29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 18 వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం -18  

రాజులు విశ్వసనీయులుగా ఎలా ఉండాలి






(Unedited)


గమనిక: మాకియవెల్లి రచనలన్నింటిలోకెల్లా ఈ అధ్యాయమే తీవ్ర వ్యతిరేకతను చవిచూసింది.

ఒక రాజు విశ్వసనీయుడుగా ఉండటం, అలాగే మోసంతో కాక నిజాయితీతో మనుగడ సాగించడం అనేది ఎంతో ప్రశంసనీయమైన విషయం అని అందరూ అంగీకరిస్తారు. కానీ మన అనుభవం ఏమిటంటే గొప్ప పనులు చేసిన రాజులు తమ మాటను అంతగా నిలుపుకోలేదు. అలాగే వారు తమ జిత్తులమారితనంతో మనుషులను ఏమార్చేవారుగా పేరుపొంది, చివరికి నిజాయితీగా వ్యవహరించే వారిని సైతం అధిగమింఛారు. అధికార పోరాటానికి (contesting or contending)  రెండు మార్గాలున్నాయనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. ఒకటి న్యాయబద్దమైనది, మరొకటి బలప్రయోగంద్వారా చేసేది. మొదటి పద్దతి మనుషులకు తగినటువంటిది, రెండవ పద్దతి పశువులకు తగినటువంటిది. ఐతే మొదటిది తరచుగా సరిపోదు కనుక రెండవదాని మీద ఆధారపడవలసిన అవసరం వస్తుంది. కనుక ఒక రాజు తనలోని మనిషిని, అలాగే పశువును రెంటినీ ఉపయోగించడాన్ని అర్థం చేసుకొని ఉండాలి. ప్రాచీన రచయితలు రాజులకు ఈ విషయాన్ని ప్రతీకాత్మకం గా బోధించారు. ‘అచెల్లిస్ మరియు ప్రాచీనకాలానికి చెందిన అనేకమంది ఇతర రాజులు పెంపకం కొరకు సగం మనిషి సగం గుఱ్ఱంగా ఉండే (Centaur) చిరాన్ కు అప్పగించబడ్డారు. చిరాన్ వారిని తన క్రమశిక్షణలో పెంచి పెద్దచేశాడు’ అని వారు వర్ణించారు. దీని ఏకైక అర్థం ఏమిటంటే వారు తమ గురువుగా సగం పశువు, సగం మనిషిగా ఉన్న వానిని కలిగి ఉన్నారు కనుక ఒక రాజుకు ఆ రెండు స్వభావాలను ప్రదర్శించడం ఎలాగో తెలియడం అవసరం, అలాగే ఆ రెంటిలో ఒకటి లేకుండా మరోటి స్థిరత్వాన్ని కలిగి ఉండదు అని. అయితే ఒక రాజుకు పశుస్వభావాన్ని వివేకవంతంగా ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి కనుక అతడు పశువులలో నక్కను మరియు సింహాన్ని రెండింటినీ ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే సింహం ఉచ్చుల బారినుండి తనను తాను రక్షించుకోలేదు, అలాగే నక్క తోడేళ్ళ బారినుండి తనను తాను రక్షించుకోలేదు. కనుక తోడేళ్ళను హడలగొట్టడానికి సింహంగానూ, ఉచ్చులను కనిపెట్టడానికి నక్కగానూ ఉండటం అవసరం. కేవలం సింహాలుగానే ఉండదలచినవారు దీనిని అర్థం చేసుకోలేరు. కనుక వివేకవంతుడైన రాజు –మాట నిలుపుకున్న పక్షంలో అది తనకు నష్టదాయకంగా పరిణమించేటపుడు, అలాగే మాట ఇవ్వడానికి దారితీసిన కారణాలు కనుమరుగైపోయినపుడు మాట నిలుపుకోలేడు; నిలుపుకోకూడదు. మనుషులందరూ మంచివారైనట్లైతే ఇది మంచి సలహా అవబోదు. కానీ వారు చెడ్డవారు అవడం వలన మరియు వారు నీకిచ్చిన మాట నిలుపుకోరు గనుక బదులుగా నీవు కూడా వారికిచ్చిన మాట నిలుపుకోవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఆడి తప్పడాన్ని సమర్థించుకోవడానికి ఆమోదయోగ్యంగా కనిపించే కారణాలకొరకు ఒకరాజుకు ఎప్పుడూ కొరత ఉండదు. ఈ విషయానికి సంబంధించి –రాజులలో విశ్వసనీయత లోపించడం ద్వారా ఎన్ని ఒప్పందాలు అమలుకాలేదో, ఎన్ని ఇచ్చిన మాటలు కట్టుబాటుకు నోచుకోలేదో చూపించే, మరియు నక్క స్వభావాన్ని ఎలా ఉపయోగించాలో బాగా తెలిసినవాడు ఎక్కువగా విజయాన్ని పొందాడని చూపించే– ఆధునికమైన ఉదాహరణలను అంతులేకుండా ఇవ్వవచ్చు.

ఐతే ఈ స్వభావానికి మంచి ముసుగు ఎలా వేయాలో తెలియడం అవసరం. అంతేకాకుండా తన ఆలోచనలను దాచిఉంచడంలో, పైకి వాటికి భిన్నంగా కనిపించేటట్లుగా నటించడంలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. మనుషులు ఎంత అమాయకులు మరియు వారు వర్తమాన అవసరాల చేత ఎంతగా ప్రభావితమై ఉంటారు అంటే మోసం చేయాలనుకునే వాడికి మోసపోయేవాడు ఎవడో ఒకడు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాడు. ఇటీవలి కాలపు ఒక ఉదాహరణను నేను చెప్పకుండా వదిలేయలేను. 6వ అలెగ్జాండర్ మనుషులను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేదు, మరోవిధంగా చేయాలనే ఆలోచన కూడా అతనెప్పుడూ చేయలేదు. అలాగే మోసపోయేవారు అతడికి ఎల్లవేళలా లభించారు. ఇతని కన్నా గొప్పదైన సామర్థ్యంతో ఒక విషయాన్ని నొక్కి వక్కాణించినవాడు, లేక ఒక విషయాన్ని ప్రమాణపూర్వకమైన వాగ్దానాలతో స్థిరంగా చెప్పికూడా దానిని తక్కువగా ఆచరించినవాడు ఎప్పుడూ లేడు. అయినప్పటికీ అతడి యొక్క మోసాలు ఎల్లవేళలా అతడి ఆకాంక్షలకు అనుగుణంగానే విజయవంతమయ్యాయి. ఎందుకంటే మానవజాతిలోని ఈ పార్శ్వాన్ని అతడు బాగా అర్థం చేసుకున్నాడు.

కనుక ఒక రాజు నేను పైన వరుసగా పేర్కొన్న మంచి లక్షణాలన్నింటినీ కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఐతే వాటిని కలిగి ఉన్నట్లుగా కనబడటం మాత్రం చాలా అవసరం. వాటిని కలిగి ఉండటం మరియు ఎల్లప్పుడూ వాటిని ఆచరించడం హానికరం; వాటిని కలిగి ఉన్నట్లుగా కనబడటం ఉపయోగకరం అని సైతం చెప్పడానికి నేను సాహసిస్తునాను. దయగా, విశ్వసనీయంగా, మానవీయంగా, మతపరంగా, నిజాయితీగా కనబడటం మంచిది, నిజంగా అలా ఉన్నా కూడా మంచిదే. అయితే, నీ మనస్సు ఎలాంటి సమతుల్యతతో ఉండాలంటే ఒకవేళ అలా ఉండకూడని అవసరం కలిగినట్లైతే వాటికి విరుద్ధంగా మారడం ఎలానో తెలిసి ఉండాలి, ఆప్రకారంగా మారగలగాలి.

రాజ్యాన్ని నిలుపుకోవడానికి విశ్వసనీయతకు, స్నేహానికి, మానవత్వానికి, మతానికి విరుద్ధంగా పని చేయకతప్పని పరిస్థితి తరచుగా తలయెత్తడం వల్ల, మనుషులు మంచివారుగా పరిగణింపబడటానికి దారితీసే వాటన్నింటినీ ఒక రాజు, మరిముఖ్యంగా ఒక కొత్త రాజు (New Prince) ఆచరించలేడని నీవు అర్థం చేసుకోవాలి. కనుక విధి యొక్క మలుపులు, మార్పుల వత్తిడికి అనుగుణంగా మారడానికి సంసిద్ధంగా ఉన్న మనసును కలిగి ఉండటం అతడికి అవసరం. అయినప్పటికీ, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సాధ్యమైనంతవరకు అతడు సన్మార్గం నుండి తప్పుకోకూడదు. కానీ తప్పనిసరైతే మాత్రం దుర్మార్గాన్ని ఎలా అనుసరించాలో అతడికి తెలిసి ఉండాలి.

ఈ కారణంగా ఒక రాజు  పైన పేర్కొన్న ఐదు లక్షణాలతో నిండిలేనిది ఏదీకూడా తన పెదవుల నుండి ఎన్నడూ జారకుండా జాగ్రత్త తీసుకోవాలి. దానిమూలంగా అతడు చూడటానికి, వినడానికి దయ, విశ్వాసం, నిజాయితీ, మానవత, మరియు మతం అన్నింటికీ మూర్తీభవించిన రూపంగా అనిపిస్తాడు. కలిగి ఉన్నట్లు కనిపించడానికి ఆఖరి లక్షణంకన్నా ఎక్కువ అవసరమైనది ఏదీలేదు. ఎందుకంటే మనుషులు సాధారణంగా చేతి కన్నా కూడా కంటి ద్వారానే ఎక్కువగా ఒక అభిప్రాయానికి వస్తారు. ఎందుకంటే నిన్ను చూడటం అనేది అందరికీ సంబంధించినది, నీతో పరిచయం అనేది కొద్దిమందికి సంబందించినది. నీవు ఎలా కనిపిస్తావో దానినే ప్రతి ఒకరూ చూస్తారు. కానీ నీవు ఏమిటన్నది నిజంగా కొద్దిమందే తెలుసుకుంటారు. అంతేకాక ఆ కొద్దిమంది రాజ్యం యొక్క సర్వోన్నతాధికారపు పరిరక్షణలో ఉన్న ఎక్కువమంది యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించేంత ధైర్యం చేయరు. మనుషులందరి యొక్క చేతల విషయంలో, —మరిముఖ్యంగా సవాలు చేయడం వివేకం అనిపించుకోని రాజుల యొక్క చేతల విషయంలో— ఎవరైనా సరే వాటి ఫలితాన్ని బట్టే మంచోచెడో నిర్ణయిస్తారు.

ఈ కారణం మూలంగా, ఒక రాజు తన రాజ్యాన్ని జయించిన మరియు దానిని నిలుపుకున్న గౌరవాన్ని పొందగలిగితే, అతడనుసరించిన మార్గం ఎల్లప్పుడూ సరియైనదిగానే పరిగణింపబడుతుంది. అతడు ప్రతిఒకరి చేతా ప్రశంసించబడతాడు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఒక విషయం ఎలా కనిపిస్తున్నది, దాని నుండి ఏమి వస్తున్నది అన్న దానికే ఎల్లప్పుడూ ఆకర్షితులవుతారు. మరి ఈ ప్రపంచంలో సామాన్య ప్రజలు మాత్రమే ఉన్నారు. అక్కడ కొద్దిమందికి (The Few) మాత్రమే స్థానం దొరుకుతుంది. జన బాహుళ్యానికి (The Many) ఆధారపడే చోటే ఉండదు.


నేటి కాలంలోని ఒక రాజు—పేరు వెల్లడించడం అంత మంచిది కాదు—ఎప్పుడూ శాంతి మరియు విశ్వాసం గురించి తప్ప మరేమీ మాట్లాడడు. కానీ ఆ రెంటికీ అతడు పూర్తి వ్యతిరేకి. ఒకవేళ అతడు ఆ రెంటిలో ఏ ఒక్కదానిని ఆచరించినాకూడా అతడు అనేక పర్యాయాలు తన ప్రఖ్యాతిని, రాజ్యాన్ని  కోల్పోయి ఉండేవాడు. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి