రాజు - రాజ్యం
అధ్యాయం - 14
సైనిక వ్యవహారాలకు సంబంధించి రాజు యొక్క విధుల గురించి
సాధనకు సంబంధించి అతడు అన్నిటికన్నా ముఖ్యంగా తన సైనికులను మంచి క్రమశిక్షణ కలిగిన వారిగా, సుశిక్షితులైన వారిగా తీర్చిదిద్దటమే కాక తాను నిరంతరం వేటలో పాల్గొంటూ ఉండాలి. దీనివలన అతడి శరీరం కఠిన పరిశ్రమకు అలావాటుపడుతుంది, ఆయా ప్రాంతాల స్వభావాన్ని ఎంతోకొంత తెలుసుకుంటాడు, పర్వతాలు ఏ విధంగా పైకెగసి ఉంటాయి, లోయలు ఏ విధంగా ప్రారంభమవుతాయి, మైదానాలు ఏ విధంగా విస్తరించి ఉంటాయి మొదలైన విషయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నదుల యొక్క మరియు చిత్తడినేలల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు. అలానే వీటన్నింటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుంటాడు. ఈ పరిజ్ఞానం రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. మొదటగా, ఇతడు తన దేశం గురించి తెలుసుకోవడం నేర్చుకుని, దానిని మరింత సమర్థవంతంగా కాపాడుకుంటాడు. తరువాత, ఆ ప్రాంతం యొక్క పరిజ్ఞానం మరియు పరిశీలన ద్వారా అతడికి అటుపిమ్మట ఏ ఇతర ప్రాంతాన్ని అధ్యయనం చేయటం అవసరమైనా, దానిని అతడు చాలా సులువుగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే, ఒకప్రాంతంలోని -ఉదాహరణకు టస్కనీ లోని- కొండలు, లోయలు, మైదానాలు, నదులు మరియు చిత్తడినేలలు ఇతర దేశాలలోని వాటినే పోలి ఉంటాయి. కనుక వీటికి సంబందించిన ఒక దేశపు పరిజ్ఞానంతో ఎవరైనా చాలా సులువుగా ఇతర దేశాల పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ఈ నైపుణ్యం లేని రాజు ఒక నాయకుడు కలిగి ఉండవలసిన అతిముఖ్యమైన లక్షణం లేనివాడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ పరిజ్ఞానం అతనికి తన శత్రువును ఆశ్చర్యపరచడాన్ని, శిబిరాలను ఏర్పాటుచేయడాన్ని, సైన్యానికి నేతృత్వం వహించడాన్ని, యుద్ధాన్ని క్రమబద్దీకరించడాన్ని, పట్టణాలను సానుకూలంగా ముట్టడించడాన్ని నేర్పుతుంది.
(టస్కనీ అనునది ఇటలీలోని ఒక ప్రాంతం)
ఫిలోపోయెమెన్ (Philopoemen) ఏచియన్స్ యొక్క రాజు. ఇతడి గురించి చరిత్రకారులు చేసిన ఇతర ప్రశంసలకు తోడుగా మరో ప్రశంస ఏమిటంటే ఇతడు శాంతి సమయంలో తన మనస్సులో యుద్ధనియమాల గురించిన ఆలోచనలు తప్ప అన్యమేమీ కలిగి ఉండేవాడు కాడు. ఇతడు దేశంలో తన స్నేహితులతో ఉన్నపుడు తరచుగా ఆగి, వారితో ఈ విధంగా చర్చించేవాడు. “ఒకవేళ మన శత్రువు కొండమీద ఉండి, అదేసమయంలో మనం ససైన్యంగా ఇక్కడ ఉంటే పరిస్థితి ఎవరికి సానుకూలంగా ఉంటుంది? ఏ విధంగా మనం -సరైన శ్రేణీ క్రమాన్ని పాటిస్తూ, సురక్షితంగా పురోగమించి- శత్రువును చేరాలి? మనం తిరోగమించాలనుకుంటే, ఏ దిశలో వెళ్ళాలి? ఒకవేళ శతృవు తిరోగమిస్తే, మనం వారిని ఏలా వెంబడించాలి?” …ఆ విధంగా చర్చజరిగేకొలదీ సైన్యం ఎదుర్కోవడానికి అవకాశమున్న అన్ని పరిస్థితులను అతడు వాళ్ళ ముందుంచుతాడు. వాళ్ళ అందరి అభిప్రాయాలు విన్న మీదట, తన అభిప్రాయాన్ని ప్రకటించి, దానిని తగిన కారణాలతో నిర్థారణ చేస్తాడు. ఈ విధమైన నిరంతర చర్చల వలన యుద్ధ సమయంలో అతడు ఎదుర్కోలేని పరిస్థితులు ఎన్నడూ తలయెత్తేవి కావు.
(Philopoemen- born 252 B.C., died 183 B.C.)
మేథో పరిశ్రమ (మానసిక శిక్షణ) కొరకు రాజు చరిత్రలను చదవాలి. పేరు పొందిన వ్యక్తులు యుద్ధంలో ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికీ, వారి గెలుపోటములకు కారణాలను పరీక్షించడానికీ, వారి కార్యాలను అక్కడ అధ్యయనం చేయాలి. దీనివలన మనం ఓటమికి గురిచేసే కారణాలకు దూరంగా ఉండి, గెలుపునందించే కారణాలను అనుకరించవచ్చు. వీటన్నింటినీ మించి గొప్పవ్యక్తులందరూ చేసినట్లుగా నీవు కూడా చేయి. అదేమంటే వారు తమకు నమూనాగా --ఎవరు తమ కన్నా ముందు ప్రఖ్యాతిని మరియు ప్రశంసను పొంది ఉంటారో, అలాగే ఎవరు సాధించిన విజయాలను, చేసిన పనులను వారు తమ మనసులో నిరంతరం పెట్టుకుంటారో, అటువంటి వ్యక్తిని-- ఎంచుకుంటారు. ఎలా అంటే ఎచిల్లిస్‌ను అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్‌ను సీజర్, సైరస్‌ను సిపియో తమ నమూనాగా ఎంచుకుని అనుకరించినట్లుగా. గ్జినోఫోన్ చే రచించబడిన సైరస్ జీవిత చరిత్రను పఠించిన తదుపరి ఎవరైనా --సిపియో జీవితంలో ఈ అనుకరణ ఎంతో వైభవాన్ని తెచ్చిందనీ, అలాగే గ్జినోఫోన్ తన రచనలో సైరస్ గుణాలుగా చెప్పిన నైతిక పరిశుద్ధత, సౌజన్యం, మానవత్వం, ఉదారత మొదలైన లక్షణాలన్నింటినీ సిపియో కూడా కలిగి ఉన్నాడనీ-- తెలుసుకుంటారు.
వివేకం కలిగిన రాజు ఇటువంటి నియమాలను కొన్నింటిని పాటించవలసి ఉన్నది. శాంతి సమయాలలో ఎన్నడూ విశ్రమించక, కష్టసమయంలో ఉపయోగపడే విధంగా తన వనరులను పరిశ్రమతో పెంపొందించుకోవాలి. దానివలన, ఒకవేళ దురదృష్టం వెంటాడినట్లైతే ఆ దెబ్బలను అతడు తట్టుకోగలిగే పరిస్థితిలో ఉంటాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి