29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 20 వ అధ్యాయం
(Unedited)

రాజు-రాజ్యం

అధ్యాయం 20:  కోటలు కట్టడం – ఇంకా రాజులు తరచుగా (చేపట్టే చర్యలు) ఆధారపడే కొన్ని ఇతర విషయాలు ప్రయోజనకరమా లేక హానికరమా ?Chapter XX: Are Fortresses, and Many other Things to which Princes often Resort, Advantageous or Hurtful?1. కొందరు రాజులు తమ రాజ్యాన్ని సురక్షితంగా నిలుపుకోడానికి తమ సామంతులకు (తాము జయించిన రాజులకు) సైన్యంలేకుండా చేశారు. మరి కొందరు తాము స్వాధీనం చేసుకున్న పట్టణాలు వివిధ ముఠాలుగా విడిపోయి గందరగోళంలో ఉండేటట్లు చేశారు. మరికొందరు శతృత్వాలను పెంచుకున్నారు. కొందరు తమ పరిపాలన యొక్క ప్రారంభంలో అనుమానితులుగా ఉన్న వారి మద్దతు పొందటానికి ప్రయత్నించారు. కొందరు కోటలు నిర్మించారు, మరికొందరు ఉన్న వాటిని పడగొట్టి, ధ్వంసం చేశారు. ఈ చర్యలన్నింటిలో దేని గురించైనా —అది ఏ రాజ్యంలో అమలు అవుతుందో ఆ రాజ్యం యొక్క ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా— ఎవరూ ఖచ్చితమైన అభిప్రాయం వెలిబుచ్చలేరు; అయినప్పటికీ నేను ఈ విషయం అనుమతించినంతమేర సమగ్రంగా మాట్లాడతాను.


2. ఒక కొత్త రాజు తన అనుచరులను (సామంతులను) సైన్యం లేకుండా (సైన్యరహితులుగా, నిరాయుధులను) చేయడం అనేది ఇంతవరకూ జరగలేదు. అందుకు భిన్నంగా వారు సైన్యం లేకుండా (సైన్యరహితులుగా, నిరాయుధులై) ఉన్నారని గమనించిన ప్రతీసారీ వారిని సైన్యసహితులుగా (సైన్యాన్ని సమకూర్చాడు, సాయుధులుగా) మార్చాడు. ఎందుకంటే ఆవిధంగా ఇవ్వబడిన సైన్యం (ఆయుధాలు) నీ సైన్యం అవుతుంది (ఆయుధాలవుతాయి,) నీవు అనుమానించినవారు విశ్వాసపాత్రులుగా మారతారు, ముందే విశ్వాసపాత్రులుగా ఉన్నవారు అలాగే కొనసాగుతారు, నీ అనుచరులు కాస్తా నీకు బలమైన మద్దతుదారులుగా మారతారు. నీ అనుచరులనందరినీ సైన్యాన్ని సమకూర్చలేకపోయినప్పటికీ (సాయుధులను చేయలేకపోయినప్పటికీ), నీవు సైన్యాన్ని సమకూర్చినవారికి (సాయుధులను చేసినవారికి) లబ్దిని చేకూర్చినట్లైతే మిగిలిన వారిని సులువుగా నియంత్రించగలవు. నీవు సైన్యాన్ని సమకూర్చినవారు (సాయుధులను చేసినవారు) తమకివ్వబడుతున్న ప్రత్యేక గౌరవాన్ని గమనించినమీదట, వారు నీకు కృతజ్ఞతాబద్దులౌతారు, మిగిలినవారు –అధిక ప్రమాదాన్ని ఎదుర్కొనేవారు, అధిక బరువు బాధ్యతలను మోసేవారు అధిక పురస్కారాన్ని పొందవలసిన అవసరం ఉన్నది– అని భావిస్తూ నిన్ను మన్నిస్తారు. అయితే వారిని నీవు సైన్యం లేకుండా (నిరాయుధులను) చేయటం వలన (చేస్తేమాత్రం) వెంటనే వారిలో ఆగ్రహాన్ని కలిగిస్తావు. వారి ధైర్యాన్ని సందేహించి గానీ లేక వారి రాజభక్తిని సందేహించి గానీ నీ అనుచరులను నీవు విశ్వసించడం లేదన్న విషయాన్ని నీవు బయటపెట్టావు కనుక –ఈ రెంటిలో ఎలా భావించినా కూడా– అది వారిలో నీ యెడల ద్వేషానికి కారణమవుతుంది. అంతేకాక సైన్యలేకుండా నీవు కొనసాగలేవు కనుక నీవు తప్పనిసరిగా కిరాయి సైన్యం మీద ఆధారపడవలసి వస్తుంది. వాటి లక్షణమేమిటో నేను ముందే తెలిపాను. ఒకవేళ అవి మంచివైనా కూడా బలవంతులైన శత్రువులనుండి, నమ్మలేని అనుచరులనుండి నిన్ను కాపాడటానికి అవి సరిపోవు. ఈ కారణంగా, నేను ముందే చెప్పినట్లుగా, ఒక కొత్తరాజు తాను కొత్తగా సంపాదించిన రాజ్యానికి సైన్యాన్ని సమకూర్చుతాడు. దీనికి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు.  అయితే ఒక రాజు తాను సంపాదించిన కొత్త రాజ్యాన్ని ఓ ప్రాంతంగా తన పాత రాజ్యంలో కలుపుకున్నపుడు మాత్రం దానిని సంపాదించడంలో తనకు మద్దతుగా నిలచిన వారిని మినహాయించి ఆ రాజ్యంలోని మిగతా అందరికీ సైన్యంలేకుండా చేయడం ఆవశ్యకం. అవకాశం చూసుకొని వారిని సైతం బలహీనులుగా, నిర్వీర్యులుగా మార్చివేయాలి. ఆవిధంగా రాజ్యంలోని సైన్యమంతా నీ పాత రాజ్యానికి చెందిన నీ స్వంత సైనికులుగా ఉండేటట్లుగా వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి.


3. మన పూర్వీకులు, –వారిలో వివేకవంతులుగా పరిగణింపబడినవారు సైతం–, పియోస్టియాను ముఠాకక్షల ద్వారానూ, పీసాను కోటల ద్వారాను నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నది అని తరచూ అనేవారు. ఈ అభిప్రాయంతో వారు తమ సామంత పట్టణాలు కొన్నింటిని మరింత సులువుగా నిలుపుకోవడానికి వాటిలో ఘర్షణలను ప్రోత్సహించేవారు.  ఇటలీలోని వివిధ బలాల మధ్యన కొంతమేర సమతుల్యత ఉండే ఆ రోజులలో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. అయితే నేడు దీనిని ఒక ఆచరణాత్మక విధానంగా అంగీకరించవచ్చని నాకు అనిపించడంలేదు. ఎందుకంటే ఆవిధంగా ఏర్పడిన ముఠాల వలన ఎప్పుడైనా మంచి జరుగుతుందని నేను విశ్వసించడంలేదు. పైగా ఆ విధంగా విడిపోయిన నగరాల పైకి బయటి శత్రువు దండెత్తినపుడు అవి వెనువెంటనే చేజారిపోవడం తథ్యం. ఎందుకంటే వాటిలో బలహీనమైన ముఠా ఎల్లప్పుడూ బయటి శత్రువుతో చేతులు కలుపుతుంది, రెండవ ముఠా ఒంటరిగా ప్రతిఘటించలేదు. పైన తెలిపిన కారణాలతో ప్రభావితమయ్యే వెనెటియన్స్ తమ సామంత నగరాలలో గెల్ఫ్, గిబెల్లైన్ ముఠాల మధ్యన కక్షలను ప్రోత్సహించారని నేను విశ్వశిస్తున్నాను. వారు రక్తపాతానికి పాల్పడే పరిస్థితిని ఎప్పుడూ రానీయకపోయినప్పటికీ –పౌరులు తమ ఘర్షణలలో తలమునకలైపోయి తమకు వ్యతిరెకంగా కుట్రకు పాల్పడకుండా ఉంటారని– వారి మధ్యన ఆ విభేదాలను మాత్రం వెనటియన్స్ పెంచి పోషించారు. ఇది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదన్న సంగతిని మనం చూశాం. వైలా వద్ద వారు ఓటమిని పొందిన తరువాత వెంటనే ఒక ముఠా సాహసించి వెనటియన్స్ నుండి మొత్తం రాజ్యాన్ని చేజిక్కించేసుకుంది.  కనుక ఇటువంటి పద్దతులు రాజు లోని బలహీనతను సూచిస్తాయి (చాటుతాయి). ఎందుకంటే ఒక బలమైన రాజ్యంలో ఎప్పుడూ ఇటువంటి ముఠాలు అనుమతించబడవు. అటువంటి పద్దతుల ద్వారా ఎవరైనా తన అనుచరులను నియంత్రించడం సులువు కనుక అవి శాంతి సమయాలలో మాత్రం ఉపయోగపడతాయి, కానీ యుద్ధం సంభవించినపుడు అది ఎంత పొరపాటు విధానమో బయటపడుతుంది.   


4. తాము ఎదుర్కొన్న కష్టాలను, ఆటంకాలను అధిగమించినపుడు రాజులు నిస్సందేహంగా గొప్పవారవుతారు. కనుక విధి, ఒక కొత్తరాజుకు -ఒక వారసత్వపు రాజు కన్నా ఇతనికి ప్రఖ్యాతిని ఆర్జించవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది- గొప్పతనాన్ని ఆపాదించాలని కోరుకున్నపుడు శత్రువులు తలయెత్తి అతడికి వ్యతిరేకంగా పథకాలు రచించేటట్లు చేస్తుంది. ఆవిధంగా వారిని జయించే అవకాశం అతడికి లభించి, వారు ఏర్పాటు చేసిన నిచ్చెన ద్వారానే అతడు ఉన్నతస్థానానికి అధిరోహించగలుగుతాడు  ఈ కారణం వలన ఒక వివేకవంతుడైన రాజు అవకాశం లభించినప్పుడు తనకు వ్యతిరేకంగా కొంత శత్రుత్వం తలయెత్తేటట్లుగా చాకచక్యంతో వ్యవహరించి, దానిని అణచివేయడం ద్వారా తన ఘనతను పెంపొందించుకోవాలని పెక్కురి అభిప్రాయం.


5. రాజులు, మరిముఖ్యంగా కొత్తరాజులు తమ పరిపాలన యొక్క ప్రారంభంలో విశ్వసనీయులుగా ఉన్నవారి కన్నా అనుమానితులుగా ఉన్నవారినుండే తదనంతర కాలంలో ఎక్కువ రాజభక్తిని, సహాయాన్ని పొందారు. సియేనా రాజైన పండొల్ఫో పెట్రూసి (Pandolfo Petrucci, Prince of Siena) తన రాజ్యాన్ని ఇతరుల ద్వారా కన్నా ఒకనాడు తాను అనుమానించిన వ్యక్తులద్వారానే ఎక్కువగా పరిపాలించాడు. అయితే ఈ విషయాన్ని మనం సాధారణీకరించి మాట్లాడలేము, ఎందుకంటే ఇది వ్యక్తిని బట్టి ఎంతగానో మారిపోతుంది. నేను కేవలం ఇది చెబుతాను: ఒక రాజు యొక్క పరిపాలన ఆరంభంలో అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు తాము మనగలగటానికి సహాయం కావలసిన వారైనట్లతే వారిని ఎల్లప్పుడూ గొప్ప సులువుతో రాజు తన పక్షానికి తిప్పుకోవచ్చు. రాజు ఆరంభంలో తమ మీద ఏర్పరచుకున్న దురభిప్రాయాన్ని తమ చేతల (సత్ప్రవర్తన) ద్వారా చెరిపివేయడం తమకెంతో అవసరమని వారికి తెలుసు గనుక వారు రాజును విశ్వాసపాత్రంగా కొలవడనికి మరింత పట్టుదల చూపుతారు. ఆ విధంగా –పూర్తి సురక్షితులుగా ఉండి (తన అవిశ్వాసానికి గురవ్వకుండా ఉండి) తనను కొలుస్తూ, తన ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసే వారి వద్దనుండి కంటే– వీరి వద్దనుండి రాజు ఎల్లప్పుడూ అధిక లాబాన్ని రాబట్టుకుంటాడు. ఒక కొత్త రాజ్యాన్ని దాని పౌరుల రహస్య సహాయం ద్వారా పొందిన ఒక రాజు తనకు సహాయం చేసినవారు ఆ విధంగా చేయడానికి వారిని ఏ కారణాలు ప్రేరేపించినవో తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలని అతడిని హెచ్చరించడం అవసరం కనుక దానిని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలివేయను. అది తన యెడల వారికి గల సహజసిద్ధమైన ఆదరాభిమానాలు కాక, కేవలం తమ ప్రభుత్వం యెడల ఉన్న అసంతృప్తి మాత్రమే అయినట్లైతే అప్పుడు వారి స్నేహాన్ని అతడు ఎంతో ప్రయాస మీద, కష్టం మీద మాత్రమే కాపాడుకోగలుగుతాడు; ఎందుకంటే వారిని సంతృప్తి పరవడం అతనికి సాధ్యం కాదు కనుక. ప్రాచీన మరియు నేటికాలపు వ్యవహారలనుండి తీసుకున్న ఉదాహరణలలో ఇందుకు గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, –పూర్వపు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉంటూ తనకు సానుకూలంగా వ్యవహరించి దానిని కబళించడానికి తనను ప్రోత్సహించిన వారి కన్నా– పూర్వపు ప్రభుత్వం క్రింద సంతృప్తితో ఉండి, ఆ కారణంగా తనకు శత్రువులైనవారిని మిత్రులుగా చేసుకోవడం ఒక రాజుకు సులభతరం అని మనం తెలుసుకుంటాము.


6. తమకు వ్యతిరేకంగా పథకాలు రచించేవారికి ముకుతాడుగానూ, ఏదైనా హఠాత్తు దాడి జరిగినపుడు తలదాచుకొనే ప్రదేశంగానూ ఉపయోగపడగల కోటలను నిర్మించి, తద్వారా తమ రాజ్యాలను మరింత సురక్షితంగా కాపాడుకోవడం అనేది రాజులకు ఒక రివాజు. ఈ పద్దతిని నేను ప్రశంసిస్తాను, ఎందుకంటే ఇది గతంలో ఉపయోగపడింది. అయినప్పటికీ, మన కాలంలో మెస్సెర్ నికోలో విటెల్లి (Messer Nicolo Vitelli) సిట్టా డి కాస్టెల్లో (Città di Castello) పట్టణాన్ని సంరక్షించుకోవడం కొరకు ఆ పట్టణంలోగల రెండు కోటలను పడగొట్టడం మనం చూశాం. అర్బినో రాజ్యానికి డ్యూక్ అయిన గిడో ఉబాల్డో (Guido Ubaldo, Duke of Urbino) తన రాజ్యం నుండి సీజర్ బోర్గియాచే తరిమివేయబడి మరలా తిరిగి వచ్చిన మీదట ఆ రాజ్యంలోని కోటలన్నింటినీ పునాదులతో సహా నాశనం చేశాడు. ఎందుకంటే అవి లేనట్లైతే తన రాజ్యం మరలా చేజారడం చాలా కష్టం అని అతడు భావించాడు. బొలోగ్నాకు తిరిగీ వచ్చిన మీదట బెంటివోగ్లి ఇటువంటి నిర్ణయానికే వచ్చారు. కనుక, కోటలు ఉపయోగకరమా కాదా అన్నది పరిస్థితులను బట్టి ఉంటుంది, అవి నీకు ఒక విధంగా మంచిని చేస్తే, మరో విధంగా హాని చేస్తాయి. ఈ అంశాన్ని ఈ విధంగా వివరించవచ్చు: విదేశీయుల (శత్రురాజుల) వలన కన్నా తన స్వంత ప్రజల (సామంతులు) వలనే ఎక్కువ భయం ఉన్న రాజు కోటలను నిర్మించాలి, ప్రజల వలన కన్నా విదేశీయులవలనే ఎక్కువ భయం ఉన్న రాజు వాటి జోలికి పోకూడదు. ఫ్రాన్సెస్కో స్ఫోర్జా (Francesco Sforza) చే నిర్మించబడిన మిలన్ కోట (castle of Milan) స్ఫోర్జా కుటుంబానికి రాజ్యంలోని మరే ఇతర కల్లోలం కన్నా కూడా ఎక్కువ సంకటాన్ని కలిగించింది, ఇంకా కలిగిస్తుంది. ఈ కారణంగా ప్రజలచే (అనుయాయులచే, సామంతులచే) ద్వేషింపబడకుండా ఉండటమే నీవు నిర్మించుకోగలిగిన ఉత్తమమైన కోట. నీవు కోటలను కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు నిన్ను ద్వేషించినట్లైతే అవి నిన్ను రక్షించలేవు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఆయుధాలు చేబట్టిన ప్రజలకు సహాయమందించే విదేశీయులకు ఎప్పుడూ కొరత ఉండదు. ఒక్క ఫోర్లి దొరసాని (Countess of Forli) విషయంలో తప్ప మన కాలంలో అటువంటి కోటలు ఏ ఒక్క రాజుకైనా ఉపయోగ పడ్డట్లుగా కనబడలేదు. ఆమె భర్త అయిన గిరొలామో (Count Girolamo) హత్యగావింపబడినప్పుడు ఆమె కోట మూలంగానే ప్రజల తిరుగుబాటును తట్టుకుని నిలబడి, మిలన్ నుండి సహాయం అందేవరకూ వేచి ఉండి, -విదేశీయులెవ్వరూ ప్రజలకు సహాయమందించగలిగే విధంగా నాటి పరిస్థితులు లేకపోవడంతో– తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగింది. అయితే తదనాంతర కాలంలో, సీజర్ బోర్గియా ఆమెపై దాడి చేసినప్పుడు మరియు ప్రజలు –ఆమె శత్రువులు– విదేశీయులతో చేతులు కలిపినప్పుడు కోటలు ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీనినిబట్టి ఇప్పుడు, ఇంతకు ముందు కూడా కోటలను కలిగి ఉండటం కన్నా ప్రజలచే ద్వేషింపబడకుండా ఉండటమే ఆమెకు క్షేమమై ఉండేది. ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట కోటలు కట్టినవానినీ, కట్టకుండా ఉన్నవానిని కూడా నేను ప్రశంసిస్తాను. అలాగే, కోటలను నమ్ముకుని ప్రజాలచే ద్వేషింపబడటాన్ని ఎవరు నిర్లక్ష్యం చేసినా, వారిని నేను నిందిస్తాను. 


1 వ్యాఖ్య:

  1. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    ప్రత్యుత్తరంతొలగించు