29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 24 వ అధ్యాయం
(Unedited)రాజు-రాజ్యం
అధ్యాయం 24: ఇటలీ రాజులు తమ రాజ్యాలనెందుకు కోల్పోయారుChapter XXIV: Why the Princes of Italy have Lost their States


ఇప్పటివరకు చెప్పిన సలహాలూ, సూచనలన్నింటినీ జాగ్రత్తగా పాటించినట్లైతే అవి ఒక కొత్తరాజును చిరకాలంనుండి ఉన్న రాజువలే కనబడేటట్లు చేస్తాయి, అంతేకాక అతిత్వరలోనే అతడిని తన స్థానంలో చిరకాలంనుండి ఉన్న రాజుకన్నా ఎక్కువ సుస్థిరం, సురక్షితం చేస్తాయి. ఎందుకంటే ఒక కొత్తరాజు చర్యలు వారసత్వపురాజు చర్యలకన్నా మరింత క్షుణ్ణంగా పరిశీలించబడతాయి, అవి సమర్థవంతంగా కనబడినపుడు ఆ కొత్తరాజుకు వారసత్వపు రాజుకన్నా మరింత ఎక్కువమంది మద్దతునిస్తారు, వారంతా మరింత బలంగా అతడికి కట్టుబడతారు. దీనికి కారణం మనుషులు గతంకన్నా వర్తమానానికి ఎక్కువ ఆకర్షితులవుతారు. వారికి వర్తమానం బాగుందనిపిస్తే వారు దానిలోనే సంతోషాన్ని పొందుతారు, అంతకు మించి మరేమీ కోరుకోరు. అంతేకాక, ఇతరవిషయాలలో ఆ రాజు వారిని నిరాశకు గురిచేయనట్లైతే అతడి రక్షణకు వారంతా శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ విధంగా నూతన రాజ్యాన్ని స్థాపించడం ద్వారానూ, మరియూ దానిని మంచి శాసనాలు, మంచి సైన్యం, మంచి మిత్రులు మరియు మంచి కార్యాల ద్వారా అలంకరించడం, బలపరచడం ద్వారానూ ఆ రాజు ద్విగుణీకృతమైన ఖ్యాతిని పొందుతాడు. అలాగే వారసత్వంగా రాజైనవాడు అవివేకం మూలంగా తన రాజ్యాన్ని కనుక పోగొట్టుకుంటే, అతడికి ద్విగుణీకృతమైన అపఖ్యాతి మిగులుతుంది.ఇటలీలోని తమ రాజ్యాలను పోగొట్టుకున్న నేపుల్స్ రాజు, మిలన్ రాజు, మరికొంతమంది వంటి మనకాలపు ఫ్యూడల్ రాజులను గనుక పరిశీలించినట్లైతే మొదటగా వారిలో ఒక సామాన్యమైన లోపం కనబడుతుంది. అదే సైన్యానికి సంబంధించినది. తత్కారణాలు సుదీర్ఘంగా చర్చించినవే. తరువాత వారిలో ఎవరోఒకరికి ప్రజలు వ్యతిరేకులుగానన్నా ఉన్నారు, లేదా ప్రజలు అతడితో స్నేహంగా ఉన్న పక్షంలో అతడు ప్రభువర్గీయులను ఎలా కాపాడుకోవాలో తెలియని వాడైనా అయి ఉంటాడు. ఇటువంటి లోపాలేవీ లేనపుడు యుద్ధరంగంలో సైన్యాన్ని నిలుపగల శక్తిసామర్థ్యాలున్న ఏ రాజ్యం కూడా చేజారిపోదు.


మాసిడోనియాకు చెందిన ఫిలిప్ —అలెగ్జాండర్ ది గ్రేట్ తండ్రి కాదు, టైటస్ క్వింటియస్‌చే జయించబడిన వాడు— తన మీద దాడిచేసిన రోమ్, గ్రీకు దేశాల గొప్పదనంతో పోల్చితే చాలా చిన్న దేశానికి రాజు. అయినా కూడా అతడు తన యుద్ధకౌశలంతోనూ, ప్రజలనెలా ఆకట్టుకోవాలో, ప్రభువర్గీయులనెలా కాపాడుకోవాలో తెలిసిన నేర్పరితనంతోనూ అనేక సంవత్సరాలపాటు యుద్ధంలో తన శతృవులను నిలువరించగలిగాడు. చివరికి అతడు కొన్ని నగరాలను కలిగియున్న కొంత భూభాగాన్ని పోగొట్టుకున్నప్పటికీ, తన రాజ్యాన్ని మాత్రం నిలుపుకున్నాడు.


Philip of Macedon Philip V (238–179 B.C.), king of Macedon. He was defeated in 197 B.C. by Titus Quintus Flaminius, a Roman general, at Cynoscephalae.అందువలన అనేక సంవత్సరాలపాటు నిలుపుకున్న తమ రాజ్యాలను పోగొట్టుకున్న మన రాజులు తమ దుస్థితికి విధిని కాక తమ సోమరితనాన్నే నిందించాలి. ఎందుకంటే పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నపుడు అవి తలక్రిందులవవచ్చనే ఊహే వారెప్పుడూ చేయలేదు. (సముద్రం ప్రశాంతంగా ఉన్నపుడు తుఫాను గురించి ఆలోచించకపోవడం మానవ స్వభావం) ఐతే చెడ్డరోజులు వచ్చిన తరువాతికాలంలో వారు ఆత్మరక్షణ గురించి కాక పలాయనం గురించే ఆలోచించారు, విజేతలు చేసే అవమానాలకు రోసిన ప్రజలు తిరిగి తమనే ఆహ్వానిస్తారని ఆశించారు. ఇలా జరగాలని ఆశించడం మిగతా ప్రయత్నాలన్నీ విఫలమైనపుడు సరైనది కావచ్చు. అయితే దీనిని నమ్ముకుని ఇతర ప్రయత్నాలన్నింటినీ నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం సరికాదు. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి లేవనెత్తుతారనే నమ్మకంతో ఎవరూ కావాలని క్రిందపడిపోరు. పైగా నీ ప్రజలు నిన్ను తిరిగి ఆహ్వానించడం అనేది జరగవచ్చు, జరుగకపోవచ్చు. ఒకవేళ జరిగినాకూడా అది నీ రక్షణకు తోడ్పడదు. ఎందుకంటే నీ మీద ఆధారపడిలేని రక్షణ నీకు నిరుపయోగం. నీ మీద, నీ ధైర్యస్థైర్యాలమీద ఆధారపడిన రక్షణ మాత్రమే నమ్మదగినది, ఖచ్చితమైనది మరియు చిరకాలం నిలిచి ఉండేది (దీర్ఘకాలం నిలబడేది).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి