29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 25వ అధ్యాయం







రాజు - రాజ్యం




అధ్యాయం25 

మానవ వ్యవహారాలలో విధి పాత్ర ఎంతవరకు ఉంటుంది
దానిని ఎలా ఎదుర్కొనవచ్చు







(Unedited)


మానవ వ్యవహారాలు (ఈ లోకంలో జరిగే సంఘటనలు) విధి మరియు దైవం చేతిలో ఉంటాయనీ, మనుష్యులు తమ తెలివితేటలతో వాటిని మార్చలేరనీ, నిజానికి విధి శాసనాలకు ఎటువంటి ప్రతిచర్యాలేదనీ అనేకమంది అభిప్రాయపడ్డారు, ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు అన్న విషయం నాకు తెలియనిది కాదు. ఈ కారణంగా –ఏ విషయంలోనైనా ఎక్కువ కష్టపడటం  అనవసరం, అన్ని విషయాలను విధిరాతకు వదిలేయాలి– అనే ఆలోచనకు వారు వస్తారు. ఈ అభిప్రాయం మనకాలంలో మరింతగా బలపడింది. ఎందుకంటే, మానవుని యొక్క ఊహలకు అందని గొప్ప మార్పులు ఎన్నో జరిగాయి, ఇంకా ప్రతిరోజూ జరుగుతున్నాయి కనుక. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించడం జరిగితే నేను వారి అభిప్రాయంతో కొంతవరకూ ఏకీభవిస్తాను. అయినప్పటికీ, మనం స్వేచ్ఛగా పనిచేసే సామర్థ్యం (Fరీవిల్ల్) పూర్తిగా అంతరించదు కనుక, మనం చేసే పనులలో సగాన్ని విధి నియంత్రిస్తుంది, మిగతా సగాన్ని లేదా అంతకన్నా కొంచెం తక్కువని విధి మన నియంత్రణకు వదిలిపెడుతుందనేది నిజమని నేను భావిస్తున్నాను. 


విధినిని నేను వెల్లువొచ్చి పొంగిపొర్లే నదితో పోల్చుతాను. అది ఉప్పొంగినపుడు మైదాన ప్రాంతాలను ముంచెత్తుంది, వృక్షాలను, భవంతులను కూల్చివేస్తుంది, మట్టిని ఒక చోటినుండి తొలగించి మరోచోట విడిచిపెడుతుంది. దాని ధాటికి ప్రతీదీ కొట్టుకుపోవలసిందే, దానిని ఏవిధంగానూ నిలువరించే శక్తి లేక అన్నీ దానికి లోబడవలసిందే. నది స్వభావం అటువంటిదైనప్పటికీ, అది ప్రశాంతంగా ఉన్నపుడు గట్లు, ఆనకట్టలు నిర్మించడం ద్వారా మనుషులు జాగ్రత్త పడటంవలన అది మరలా ఉప్పొంగినపుడు నీరు కాలువలోకి ప్రవహిస్తుంది, అలాగే దాని ప్రవాహం అదుపుచేయలేనంతగానూ, అంత ప్రమాదకరంగానూ ఉండదు. విధి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. తనను నిరోధించడానికి ఏ చర్యా చేపట్టని చోటే అది తన ప్రతాపాన్ని చూపిస్తుంది, తనను నిలువరించడానికి ఆనకట్టలు, అడ్డుకట్టలు ఎక్కడలేవని తెలుసుకుంటుందో అక్కడికే ఆమె తన కోపాగ్నిని ప్రసరింపజేస్తుంది.


ఈ మార్పులకు వేదిక అయిన మరియు వాటికి ప్రేరణను ఇచ్చిన ఇటలీని గనుక నీవు పరిశీలించినట్లైతే అది ఎటువంటీ ఆటంకంగానీ, రక్షణగానీ లేని బహిరంగ దేశమని నీవు గ్రహిస్తావు. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలవలే ఇటలీకూడా సరైన శౌర్యపరాక్రమాలతో గనుక రక్షింపబడినట్లైతే ఈ దండయాత్ర వలన జరిగిన గొప్ప మార్పులు జరిగి ఉండేవి కావు లేదా అసలు దండయాత్రే జరిగి ఉండేది కాదు. విధిని నిరోధించడానికి సంబంధించి సాధారణంగా వివరించడానికి ఇప్పుడు చెప్పినది సరిపోతుందని నేను అనుకుంటూన్నాను.


అయితే విశేషమైన సందర్భాలకు నన్ను ఎక్కువగా పరిమితం చేసుకున్నట్లైతే నేనేం చెబుతానంటే ఒక రాజు యొక్క స్వభావంలోగానీ, గుణగణాలలోగానీ ఎటువంటీ మార్పు లేకుండానే అతడు ఈ రోజు సంతోషంగా ఉండి రేపు నాశనమవడం మనం చూస్తాం. ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించిన కారణాలవలనే ప్రధానంగా ఇలా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. అదేమంటే అదృష్టం (విధి) మీదే పూర్తిగా ఆధారపడిన రాజు అది మారినపుడు వినాశనాన్ని పొందుతాడు. తన చేతలను సమయానికి తగినట్లుగా మలచుకునేవాడు విజయాన్ని పొందుతాడు, అలా మలచుకోనివాడు అపజయాన్ని పొందుతాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే —ప్రతీ మనిషి తన ముందుంచుకున్న— యశస్సు మరియు సంపద అనే లక్ష్యాన్ని చేరుకునే కార్యకలాపాలలోనే మనుషులు కనిపిస్తారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు వివిధ పద్దతులను అవలంబిస్తారు. ఒకరు ఆచితూచి, మరొకరు ఆతురతతో; ఒకరు బలంతో, మరొకరు నైపుణ్యంతో; ఒకరు సహనంతో, మరొకరు తద్విరుద్ధంగా ఉన్న దానితో. ప్రతీ ఒకరూ విభిన్నమైన పద్దతిలో లక్ష్యాన్ని చెరుకోవడంలో సఫలమౌతారు. ఆచితూచి అడుగువేసే ఇరువురు వ్యక్తులలో ఒకరు తన లక్ష్యాన్ని చేరుకోవడం మరొకరు విఫలమవడం కూడా మనం గమనించవచ్చు. అలాగే వేరువేరు మార్గాలననుసరించిన ఇరువురువ్యక్తులు —ఒకరు ఆచితూచి అడుగువేసేవారు, మరొకరు దూకుడుగా ఉండేవారు— ఒకేవిధంగా విజయాన్ని సాధిస్తారు. వారు అవలంబించిన పద్దతులు సమయానుకూలంగా ఉన్నయా లేదా అన్నదానినిబట్టి కాక మరిదేని వలనా ఇదంతా జరగదు. నేను చెప్పిన దాని ప్రకారం ఇలా జరుగుతుంది. అదేమంటే వేరువేరుగా పనిచేసే ఇరువురు వ్యక్తులు ఒకే ఫలితాన్ని పొందుతారు, అలాగే ఒకే విధంగా పనిచేసే ఇరువురు వ్యక్తులలో ఒకరు తన లక్ష్యాన్ని చేరుకుంటే, మరొకరు చేరుకోరు.


అదృష్టం లోని మార్పులను కూడా మనం ఇలానే వివరించవచ్చు. ఎలాగంటే జాగరూకతతో, సహనంతో పనిచేసే వ్యక్తికి కాలము మరియు ఇతర వ్యవహారాలు అనుకూలంగా ఉన్నట్లైతే అతడు విజయాన్ని పొందుతాడు. అయితే అవి మారినప్పుడు అతడు తాను పనిచేసే పద్దతిని మార్చుకోనట్లైతే వినాశనాన్ని పొందుతాడు. అయితే మార్పుకు అనుకూలంగా తనను తాను మలచుకోవడం తెలిసిన మనిషి మనకు తరచూ కనబడడు. దీనికి ఓ కారణం అతడు తన స్వభావానుసారంగా పనిచేసే విధానాన్నుండి పక్కకు తప్పుకోలేకపోవడం. మరొక కారణం ఒకానొక విధానంలో పనిచేస్తూ, ప్రతీసారీ విజయాన్ని పొందిన వ్యక్తి, ఆ విధానానికి స్వస్తిపలకడమే మంచిది అనే భావనకు రాలేకపోవడం. అందువలన ఆచితూచి అడుగువేసే వ్యక్తి దూకుడుగా వ్యవహరించాల్సిన సమయం వచ్చినపుడు అలా వ్యవహరించడం ఎలానో తెలియక వినాశనాన్ని పొందుతాడు. అయితే అతడు తన వ్యవహారశైలిని గనుక సమయానుకూలంగా మార్చుకుంటే, అతడి తలరాత మారబోదు.


పోప్ జూలియస్–ఈఈ అన్ని వ్యవహారాలలోనూ చాలా దూకుడుగా పని చేసేవాడు. అతడి వ్యవహారశైలికి కాలము మరియు పరిస్థితులు ఎంతబాగా అనుకూలించేవంటే అతడు ఎల్లవేళలా విజయాన్నే పొందేవాడు. మెస్సర్ గియోవన్నీ బెంటివోగ్లి ఇంకా బ్రతికి ఉండగానే బొలోగ్నా మీద ఇతడు చేసిన మొదటి యుద్ధాన్ని పరిశీలించండి. వెనటియన్స్ దీనికి సుముఖంగా లేరు, స్పెయిన్ రాజు కూడా అంతే. ఈ యుద్ధానికి సంబంధించి ఫ్రాన్సు రాజుతో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా పోప్ తన కలవాటైన ధైర్యంతో దూకుడుగా వ్యక్తిగతంగా తానొక్కడే జైత్రయాత్రకు బయలుదేరాడు. ఈ చర్యవలన భయపడి వెనటియన్స్, నేపుల్స్ రాజ్యాన్ని తిరిగి సంపాదించాలనే కోరికతో స్పెయిన్ ఏం చేయాలో పాలుపోక చేష్టలుడిగిపోయారు. మరోపక్క పోప్ తన వెనుకే ఫ్రాన్సు రాజును యుద్ధంలోకి లాగాడు. ఎందుకంటే పరిస్థితినంతా గమనించిన మీదట, వెనటియన్స్‌ను బలహీనపరచడం కొరకు పోప్‌ను తన మిత్రునిగా చేసుకోదలచిన ఆ రాజుకు పోప్‌ను తిరస్కరించడం సాధ్యపడలేదు. దీనిమూలంగా జూలియస్ తన దూకుడుతో ఎంతోగొప్ప వివేకం కలిగిన మరి ఏ ఇతర పోప్ కూడా నెరవేర్చలేనటువంటి కార్యాన్ని నెరవేర్చాడు. పోప్ తన పథకాలన్నింటినీ సిద్ధంచేసుకుని, అన్నివిషయాలనూ సమకూర్చుకొన్న తరువాతే బయలుదేరడం కొరకు –ఏ ఇతర పోప్ అయినా ఇలానే వ్యవహరించేవాడు– రోమ్‌లోనే వేచి ఉన్నట్లైతే అతడు ఎప్పటికీ విజయాన్నిసాధించి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఫ్రాన్స్ రాజు వేయి వంకలు చెప్పి ఉండేవాడు, అలానే ఇతరులు వేయి భయాలను వెల్లడి చేసి ఉండేవారు.


నేను అతడి ఇతర చర్యలను వదిలేస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా ఇలానే ఉంటాయి. అలాగే అన్నీ విజయవంతమయ్యాయి. అతడి జీవితం చిన్నది కావడంతో ఇందుకు విరుద్ధమైనది అతడికి అనుభవంలోకి రాలేదు. అయితే ఒకవేళ అతడు ఆచితూచి అడుగువేయవలసిన అవసరం కలిగిన పరిస్థితులు కనుక తలయెత్తినట్లైతే, అతడి వినాశనం సంభవించి ఉండేది. ఎందుకంటే తన స్వభావానికి అనుగుణమైన మార్గాలనుండి అతడు ఎప్పుడూ తప్పుకుని ఉండేవాడు కాదు.



చివరకు నేనేం చెబుతానంటే అదృష్టం మారుతూ ఉంటుంది, మనుష్యులు మాత్రం తమ విధానాలను అంటిపెట్టుకుని ఉంటారు. ఇవి రెండూ ఎంతకాలం సామరస్యాన్ని కలిగి ఉంటాయో అంతకాలం మనుషులు గెలుపొందుతారు, ఆ సామరస్యం చెడిపోయినప్పుడు ఓటమిపాలౌతారు. నావరకు నేనేం అనుకుంటున్నానంటే జాగరూకతతో ఉండటం కన్నా సాహసించడమే మేలు. ఎందుకంటే అదృష్టం ఒక స్త్రీ. ఆమెను నీ అదుపులో ఉంచుకోవాలని కోరుకున్నట్లైతే బలప్రయోగం ద్వారా ఆమెను గెలుపొందటం అవసరం. అంతేకాక నెమ్మదిగా వ్యవహరించేవారి కన్నా ఇలా సాహసికులుగా ఉండేవారికి లోబడటానికే ఆమె అంగీకరించడం మనకు కనబడుతుంది. అందువలన, ఇలా ఓ స్త్రీవలే ఆమె ఎల్లవేళలా యువకులనే ఇష్టపడుతుంది. ఎందుకంటే వారు తక్కువ జాగ్రత్తతోనూ, ఎక్కువ హింసాత్మకంగానూ ఉండి మిక్కిలి ధైర్యంతో ఆమెను ఆజ్ఞాపిస్తారు.










1 కామెంట్‌: