పారిపోవడం గురించి ఆలోచిస్తాడు. ప్రాణాలతో ఇంటికి తిరిగివెళ్ళాలనుకుంటూ ప్రమాదంలోకి అడుగిడలేడు. అటువంటి వాడు శత్రువులచేతిలో ఓడిపోయి, వారికి పట్టుబడిపోతాడు.

త్వరగా ఆవేశపడే లక్షణం: పోరాటాన్ని ప్రారంభించేటట్లుగా శత్రువులు అతడిలో ఆగ్రహాన్ని రగిలించి, తరువాత ఆ పోరాటంలోనే అతడిని వధిస్తారు.

సున్నిత మనస్తత్వం: శత్రువు తన మీద దుష్ప్రచారం ద్వారా చేసే మానసిక యుద్ధంలో ఓడిపోతాడు.

తన సైనికుల మీద వల్లమాలిన ప్రేమ: తన బలగాల సంక్షేమం యెడల నిర్లక్ష్యం చూపాలని సన్జు ఉద్దేశ్యం కాదు. తన సైనికులకు ఆ క్షణానికి ఒనగూడే సౌకర్యం కొరకు ఏదైనా ఒక ముఖ్యమైన సైనిక ప్రయోజనాన్ని త్యాగం చేయడంలో ఉండే ప్రమాదాన్నే అతడు తెలియజేస్తున్నాడు. అటువంటి హ్రస్వదృష్టి విధానాల పర్యవసానంగా దీర్ఘకాలంలో ఓటమి చెందటం మూలంగా గానీ లేక సాగదీత యుద్ధం వలన గానీ సైన్యం అంతకంటే ఎక్కువ కష్టాన్నే ఎదుర్కోవలసి వస్తుంది.]

13) ఒక సేనానిలో ఉండే చుట్టుముట్టే పాపాల్లాంటి ఈ దోషాలు యుద్ధనిర్వహణకు వినాశకరం.

14) ఒక సైన్యం ఓటమి చెంది, దాని నాయకుడు వధింపబడినప్పుడు దానికి కారణం ఈ ఐదు ప్రమాదకర లోపాలలోనే ఖచ్చితంగా కనబడుతుంది. కనుక అవి నిరంతరం ధ్యానించవలసిన విషయాలుగా ఉండాలి.




(ఎనిమిదవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సన్-జు 'యుద్ధకళ': 7వ అధ్యాయం




యుద్ధకళ




7వ అధ్యాయం:  సైనిక విన్యాసాలు









సన్జు చెప్పాడు:

1) యుద్ధానికి సంబంధించి సైన్యధికారి తన ప్రభువునుండి ఆదేశాలను స్వీకరిస్తాడు.

2) సైన్యాన్ని సమీకరించి, తన బలగాలన్నింటినీ ఏకీకృతం చేసిన తరువాత, అతడు తన యుద్ధ శిబిరాన్ని ఏర్పాటుచేయడంకన్నా ముందే వాటిలోని వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని, సామరస్యాన్ని తప్పనిసరిగా నెలకొల్పాలి.

3) ఆ తరువాత, అన్నింటికన్నా కష్టమైన యుక్తిపర సైనికవిన్యాసాలు (tactical maneuvering) వస్తాయి. ఈ యుక్తిపర సైనిక విన్యాసాలలోని కష్టం అంతా డొంకతిరుగుడుగా ఉండే దానిని సూటిగానూ, దురదృష్టాన్ని లాభంగానూ మార్చుకోగలగడంతో కూడుకొని ఉంటుంది.

(Tactical maneuvering అంటే శత్రువును తప్పుదారిపట్టించడం కొరకు... తద్వారా ప్రతికూలపరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కొరకు పన్నే ఎత్తుగడలు.)

4) శత్రువు తప్పుదారి పట్టేటట్లు ప్రలోభపెట్టిన తరువాత, సుదీర్ఘమైన చుట్టుతిరుగుడు మార్గాలలో ప్రయాణించడం, అతడి తరువాత ప్రయాణం ప్రారంభించినా కూడా అతడికన్నా ముందు గమ్యాన్ని చేరుకునే విధంగా జాగ్రత్తపడటం అనేవి తప్పుదారి పట్టించే నైపుణ్యంయొక్క పరిజ్ఞానాన్ని సూచిస్తాయి.

(తనకు శత్రువు మీద దాడి చేసే ఉద్దేశ్యం లేదన్నట్లుగా సుదూర ప్రాంతంలో కాలయాపన చేయడం ద్వారా శత్రువును ఏమార్చి, ఆతరువాత శరవేగంతో తన ప్రయాణాన్ని పూర్తిచేసి, శత్రువుకంటే ముందుగా యుద్ధక్షేత్రానికి చేరుకోవటం)

5) సైనిక విన్యాసాలు సుశిక్షితమైన సైన్యంతో అయితే లాభదాయకం. అదే క్రమశిక్షణ లేని మందతో అయితే ఎంతో నష్టదాయకం.

6) ఒకానొక ప్రయోజనాన్ని చేజిక్కించుకోవడం కొరకు సైన్యాన్ని పూర్తి సరంజామాతో పంపితే చాలా ఆలస్యం జరిగే అవకాశముంటుంది. మరోపక్క అదే లక్ష్యం కొరకు త్వరితగతిన కదిలే ఒక సైనికవిభాగాన్ని మిగతా సైన్యం నుండి విడగొట్టి పంపితే అది తన సామానుకు, నిల్వలకు దూరమవుతుంది.

7) ఆ విధంగా, నీవు వంద లీల దూరంలో ఉన్న ఒకానొక ప్రయోజనాన్ని చేజిక్కించుకోవడం కొరకు నీ సైనికులనురక్షణ కవచాలను తొలగించి వేసి పగలుగానీ, రాత్రిగానీ ఆగకుండా శక్తిమేరకు ప్రయాణిస్తూ, సాధారణం కన్నా రెట్టింపు దూరాన్ని అధిగమించేటట్లుగా ఆదేశిస్తేనీ సైన్యంలోని మొత్తం మూడు విభాగాలకు చెందిన నాయకులు శత్రువుల చేజిక్కుతారు.

8) శక్తివంతులు ముందుకెళ్ళిపోతారు. అలసిపోయినవారు వెనకబడిపోతారు. అలా ఈ పథకంలో నీ సైన్యంలోని పదోవంతు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటుంది.

9) నీవు యాభై లీల దూరం ప్రయాణించి శత్రువు పథకాన్ని చిత్తుచేయాలనుకుంటే నీ మొదటి సైనిక విభాగపు నాయకుడిని నీవు కోల్పోతావు. నీ సైన్యంలో సగభాగం మాత్రమే గమ్యాన్ని చేరుకుంటుంది.

10) నీవు అదే లక్ష్యంతో 30’లీల దూరం ప్రయాణిస్తే నీ సైన్యంలో మూడింట రెండు వంతులు గమ్యాన్ని చేరుకుంటుంది.

11) దీనిని బట్టి సామానుల బండి వెంటలేని సైన్యం ఓడిపోతుంది; ఆహార పదార్థాలు లేని సైన్యం ఓడిపోతుంది; సరఫరా కేంద్రాలు లేని సైన్యం ఓడిపోతుంది అని చెప్పవచ్చు.

12) మన పొరుగు రాజ్యాల వారి పథకాల గురించి తెలుసుకోకుండా వారితో మనం పొత్తులకు దిగలేము.

