29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 23 వ అధ్యాయం(Unedited)
రాజు-రాజ్యం
అధ్యాయం 23: భజనపరులను ఎలా దూరంగా ఉంచాలిChapter XXIII: How Flatterers should be Avoided


ఈ విషయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విభాగాన్ని విడిచిపెట్టాలని నేను కోరుకోవడంలేదు. ఎందుకంటే రాజులు —వారు ఎంతో జాగ్రత్తపరులు మరియూ విచక్షణ కలిగినవారూ కాని పక్షంలో— అతికష్టం మీద మాత్రమే అధిగమించగలిగిన ఒక ప్రమాదం అది. అదే భజనపరులు. రాజాస్థానాలన్నీ వీరితో నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే మనుషులు తమ స్వవిషయాలతో ఎంతగా సంతోషాన్ని పొందుతారంటే, వాటి గురించి ఎంతగా భ్రమలలో ఉంటారంటే భజన అనే ఈ చీడపురుగునుండి వారు తమను తాము ఏ మాత్రం రక్షించుకోలేరు. పైగా అలా రక్షించుకోవాలనే ప్రయత్నంలో వారు అగౌరవమనే ప్రమాదానికి గురివుతారు. ఎందుకంటే భజనపరులనుండి రక్షణ పొందడానికి —నిజంచెప్పడం అనేది నీకు ఆగ్రహం కలిగించదనే విషయం— ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయడం కన్నా మార్గాంతరం లేదు. ఐతే ప్రతి ఒకరూ నీతో నిజం మాట్లాడగలిగినప్పుడు నీకు గౌరవమన్నదే ఉండదు.


కనుక ఒక వివేకవంతుడైన రాజు మూడవ మార్గాన్ని అనుసరించాలి. తన రాజ్యంలోని జ్ఞాన సంపన్నులైన వ్యక్తులను ఎంపిక చేసుకొని తనతో నిజంచెప్పే స్వేచ్ఛను వారికి మాత్రమే ఇవ్వాలి. అది కూడా తాను అడిగినవిషయాల గురించే తప్ప మరి ఇతరమైన వేటి గురించీ వారు మాట్లాడకూడదు. కానీ రాజు వారిని ప్రతి విషయం గురించి ప్రశ్నించాలి, వారి అభిప్రాయాలను వినాలి. ఆ తదుపరి స్వయంగా తన స్వంత అభిప్రాయాన్ని రూపొందించుకోవాలి. ఈ సభ్యులందరితో కలసికట్టుగానూ, విడివిడిగానూ అతడు ఎలా మెలగవలనంటే వారిలో ప్రతి ఒకరూ తాను ఎంత స్వేచ్ఛగా మాట్లాడితే రాజు తనను అంతగా ఇష్టపడతాడు అని తెలుసుకోవాలి (అనుకోవాలి). వీరుకాకుండా మరెవరికీ రాజు చెవి ఒగ్గకుండా ఉండి, ఆమోదం పొందిన మార్గాన్నే అనుసరిస్తూ, తన నిర్ణయాలకు స్థిరంగా కట్టుబడి ఉండాలి. ఎవరైతే ఇందుకు ఇతరంగా వ్యవహరిస్తారో వారు భజనపరుల మూలంగా తప్పుదారిలోనన్నా నడుస్తారు, లేదా రకరకాల అభిప్రాయాలవలన తన నిర్ణయాలను తరచూ మార్చుకుంటూ గౌరవాన్నన్నా కోల్పోతారు.


ఈ విషయం మీద ఒక ఆధునిక ఉదాహరణను పేర్కొనాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి చక్రవర్తి అయిన మాక్సిమిలన్ సేవలో ఉన్న ఫ్రా లూక తన ప్రభువు గురించి మాట్లాడుతూ “అతడు ఏన్నడూ ఎవరినీ సంప్రదించలేదు, అలాగని అతడు ఏ పనినీ తాను అభిలషించినట్లుగానూ చేయలేదు” అని చెప్పాడు. పైన తెలిపిన విధానానికి వ్యతిరేకంగా అతడు నడచుకోవడం వలన ఇలాంటి పరిస్థితి తలయెత్తింది. ఎలాగంటే చక్రవర్తి రహస్యాన్ని పాటించే వ్యక్తి అవడం వలన తన పథకాలను అతడు ఎవరికీ తెలియపరచడు, వాటి మీద ఎలాంటి సలహాలనూ స్వీకరించడు. ఐతే వాటిని ఆచరణలో పెట్టే క్రమంలో అవి బహిర్గతమై అందరికీ తెలిసిపోవడంతో, అతడి చుట్టూ ఉండే వ్యక్తులచేత అవి ఒక్కసారిగా వ్యతిరేకించబడతాయి. దానితో మెత్తబడిపోయిన అతడు తన పథకాలను విరమించుకుంటాడు. దీనివలన అతడు ఓరోజు చేసిన పనిని మరుసటిరోజు ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అసలతడు ఏం చేయాలనుకుంటున్నాడు, అతడి ఉద్దేశ్యం ఏమిటి అనేది ఏ ఒక్కరికీ కూడా ఎన్నడూ అర్థం కాదు. ఆలాగే ఏ ఒక్కరూ అతడి నిర్ణయాల మీద ఆధారపడలేరు.


[మొదటి మాగ్జిమిలన్ (Maximilian I; జననం: 1459, మరణం: 1519) పవిత్ర రోమన్ సామ్రాజ్య (జర్మనీ ప్రాంతం) చక్రవర్తి. ఇతడు మొదట బర్గండి రాజు చార్లెస్ (Charles the Bold) కుమార్తె అయిన మేరీని వివాహం చేసుకున్నాడు. ఆమె మరణించిన పిమ్మట మిలన్ రాజు కుమార్తె అయిన బియాంకా స్ఫోర్జాను (Bianca Sforza;) వివాహం చేసుకుని, తద్వారా ఇటలీ రాజకీయాలలో జోక్యం చేసుకోనారంభించాడు.]


అందువలన ఒక రాజు ఎల్లప్పుడూ సలహాలను స్వీకరించాలి. ఐతే అది తాను కోరుకున్నప్పుడు మాత్రమే, ఇతరులు కోరుకున్నప్పుడు కాదు. అంతేకాక తను అడగకుండానే సలహాలను ఇవ్వజూపే ప్రతి ఒక్కరినీ అతడు నిరుత్సాహపరచాలి. ఏది ఏమైనప్పటికీ అతడు నిరంతరం సంప్రదించేవాడిగానే ఉండాలి, తదుపరి తాను సంప్రదించిన అంశానికి సంబంధించిన విషయాలను సహనంతో వినేవాడుగా ఉండాలి. ఒక వేళ ఏ ఒక్కరైనా, ఏ విషయంలోనైనా తనకు నిజం చెప్పలేదని తెలిసినట్లైతే అతడు తన కోపాన్ని రుచిచూపించాలి.


ఒక రాజు వివేకవంతుడని అనిపించుకుంటే అది అతని ప్రతిభ వలన కాదు, అతడు తన చుట్టూ కలిగిఉన్న మంచి సలహాదారుల వలన అని ఎవరైనా అనుకున్నట్లైతే వారు నిస్సందేహంగా పొరబడినట్లే. ఎందుకంటే వివేకవంతుడు కాని రాజు ఎన్నడూ మంచి సలహా తీసుకోడనేది ఎప్పుడూ తప్పవని ఒక నిత్యసత్యం. ఐతే, అన్ని విషయాలలోనూ తనను పూర్తిగా నిర్దేశించే ఒక వివేకవంతుడైన వ్యక్తి చెప్పుచేతల్లో ఆ రాజు తనను తాను ఉంచుకున్న పక్షంలో, ఆ వ్యక్తి రాజుకు చక్కటి మార్గనిర్దేశకత్వాన్ని అందించవచ్చు. కానీ అలా ఎంతో కాలం జరగదు. ఎందుకంటే అలాంటి సలహాదారుడు అనతికాలంలోనే రాజ్యాన్ని ఆ రాజు నుండి తన హస్తగతం చేసేసుకుంటాడు.వివేకవంతుడు కాని రాజు ఒకవేళ ఎక్కువమందిని కనుక సంప్రదిస్తే అతనికెప్పుడూ ఏకాభిప్రాయం లభించదు. అలాగే ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఏకాభిప్రాయాన్ని రాబట్టడమూ అతడికి తెలియదు. ఆ సలహాదారులలో ప్రతి ఒకడూ తన స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తాడు. వారినెలా నియంత్రించాలో, వారి అంతరంగాన్ని ఎలా కనిపెట్టాలో ఆ రాజుకు తెలియదు. వారు మరోలా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నిర్భందంతో నిజాయితీగా ఉండే అవసరాన్ని కల్పించితే తప్ప మనుషులు ఎల్లప్పుడూ నీ యెడల తప్పుగానే ప్రవర్తిస్తారు. దీనినిబట్టి ఈ విధమైన నిర్థారణకు మనం ఖచ్చితంగా రావచ్చు. మంచి సలహాలు అవి ఎక్కడినుండి వచ్చినప్పటికీ రాజు వివేకం నుండే జనిస్తాయి, అంతేకానీ రాజు యొక్క వివేకం మంచి సలహాలనుండి జనించదు.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి