3, జూన్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!

నేను జె.పి.గారిలో మరియు లోక్‌సత్తాలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతూ ఇటీవల రాసిన వ్యాసాలకు ప్రతిస్పందించిన కామెంటేటర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారిలో ఎక్కువ మంది అసలు మీరెలాంటి వ్యవస్థను కోరుకుంటున్నారనీ మరియూ మీరు ఆశిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్వరూపమెలా ఉంటుందనీ అడిగారు.దానిని వివరించటం కొరకే ఈ వ్యాసం రాస్తున్నాను.

భారతదేశానికి ఏటువంటి వ్యవస్థ కావాలో తెలుసుకోవటానికి ముందుగా ఒక దేశపు రాజకీయ వ్యవస్థ స్వరూపమెలా ఉంటుందో తెలుసుకుందాం. ఏ దేశపు రాజకీయ వ్యవస్థలోనైనా మూడు అంగాలుంటాయి.

అవి 1.రాజ్యం 2.సమాజం 3.వ్యక్తి

1.రాజ్యం:- ఒకే శాసనాధికారం క్రింద జీవిస్తున్న ప్రజలతో కూడిన నిర్ణీత ప్రాదేశిక పరిధిని 'రాజ్యం' అంటారు.రాజ్యానికి ఇలాంటి నిర్వచనం ఉన్నది.కానీ రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎక్కువగా' రాజ్యం' అనే పదాన్నివేరే అర్థంలో వాడుతున్నారు. అదేమంటే రాజ్యం అంటే సైన్యం,పోలీసులు,పాలనా యంత్రాంగం,శాసనం.. ఇలాంటి శక్తులను మరియు వాటిని ప్రయోగించే విధానాన్ని' రాజ్యం' లేక 'రాజ్యశక్తి' అంటున్నారు.మనం ఈ రెండవ అర్థంలోనే అధ్యయనం చేస్తాము.

2.సమాజం:- 'సమాజం' అంటే నదులు,ఖనిజాలు లాంటి సహజవనరులు, రోడ్లు,వంతెనలు లాంటి మౌలిక సదుపాయాలు, విద్య,వైద్యం లాంటి సౌకర్యాలు, ఫాక్టరీలు, వ్యవసాయ భూములు లాంటి ఉత్పత్తి సాధనాలు మరియు వీటితో కూడుకున్న జనబాహుళ్యం అనే అర్థం ఉన్నది. కానీ మన అధ్యయనంలో సమాజంలో మిగతావన్నీ కలుపుతాముకానీ జనబాహుళ్యం స్థానంలో మాత్రం మౌలిక సదుపాయాలు,సౌకర్యాలు, ఉత్పత్తి సాధనాలు తదితరాల మీద పెత్తనం కలిగిన ధనిక(బూర్జువా)వర్గాన్ని మాత్రమే ఉంచుతాము.'సమాజం' అనే అంగంలో సామాన్య ప్రజలు రారు.ఎందుకంటే సామాన్య ప్రజలకు పైన పేర్కొన్న వాటిలో వేటిమీద పట్టు కానీ,పెత్తనం కానీ ఉండదు.

3.వ్యక్తి:- ఇక్కడ 'వ్యక్తి' అంటే ఒక వ్యక్తి అని కాదు అర్థం.పైన సమాజంలో కలపకుండా ఉంచిన సామాన్య ప్రజలంతా ఈ విభాగంలోకి వస్తారు.


ఈ అర్థాలతోనే మనం ఇప్పుడు 'రాజ్యం', 'సమాజం', 'వ్యక్తి' అనే అంగాలను పరిశీలిస్తాము. మొదటే చెప్పినట్లుగా 'వ్యవస్థ' యొక్క పూర్తి స్వరూపం ఈ మూడు అంగాలతో కూడుకొని ఉంటుంది. ఈ మూడు కూడా పరస్పర విరుద్ధ మైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పరస్పర విరుద్ధ మైన ప్రయోజనాలు అంటే 'రాజ్యం' యొక్క ప్రయోజనాలు సమాజానికి,వ్యక్తికి విరుద్ధంగా ఉంటాయి.'సమాజం' యొక్క ప్రయోజనాలు రాజ్యానికి,వ్యక్తికి విరుద్ధంగా అలాగే 'వ్యక్తి' యొక్క ప్రయోజనాలు రాజ్యానికి,సమాజానికి విరుద్ధంగా ఉంటాయి. పరస్పర విరుద్ధ మైన ఈ మూడు అంగాలనూ సమన్వయపరచవలసిన బాధ్యత ప్రభుత్వానిది.ఈ మూడు అంగాలనూ ప్రభుత్వం సమదృష్టితో చూడాలి.అలా కాక ప్రభుత్వం ఏదో ఒక అంగం యొక్క ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి మిగతా రెండు అంగాలను అణచి వేస్తే అది మంచి వ్యవస్థ అనిపించుకోదు.

ఇప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థలలో ఏ ఒక్కటి కూడా అటువంటి నిష్పక్షపాతమైనది కాదు. కొన్ని వ్యవస్థలలో ప్రభుత్వం 'రాజ్యం' యొక్క ప్రయోజనాల వైపు మొగ్గినది.కొన్ని వ్యవస్థలలో ప్రభుత్వం 'సమాజ' ప్రయోజనాల వైపు మొగ్గినది. మరికొన్నింటిలో 'వ్యక్తి 'ప్రయోజనాల వైపు మొగ్గినది.

వ్యవస్థ లోని ఈ మూడు అంగాల ప్రయోజనాలకూ సమప్రాధాన్యత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.దాని కొరకు మనం సృజనాత్మకతతో ప్రయత్నించాలే గానీ ఇప్పుడున్న వాటిలో ఏదో ఒక దానిని ఏరుకోవటమో లేక వాటిలో ఏదో ఒక దాన్ని దుమ్ము దులిపి అంటే కొంచెం మార్చి వాడుకోవటమో కుదరదు. ఎందుకంటే అవన్నీ మౌలికంగా ఏదో ఒక అంగం వైపు మొగ్గు చూపిన పక్షపాత వ్యవస్థలే. వాటిని ఎంత సంస్కరించినా వాటి మౌలిక స్వభావంలో మార్పు రాదు. కనుక నూతన వ్యవస్థను సృజన చేయడ మొక్కటే మార్గం.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకూ వ్యవస్థలోని మూడు అంగాలకూ సమప్రాధాన్యతనిచ్చే నిష్పక్షపాతమైన ప్రభుత్వం ఏర్పడలేదు. ఆ క్రమాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

బర్బర జాతుల దాడులతో ప్రపంచమంతా అట్టుడికిపోతున్న అరాచక పరిస్థితులు నెలకొన్న సమయంలో పటిష్ఠవంతమైన రాజ్యశక్తి తక్షణావసరంగా భావించబడి 'ఇస్లాం' జనించినది(ఇస్లాం ఒక మతంగా పరిగణింపబడుతున్నప్పటికీ రాజనీతి శాస్త్రమునకు సంబంధించినంతవరకూ ఇస్లాం ఒక వ్యవస్థీకృత ఫ్యూడలిజం).కానీ ఇస్లాంలో శక్తివంతమైన రాజ్యం ఆవిర్భవించినప్పటికీ సమాజం మరియు వ్యక్తి యొక్క ప్రయోజనాలు తీవ్రంగా అణచివేయబడ్డాయి. మరీ ముఖ్యంగా సమాజమనేది వికాసం లేక కృశించుకుపోయింది.దానితో కాలక్రమంలో సమాజ వికాసం తక్షణావసరంగా భావించబడి తదనుగుణమైన 'పెట్టుబడిదారీ వ్యవస్థ'(కాపిటలిజం) జనించినది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లో సమాజం అన్నిరంగాలలోనూ వికాసాన్ని సంతరించుకున్నది.కానీ 'రాజ్యం' మరియు 'వ్యక్తి' ల యొక్క ప్రయొజనాలు తీవ్రస్థాయిలో దెబ్బ తిన్నాయి. మరీ ముఖ్యంగా వ్యక్తి దారుణమైన దోపిడికి గురి అయ్యాడు. దానితో కాలక్రమంలో వ్యక్తి ప్రయోజనం తక్షణావసరంగా భావించబడి 'కమ్యూనిజం'(సామ్యవాదం) ఆవిర్భవించినది.ఈ కమ్యూనిజంలో 'వ్యక్తి' కి అధిక ప్రాధాన్యత ఈయబడినప్పటికీ రాజ్యం,సమాజం ఈ రెంటి ప్రయోజనాలూ దెబ్బతిని కాలక్రమంలో ఈ సామ్యవాదం దానికదే కూలిపోయింది(సోవియట్ యూనియన్ పతనం).

ఈ విధంగా మానవ సమాజానికి ఒక చక్కని రాజకీయ,సామాజిక వ్యవస్థను అందించటానికి తలయెత్తిన ప్రయత్నాలన్నీ విఫలమైన ప్రపంచం ఈనాడు మన ఎట్ట ఎదుట ఉన్నది. ఈనాడు ప్రపంచానికి కావలసినది వ్యవస్థలోని మూడు అంగాల ప్రయోజనం సమంగా నెరవేరే వ్యవస్థ. దానిని ఏర్పరచటానికే మనం ఇప్పుడు కృషి చేయాలి.మానవ సమాజానికి ఒక చక్కని రాజకీయ,సామాజిక వ్యవస్థ నందించే సమస్య ఈ నాటికీ అపరిష్కృతంగానే ఉన్నది. దానినే మనం ఇప్పుడు పరిష్కరించాలి.

ఈ కార్యాన్ని ఏ పాశ్చాత్యులో కాదు భారతీయులు కూడా చేయవచ్చు.అసలు చేయవలసినది భారతీయులే.ఎందుకంటే ప్రపంచంలో సామర్థ్యమున్న జాతులన్నీ కూడా ఒకసారి ప్రయత్నించి విఫలమైపోయాయి.ఇక ఇప్పుడు అవి అంతకుమించి చేయగలిగినది ఏమీలేదు.తమకు తోచిన వ్యవస్థలనేవో అవి అందించివేశాయి.ఇక మిగిలినది భారతదేశం మాత్రమే.

పై మూడు ప్రయత్నాలు వాటి అంతిమ లక్ష్యంలో విఫలమైనా కూడా విజ్ఞాన శాస్త్రంతో కూడుకున్న నేటి అత్యాధునిక, స్వేచ్ఛాయుత ప్రపంచం మరియు ప్రపంచమంతటా దాదాపు ఒకే విధమైన జీవనవిధానంతో ఏకరూపత ఉన్న మానవ సమాజం ఏర్పడటానికి పై మూడు విఫల యత్నాలే కారణం. ఇటువంటి ఏకరూప సమాజానికి మనం ఇప్పుడు వ్యవస్థలోని అన్ని అంగాలూ సమంగా ప్రయోజనం పొందే వ్యవస్థను అందించాలి.

అటువంటి వ్యవస్థను మనం ఒక సూత్రీకరణ ద్వారా సాధించవచ్చు. అదేమంటే Truth is the Synthesis of Thesis, Antithesis and Analysis. పై మూడు వ్యవస్థలలో ఇస్లాం Thesis, కాపిటలిజం Antithesis, కమ్యూనిజం Analysis. ఈ మూడింటి Synthesis వలన వచ్చే వ్యవస్థే మనకు కావలసినది.( ఈ Synthesis ప్రక్రియ స్వరూపమెలా ఉంటుందనేది తరువాత వివరంగా తెలుసుకుందాం)

అంటే ఆ వ్యవస్థను మనం ఈ మూడు విఫలయత్నాలకు భిన్నంగా కొత్తగా సృజించవలసిన పనిలేదు. పై మూడు ప్రయత్నాల ద్వారానే సాధించుకోవచ్చు.ఈ విధంగా సాధించుకున్న వ్యవస్థలో ఇస్లాంలో వలే రాజ్యం యొక్క ప్రయోజనాలు,కాపిటలిజంలో వలే సమాజం యొక్క ప్రయోజనాలూ మరియూ కమ్యూనిజంలో వలే వ్యక్తి యొక్క ప్రయోజనాలూ ఈ విధంగా వ్యవస్థలోని మూడు అంగాల ప్రయోజనాలూ సమంగా నెరవేరతాయి.అటువంటి వ్యవస్థనే ఈ నాడు మనం భారతదేశంలో ఏర్పరచాలి.

ఈ వ్యవస్థ మానవ సామాజిక పరిణామపు అత్యున్నత దశ..పరిపూర్ణ దశ..అంతిమ దశ.

19 కామెంట్‌లు:

  1. మీరు ఏం చెప్పాలనుకుంటారో చాలా తికమకగా ఉంది. కమ్యూనిజాన్ని, కాపిటలిజాన్ని అటునిటు తిరగవేసినట్టుగా అనిపించింది

    రిప్లయితొలగించండి
  2. రవి గారూ! చాలా విస్తృతంగా చర్చించవలసిన విషయాన్నివ్యాసరూపంలోకి తీసుకు వచ్చే ఉద్దేశంతో బాగా కుదించి చెప్పాను. బహుశా మీ తికమకకు అదే కారణమై ఉంటుంది. ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం..ఈ మూడింటిలోని మంచిలక్షణాలతో ఒక దోష రహితమైన నూతన వ్యవస్థను ఏర్పరచాలనే విషయాన్నే నేను చెప్పినది.మీకు వీలైన పక్షంలో ఇదే బ్లాగులో ఫిబ్రవరి నెలలోని 'సత్యాన్వేషణ పథం' అనే టైటిల్ కలిగిన వ్యాసం చూడగలరు.ఆ వ్యాసంలోని విషయానికి వివరణే ఈ వ్యాసం.

    రిప్లయితొలగించండి
  3. సరస్వతీ కుమార్ గారు

    మన దేశం లో సాధారణ ఓటరుకి ఇలాంటి చర్చలు పట్టవు. పడితే, మన పరిస్థితి వేరే విధంగా ఉండేది. లోక్-సత్తా ప్రస్తుతం చర్చలూ.. సమాజపు తీరు తెన్నుల గురించి దీర్ఘ విశ్లేషణ లూ పక్కన పెట్టి, జన బాహుళ్యానికి ఒక మంచి చోయిస్ లా కనిపించేందుకు కృషి చెయ్యాలి. ''జే పీ'' అంటే ఎవరో తెలిసున్న చదువుకున్న వర్గానికి చెందిన వారికన్నా ఆయన ప్రామిసింగ్ గా కనిపించాలి. ఒకప్పుడు 'చంద్ర బాబు నాయుడు' పని చేసే ముఖ్యమంత్రి గా.. రాష్ట్రానికి ''సి ఈ వో'' గా హైపు కల్పించుకుని, ఆకస్మిక తనిఖీలూ, రైతు బజార్లూ, జన్మభూమి, శ్రమదానం లాంటి పధకాలతో జనాల్లోకి దూసుకు వెళ్ళారు. యువత లో ఒక ''ఆశ'' ను కలిగించారు.

    జే పీ ఇప్పుడు అలాంటి హైప్ ను సృష్టించుకొనైనా, యువత లోకి, జనం లోకీ దూసుకు వెళ్ళాలి. ఆయన చాలా కష్టపడాలి. ఇప్పటి రాజకీయాలు చూసి జనం 'ఎవరైతే, ఎంత మంచి వారైనా, అధికారం లోకి రాగానే, వారూ అవినీతిపరులుగా మారిపోతారు లే !' అని అనుకుంటున్నారు. కాబట్టీ ఆయన లోక్ సత్తా అధికారంలోకి వస్తె ఏమి చేస్తుందో.. జనానికి స్పష్టం చేసి.. తన నిజాయితీ ని నిరూపించుకోవాలి. యువత కి ఇపుడు ఒక Promising Leader కావాలి. లోక్ సత్తా ఆ స్థానం భర్తీ చేయగలదని మీరు జనాన్ని కన్విన్స్ చెయ్యగలిగితే.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి.

    రిప్లయితొలగించండి
  4. సరస్వతీ కుమార్ గారు
    మీ వ్యాసంలో(టపాలో) ప్రస్తుతమున్న కాపిటలిజం, కమ్యునిజం, ఎవరికీ అర్థం కాని భయపెట్టే ఇస్లామిజం, ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కువగా ఇష్టపడుతున్న ఆచరిస్తున్న ప్రజాస్వామ్యం ఏవి పనిచేయటంలేదు, పనికిరావు అంటూ కొత్త వ్యవస్తని సృస్టిచుకోవాలని మీరు చెప్పటం ఎలావుందంటే అలా ఉండాలని రావాలని కల కనటముకూడా కష్టంగా అనిపిస్తుంది. బహుశ వెబ్లో సెకండ్ లైఫ్ అనే వెబ్సైట్లో ఎవరికీ వారు సొంతంగా వూహాలోకాలు సృస్తించుకుని ఆనందపడుతున్నట్లుగా ఉంటుంది.
    భవిష్యత్తులో మీరన్న అద్భుత వ్యవస్తే వచ్చినా దానిలో లోపాలు బోలెడు వుంటాయి, అప్పుడూ ఆ వ్యవస్థా మారాలి అని కొత్త వ్యవస్త కోసం చర్చలు మొదలవుతాయి. అసలు ఏ వ్యవస్తలో అయిన ఆచరించే వ్యక్తులు నిజాయితీగా వుండాలి. ఉదా: ఇప్పుడు మన వ్యవస్తలో జిల్లా కల్లెక్టర్లు అందరు గొప్పగా పని చేయక పోయిన కూడా, ఒక జయప్రకాష్ నారాయణ (మీకు కోపం రాదని ఆశిస్తాను),రాజేంద్ర నరేంద్ర నిమ్జే (గడచిన ఆదివారం ఈనాడు పత్రిక చూడగలరు),ఇప్పటి అనంతపూర్ కలెక్టర్(క్షమించాలి పేరు గుర్తుకు రాలేదు ), బాల కార్మిక వ్యవస్త నిర్మూలనకి గాట్టిగా కృషి చేస్తున్న మన హైదరాబాద్ కలెక్టర్(అనిల్ అగర్వాల్ అనుకుంటున్నాను) మొదలగు వారు ఇప్పటి వ్యవస్తలోనే మంచి ఫలితాలు సాధించటము లేదా?
    ఇదే వ్యవస్తతోటే మన దేశం సాఫ్టువేరు,అంతరిక్ష,విద్య,ఫార్మా,ఆటోమొబైల్,వ్యాపార రంగాలలో మంచి ప్రగతి సాధించలేదా?
    మీరు తప్పు పట్టే రాజ్య వ్యవస్త మీద ఇంగ్లాండ్, థాయిలాండ్,జపాన్,భూటాన్,బ్రునే మొదలగు దేశాలలో ప్రజలు రాజులకి, రాణులకి ఎందుకు అంత గౌరవం ఇస్తారు? వారు ప్రజలతో,వ్యవస్తతో మమేకమయి మంచి చేస్తున్నారు కనుక!!!
    మీరు తప్పు పట్టే పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడి దారులయిన బిల్ గేట్స్,(తన ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలోని చాల దేశాలలో చిన్న పిల్లలకి వ్యాధి నిర్మూలనకి ఖర్చుపెడుతున్నది మీకు తెలుసు)వారెన్ బఫ్ఫేట్(తన ఆస్తిలో మూడు భాగాలు దానమిచ్చారు) కాని మన దేశములో అత్యంత సంపన్నులయిన ముఖేష్ అంబాని పూజలకి ఖర్చు చేస్తారు తప్పించి, ప్రజలకి,సమాజానికి ఖర్చు చేయరు.
    ఇంక చెప్పాలంటే మీరు ఎకసేక్కలాడే సినిమా నటులలో రజనీకాంత్ తన ఆస్తిలో 75% పేదలకి దానం చేశారు మరి.రెండు కోట్లు ప్రైమ్ మినిస్టర్ కి చెక్కు ఇచ్చింది మనకందరికీ తెలుసు. కాని చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేశు,రాఘవేంద్ర రావులు ఒక్క రూపాయి సమాజము కోసం పేద ప్రజల కోసం ఖర్చు పెట్టరు, దానమివ్వరు( వీరిలో కొందరు ఏమయినా ఇచ్చి వుంటే క్షమించాలి, ఉదాహరణకి వ్రాసాను!)
    ఉదాహరణలు ఇస్తూ వ్రాసు కుంటూ పొతే మీ బ్లాగు ని నేను హైజాక్ చేసినట్టు అవుతుంది.ఇంత పెద్ద సమాధానానికి కారణం వ్యవస్త కంటే ఆచరించే వ్యక్తుల మీద అదారపడి వ్యవస్త పనిచేస్తుంది అని చెప్పటం.

    మీరు ఆశిస్తున్నట్లే జయ ప్రకాష్ నారాయన్ గారు లోకసత్త ద్వారా ప్రజల సహకారంతో(ఒకే ఓట్లతో ) వ్యవస్త ని బాగు చేయాలని, మంచి పరిపాలనని అందిస్తానని,కనీసం ప్రయత్నిస్తానని చెప్పటం మీకు ఎందుకు కోపకారణం???

    మీరూహించే వ్యవస్త దేవతలు స్వర్గంలో కలకనేది?

    లోకసత్త వాళ్లు పాపం "ఎంత వెధవలు అయిన, నేరస్తులుయిన తమ సంతానాన్ని బాగు పరచాలని తాపత్రయపడి, కష్టపడే తల్లితండ్రులలాగా" ఆలోచించే వ్యవహారం.ప్చ్...

    మీరు చెప్పలనుకుంటున్నది,వూహిస్తున్న వ్యవస్త మన హైదరాబాద్ ట్రాఫిక్ లాగ మన హోమ్ మినిస్టర్ గారి ఉపన్యాసం లాగ వుంది అని చెప్పటానికి చింతిస్తూ...

    రిప్లయితొలగించండి
  5. సుజాత గారూ!
    మీ కామెంట్ను ఒకటికి రెండుసార్లు చదివిన తరువాత నాకు అర్థమైన దేమంటే 'జె.పి. ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నాడు కనుక అలా ఆకట్టుకోవడానికి నేను ఒక సిద్ధాంతాన్ని రూపొందించి లోక్‌సత్తాకు సజెస్ట్ చేస్తున్నాను ' అనే ఉద్దేశంలో మీరు ఉన్నారు. అదేగా మీ ఉద్దేశం.

    జె.పి. గురించి నా గత టపాలను చదివి వాటికి స్పందించిన మీకు నా గురించి ఇలాంటి భావన ఎలా కలిగినదో అర్థం కావటంలేదు.

    Radical Change లాంటి తీవ్రమైన భావాలు కలిగిన నేను జె.పి. లాంటి సంస్కరణ వాది తరఫున ఓటర్లను ఎలా కన్విన్స్ చేస్తాను.నేను ఓట్ల వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్నాననే విషయం నాతో విభేదించిన తోటి బ్లాగర్లందరికీ స్పష్టంగా తెలుసు.జె.పి. విషయంలో కొద్దో గొప్పో నాతో ఏకీభవించిన మీకు ఇంకా అర్థం కాక పోవటం ఆశ్చర్యంగా ఉంది.

    మరో విషయమేమంటే నేను వ్యాసంలో ఆ చర్చంతా చేసినది సాధారణ ఓటర్లకు(ప్రజలకు)అర్థం అవుతుందవుతుందని కాదులెండి.కొంచెం ప్రాధమిక పరిజ్ఞానం ఉన్న పై స్థాయి వారి కోసమే.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గారూ !
    'ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కువగా ఇష్టపడుతున్న ఆచరిస్తున్న ప్రజాస్వామ్యం'..ఇదీ.. కాపిటలిజం ఒకటే. రెండూ వేరు కాదు.

    'ఎవరికీ అర్థం కాని భయపెట్టే ఇస్లామిజం'..అర్థం చేసుకుంటే భయపెట్టదులెండి.

    మీరు కొందరు మంచివ్యక్తులను మరియు ఈ వ్యవస్థలోనే వారు సాధిస్తున్న సత్ఫలితాలను పేర్కొని వ్యవస్థ కన్నా వ్యక్తులే ప్రధానం అని అన్నారు. మరి ఒక మన్రో..ఒక కాటన్..ఒక బ్రౌన్ కూడా బ్రిటిష్ వారిలో ఉన్నారు. అలా అని మనం వారిని పారద్రోలకుండా ఉండలేదుకదా!

    మరి ఇంతటి మంచి వ్యక్తులున్న ఈ వ్యవస్థలో, అన్ని రంగాలలో ఎంతో ప్రగతి సాధిస్తున్న ఈ వ్యవస్థలో రైతులు ఆత్మహత్యలెలా చేసుకుంటున్నారు..? ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కలేక కుటుంబాలు సామూహిక ఆత్మహత్యల కెలా పాల్పడుతున్నాయి..? ఇందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరి ఇంకెందరు చావలేక బ్రతుకుతున్నారు..!?

    ఆర్థికాభివృద్ధి జరగగానే సరికాదు అది గ్రాస్‌రూట్ లెవెల్‌కి చేరాలంటున్నాను. మీరూ అదే అంటారు. ఐతే అది ఈ వ్యవస్థ ద్వారానే సాధించవచ్చని మీరంటారు. ఈ వ్యవస్థలో అది సాధ్యం కాదు..వ్యవస్థ మారాల్సిందే అని నేనంటాను. వ్యక్తులు ప్రధానం అని మీరంటారు. వ్యవస్థ ప్రధానం అని నేనంటాను.

    ఇప్పటి వ్యవస్థలోనే అన్నీ సాధ్యం అని అనుకుంటే,కేవలం వ్యక్తులు నిజాయితీగా ఉంటే చాలు అని అనుకున్నట్లైతే అసలు చరిత్రలో ఇన్ని రాజకీయ పరిణామాలు జరిగేవేనా..?! అసలు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేదేనా..?!

    ముఖేష్ అంబానీ కూడా పెట్టుబడిదారుడే. మరి బిల్ గేట్స్,వారన్ బఫెట్ లకు ఎగైనెష్ట్‌గా అతని పేరెందుకు పేర్కొన్నారు?...ఓహో..!భారతీయుడనా..!సరే ఐతే రజనీకాంత్‌కు ఎగైనెష్ట్‌గా మరలా సినీ నటులనే ఎందుకు పేర్కొన్నారు? ఇంతకీ మీరు సినీ నటులను సమర్థించినట్లా..?!లేక విమర్శించినట్లా..?! లేకపోతే రజనీకాంత్ తమిళుడనా(మరాఠీ వాడు కూడా)..?!చూడబోతే మీకు తన వారికన్నా పెరవారే ఇష్టం లాగుంది.

    రిప్లయితొలగించండి
  8. పైన చెప్పినవన్నీ నేను అంగీకరించేశా! ఎందుకంటే నేను "ప్రజాస్వామ్యాన్ని",కాకపోతే నాకు వ్యతిరేకంగా ఉండేవాటిని అమలుకానివ్వను ఎందుకటే నా భావజాలం ‘ఫ్యూడలిజానిది’. నాకు ఉపయోగపడే వాటిని మాత్రం దాచుకుని వాడుకుంటా,ఎందుకంటే అవి నాకు లాభాన్ని(క్యపిటలిజమ్) తెచ్చిపెడతాయి కాబట్టి.ఇక మాటవరసకు అందరూ సమానమంటాను (కమ్యూనిజం), కానీ నాలాంటి వారు మాత్రం ‘సమానం’ కన్నా కాస్త ఎక్కువని నమ్ముతాను.ఓటు పై నమ్మకం లేదు,ఎందుకంటే అవి ఖచ్చితంగా అమ్ముడవుతాయని తెలుసు గనక.

    ఇక మిగిలింది "సమాజాన్ని సమూలంగా మార్చే"(fundamental change)‘నక్సలిజం’. అదికూడా ఎప్పట్నుంచో చెట్లూ,పుట్టలూ పట్టుకు తిరుగుతోంది.

    ఇక మిగిలింది ఏమిటీ????

    రిప్లయితొలగించండి
  9. హమ్మో ‘జేపీ’ గురించి ఒక మాట కూడా చెప్పకుండా ముగిస్తే నాకు పంచమహా పాతకాలూ చుట్టుకోవూ!
    "మనిషి మంచోడూ,విషయమున్నోడూకూడా. కానీ ఈ రాజకీయాలు ఈయనకి అవసరమా" అని మా నాన్న మొన్న టీవీ చూస్తూ అనేశాడు. ఒక్క క్షణం నాకు బాధ అనిపించినా, మళ్ళీ మా నాన్న నడిగా "ఎందుకామాట అంటున్నారూ?". దానికాయన చెప్పిన సమాధానం విని నా మతి...స్థిమితమైంది.

    "ఇక్కడ మార్పెవడికి కావాలీ? ఇప్పుడున్న వ్యవస్థలోని లోటుపాట్లవల్లే అందరూ బతికిబట్ట కడుతోంది. అవకాశం లేనోడు మార్పు కావాలంటాడు,వాడికీ అవకాశం ఇస్తే అంతా ‘తానా తానా తందానే’" అని.చాలా భాధేస్తుంది. కాకపోతే ఇదే నిజమ్.జేపీ ఆదర్శాలూ జిందాబాద్, కానీ మా ఓటు మాత్రమ్ గెలవగలిగిన అవినీతి పార్టీలకే.

    రిప్లయితొలగించండి
  10. మహా ప్రభో మీరూహించిన కలల వ్యవస్థ వచ్చిన కూడా ఆత్మహత్యలు, హత్యలు,మానభంగాలు,దొంగతనాలు జరుగుతాయి. నేను చెప్పాలనుకున్నది మీకు నచ్చదని నాకు ఖచ్చితంగా తెలుసు. నేను అమెరికా కంటే ఎక్కువ అభివ్రుద్దిచెందిన కెనడా లోని టొరోంటో నగరములో అడుక్కునే వాళ్ళను చూసాను, హత్యలు చూసాను(ప్రత్యక్ష్యంగా కాదులెండి), వ్యభిచారినులని చూసాను. ఎక్కువగా మోసగాల్లని చూసాను(ఇందులో మన భారతీయులే ;-( ఎక్కువ).మరి అక్కడి ప్రభుత్వం ఉచిత విద్య,వైద్య, ఉపాధి అవకాశాలు ఎన్ని కల్పిస్తున్న ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయి.
    ఒక చేదు వాస్తవ మేమంటే పేదరికముతో ఇక్కడి (మన దేశం) కంటే బాగా అభివ్రుద్దిచెందిన అమెరికా,కెనడా,ఇంగ్లాండ్,స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో బ్రతకటం చాల కష్టం.

    నేను వ్యక్తులని గుడ్డిగా సమర్ధించటము లేదు. ఏ వ్యవస్త అయిన నిజాయీతీతోకూడిన సమర్డులయిన వ్యక్తులతో(నా వుద్దేశం నాయకులతో) చక్కగా నడవగలదు. తేడా ఆచరణ అని చెప్పానంతే.

    సరే చాల ఘాటుగా చర్చించే ముందు చిన్న కథ. ఒక ఊరి బయట ఉన్న కప్పని చాల మంది తొక్కుతూ,ఏడిపిస్తూ వుంటే అది చాల భాద పడుతూ వుంటే ఇదంతా గమనించిన ఒక పూజారి కప్పతో రేపు ఈ దారిలో శ్రీరామచంద్రులవారు వస్తున్నారు, ఆయనతో చెప్పుకో నీ సమస్యలన్నీ తీరుతాయని అని చెప్పాడంట. పాపం ఆ కప్ప చాల ఓపిగ్గా ఎదురుచూస్తూ వుంటే కాసేపటికి ఎవరో తనని తొక్కుకుంటూ వెళ్ళేసరికి బాధతో తిరిగీ చూస్తే శ్రీరామచంద్రుదంట. ఇక ఎవరికీ చెప్పుకోవాలి తన సమస్య. కథ చెప్పటంలో నా వుద్దేశం మీకు అర్థం అయ్యిందనుకుంటాను.

    వ్యవస్త,సమాజం,ప్రజలు స్తూలంగా వేరు కావనుకుంటున్నాను.వూహించి అందంగా పుస్తకాలలో వ్రాసేదానికి(బ్లాగులలో కూడా),ఆచరణకి ఎప్పుడయినా చాల వ్యత్యాసముంటుంది.

    మీరన్నట్టే "ఒక మన్రో..ఒక కాటన్..ఒక బ్రౌన్ కూడా బ్రిటిష్ వారిలో ఉన్నారు. అలా అని మనం వారిని పారద్రోలకుండా ఉండలేదుకదా!"

    మనం వ్యక్తులనికాదు మొత్తం బ్రిటిష్ రాజరికపు వ్యవస్తని(వ్యవస్త అంటే ఏమిటి వ్యక్తులేకదా!!!) పారద్రోలాం. కాని అందులో మన గోదావరి జిల్లాల సాగునీటి సమస్యని పారద్రోలిన, మనకు తెలుగు వ్యాకరణం, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ని తాయారు చేయించిన బ్రౌన్ కి విగ్రహం పెట్టి, స్టాంప్ విడుదల చేసి ఎందుకు గౌరవించాం,అల్బనియా దేశములో పుట్టిన మదర్ తెరిస్సా గారికి ఎందుకు భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించాం. మొన్న పేపర్లలో చూసి వుంటారు ఇంగ్లాండ్ దేశం ఎక్కువ పౌరసత్వాలు ఇచ్చింది భారతీయులకి అని.ఎందుకు?!

    నేను సినిమా వాళ్ళకి వ్యతిరేకం కాదు మాస్టారు. నేను అదే పరిశ్రమలో పనిచేస్తున్నాను. ఒక పరాయి వ్యక్తిని మెచ్చుకుంటే మన వాళ్ళని కిన్చపరచుకున్నట్టు కాదు. నవ్వడానికి నేను చార్లీ చాప్లిన్,రాజేంద్ర ప్రసాద్ ఇద్దరి సినిమాలు చూస్తాను. చాప్లిన్ సినిమాని మనలని పరిపాలించిన దేశానికి చెందిన ఇంగ్లీష్ వాడిది అని మూతిబిగదీసుకు కూర్చేలేముకదా!

    ఇక మన దేశ సమస్య ఎక్కువ జనాభా :(
    తెలుగులో ఒక మంచి సామెత ఉంది ... మందెక్కువవుతే మజ్జిగ పలుచన అని.

    మీరొక ఆదర్శవంతమయిన కలల వ్యవస్త ఇలావుండాలి శ్రమిద్దాం అంటే ఏమో మీవెంట కూడా బోల్డుమంది రావచ్చేమో.
    ఆల్ ది బెస్ట్.
    PS:క్షమించాలి! ఎక్కువ స్పేస్ తీసికున్నందుకు. నెక్స్ట్ కామెంట్ వెరీ బ్రీఫ్.
    ప్రామీస్ :)

    రిప్లయితొలగించండి
  11. మహేష్ కుమార్ గారూ!
    వ్యాసంలోని నా భావాన్ని మీరు సరిగానే అర్థం చేసుకున్నారు.కాకపోతే వ్యంగ్య ధోరణిలో చెప్పారు.

    'ఇక మిగిలినది ఏమిటి ' అని నాలుగు ప్రశ్నార్థకాలుంచారు. మూడు వ్యవస్థలను కలగలపాలనే విషయాన్ని మీరు అంగీకరించేశారుగా..ఇంకా ఈ ప్రశ్న మీకెలా ఉదయించింది?!

    'మార్పు కోరేవారంతా అవకాశంలేకే' అనే మీ ఉద్దేశాన్ని మీరు మరోసారి ఆలోచించుకోండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గారూ!
    ముందుగా మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు.ఇక విషయానికి వద్దాం. కెనడాలో నేనూహించిన కలల వ్యవస్థ లేదుకదా..అందుకే ఆ దేశం అమెరికా కన్నా ఎక్కువ అభివృద్ధి చెందినా కూడా అవన్నీ జరుగుతున్నాయేమో..!!

    వ్యక్తుల నిజాయితీ కన్నా వ్యవస్థ నిర్మాణం అత్యంత ప్రభావ శీలమైనది. ఈ విషయాన్ని శతాబ్దాల క్రితమే ప్రజలు గుర్తించారు. కనుకనే వ్యవస్థ మార్పుకొరకు అన్ని పోరాటాలు జరిగాయి. ఈ విషయాన్ని మీరే ఇంకా గుర్తించలేదు. గుర్తిస్తే కప్ప కథ చెప్పేవారు కాదు.

    వ్యవస్థ,సమాజం, ప్రజలు ఇలా అన్నీ ఒకటే అనే మీ అద్వైత ధోరణి పొరపాటు. రాజనీతి శాస్త్రం ఒక క్రమపద్ధతిలో వీటన్నింటినీ అధ్యయనం చేయబట్టే రాజకీయంగా ఇప్పటివరకు జరిగిన పురోగతి వీలు పడింది.ఇక ముందు జరగవలసిన పురోగతికి కూడా ఈ అధ్యయనం అవసరం. మీకేమో అది కేవలం పుస్తకంగానే కనిపిస్తున్నది.

    మీరు సూచించిన మంచివ్యక్తులకు కూడా విగ్రహం పెట్టి,స్టాంపు విడుదల చేసి గౌరవిద్దాం.ఇంకా గొప్ప వారెవరైనా ఉంటే భారతరత్న పురస్కారం కూడా ఇద్దాం.

    'మానవ వనరులే ఈ దేశాభివృద్ధికి ఆయువుపట్టు ' అని అందరూ భావిస్తున్న నేటి పరిస్థితులలో 'మనదేశ సమస్య అధిక జనభా 'అనటం పాత భావన.

    నేనెవ్వరికీ పిలుపునివ్వటం లేదు.కేవలం నా అభిప్రాయాలను తోటి బ్లాగర్లతో పంచుకుంటున్నాను.

    కామెంట్ కొరకు మీరు ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నందుకు నాకేమీ అభ్యంతరం లేదు.మీరు నెక్స్ట్ కామెంట్కు కూడా ఎక్కువ స్పేస్ తీసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  13. సరస్వతీ కుమార్‌గారికి మరియు వ్యాఖ్యాతలకు: మనం చర్చించే విషయంలో స్పష్టంగా ఉందాం. జె.పి.గారి గురించి మాట్లాడటం, సంస్కరణ వాదం యొక్క తప్పొప్పులు మాట్లాడటటం ఈ వ్యాస పరిధిలోకి రావు. ఇక్కడ సరస్వతీ కుమర్‌గారు చర్చిస్తున్నది ప్రతిపాదిత నూతన వ్యవస్థగురించి మాత్రమే.

    అలాగే చిన్న ప్రశ్న/సమాధానం:

    ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దటానికి కుమార్‌గారు ప్రతిపాదించిన వ్యవస్థ మాత్రమే ప్రత్యామ్నాయమా?

    కాకపోవచ్చు. వేరే ప్రత్యామ్నాయాలు ఉండవచ్చు. లేవని మనం నిరూపించనంతవరకు "ఇదొక్కటే ప్రత్యామ్నాయం" అనగలిగే అధికారం మనకు లేదు. ఉదాహరణకి సంస్కరణ వాదం...ఇది విఫలమవుతుంది అని మనం నిరూపించటంలేదు, ఆరోపించటం తప్ప. సో...ముందు చెప్పినట్లు ఆ విషయంపై వాదించటం ఈ వ్యాస పరిధిలోకి రాదు.

    మరి ఈ విషయంలోకి వస్తే, కుమార్‌గారు ఈ టపా ద్వారా ప్రస్తుతానికి తన అలోచనలని పరిచయం చేసారు. వివరాలు మున్ముందు అందిస్తారని ఆశిస్తున్నాను. పరిచయం మీద వ్యాఖ్యానించగలనని నేననుకోవటం లేదు. అది భావ్యం కాదు కూడా.

    రిప్లయితొలగించండి
  14. సరస్వతీ కుమార్‌గారికి
    మీరు మరింత వివరంగా మీరూహించే వ్యవస్త గురించి వ్రాసినప్పుడు స్పందిస్తాను.
    మీ స్పందనకి కృతజ్ఞతలతో...

    రిప్లయితొలగించండి
  15. శివ గారూ!
    మీరు కామెంట్ చేయకపోయినా ఈ వ్యాసాన్ని చదివి చర్చను గమనిస్తూ ఉండి ఉంటారనే నా ఊహ తప్పు కాలేదు.

    'గడ్డిపూలు 'సుజాత గారిని 'మానస వీణ ' సుజాతగారిగా నేను పొరపడ్డాను. వ్యాసాన్ని నేను జె.పి.గారి తరఫున ఓటర్ల కొరకు రాశానని ఆవిడ పొరబడ్డారు. దానితో జె.పి.గారి ప్రస్తావన తేక తప్పలేదు.

    ఈ వ్యాసంలో నేను చెప్పవలసినదంతా సంగ్రహంగా చెప్పివేసాను. ఇక ఎంత రాసినా దాని వివరణే అవుతుంది. దానిని కూడా త్వరలోనే అందిస్తాను. వ్రాతప్రతి సిద్ధంగానే ఉన్నది.

    ఈ వ్యాసాన్ని నేను హెడ్డాఫీసుకు కాంప్ వెళ్ళినపుడు అక్కడ ఉన్న నెట్ సౌకర్యం ద్వారా రాసాను. కామెంట్స్ కు సమాధానాలను కాంప్ నుండి తిరిగివచ్చి నెట్ సెంటర్ ద్వారా ఇస్తున్నాను. నా PC ఇంకా బాగవలేదు.అది సరి అవగానే నా వ్యాసాలను కొనసాగిస్తాను.

    మీ కామెంట్ నాక్కొంత ప్రోత్సాహాన్నిచ్చింది. కృతజ్ఞతలు.

    శ్రీ గారూ!
    ఈ వ్యాసంలో సంగ్రహంగా చెప్పిన విషయాన్ని తప్పకుండా సమగ్రంగా వివరిస్తాను.

    రిప్లయితొలగించండి
  16. Hi....
    Mee blog chalabagundandi.Meeku Telusa
    www.hyperwebenable.com site manalati bloggers ki free ga websites isthunnaru.
    ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
    www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

    రిప్లయితొలగించండి
  17. సింధు గారూ!
    మీ కామెంట్‌ను చూడటం లేటైనది.అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.మీ ప్రసంశకు ధన్యవాదాలు.మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు.అది నాకు ఉపయోగకరంగా ఉండగలదని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  18. సరస్వతీ కుమార్‌గారికి మరియు ఈతరులకు నా అబినధనలు.ఈ చర్చ చాలా ప్రయొజనకరం గా ఉంది. సరస్వతీ కుమార్‌గారి చెపిన దాంట్లొ నిజం ఉంది. మార్టిన్ లూదర్ కింగ్ మాటలొ చెపాలంటె ప్రజాస్వామం మనిషి సంగ జీవి అని గుర్థించతం లొ విపలం ఆయింది .కమునిజం మనిషి స్వతంత జీవి అని గుర్థించతం లొ విపలం ఆయింది. ఈపుదు మనకు ఒక కొత వ్యవస్త అవసరం ఉంది. అది మనిషి అన్ని రకల అవసరలని గుర్థిచెది గా మనిషిని సమజ అబివ్రుదిలొ బాగస్వామిని చెసెదిగ చివరికి నాయకులు చెడవారినా ప్రజల మిద విలయినత తకువ ప్రబవం ఉందెలా ఉందలి. యందుకంటె ఎ ధేశాని పరిపలెంచె నయకులెన మంచి వారికంటె చెదవరె ఎకువని మనకి చరిత్ర చెబుథుంది

    రిప్లయితొలగించండి
  19. రాజేష్ గారూ!

    మీ అభినందనలకు ధన్యవాదాలు. మీరు నాతో ఏకీభవించినందుకు కృతజ్ఞతలు. మార్టిన్ లూథర్ కింగ్ అన్న మాటలను మీరు చాలా సందర్భోచితంగా పేర్కొన్నారు.

    రిప్లయితొలగించండి