13) ఒక దేశ భూస్వరూపంఅంటే ఆ దేశంలోని పర్వతాలు, అడవులు; గుంటలు, అగాథాలు; చెలమలు, చిత్తడి నేలలు మొదలైనవాటి గురించి అవగాహన లేకుండా దాని గుండా ప్రయాణించే ఒక సైన్యానికి నేతృత్వం వహించడానికి మనం తగము.

14) స్థానిక మార్గదర్శకులను ఉపయోగించుకోకుండా ఆప్రాంత సహజసానుకూలత నుండి మనం లబ్దిని పొందలేము.

15) యుద్ధంలో నిజాన్ని దాచి, అబద్దాన్ని మాత్రమే చూపించు, నిన్ను విజయం వరిస్తుంది.

16) నీ బలగాలను ఏకీకృతం చేయాలా లేక విభజించాలా అన్నదానిని పరిస్థితులను బట్టి మాత్రమే నిర్ణయించాలి.

17) నీ సైన్యం వేగంగా కదిలేటపుడు వాయువును పోలి ఉండాలి, నెమ్మదిగా కదిలేటపుడు దట్టమైన అడవిని పోలి ఉండాలి.

(దట్టమైన అడవిలా అంటే శ్రేణులన్నీ పరస్పరం సామీప్యంలో ఉంటూ ఒకరికొకరు అందుబాటులో ఉండాలి.)

18) దాడి చేయడంలో, దోపిడీ చేయడంలో కార్చిచ్చును పోలి ఉండు. స్థిరంగా ఉండటంలో పర్వతాన్ని పోలి ఉండు.

19) నీ ప్రణాళికలు రాత్రివలే చీకటిగా, గ్రహించలేని విధంగా ఉండాలి. నీవు చేసే దాడి పిడుగుపాటువలే ఎదుర్కోలేని విధంగా ఉండాలి.

20) నీవు గ్రామసీమలను లూటీ చేసినపుడు ఆ లూటీనంతా నీవారందరికీ సమానంగా పంచు. నీవు కొత్త ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నపుడు సైనికులకు కేటాయింపులు జరిపే విధంగా ఆ భూమిని అనేక భాగాలుగా విభజించు.

21) నీవు అడుగు ముందుకు వేయబోయే ముందు తొందరపాటు లేకుండా అన్ని విషయాలను జాగ్రత్తగా పర్యాలోచించు.

22) ‘తప్పుదారి పట్టించే నైపుణ్యాన్ని ఎవరు నేర్చుకుని ఉంటారో వారు జయిస్తారు. సైనిక విన్యాసాల యొక్క వైనం ఆ విధంగా ఉంటుంది.

23) సేనానిర్వహణ గ్రంథం (The Book of Army Management) ఇలా చెబుతుంది: రణరంగంలో నోటితోపలికే మాటలు ఎంతో దూరం వినిపించవు. అందుకే భేరీలుఘంటికలు ఉపయోగిస్తారు. సాధారణ వస్తువులు అంత స్పష్టంగా కనిపించవు. అందుకే జెండాలు, చిహ్నాలు ఉపయోగిస్తారు.

(The Book of Army Management అనేది సన్జు కాలం కన్నా ముందే రాయబడి అతని కాలంలో చైనాలో వ్యాప్తిలో ఉన్న మిలటరీ గ్రంథం. ఇప్పుడది అలభ్యం. ఈ అధ్యాయంలోని మిగిలిన పాయింట్లన్నీ ఆ గ్రంథం లోనివే)

24) భేరీలు, ఘంటికలు; జెండాలు, చిహ్నాలు అనేవి సమస్త సైనికులు తమ కళ్ళు, చెవులను ఒకానొక ప్రత్యేక విషయం మీద కేంద్రీకరించేటట్లు చేసే సాధనాలు.

25) ఆ విధంగా సైన్యమంతా ఒకే సంఘటిత దేహంగా రూపొందటం వలన ధైర్యవంతుడైన సైనికుడు ఒంటరిగా ముందుకు వెళ్ళడంగానీ, పిరికివాడైన సైనికుడు ఒంటరిగా వెనుదిరగడం గానీ సాధ్యం కాదు. పెద్ద సంఖ్యను నియంత్రించే విధానం ఆవిధంగా ఉంటుంది.

(పురోగమించడం గానీ, తిరోగమించడం కానీ సేనాని ఆదేశాల ప్రకారం సైనికులంతా కలసికట్టుగానే చేస్తారు.)

26) కనుక రాత్రియుద్ధంలో నీ సైనికుల కళ్ళను, చెవులను ప్రభావితం చేసే సాధనాలుగా భేరీలను, సంకేతాత్మకమైన అగ్నిజ్వాలలను ఉపయోగించు; అలాగే పగటియుద్ధంలో జెండాలను, పతాకాలను విరివిగా వినియోగించు.

27) ఒక సైన్యం మొత్తం తన స్ఫూర్తిని (spirit) కోల్పోవచ్చు. ఒక సర్వ సైన్యాధికారి తన అప్రమత్తతను (presence of mind) కోల్పోవచ్చు.

(కనుక, అలా కోల్పోయేవరకు వేచి ఉండు)

28) ఉదయం పూట ఒక సైనికుని స్పూర్తి, ఉత్సాహం చురుకుగా ఉంటుంది. మధ్యాహ్నానికల్లా అది బలహీనమవటం ప్రారంభమవుతుంది. సాయంత్రం అతడి మనసు శిబిరానికి తిరిగి వెళ్ళడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది.

29) అందువలన తెలివైన సేనాని శత్రుసైన్యం స్పూర్తి చురుకుగా ఉన్నపుడు దాని నుండి దూరంగా ఉంటాడు. శత్రుసైన్యం చురుకుదనాన్ని కోల్పోయి, తిరిగి వెళ్ళడాన్ని కోరుకుంటున్నపుడు దాడి చేస్తాడుమానసిక స్థితులను చదవగలిగే నేర్పు ఇది.

30) క్రమశిక్షణతోనూ, ప్రశాంతంగానూ ఉండటం; శత్రువులో గందరగోళం, కోలాహలం కనబడే వరకు ఎదురు చూడటంస్వీయనియంత్రణను కాపాడుకోగల నేర్పు ఇది.

31) శత్రువు గమ్యానికి ఇంకా దూరంగా ఉన్నపుడు నీవు దగ్గరగా ఉండటం, శత్రువు నానాతంటాలు పడుతున్నపుడు నీవు తీరుబడిగా వేచిఉండటం, శత్రువు ఆకలితో అలమటిస్తున్నపుడు నీవు సుష్టుగా భోంచేసి ఉండటంశక్తిని పొదుపుగా, ఉత్తమంగా వాడుకునే నేర్పు ఇది.

32) పతాకాలన్నీ క్రమపద్దతిలో ఉన్న శత్రుసైన్యాన్ని మార్గమధ్యంలో అడ్డగించకుండా ఉండటం, ప్రశాంతతతో, ఆత్మవిశ్వాసంతో కూడుకొని, చక్కని అమరికతో తీర్చిదిద్దబడి ఉన్న సైన్యం జోలికి వెళ్ళకుండా ఉండటంపరిస్థితులను అవగతం చేసుకోగలిగే నేర్పు ఇది.

(పతాకాలన్నీ క్రమపద్దతిలో ఉంటే, దానిని బట్టి ఆ సైన్యంలోని శ్రేణులన్నీ క్రమపద్దతిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అటువంటి సైన్యం అజేయమైనది కనుక దాని జోలికి పోకూడదు)

33) సైనికనీతిననుసరించి శత్రువుకు అభిముఖంగా కొండను అధిరోహించకూడదు, అలాగే కొండదిగుతున్న శత్రువును ఎదుర్కోకూడదు.

34) శత్రువు పలాయనం మోసపూరితమైనపుడు అతడిని వెంబడించకు. ఆవేశపూరితులై ఉన్న సైనికులమీద దాడి చేయకు.

35) శత్రువు ఇవ్వజూపే ప్రలోభాలను స్వీకరించకు. ఇంటిదారిపట్టిన సైన్యాన్ని అటకాయించకు

(శత్రువు ఇవ్వజూపే ప్రలోభాలు అంటే ముఖ్యంగా శత్రువు వీడివెళ్ళిన ప్రాంతంలోని ఆహారం, ఎందుకంటే అది విషపూరితమై ఉండగలదు. ఇంటిదారిపట్టిన సైన్యాన్ని ఎందుకు అటకాయించకూడదంటే, ఇంటికి తెరిగి వెళ్ళే అభిలాషతో ఉన్న సైనికుడు తన దారిని అడ్డుకున్న వారిమీద ప్రాణాలకు తెగించి పోరాడతాడు. అదేజరిగితే నీవు నిలువలేవు)

36) నీవు ఒక సైన్యాన్ని చుట్టుముట్టినపుడు అది పారిపోగల మార్గాన్ని దానికి వదిలి పెట్టు. నిస్పృహతో ఉన్న సైన్యాన్ని మరింత బాధించకు.

(పారిపోగల మార్గాన్ని వదిలి పెట్టమంటే పారిపోనీయమని అర్థం కాదు. పారిపోగల మార్గం దానికి చూపించడం ద్వారా అది నిరాశా, నిస్పృహలతో తెగించి పోరాడే పరిస్థితి రాకుండా చేసి, ఆ తరువాత దానితో యుద్ధం చేయాలి. నిస్పృహతో ఉన్న సైన్యాన్ని మరింత బాధిస్తే వారు తెగించే ప్రమాదం ఉంటుంది)

37) ‘యుద్ధకళ ఆవిధంగా ఉంటుంది.




(ఏడవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





8, ఫిబ్రవరి 2012, బుధవారం

సన్-జు 'యుద్ధకళ': 6వ అధ్యాయం




యుద్ధకళ




6వ అధ్యాయం: బలాలుబలహీనతలు








సన్జు చెప్పాడు:

1) యుద్ధ క్షేత్రానికి ఎవరైతే మొదట చేరుకుని శత్రువు రాకకై ఎదురు చూస్తారో వారు నవ్యోత్సాహంతో యుద్ధం చేస్తారు. ఎవరైతే యుద్ధక్షేత్రానికి ఆ తరువాత చేరుకుని యుద్ధంలో పాల్గొనడానికి హడవుడి పడవలసి ఉంటుందో వారు అక్కడకు చేరుకునేసరికే డస్సిపోతారు.

2) కనుక, తెలివైన యోధుడు తన అభీష్టానికి అనుగుణంగా శత్రువు అడుగువేసేటట్లు చేస్తాడుగానీ శత్రువు అభీష్టానికి అనుగుణంగా తను అడుగు వేసే పరిస్థితి రానీయడు.

3) లాభాన్ని చూపడం ద్వారా శత్రువు తనంతట తానుగా తనను సమీపించేటట్లు చేయగలడు; లేదా నష్టాన్ని కలిగించడం ద్వారా తనను సమీపించడం శత్రువుకు అసాధ్యమయ్యేటట్లూ చేయగలడు.

4) శత్రువు విశ్రాంతిగా ఉంటే, అతడిని ఇక్కట్లపాలు చేస్తాడు; శత్రువుకు ఆహారం సమృద్ధిగా అందుతుంటే, అతడిని ఆకలితో మాడేటట్లు చేస్తాడు; శత్రువు ప్రశాంతంగా శిబిరాన్ని ఏర్పరచుకుని ఉంటే, అతడు అక్కడి నుండి కదలిపోయేటట్లు ఒత్తిడి తెస్తాడు.

5) ఏ ప్రాంతాలను రక్షించుకోవడానికి శత్రువు హడావుడి పడతాడో అక్కడ నీవు ప్రత్యక్షమవ్వు. అతడు నిన్ను ఊహించని ప్రాంతాలకు నీవు త్వరితగతిన చేరుకో.

6) ఎటువంటి బాధ లేకుండా సైన్యం సుదూరాలను ప్రయాణించాలంటే, శత్రువు లేని దేశం గుండా ప్రయాణించు.

7) నీవు చేసే దాడులు ఖచ్చితంగా సఫలమవ్వాలంటే అరక్షితమైన ప్రాంతాల మీద మాత్రమే దాడి చేయి. నీ స్వీయరక్షణకు హాని జరగకుండా ఉండాలంటే శత్రువు దాడి చేయలేనటువంటి ప్రదేశాలలో మాత్రమే ఉనికిని కలిగి ఉండు.

8) కనుక, ప్రత్యర్థికి దేనిని కాపాడుకోవాలో తెలియకుండా దాడి చేయగల సైన్యాధికారే దాడి చేయడంలో నిపుణుడు. అలాగే ప్రత్యర్థికి దేనిమీద దాడి చేయాలో తెలియకుండా చేయగలవాడే ఆత్మరక్షణ చేసుకోవడంలో నిపుణుడు.

9) మార్మికతను, నిగూఢతను నేర్పే ఓ దైవ విద్యా! నీ ద్వారానే మేము కనబడకుండా ఉండటం నేర్చుకున్నాము, నీ ద్వారానే మేము వినబడకుండా ఉండటం నేర్చుకున్నాము; ఆ కారణంగానే మేము శత్రువు తలరాతను మా చేతులలో ఉంచుకోగలుగుతున్నాము.

(కనబడకుండా ఉండేంతగా మార్మికతను అలవరచుకో! వినబడకుండా ఉండేంతగా నిగూడతను అలవరచుకో! అపుడు నీవు శత్రువు యొక్క తలరాతను నిర్దేశించగలవు)

10) శత్రువు ప్రతిఘటించలేకుండా నీవు పురోగమించాలంటే, నీవు అతడి బలహీనతలమీద పనిచేయి; శత్రువు వెంటాడలేకుండా నీవు తిరోగమించాలంటే, నీ కదలికలు అతడి కన్నా మరింత వేగంగా ఉండాలి.

11) మనం యుద్ధం చేయాలనుకుంటే, శత్రువు ఎత్తైన గోడలు, లోతైన కందకాలకు ఆవల ఆశ్రయం పొంది ఉన్నాకూడా అతడిని మనతో తలపడేటట్లు ఒత్తిడి చేయవచ్చు. అందుకు మనం చేయవలసిందల్లాఅతడు తప్పకుండా రక్షించుకోవలసిన ఏదైనా మరో ప్రాంతం మీద దాడి చేయడమే.

12) మనం యుద్ధం చేయకూడదనుకుంటే, మన శిబిరం ఎటువంటి రక్షణ లేకుండా చుట్టూ కేవలం ఒక గీత మాత్రమే గీసి ఉన్నాకూడా శత్రువు మనతో తలపడకుండా చేయవచ్చు. అందుకు మనం చేయవలసిందల్లాకొత్తగా, అనుమానాస్పదంగా ఉండే దేనినైనా అతడి మార్గంలో విసిరివేయడమే.

13) శత్రు పథకాలను మనం కనిపెట్టి, మన పథకాలను మాత్రం శత్రువుకు గోచరం కాకుండా ఉంచడం ద్వారా శత్రు బలగాలు విడిపోక తప్పని సమయంలో మనం మన బలగాలను ఒకేచోట కేంద్రీకరించగలం.

(శత్రు పథకాల గురించి మనకు తెలియడం వలన అతడు ఏ వైపు నుండి దాడి చేస్తాడో మనకు తెలుస్తుంది. కనుక అతడి దాడినెదుర్కోవడానికి మనం ఆ దిశలో సంఘటితరూపంలో కాచుకొని ఉంటాం. కానీ శత్రువుకు మన పథకాల గురించి తెలియకపోవడం వలన మనం ఎటువైపునుండి దాడి చేస్తామో అతడికి తెలియదు. కనుక మనం చేయబోయే దాడిని ఎదుర్కోవడం కొరకు అతడు అన్ని వైపులా సంసిద్ధంగా ఉండవలసి రావడంతో, తన సైన్యాన్ని అనేక భాగాలుగా విడగొట్టవలసి వస్తుంది.)

14)  శత్రువు వివిధభాగాలుగా విడిపోక తప్పని సమయంలో, మనం ఒకే సంఘటిత దేహంగా రూపొందగలం. దానిమూలంగా ఒక పూర్ణత్వం, మరో పూర్ణత్వపు విడిభాగాలకు ఎదురునిలిచి ఉంటుంది. అంటే శత్రువుకు చెందిన కొద్దిమందికి ప్రతిగా మనం అనేక మందిమి ఉంటాము.

15) ఆవిధంగా మనం బలమైన సైన్యంతో బలహీనమైన సైన్యం మీద దాడి చేయగలిగితే, మన ప్రత్యర్థులు భయానక కష్టంలో చిక్కుకుపోతారు.

16) మనం ఏ ప్రాంతంలో పోరాడాలనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని ఎట్టిపరిస్థితుల్లో శత్రువుకు తెలియనీయకూడదు. అలా తెలియనీయకపోవడం వలన జరగబోయే దాడికొరకు శత్రువు అనేక ప్రాంతాలలో సంసిద్ధుడవవలసి వస్తుంది. ఆ విధంగా అతడి బలగాలు అనేక దిశలలోకి విడిపోయి, ఏదేని ఒక ప్రాంతంలో మనం ఎదుర్కోవలసిన శత్రుసైన్యం సాపేక్షంగా కొద్ది సంఖ్యలో ఉంటుంది.

17) శత్రువు తన సేనావాహిని ముందుభాగాన్ని బలోపేతం చేయడం కొరకు వెనుక భాగాన్ని బలహీనం చేస్తాడు; వెనుక భాగాన్ని బలోపేతం చేయడం కొరకు ముందు భాగాన్ని బలహీనం చేస్తాడు; ఎడమ భాగాన్ని బలోపేతం చేయడం కొరకు కుడి భాగాన్ని బలహీనం చేస్తాడు; కుడి భాగాన్ని బలోపేతం చేయడం కొరకు ఎడమ భాగాన్ని బలహీనం చేస్తాడు. అతడు అన్నిచోట్లకూ అదనపు బలగాలను పంపితే, అన్నిచోట్లా బలహీనపడతాడు.

18) సంఖ్యాపరమైన బలహీనత శత్రువు చేయబోయే దాడుల కొరకు మనం సిద్ధంకావలసి రావడం వలన వస్తుంది. సంఖ్యాపరమైన బలం మనం చేయబోయే దాడుల కొరకు శత్రువు సిద్ధంకావలసి వచ్చేటట్లు చేయడం ద్వారా వస్తుంది.

(శత్రుదాడి కొరకు సిద్ధంకావటమంటే సైన్యాన్ని అనేక భాగాలుగా విభజించడమే)

19) జరగబోయే యుద్ధం ఏ ప్రాంతంలో, ఏ సమయంలో జరుగుతుందో తెలియడం వలన సుదూరప్రాంతాల నుండి వచ్చి పోరాటం కొరకు ఏకీకృతం కావచ్చు.

(వేగవంతమైన ప్రయాణం కొరకు సైన్యం వివిధ భాగాలుగా విడిపోయి కూడా యుద్ధం జరగబోయే ప్రాంతాన్ని చేరుకొనే సమయానికి అన్ని భాగాలు కలసి పోయి సంఘటితంగా పోరాటంలో పాల్గొనవచ్చు.)

20) ఐతే పోరు జరిగే సమయంకానీ, ప్రదేశం కానీ తెలియనపుడు, ఎడమవైపున ఉన్న సైన్య భాగం కుడివైపున ఉన్న సైన్య భాగాన్ని ఆపదలో ఆదుకోవడానికి అసమర్థమై ఉంటుంది. అదే విధంగా కుడి సైన్యభాగం కూడా ఎడమ సైన్యభాగాన్ని ఆదుకోవడానికి అసమర్థమై ఉంటుంది. ముందు భాగం వెనుకభాగాన్ని ఆదుకోలేదు, వెనుక భాగం ముందుభాగానికి మద్దతుగా నిలువలేదు. సైన్యంలో అతిదూరంగా ఉండే భాగాల మధ్య దూరం వంద లీలు అయి ఉండి, చివరికి అతి సమీపంగా ఉండే భాగాల మధ్య దూరం సైతం కొన్ని లీలు అయి ఉంటే పరిస్థితి ఇంకెంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

21) నా అంచనా ప్రకారం యూ’ (Yueh) రాజ్య సైన్యం మన సైన్యం కన్నా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ అధిక్యం వారికి విజయాన్ని అందించడంలో ఏ విధంగానూ సహాయకారిగా ఉండదు. అందువలన మనం విజయం సాధించగలమని నేను చెబుతున్నాను.

(‘యూరాజ్యం వారికి యుద్ధం జరిగే ప్రాంతం, సమయం తెలియకుండా చేయడం ద్వారా)

22) శత్రువు సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ, పోరుసల్పకుండా అతడిని నిరోధించవచ్చు. దానికొరకు అతడి పథకాలను, వారి విజయావకాశాలను కనిపెట్టడానికి ఎత్తుగడవేయి.

23) అతడిని రెచ్చగొట్టి, అతడు ఏ పరిస్థితుల్లో క్రియాశీలంగా ఉంటాడు, ఏ పరిస్థితుల్లో స్థబ్దుగా ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకో! అతడు తనను తాను వెల్లడి చేసుకునేటట్లు వత్తిడి చేసి, తద్వారా అతడి బలహీన ప్రాంతాలను కనిపెట్టు.

24) ప్రత్యర్థి సైన్యాన్ని, నీ సైన్యంతో జాగ్రత్తగా పోల్చి చూడటం ద్వారా శత్రుసైన్యంలో బలం ఎక్కడ సమృద్ధిగా ఉన్నదో, ఎక్కడ లోపించి ఉన్నదో నీవు తెలుసుకోవచ్చు.

25) వ్యూహాత్మక పథకాలను రచించడంలో నీవు చేరుకోదగిన అత్యున్నత స్థానం ఏమిటంటే వాటిని దుర్గ్రాహ్యంగా ఉంచడమే. నీ పథకాలను ఆ విధంగా ఉంచడం వలన గుచ్చి గుచ్చి పరిశీలించే రహస్య గూఢచారుల తీక్షణ దృక్కుల నుండి, ఎంతో తెలివిగలిగినవారు పన్నే కుట్రల నుండి నీవు రక్షింపబడతావు.

(నీ పథకాలను రహస్యంగా ఉంచడం వలన శత్రు గూఢచారులు వాటిని గ్రహించలేరు. తెలివైన ప్రత్యర్థులు నీకు వ్యతిరేకంగా ఎటువంటి ఎత్తుగడా వేయలేరు)

26) శత్రువు వేసే ఎత్తుగడల నుండి తమకు విజయం ఎలా సమకూరగలదో సామాన్యులు గ్రహించలేరు.

27) నేను విజయం సాధించిన సమయంలో తాత్కాలికంగా అనుసరించిన ఉపాయాన్నే అందరూ చూడగలరు, కానీ విజయం యొక్క క్రమపరిణామానికి కారణమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని ఎవరూ చూడలేరు.

(విజయాన్ని స్థూలంగా అందరూ దర్శిస్తారు. కానీ అది సమకూరడానికి దారితీసిన దీర్ఘకాలిక వ్యూహప్రతివ్యూహాలను ఎవరు దర్శించలేరు)

28) ఒకానొక విజయాన్ని పొందడనికి నీవు అనుసరించిన ఎత్తుగడలను మరలా మరలా అనుసరించకు. లెక్కలేనన్ని విధాలుగా ఉండే పరిస్థితులకనుగుణంగా నీ విధానాలను మార్చుకుంటూ ఉండు.

29) నీరు ప్రవహించేటపుడు ఎత్తైన ప్రదేశాలను వదిలిపెట్టి, పల్లపు ప్రాంతాలను వడివడిగా చేరుకుంటుంది. సైనిక ఎత్తుగడలు అటువంటి నీటిని పోలి ఉంటాయి.

30) కనుక యుద్ధంలో అనుసరించవలసిన విధానమేమిటంటే ఏది బలమైనదో దానిని వదిలి పెట్టడం, ఏది బలహీనమైనదో దానిమీద దాడి చేయడం.

31) నీరు తను ప్రవహిస్తున్న నేలను బట్టి తన ప్రవాహదిశను రూపొందించుకుంటుంది. సైనికుడు తను ఎదుర్కొంటున్న శత్రువుకు తగినట్లుగా విజయం కొరకు కృషి చేస్తాడు.

32) కనుక నీటికి ఎలాగైతే స్థిరమైన రూపం ఉండదో, అలాగే యుద్ధంలో కూడా స్థిరమైన పరిస్థితులుండవు.

33) ఎవరైతే తన శత్రువుకు అనుగుణంగా తన ఎత్తుగడలను మార్చుకోగలిగి తద్వారా గెలుపును సాధిస్తాడో అతడిని స్వర్గం నుండి దిగివచ్చిన సైన్యాధికారిగా పిలువవచ్చు.

34) పంచభూతాలలో ఏ ఒక్కటీ ఎల్లవేళలా మిగతావాటిని అధిగమించి ఉండదు.
నాలుగు ఋతువులు వంతుల వారీగా ఒకదానికొకటి అవకాశాన్ని ఇచ్చుకుంటాయి.
పగటికాలం ఒక్కోసారి ఎక్కువ సమయం ఉంటుంది. ఒకోసారి తక్కువ సమయం ఉంటుంది.
చంద్రుడు కొంతకాలం క్షీణిస్తాడు, మరికొంతకాలం వృద్ధిచెందుతాడు.

(అదేవిధంగా యుద్ధంలోని పరిస్థితులు కూడా మారుతుంటాయి, వాటికనుగుణంగా మన ఎత్తుగడలను కూడా మార్చుకుంటుండాలి)




(ఆరవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





6, ఫిబ్రవరి 2012, సోమవారం

సన్-జు 'యుద్ధకళ': 5వ అధ్యాయం




యుద్ధకళ




5వ అధ్యాయం: శక్తి









సన్జు చెప్పాడు:

1) కొద్దిమందిని ఏ పద్దతిలో నియంత్రిస్తామో అదే పద్దతిలో ఒక పెద్ద బలగాన్ని కూడా నియంత్రించవచ్చు. మనం చేయవలసిందల్లా ఆ బలగాన్ని చిన్నచిన్న సమూహాలుగా విభజించడమే.

2) నీ అదుపాజ్ఞలలో ఓ పెద్దసైన్యం ఉన్నపుడు చేసే పోరాటానికి, ఓ చిన్నసైన్యం ఉన్నపుడు చేసే పోరాటానికీ ఏ మాత్రం తేడా ఉండదు. నీవు చేయవలసిందల్లా సంకేతాలు, సంజ్ఞల ద్వారా సమాచార మార్పిడిని సరైన విధంగా నెలకొల్పుకోవడమే.

3) నీ సైన్యమంతా శత్రుదాడి తీవ్రతను తట్టుకొని చలించకుండా నిలబడటం అనేది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉండే ఎత్తుగడల వలన సాధ్యమవుతుంది.

4) నీ సైన్యపు ప్రభావం గుడ్డు మీదకు విసిరిన గులకరాయి వలే ఉండటం అనేది బలమైన, బలహీనమైన అంశాల గురించిన పరిజ్ఞానం వలన సాధ్యమవుతుంది.

5) యుద్ధాన్ని ప్రారంభించడానికి ప్రత్యక్షంగా ఉండే పద్దతులను ఉపయోగించవచ్చు. కానీ విజయాన్ని పొందడానికి మాత్రం పరోక్షంగా ఉండే పద్దతులు అవసరమవుతాయి.

6) సమర్థవంతంగా అమలు చేయబడే పరోక్షమైన ఎత్తుగడలు ఆకాశంవలే, భూమివలే తరిగిపోనివి; నదులు, సెలయేళ్ళ ప్రవాహం వలే అంతులేనివి; సూర్యచంద్రుల వలే అవి అంతమయ్యేది తిరిగి కొత్తగా మొదలవడానికే; నాలుగు ఋతువుల వలే అవి గతించిపోయేది మరోసారి తిరిగి రావడానికే.

7) సంగీత స్వరాలు ఐదు కన్నా ఎక్కువలేవు. అయినాకూడా ఆ అయిదింటి మేళవింపుతో ఎప్పటికీ వినలేనన్ని బాణీలను కూర్చవచ్చు.

8) ప్రాథమిక రంగులు ఐదుకన్నా ఎక్కువ లేవు. ఆయినా కూడా వాటి మేళవింపుతో ఎప్పటికీ చూడలేనన్ని వర్ణమిశ్రమాలను సృష్టించవచ్చు.

9) ప్రాథమిక రుచులు ఐదుకన్నా ఎక్కువ లేవు. అయినాకూడా వాటి సమ్మేళనంతో ఎప్పటికీ ఆస్వాదించలేనన్ని రుచులను తయారు చేయవచ్చు.

(మనకు సంగీత స్వరాలు, ప్రాథమిక వర్ణాలు ఏడేసి ఉంటాయి. అలాగే రుచులు ఆరు. కానీ పైన తెలిపిన ఐదు సంఖ్య చైనా సంప్రదాయాన్ని అనుసరించి తెలపబడినది)

10) యుద్ధంలో దాడి చేయడానికి రెండు కన్నా ఎక్కువ పద్ధతులు లేవు. అవి ప్రత్యక్షం, పరోక్షం. అయినాకూడా ఆ రెండింటి మేళవింపు అంతులేని ఎత్తుగడల పరంపరకు కారణమవుతుంది.

11) ప్రత్యక్ష, పరోక్షమైన పద్దతులు వరుసగా ఒకదానికొకటి దారితీస్తుంటాయి. అది ఒక చక్రభ్రమణం వంటిది. నీవెప్పటికీ అంతానికి చేరుకోలేవు. వాటి మేళవింపు వలన జనించే పథకాలను ఎవరు మాత్రం పూర్తిగా వినియోగించుకోగలరు?

12) రాళ్ళను సైతం తన మార్గంవెంట దొర్లించుకుపోయే ఉరకలెత్తే నీటిప్రవాహపు ఉధృతి వలే బలగాల దాడి ఉంటుంది.

13) గ్రద్ద ఆకాశంనుండి తన ఆహారంమీద సరైనసమయంలో దాడి చేసి, దాని శరీరాన్ని ఛిద్రంచేసే విధానంలో సరైన నిర్ణయం ఉంటుంది.

14)  కనుక ఉత్తమ యోధుడు తన దాడి భీకరంగా ఉండేటట్లు, తన నిర్ణయం ఖచ్చితంగా ఉండేటట్లు జాగ్రత్త పడతాడు.

15) శక్తిని వింటి నారిని లాగడంతో పోల్చవచ్చు. నిర్ణయాన్ని శరాన్ని వదలడంతో పోల్చవచ్చు.

16) యుద్ధకల్లోలంలో అంతా అస్తవ్యస్తంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ నిజానికి అక్కడ ఏ అస్తవ్యస్తతా ఉండదు. ఆ తికమకలో, ఆ కోలాహలంలో నీ బలగాల మోహరింపు తలాతోకా లేనట్లుగా ఉంటుంది. ఆయినా కూడా అది ఓటమిని అడ్డుకుంటుంది.

17) అస్తవ్యస్తతను నటించాలంటే ముందు ఉత్తమ క్రమశిక్షణ ఉండాలి. పిరికితనాన్ని నటించాలంటే ముందు ధైర్యం ఉండాలి; బలహీనతను నటించాలంటే ముందు బలం ఉండాలి.

18) అస్తవ్యస్తత ముసుగులో క్రమత్వాన్ని దాయడం అనేది విభజనకు సంబంధించిన విషయం.

(అనేక విభాగాలు, ఉపవిభాగాలుగా విభజింపబడి వాటన్నింటికీ అధికారులు నియమించబడి పూర్తి క్రమశిక్షణతో ఉన్న పెద్ద బలగం పైకి అస్తవ్యస్తంగా కనబడుతుంది.)

పిరికితనం మాటున ధైర్యాన్ని కనుమరుగు చేయడానికి  పైకి గోచరంకాని అంతర్గతశక్తి నిల్వ ఉండాలి.

(ముందడుగు వేయగలిగే అనువైన పరిస్థితిలో ఉండి కూడా మనం ముందడుగు వేయకపోతే, మనం భయపడినట్లుగా శత్రువు భావిస్తాడు.)

బలహీనత ముసుగులో బలాన్ని దాయడం అనేది వ్యూహాత్మక మోహరింపు ద్వారా సాధించబడుతుంది.

(సేనలోని మంచి శరీర సౌష్టవం కలిగిన సైనికులను, బలిష్ఠమైన గుఱ్ఱాలను బయటకు కనబడకుండా చేసి వృద్ధులైన సైనికులను, బక్కచిక్కిన గుఱ్ఱాలను బయటకు ప్రదర్శించడం ద్వారా శత్రువు మనలను తక్కువ అంచనా వేసేటట్లు చేయవచ్చు.)

19) ఆ విధంగా శత్రువు కదలికలో ఉండేటట్లు చేయడంలో నేర్పరి అయినవాడు మోసపూరితమైన ప్రదర్శనలను కొనసాగిస్తుంటాడు. వాటి ప్రకారంగానే శత్రువు స్పందిస్తాడు. శత్రువు దేనినైతే తటాలున స్వీకరిస్తాడో దానినే అతడు త్యాగం చేస్తుంటాడు.

20) ఎరలు వేయడం ద్వారా శత్రువును ముందుకు కదిలేటట్లు చేసి, ఆ తదుపరి ఎంపిక చేసిన మనుషులతో అతడి కొరకు వేచి ఉంటాడు.

21) తెలివైనయోధుడు సంఘటిత శక్తి యొక్క ప్రభావం కొరకే చూస్తాడు. విడివిడి మనుష్యులతో అతడికి అంతగా అవసరముండదు. కనుక సరైన మనుషులను ఎంచుకొని వారి ఐక్యత ద్వారా సమకూరే సంఘటిత శక్తిని ఉపయోగించుకోవడంలోనే అతడి సమర్థత వెల్లడవుతుంది.

22) అతడు సంఘటిత శక్తిని ఉపయోగించేటపుడు అతని సైనికులు దొర్లిపోయే కొయ్యదుంగలు లేక బండరాళ్ళవలే మారతారు. ఎందుకంటే సమతల ప్రదేశం పై కదలకుండా ఉండటం, వాలు ప్రాంతంలో దొర్లడం; నాలుగుపలకలుగా ఉంటే నిశ్చలం గా ఉండటం, గుండ్రంగా ఉంటే దొర్లుతూ క్రిందికి పోవడం కొయ్యదుంగ లేక బండరాయి లక్షణం.

(సంఘటిత శక్తిని ఉపయోగించడమంటే, సైనికులను యుద్ధంలో సమిష్టిగా, వ్యూహాత్మకంగా వినియోగించడం. Making the best out of them.)

23) ఆవిధంగా, మంచి సైనికుల వలన పెంపొందింపబడిన శక్తి, వేల అడుగుల ఎత్తు ఉండే పర్వతం మీద నుండి దొర్లుతూ వచ్చే గుండ్రని బండరాయి యొక్క శక్తిని పోలి ఉంటుంది.

శక్తి అనే అంశం గురించిన చర్చ ముగిసింది.



(ఐదవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి




4, ఫిబ్రవరి 2012, శనివారం

సన్-జు 'యుద్ధకళ': 4వ అధ్యాయం




యుద్ధకళ




4వ అధ్యాయం: వ్యూహాత్మక సంసిద్ధత








సన్జు చెప్పాడు:

1) ప్రాచీన కాలపు ఉత్తమ యోధులు మొదట తమను ఓటమి సంభావ్యతకు ఆవల నిలుపుకుని, తదుపరి శత్రువును ఓడించే అవకాశం కోసం వేచి ఉండేవారు.

2) మనలను ఓటమి బారినుండి సురక్షితులను గావించుకోవడం అనేది మన చేతులలో ఉంటుందిగానీ, శత్రువును ఓడించే అవకాశాన్ని మాత్రం శత్రువే స్వయంగా అందిస్తాడు.

3) ఆ విధంగా ఉత్తమ యోధుడు ఓటమి బారి నుండి తనను రక్షించుకోగలడు గానీ, శత్రువును ఓడించే విషయంలో మాత్రం ఖచ్చితత్వాన్ని సాధించలేడు.

4) కనుకనే ఇలా చెప్పబడింది: జయించే సామర్థ్యం లేనివానికి జయించడమెలాగో తెలిసి ఉండవచ్చు.

5) ఓటమి బారినుండి రక్షించుకోవడం అనేది ఆత్మరక్షణ వ్యూహం. శత్రువును ఓడించే సామర్థ్యం అంటే దాడిచేసే వ్యూహం.

6) ఆత్మరక్షణను అనుసరించడం లోపించిన బలాన్ని సూచిస్తుంది. దాడిచేయడం అనేది మిగులు ఉన్న బలాన్ని సూచిస్తుంది.

7) ఆత్మరక్షణ నైపుణ్యం కలిగిన సేనాని అతిరహస్యమైన భూఅంతరాలలో దాగి ఉంటాడు. దాడి చేయడంలో నైపుణ్యం కలిగినవాడు స్వర్గశిఖరాల నుండి మెరుపువలే దూసుకొస్తాడు. వారి విధానాన్ని అనుసరించడంవలన మనం ఒకపక్క మనల్ని మనం రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. మరోపక్క సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తాం.

8) విజయాన్ని అందరూ దర్శించగలిగినపుడే నీవూ దర్శించగలగడం అత్యున్నత ప్రతిభ అనిపించుకోదు

9) సామ్రాజ్యం అంతా భళాఅనేటట్లుగా నీవు పోరాడి, విజయం సాధిస్తే అది అత్యున్నత ప్రతిభ అనిపించుకోదు.

(యుద్ధం చేయకుండా విజయం సాధించడమే అత్యున్నత ప్రతిభ)

10) కుందేలు వెంట్రుకను ఎత్తడం పెనుబలానికి నిదర్శనం కాదు; సూర్యచంద్రులను చూడటం నిశితదృష్టికి నిదర్శనం కాదు; పిడుగు శబ్దాన్ని వినడం సునిశితమైన వినికిడి శక్తికి నిదర్శనం కాదు.

11) కేవలం గెలుపొందడమే కాదు, ఆ గెలుపును సునాయాసంగా పొందే ప్రతిభ ఉన్న వానిని ప్రాచీనులు తెలివైన యోధుడుఅని పిలిచేవారు.

12) ఆకారణంగానే అతడి విజయాలు అతడి యుద్ధపరిజ్ఞానానికి ప్రఖ్యాతినీ, అతడి ధైర్యానికి గుర్తింపునూ తేలేకపోయాయి.

(వెలుగు చూడని వ్యవహారాల వలన అతడు విజయాన్ని సాధిస్తాడు, అందువలనే అతడి యుద్ధపరిజ్ఞానం ప్రఖ్యాతిని బడయదు. రక్తపాతం జరగక ముందే శత్రురాజ్యం అతడికి లోబడి పోతుంది. అందువలనే అతడి ధైర్యానికి గుర్తింపు రాదు.)

13) పొరపాట్లు చేయకపోవడం ద్వారా అతడు తన యుద్ధాలను గెలుపొందుతాడు. పొరపాట్లు చేయకపోవడం అంటే ముందే ఓడిపోయిన శత్రువును జయించడం అని అర్థం కనుక అది విజయాన్ని ఖాయపరుస్తుంది.

14) అందువలన నైపుణ్యం కలిగిన యోధుడు తను ఓడిపోవడం అసాధ్యమయ్యే పరిస్థితిని కల్పించుకోవడమే కాక, శత్రువును ఓడించే క్షణాన్ని జారవిడుచుకోడు.

15) ఆవిధంగా యుద్ధంలో, విజయవంతమైన వ్యూహకర్త విజయాన్ని గెలుచుకున్న తరువాత మాత్రమే పోరాటాన్ని కోరతాడు. ఐతే ఓటమి రాసిపెట్టి ఉన్నవాడు మొదట పోరాడి, ఆ తదుపరి విజయం కోసం చూస్తాడు.

(‘విజయాన్ని గెలుచుకున్న తరువాతఅంటే గెలుపును ఖాయం చేసే ప్రణాళికను సిద్ధం చేసుకున్న తరువాత)

16) పరిపూర్ణమైన నాయకుడు ప్రజామద్దతును కూడగట్టడం ద్వారా, అలాగే యుద్ధ వ్యవహారాన్నంతా సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విజయాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు.

17) సైనిక పద్దతి ప్రకారం మనం అనుసరించవలసిన చర్యాక్రమం ఇలా ఉంటుంది.

మొదటగా భూమి కొలత (measurement),

రెండవది శత్రు బలాన్ని మదింపు చేయడం (estimation of quantity),

మూడవది అంచనాలు వేయడం (calculations),

నాల్గవది శత్రువుకు, మనకు ఉన్న అవకాశాలను పోల్చిచూడటం (balance of chances),

అయిదవది విజయాన్ని పొందడం (victory).

18) భూమినుండి కొలతను రాబడతాము, కొలతనుండి శత్రుబలాన్ని మదింపు చేస్తాము, ఆ మదింపు నుండి అంచనాలు వేస్తాము, అంచనాల నుండి శత్రువుకు, మనకు ఉన్న అవకాశాలను పోల్చుతాము, ఆ పోలిక నుండి విజయాన్ని పొందుతాము.

19) విజయవంతమైన సైన్యం, ఓడిపోయిన సైన్యం ఎదురెదురుగా ఉంటే, ఆ పరిస్థితి త్రాసులో ఒక ధాన్యపు గింజను తూయడానికి ఒక పౌండ్ బరువును ఉంచినట్లుగా ఉంటుంది.

20) కట్టడి చేయబడిన నీరు వేల అడుగుల లోతున్న ఒక సన్నని అగాథంలోనికి ఏవిధంగా మహోధృతంగా చొచ్చుకుపోతుందో అదేవిధంగా గెలుపొందే సైన్యం మున్ముందుకు దూసుకొస్తుంది.




(నాలుగవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి





2, ఫిబ్రవరి 2012, గురువారం

సన్-జు 'యుద్ధకళ': 3వ అధ్యాయం




యుద్ధకళ




3వ అధ్యాయం:ఎత్తుగడే ఆయుధం 








సన్జు చెప్పాడు:

1) యుద్ధంలో శత్రుదేశాన్ని స్వాధీనం చేసుకునేటపుడు దానికి హాని జరగకుండా చూడటం, అది ముక్కలవకుండా ఒకే రాజ్యంగా ఉండేటట్లు చూడటం అన్నింటికన్నా ఉత్తమమైన విషయం. దానిని తునాతునకలు చేసి నాశనం చేయడం అంత మంచిది కాదు. అలాగే ఒక సైన్యాన్ని గానీ, ఒక రెజిమెంటును గానీ, ఒక డిటాచ్‌మెంటును గానీ, ఒక కంపెనీని గానీ పట్టుకున్నపుడు వాటిని నాశనం చేయడం కన్నా పదిలంగా ఉంచడమే మంచిది.

2) కనుక నీవు తలపెట్టిన యుద్ధాలన్నింటిలోనూ పోరాడి గెలుపొందటం సర్వోత్తమ నైపుణ్యం అనిపించుకోదు. సర్వోత్తమ నైపుణ్యం ఏమిటంటే పోరాటం లేకుండానే శత్రు ప్రతిఘటనను అంతం చేయడం.

3) ఈ విధంగా అన్నింటికన్నా ఉత్తమ సేనాధిపత్యం అంటే శత్రు పథకాలు కార్యరూపం దాల్చకుండా అడ్డుకోవడం; తరువాత ఉత్తమమైనది శత్రు బలగాలను ఒకదానితో మరొకటి వచ్చిచేరనీయకపోవడం; తరువాత ఉత్తమమైనది శత్రుసైన్యం మీద యుద్ధరంగంలో దాడిచేయడం; అన్నిటికన్నా అధమ విధానం కోటకట్టిన నగరాలను ముట్టడించడం.

4) అవకాశమున్నంత వరకు రక్షణ గోడలు కట్టిన నగరాలను ముట్టడించక పోవడం అనేది ఒక నియమం. ఎందుకంటే అటువంటి ముట్టడిలో రక్షణ కవచాలు, కదిలే రక్షణ నిలయాలు, వివిధ రకాల యుద్ధ పరికరాలు; వీటన్నింటినీ సిద్ధం చేయడానికి మూడునెలల పూర్తికాలం తీసుకుంటుంది. మరలా గోడల కెదురుగా మట్టి గుట్టల నిర్మాణానికి మరొక మూడు నెలలు పడుతుంది.

5) సేనాని ఓర్పు నశించిపోయి తన సైన్యాన్ని కోటమీద దాడిచేయడానికి చీమల దండులాగా వదులుతాడు. వారిలో మూడింట ఒక వంతు సైనికులు చంపివేయబడతారుగానీ నగరం స్వాధీనం కాదు. ముట్టడి వలన ఆ విధమైన విపత్తులు సంభవిస్తాయి.

6) కనుక నైపుణ్యం కలిగిన నాయకుడు శత్రుసైన్యాలను పోరాటం లేకుండానే లోబరుచుకుంటాడు. అతడు వారి నగరాలను ముట్టడి వేయకుండానే స్వాధీనం చేసుకుంటాడు. అతడు యుద్ధరంగంలో దీర్ఘకాలం పోరాడకుండానే వారి రాజ్యాన్ని అంతం చేస్తాడు.

7) తన బలగాలకు ఏ విధమైన హాని జరగకుండానే అతడు రాజ్యపాలకులతో తగవు పడతాడు. ఆ విధంగా ఒక్క సైనికుడిని కూడా కోల్పోకుండా సంపూర్ణ విజయాన్ని సాధిస్తాడు. ఎత్తుగడే ఆయుధంగా దాడి చేసే పద్దతి ఇదే.

8) ఇది యుద్ధనియమం: మన బలగాలు శత్రు బలగాలకు పదింతలు ఉంటే వారిని చుట్టుముట్టాలి, ఐదింతలు ఉంటే వారిమీద సూటిగా దాడి చేయాలి, రెండింతలు ఉంటే మన సైన్యాలను రెండుగా విభజించాలి,

9) సమానంగా ఉంటే మనం యుద్ధాన్ని ప్రతిపాదించాలి; సంఖ్యలో కొంచెం తక్కువగా ఉంటే శత్రువును ఎదుర్కోవడాన్ని అప్పటికి దాటవేయాలి; ప్రతీ విషయంలోనూ అసమానంగా ఉంటే మనం అతడినుండి పారిపోవాలి.

10) ఎందుకంటే, చిన్నసైన్యం మొండిగా పోరాడినప్పటికీ చివరికి పెద్దసైన్యానికి పట్టుబడిపోతుంది.

11) సైన్యాధిపతి దేశానికి రక్షణకుడ్యం వంటివాడు. ఈ రక్షణకుడ్యం అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉంటే రాజ్యం బలీయంగా ఉంటుంది; లోపభూయిష్టంగా ఉంటే బలహీనంగా ఉంటుంది.

12) ఒక పాలకుడు మూడు విధాలుగా తన సైన్యానికి ముప్పు తెచ్చిపెడతాడు.

13) (1) సరైన సమాచారం లేకుండా సైన్యానికి ఆదేశాలను జారీ చేయడం: సైన్యం తన ఆజ్ఞలను తలదాల్చగల స్థితిలో లేదనే విషయం తెలుసుకోకుండా దానిని పురోగమించమనో లేక తిరోగమించమనో ఆదేశించడం ద్వారాదీనిని సైన్యం కాళ్ళను బంధించివేయడం అంటారు.

(సైన్యం పురోగమించలేని స్థితిలో ఉన్నపుడు ఆ విషయాన్ని తెలుసుకోక పురోగమించమని ఆజ్ఞాపించడం, లేక తిరోగమించలేని స్థితిలో ఉన్నపుడు అది తెలుసుకోలేక తిరోగమించమని ఆజ్ఞాపించడం)

14) (2) సైనిక నిర్ణయాలలో అనవసర జోక్యం: సైన్యానికి సంబంధించిన విషయాల యెడల అవగాహన లేకుండా రాజ్యాన్ని పరిపాలించినట్లుగానే సైన్యంతో గూడా వ్యవహరించడానికి యత్నించడం ద్వారాఇది సైనికుల మనసులలో అవిశ్రాంతతకు కారణమవుతుంది.

15) (3) సైనిక నియామకాలలో అనవసర జోక్యం: పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం అనే సైనిక నియమం యెడల అవగాహన లేకుండా తన సైన్యంలోని అధికారులను విచక్షణారహితంగా నియమించడం ద్వారాదీనివలన సైనికుల ఆత్మవిశ్వాసం సడలిపోతుంది.

16) సైన్యం అవిశ్రాంతంగా ఉండి, దానికి ఆత్మవిశ్వాసం లేనపుడు ఇతర రాజులనుండి తప్పక ముప్పు వస్తుంది. సైన్యంలోనికి అరాచకాన్ని తేవడం, విజయాన్ని దూరంగా తరిమివేయడం అంటే ఇదే.

17) ఈ విధంగా విజయానికి ఐదు ముఖ్యావసరాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఆవి:

a. ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు పోరాడకూడదో తెలిసినవాడు గెలుపొందుతాడు.

b. పెద్దసైన్యం, చిన్నసైన్యంఈ రెంటితో ఎలా వ్యవహరించాలో తెలిసినవాడు గెలుపొందుతాడు.

c. ఎవరిసైన్యంలో శ్రేణులన్నీ ఒకే స్ఫూర్తితో ప్రేరేపించబడి ఉంటాయో అతడు గెలుపొందుతాడు.

d. తాను సిద్ధంగా ఉండి, సిద్ధంగా లేని శత్రువును పట్టుకోవడానికి వేచియుండేవాడు గెలుపొందుతాడు.

e. ఎవరు సైనిక వ్యవహారాలలో సమర్థత కలిగి ఉండి, పాలకుడి జోక్యం లేకుండా ఉంటాడో అతడు గెలుపొందుతాడు.

18) దీనిని బట్టి ఇలా చెప్పబడింది: నీకు నీ గురించీ, నీ శత్రువు గురించి కూడా తెలిసి ఉంటే నీవు వంద యుద్ధాలు చేసినా, ఒక్క దాని ఫలితం గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. నీకు కేవలం నీ గురించే తెలిసి ఉండి, నీ శత్రువు గురించి మాత్రం తెలియకపోతే నీవు పొందే ప్రతీ గెలుపుకీ బదులుగా మరో ఓటమిని కూడా అనుభవిస్తావు. మరినీకు నీ గురించీ, నీ శత్రువు గురించి కూడా తెలియకపోతే నీవు చేసే ప్రతీ యుద్ధంలోనూ ఓడిపోతావు.





(మూడవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి