29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 17 వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం 17  

కౄరత్వం మరియు దయాగుణం గురించి;
 ప్రేమించబడటం, భయపెట్టడం – రెంటిలో ఏది ఉత్తమం






(Unedited)

ఇప్పుడు పైన తెలిపిన గుణగణాలలో మిగతావాటికి వస్తూ నేనేం చెబుతానంటే ప్రతి ఒక రాజు తను కౄరుడుగా కాక దయార్ద్ర హృదయుడుగా భావించబడేటట్లు కోరుకోవాలి. అయినప్పటికీ అతడు తన దయాగుణాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. సీజర్ బోర్గియా కౄరుడుగా ముద్రపడినవాడు. అయినప్పటికీ అతని కౄరత్వమే రొమాగ్నాను తిరిగి సాధించి, దానిని సమైక్యపరచి, దానిలో శాంతిని, విధేయతను పునరుద్ధరించింది. ఈ విషయాన్ని సరిగా ఆలోచించినట్లైతే, కౄరులుగా పేరుపొందకుండా ఉండటానికి పిస్తోయియా వినాశనాన్ని అనుమతించిన ఫ్లోరెన్స్ ప్రజల కన్నా ఇతడు ఎక్కువ దయార్ద్రహృదయుడుగా కనిపిస్తాడు. కనుక ఒక రాజు తన అనుచరులను (subjects) సమైక్యతతోనూ, విధేయతతోనూ ఉంచినంతవరకు ‘కౄరుడు’ అనే నింద గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే మితిమీరిన దయద్వారా –దోపిడీలు, హత్యలు జరిగేవిధంగా– కల్లోలం చెలరేగటానికి అవకాశాన్నిచ్చే వారికంటే, హెచ్చరిక కోసం చేసే కొద్ది చర్యలతో ఇతడు ఎక్కువ దయను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే అవి మొత్తం దేశాన్ని బాధిస్తే,  రాజు అమలు చేసే ఈ మరణశిక్షలు కొద్దిమంది వ్యక్తులనే బాధిస్తాయి.

కొత్త రాజ్యాలు ప్రమాదాల మయంగా ఉంటాయి కనుక రాజులందరిలోకెల్లా ఒక కొత్తరాజుకు కౄరత్వపు నిందకు గురికాకుండా ఉండటం అసాధ్యం. కనుకనే వర్జిల్ డిడో నోటి ద్వారా ఇలా చెబుతూ, ఆమె పరిపాలన కొత్తదన్న కారణంగా ఆ పరిపాలన యొక్క అమానవీయతను సమర్ధించాడు:

(వర్జిల్: ప్రాచీన రోమన్ కవి ;  డిడో: వర్జిల్ కావ్యం Aeneid లోని ఒక పాత్ర ,కార్తేజ్ రాణి)

“దయలేని విధి, నా పరిపాలనలోని కొత్తదనం
ఒక విశాల భూభాగాన్ని కాపాడటానికి ఆ విధంగా వత్తిడి చేశాయి”

అయినప్పటికీ అతడు విశ్వసించడంలో, పనిచేయడంలో నెమ్మదిగా ఉండాలి. భయాన్ని తానే ముందుగా వెల్లడిచేయకూడదు: అతి విశ్వాసం వలన అజాగ్రత్తపరుడవని విధంగా, అలానే అతిగా ఉండే అపనమ్మకం వలన భరించలేని వ్యక్తిగా మారని విధంగా తగుమాత్రపు రీతిలో యోచనతో, మానవత్వంతో ముందడుగు వేయాలి.

ఇక్కడ ఒక ప్రశ్న తలయెత్తుతుంది:

భయం కన్నా ప్రేమను కలుగజేయటం ఉత్తమమా? లేక ప్రేమ కన్నా భయం కలుగజేయడం ఉత్తమమా? ‘ఎవరైనా సరే రెంటినీ కలుగజేసే విధంగా ఉండాలని కోరుకోవాలి’ ఆనేది దీనికి సమాధానం అయి ఉండవచ్చు. ఐతే ఒకే మనిషిలో రెంటినీ కలిపి ఉంచటం అనేది కష్టం కనుక ఈ రెంటిలో ఏదో ఒకదానిని వదులుకోక తప్పనప్పుడు, ప్రేమను కలుగ జేయడం కన్నా భయాన్ని కలుగజేయడమే చాలా సురక్షితం. ఎందుకంటే మనుషుల గురించి సాధారణంగా ఇలా చెప్పబడుతుంది. వారు కృతజ్ఞతలేని వారు చంచలురు, మోసగాళ్ళు, పిరికివారు, దురాశాపరులు. అంతేకాక నీవు వారికి మేలు చేకూర్చే స్థితిలో ఉన్నంతకాలం వారు మొత్తంగా నీకే అంకితమై ఉంటారు. ముందుచెప్పినట్లుగా వారు వారి రక్తాన్ని, సంపదను, జీవితాన్ని, వారి సంతానాన్ని కూడా –నిజంగా ఇచ్చే అవసరం రానంతకాలం—నీకు ఇవ్వజూపుతారు. అయితే ఆ అవసరం రాగానే వారు నీకు వ్యతిరేకంగా మారిపోతారు. పూర్తిగా వారి మాటల మీదే ఆధారపడి, మిగతా జాగ్రత్తలన్నింటినీ నిర్లక్ష్యం చేసిన రాజు వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే నడవడికలోని గొప్పదనం మరియు ఉదాత్తతలద్వారా కాకుండా ధనం చెల్లించి పొందిన స్నేహాలు, –నిజానికి అవి మనకు ప్రతిఫలం ఇవ్వవలసి ఉన్నాకూడా– సురక్షితమైనవి కావు, అవసరమైన సమయంలో ఆధారపడదగినవి కావు. అంతేకాక మనుషులు భయాన్ని కలుగజేసే వ్యక్తికన్నా ప్రేమను కలుగజేసే వ్యక్తికి ఆగ్రహం తెప్పించడంలో తక్కువ జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే ప్రేమ అనేది విధాయకత (obligation) అనే బంధనం ద్వారా నిలిపి ఉంచబడటంతో మనుషుల యొక్క అల్పత్వం మూలంగా, వారి స్వప్రయోజనాల కొరకు ఆ బంధనం అవసరమైనప్పుడల్లా తెంపివేయబడుతుంది. ఐతే భయం అనేది శిక్షాభీతి ద్వారా బంధింపబడి ఉంటుంది. అది ఎన్నడూ తెగిపోదు.

అయినప్పటికీ ఒక రాజు ఏ విధంగా భయాన్ని కలుగజేయవలెనంటే, ఒక వేళ అతడు ప్రేమను పొందలేని పక్షంలో, కనీసం ద్వేషానికి గురికాకుండా అయినా ఉండాలి. తన పౌరుల, అనుచరుల ఆస్తుల నుండి మరియు వారి స్త్రీలనుండి దూరంగా ఉన్నంతకాలం ద్వేషానికి గురికాకుండా భయాన్ని కలుగజేయటంలో అతడు చక్కగా కృతకృత్యుడవుతాడు. ఎవరికైనా మరణ శిక్ష వేయవలసిన అవసరం అతడికి కలిగినప్పుడు, ఆ పనికి స్పష్టమైన కారణం ఉన్నపుడు మాత్రమే, అలానే అది న్యాయసమ్మతంగా ఉన్నపుడు మాత్రమే దానిని చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పరుల సంపదకు అతడు దూరంగా ఉండాలి. ఎందుకంటే మనుషులు తండ్రి మరణాన్ని త్వరగా మరచిపోతారేమోగానీ తండ్రి ఇచ్చిన ఆస్తిని కోల్పోతే మాత్రం దానిని అంత త్వరగా మర్చిపోలేరు. అంతేకాక ఆస్తులు జప్తు చేయడానికి చూపించే సాకులకు ఎప్పుడూ కొదవ ఉండదు. కొల్లగొట్టడం ద్వారా బతకటం ఒకసారి ప్రారంభించిన వాడు ఇతరులకు చెందిన దానిని స్వాధీనం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సాకులు వెదకుతూనే ఉంటాడు. ఐతే ఇందుకు విరుద్ధంగా ప్రాణాలను హరించడానికి కారణాలను వెదకడం కష్టమేకాక అవి త్వరగా మరుగునపడిపోతాయి. ఐతే ఒక రాజు తన సైన్యంతో ఉన్నపుడు, తన నియంత్రణలో అనేకమంది సైనికులు ఉన్నపుడు, కౄరత్వపు నిందను లెక్కచేయకపోవడం అతనికి ఎంతో అవసరం. ఎందుకంటే అటువంటి నింద మోయకుండా తన సైన్యాన్ని అతడు ఎప్పుడూ సమైక్యంగా ఉంచలేడు. అలాగే అది తన కర్తవ్యానికి కట్టుబడేటట్లు కూడా చేయలేడు.

హన్నిబాల్ చేసిన అద్భుత కార్యాలలో ఇది గణింపదగినది: వివిధ రకాల జాతులకు చెందిన మనుషులతో కూడుకున్న మరియు యుద్ధంకొరకు విదేశాలకు కొనిపోబడిన అతి పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నా కూడా —అతడి మంచి రోజులలోగానీ, చెడ్డరోజులలోగానీ— వారిలోవారికిగానీ లేక వారికి రాజుతోగానీ వివాదాలేమీ తలయెత్తలేదు. దీనికి కారణం అతడి అమానవీయ కౄరత్వం తప్ప మరేమీకాదు. ఆ కౄరత్వం అతడి అంతులేని శౌర్యపరాక్రమాలతో కలసి తన సైనికుల దృష్టిలో అతడిని గౌరవనీయంగానూ, అదేసమయంలో అమితమైన భీతిని కలుగజేసేవిధంగానూ చేసింది. అయితే ఆ కౄరత్వం లేకుండా అతడి ఇతర సుగుణాలు ఈ ప్రభావాన్ని కలుగజేయడానికి సరిపోయి ఉండేవికావు. అయితే హ్రస్వ దృష్టి కలిగిన రచయితలు ఒక దృక్కోణం నుండి  అతడి చేతలను అభినందిస్తూ మరో దృక్కోణం నుండి ఆ చేతల యొక్క ప్రధాన కారణాన్ని ఖండిస్తుంటారు. ‘అతడి ఇతర సుగుణాలు అతడికి చాలి ఉండేవి కావు అనేది నిజం’ అన్న విషయాన్ని సిపియో దృష్టాంతం ద్వారా నిరూపించవచ్చు. సిపియో తన కాలంలో మాత్రమే కాక మనిషి యొక్క జ్ఞాపకపుపరిధిలోనే చాలా గొప్ప వ్యక్తి. అయినప్పటికీ అటువంటి వ్యక్తిమీద స్పెయిన్‌లో అతడి సైన్యం తిరుగు బాటు చేసింది. దీనికి కారణం అతడి మితిమీరిన సహనశీలత తప్ప మరోటికాదు. ఆ సహనశీలతే అతడి సైనికులకు సైనిక క్రమశిక్షణ అనుమతించనంతటి ఎక్కువగా స్వేచ్ఛనిచ్చింది. ఈ కారణం చేతనే అతడిని సెనేట్‌లో –రోమన్ సైన్యాన్ని చెడగొట్టిన వాడిగా పేర్కొంటూ–  ఫాబియస్ మాగ్జిమస్ నిందించాడు. సిపియో క్రింది అధికారి ఒకరు లోక్రియన్‌ను విధ్వంసానికి గురిచేసినపుడు (*) వారిమీద ఇతడు ప్రతీకారం తీర్చుకోలేదు. అలాగే తన క్రింది అధికారి దుశ్చర్యనూ శిక్షించలేదు. దీనికి కారణం కేవలం ఇతడి మెతక వైఖరే, కేవలం అన్నింటినీ తేలికగా తీసుకునే స్వభావమే. ఎంత అంటే సెనేట్‌లో  ఒకానొకరు ఇతడిని మన్నించదలచి (wishing to excuse him) ‘ఇతరుల యొక్క తప్పులను సరిదిద్దడం కన్నా తాము తప్పు చేయకుండా ఎలా ఉండాలో బాగా తెలిసిన వారు అనేక మంది ఉన్నారు’ అని అన్నాడు. సిపియో సైన్యాధికారిగానే కొనసాగినట్లైతే ఈ విధమైన వైఖరి అతడి యొక్క పేరు ప్రతిష్ఠలను అప్పుడే నాశనం చేసి ఉండేది. అయితే అతడు సెనేట్ నియంత్రణలోకి రావడంతో హానికరమైన ఈ లక్షణం మరుగునబడటమేకాక అతడి పేరుప్రఖ్యాతులకు కూడా కారణమయ్యింది.

*(సిపియో క్రింది అధికారి అయిన Quintus Pleminius తన ఆధీనంలో ఉన్న లోక్రిస్‌లో లూటీలకు పాల్పడినపుడు ఆ ప్రాంతీయులు ఎదురు తిరగడంతో ప్రారంభమైన అల్లర్లు చాలా విధ్వసానికి దారితీసాయి)

భయాన్ని కలుగ జేయాలా లేక ప్రేమను కలుగ జేయాలా అనే ప్రశ్నకు తిరిగి వస్తూ చివరిగా నేను చెప్పేదేమిటంటే మనుషులు ప్రేమించటం అనేది తమ ఇష్టానుసారం చేస్తారు. భయపడటం అనేది రాజు యొక్క ఇష్టానుసారం చేస్తారు. కనుక వివేకవంతుడైన రాజు ఇతరుల నియంత్రణలో ఉండేదానిమీదకాక తన నియంత్రణలో ఉండేదానిమీద ఆధారపడాలి.


(రాజును ప్రజలు ప్రేమించడం అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. కానీ రాజును చూసి ప్రజలు భయపడటం అనేది రాజు మీద ఆధారపడి ఉన్నది.) నేను చెప్పినట్లుగా అతడు ద్వేషానికి గురికాకుండామాత్రం శాయశక్తులా ప్రయత్నించాలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి