29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 26వ అధ్యాయం






రాజు - రాజ్యం




అధ్యాయం – 26 

ఇటలీని అనాగరికులనుండి విముక్తి చేయడానికి పిలుపు







(Unedited)


పై చర్చలలోని విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించి, ఒక కొత్తరాజుకు ప్రస్తుతకాలం అనుకూలమైనదేనా అనీ, జ్ఞానం మరియు నైతికత కలిగిన ఒక వ్యక్తికి –తనకు గౌరవం కలిగించేవీ, తనదేశ ప్రజలకు మంచి చేసేవీ అయిన– ఒక నూతన విషయ క్రమాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చే అంశాలు ఈ కాలంలో ఉన్నాయా అనీ నాలో నేను ఆశ్చర్యపడిన నాకు ఒక కొత్తరాజుకు అనుకూలంగా అనేక అంశాలు కలసిరావడానికి ప్రస్తుతకాలం కన్నా ఎక్కువ సరియైనది నాకు ఎప్పుడూ తెలియదని నాకు అర్థమైనది.


నేను చెప్పినట్లుగా మోసెస్ సామర్థ్యం వెల్లడికావడానికి ఇజ్రాయెల్ ప్రజలు బంధీలుగా ఉండవలసిన అవసరం, సైరస్ ఆత్మౌన్నత్యం బహిర్గతం కావడానికి పర్షియన్లు మెడెస్‌చే అణచివేయబడవలసిన అవసరం, అలాగే థెసియస్ సామర్థ్యం ప్రదర్శింపబడటానికి ఎథీనియన్లు చెల్లాచెదురుకావలసిన అవసరం ఏర్పడినట్లుగా ప్రస్తుత సమయంలో ఇటలీకి చెందిన ఒక మహావ్యక్తి గుణగణాలు (నైతికత) బహిర్గతం కావడానికి ఇటలీ ఇప్పుడున్న—హీబ్రూలకన్నా ఎక్కువ బానిసత్వం, పర్షియన్లకన్నా ఎక్కువ అణచివేత, ఎథీనియన్ల కన్నా ఎక్కువగా చెదిరిపోయిన, నాయక్త్వం లేని, ఓ వ్యవస్థ లేని, దాడిచేయబడిన, దోచివేయబడిన, ముక్కలు చేయబడిన, జయించబడిన, ఇలా అన్ని రకాలుగా విధ్వంసానికి గురైన — దుర్దశకు చేరుకోవలసిన అవసరం ఏర్పడింది.


మన విముక్తి కొరకు భగవంతునిచే ఆదేశింపబడ్డాడా అని మనం భావించేటట్లుగా ఒకరు (*) గతంలో ఆశలు రేకెత్తించినప్పటికీ, తరువాతి కాలంలో, అతడి సామర్థ్యం ఉచ్ఛస్తితిలో ఉండగా, విధి అతడిని తిరస్కరించడం మనం చూశాం. దానితో ఇటలీ నిర్జీవంగా విడిచిపెట్టబడి తన గాయాలను నయం చేసేటటువంటి; లొంబార్డీ దోచివేతకు, రాజ్యంలో, టస్కనీలో బలవంతపు వసూళ్ళకు, పన్నులకు ముగింపు పలకగలిగిన, ఎంతోకాలం నుండి తనను వేధిస్తున్న కురుపులవంటి బాధలను నయం చేయగలిగిన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నది. ఈ కౄరత్వాన్నుండి, ఆటవికమైన ఈ అవమానాలనుండి తనను రక్షించగలిగిన వారిని ఎవరినైనా పంపమని ఆమె భగవంతుడిని ఎలా వేడుకుంటున్నదో చూడు. అలాగే ఇందుకొరకు ఎవరైనా బావుటాను ఎగురవేసిన పక్షంలో, దానిని అనుసరించడానికి ఆమె సిద్ధంగా ఉండటాన్ని, ఆతురత చెందడాన్ని కూడా చూడు.



సీజర్ బోర్గియా (*)



శౌర్యపరాక్రమాలు, సిరిసంపదలతో ఖ్యాతిగడించిన, భగవదనుగ్రహం కలిగిన, అలాగె ఇప్పుడు మీ కుటుంబమే అధిపతిగా (*) ఉన్న చర్చి అనుగ్రహం కూడా కలిగిన, అలాగే ఈ విమోచన కార్యక్రమానికి నాయకత్వం వహించగలిగిన మీ కుటుంబం మీద కన్నా ఆమె ఎక్కువ ఆశపెట్టుకోవడానికి ప్రస్తుతం ఎవరూ కనబడటంలేదు. నేను పేర్కొన్న వ్యక్తుల జీవితాలను, వారి చేతలను గనుక నీవు గుర్తుచేసుకున్నట్లైతే ఇది కష్టతరం కాబోదు. వారెంతో గొప్ప మరియు అద్భుతమైన మనుష్యులు అయినా కూడా వారు కేవలం మనుష్యులు. అలాగే వారిలో ఏఒక్కరికి కూడా ప్రస్తుతకాలం అందిస్తున్నంత అవకాశం రాలేదు. ఎందుకంటే వారు చేపూనిన కార్యం ఇంతకన్నా ఎక్కువ న్యాయమైనది కాదు, అలాగే ఇంతకన్నా తేలికైనదీ కాదు. అలాగే ఆ భగవంతుడు మీకు స్నేహితుడైనంతగా వారికి కాదు (మీకు స్నేహితుడైనంతగా కన్నా ఎక్కువగా వారికి స్నేహితుడు కాదు)



head of the Church Giovanni de Medici, the newly elected Pope Leo X. Pope at the time The Prince was written. ఇతడు మెడిసి కుటుంబం నుండి ఎన్నికైన పోప్ (*)



మన వైపు గొప్ప న్యాయం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఆవశ్యకమైనదైన ఆ యుద్ధం న్యాయమైనది. సైన్యం తప్ప మరి ఏ ఇతర ఆశాలేని ఈ సమయంలో సైన్యం పవిత్రమైనది. ఇక్కడ గొప్ప ఆకాంక్ష ఉన్నది, ఎక్కడ ఆకాంక్ష గొప్పగా ఉంటుందో, –నేను ఉదాహరణలుగా నీ ముందుందిన వ్యక్తుల విధానాలను నీవు అనుసరించినట్లైతే– అక్కడ కష్టాలు గొప్పగా ఉండలేవు. అంతేకాకుండా నిరుపమానమైన దేవుడి మహిమలు ఎంతటి అసాధారణరీతిలో ప్రకటింపబడ్డాయి?! సముద్రం రెండుగా విడిపోయింది, మేఘం దారి చూపింది, ఱాతి నుండి నీరు వెలుపలికి పారింది, మన్నా వర్షించింది, అదేవిధంగా ప్రతీ విషయం తమ గొప్పదనానికి దారితీసింది. మిగతా కార్యాన్ని తమరు చేయవలసి ఉన్నది. పనిచేయడంలో మనస్వేచ్ఛను, అలాగే ఖ్యాతిలో మనకు చెందవలసిన భాగాన్ని మననుండి వేరుచేయకుండా ఉండటం కొరకు భగవంతుడు అన్నీ చేయడు.



ఖ్యాతి గడించిన మీ కుటుంబం చేయగలుగుతుందని ఆశిస్తున్న దానిని ఇంతకు ముందు పేర్కొన్న ఇటాలియన్లు ఎవరూ చేయలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇటలీలో జరిగిన ఎన్నో విప్లవాలలోనూ, ఎన్నో యుద్ధ ఘటనలలోనూ సైనిక సామర్థ్యం అడుగంటిపోయిందేమో అన్నట్లుగానే ఎప్పుడూ కనబడింది (అనిపించింది). దీనికి కారణం పాత పద్ధతులు మంచివి కాక పోవడమే. పైగా కొత్తపద్దతులు ఆవిష్కరించడం ఎలాగో (మాలో ఎవరికీ తెలియదు) తెలిసిన వారు ఒక్కరూ తలయెత్తలేదు. కొత్తగా తలయెత్తిన వానికి అతడు ప్రవేశపెట్టిన కొత్త పద్దతులు, చట్టాలు తెచ్చినంతగా (ప్రవేశపెట్టడం కన్నా) గౌరవం మరి ఏదీ తేలేదు. అవి మంచి పునాదిని మరియు గొప్పదనాన్ని కలిగి ఉన్నపుడు అవి అతడిని గౌరవనీయుడిగా, ఆరాధనీయుడిగా చేస్తాయి. ఇటలీలో అన్ని విధాలైన కొత్తపద్దతులనూ ప్రవేశపెట్టగలిగే అవకాశాలకు కొదవేలేదు.



ఇక్కడ బాహువులలో గొప్ప పరాక్రమం ఉన్నది, అదే సమయంలో ఆ పరాక్రమం శిరస్సులో లోపించినది. ద్వంద యుద్ధాలలోనూ, కొద్దిమంది పాల్గొనే యుద్ధలలోనూ ఇటాలియన్లు ఎంతటి బలవంతులో, ఎంతటి నైపుణ్యం ఉన్నవారో, ఎంతటి యుక్తిపరులో శ్రద్ధగా చూడు. అయితే సైన్యం విషయం వచ్చేసరికి అసలు పోలికే కనిపీంచదు. ఇది పూర్తిగా నాయకులలోని లోపాలవల్లనే సంభవిస్తున్నది. సమర్థులైన వారిలో విధేయత కనిపించదు. అలాగే ప్రతిఒకరూ తనను తాను సమర్థుడిగా భావించుకుంటూ ఉన్న కారణంగా పరాక్రమంలోగానీ, అదృష్టంలోగానీ ఇతరులకన్నా ఉన్నతంగా ఉండి వారిని తనకు లోబడి ఉండేటట్లు చేసుకోగలిగేవారు ఎప్పుడూ కూడా ఏ ఒక్కరూ కూడా లేరు. అందువలన చాలాకాలంనుండి కూడానూ, అలాగే ఎంతో పోరాటం జరిగిన గత ఇరువది సంవత్సరాలలోనూ ఎప్పుడెప్పుడైతే పూర్తిగా ఇటాలియన్ సైన్యం ఉన్నదో అప్పుడు ప్రతిసారీ చాలా పేలవమైన పనితీరును ప్రదర్శించింది. దీనికి తొలి నిదర్శనం రెండవ టారో యుద్ధం, ఆ తరువాత అల్లెసాండ్రియా యుద్ధం, కపువా యుద్ధం, జెనోవా యుద్ధం, వైలా యుద్ధం, బొలొగ్నా యుద్ధం, మేస్త్రీ యుద్ధం. 



(రెండవ టారో యుద్ధం 1495 లో, అల్లెసాండ్రియా యుద్ధం 1499 లో, కపువా యుద్ధం 1501 లో, జెనోవా యుద్ధం 1507 లో, వైలా యుద్ధం 1509 లో, బొలొగ్నా యుద్ధం 1511 లో, మేస్త్రీ యుద్ధం 1513 లో జరిగాయి)



అందువలన ఘనతవహించిన మీ కుటుంబం (గతంలో) తమ దేశాలను రక్షించిన గొప్పవ్యక్తులను అనుసరించాలని కోరుకున్నట్లైతే –ప్రతి యుద్ధానికి ఒక నిజమైన పునాదిగా– మీ స్వంత సైన్యాలను కలిగి ఉండటం అనేది అన్నింటికంటే ముందుగా అవసరం. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ విశ్వసనీయమైన, నిజమైన, ఉత్తమమైన సైనికులు ఎక్కడా ఉండలేరు (నీకు లభించరు). అలాగే ఆ సైనికులు ఒక్కొక్కరిగా (కూడా మంచి వారే అయినా) మంచి వారైనప్పటికీ అందరూ కలసికట్టుగా —వారు వారి రాజుచే ఆదేశింపబడుతున్నప్పుడు, అతడిచేత గౌరవింపబడుతున్నప్పుడు, అతనిచే పోషింపబడుతున్నపుడు— మరింత ఉత్తమంగా ఉంటారు. అందువలన, ఇటాలియన్ పరాక్రమం ద్వారా విదేశీయులనుండి నీవు రక్షణపొందగలగడానికి అటువంటి సైన్యంతో సిద్ధంగా ఉండటం అవసరం.



స్విస్ మరియు స్పానిష్ పదాతిదళాలు రెండూ అతి భీకరమైనవిగా పేరుపొందినప్పటికీ రెంటిలో కూడా లోపాలున్నాయి. ఆ కారణంగా ఒక వైవిద్యమైన పద్దతిలో తర్ఫీదు పొందిన సైన్యం వాటీని నిలువరించడమేకాక ఖచ్చితంగా ఓడించగలుగుతుంది. స్పానియార్డులు అశ్వికదళాన్ని ఎదుర్కోలేరు, స్విస్ సైన్యం తమను సమీపించి, తమంత నిర్ణయాత్మకంగా (దృఢనిశ్చయంతో) పోరాడే పదాతిదళం ముందు తలవంచుతుంది. ఈ కారణంగా స్పానియార్డులు ఫ్రెంచివారి అశ్వికదళం యొక్క దాడిని కాచుకోలేకపోవడం, అలాగే స్విస్ సైన్యం స్పానిష్ పదాతిదళం చేతిలో ఓడిపోవడం మనం చూశాం, ఇక ముందు కూడా చూస్తాం. రెండవ పరిస్థితి (స్విస్ సైన్యం స్పానిష్ ఇన్‌ఫాంట్రీ చేతిలో ఓడిపోవడం) పూర్తిగా సంభవించనప్పటికీ దానిని సూచించే సంఘటన రవెన్నా యుద్ధంలో మనం చూశాం. ఆ యుద్ధంలో స్పానిష్ పదాతిదళం స్విస్ వారి(వలే) తరహాలో పోరాడే జర్మన్ సైన్యాలను ఎదుర్కొంది. ఆ సంఘటనలో స్పానియార్డులు తమ చురుకుదనంతోనూ, డాలుల సహాయంతోనూ బల్లాలు చేబూనిన జర్మన్ సైన్యంలోకి చొచ్చుకుపోయి వారికి సమీపాన నిలిచాయి. దానితో జర్మన్‌లు ఎంతో సేపు తమను తాము రక్షించుకోలేకపోయారు. ఒక వేళ వారి మీదకు అశ్వికదళం కనుక పంపబడకపోయినట్లైతే వారు జర్మన్‌లను చిత్తుచిత్తుగా ఓడించిఉండేవారు. ప్రతి ఒక సైన్యంలోని లోపాలను తెలుసుకున్నమీదట నీవు నీ సైనికులకు ఒక విభిన్నమైన పద్దతిలో —అశ్వికదళాన్ని నిలువరించడానికి, అలాగే పదాతిదళానికి భయపడకుండా ఉండాటానికి— తర్ఫీదునివ్వగలవు. ఇది జరగడానికి, కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు, పాతసైన్యంలోనే కొద్దిపాటు మార్పును ప్రవేశపెడితే చాలు. ఒక కొత్త రాజుకు ఖ్యాతిని, అధికారాన్ని తెచ్చిపెట్టే విషయాలు ఇవే.



అందువలన ఇటలీ ఎట్టకేలకు తన విమోచనకర్తను దర్శించే ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. విదేశీ ఉపద్రవం వల్ల ఎంతగానో బాధపడ్డ ప్రాంతాలన్నింటిలోనూ ఎంతటి ప్రేమతో, ప్రతీకారం కొరకు ఎంతటి దాహంతో, ఎంతటి మొండి విశ్వాసంతో, ఎంతటి భక్తిప్రపత్తులతో, ఎంతటి కన్నీటితో అతడు స్వాగతించబడతాడో ఎవరూ వ్యక్తం చేయ.ఎఏరు. అతడికి ఏ తలుపులు మూసుకుపోతాయి? అతడికి విధేయులుగా ఉండటానికి ఎవరు తిరస్కరిస్తారు? ఎటువంటి అసూయ అతడిని ఆటంకపరుస్తుంది? ఏ ఇటాలియన్ అతడికి వందనాలర్పించడు?



మాకందరికీ ఈ ఆటవిక రాజ్యం దుర్గంధభరితంగా ఉంది. కనుక ఘనతవహించిన మీ కుటుంబం ఈ కార్యాన్ని –న్యాయమైన లక్ష్యం వలన ప్రేరేపింపబడిన– ధైర్యంతో, ఆశతో చేబూనాలి.  ఆ ప్రకారంగా మీ పతాకం క్రింద మన మాతృదేశం వైభవాన్ని పొందుతుంది, అలాగే మీ ప్రాయోజకత్వం క్రింద పెట్రార్క్ యొక్క ఈ ఉవాచ నిజమవుతుంది.



మొరటు క్రోథాన్ని ధైర్య స్థైర్యాలు దండించపూనుకున్నపుడు యుద్ధం ఎంతోసేపు జరగదు.


ఎందుకంటే ఇటాలియన్ల హృదయాలను ప్రాచీనకాలపు స్ఫూర్తి ఇంకా ఉత్తేజపరుస్తూనే ఉన్నది. అది ఇంకా చావలేదు.









The End




3 కామెంట్‌లు:

  1. Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com

    రిప్లయితొలగించండి
  2. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    రిప్లయితొలగించండి