రాజు - రాజ్యం
అధ్యాయం - 15
వ్యక్తులు, ముఖ్యంగా రాజులు ప్రసంశలు పొందటానికి లేక నిందలు మోయడానికి కారణమయ్యే విషయాల గురించి
ఒక రాజు తన అనుచరులతో మరియు మిత్రులతో (subject and friends) మెలగవలసిన విధానం ఎలా ఉండాలన్నది తెలిసుకోవడం ఇప్పుడు మిగిలి ఉన్నది. అనేకమంది ఈ అంశం గురించి రాశారనే విషయం నాకు తెలుసు కనుక, దీనిని నేను మరలా చెప్పడం, --మరి ముఖ్యంగా ఈ విషయం గురించి చర్చించేటపుడు నేను ఇతరులు చెప్పిన దానితో విభేదించడం-- అనేది తెగువగా పరిగణింపబడుతుందని నేను భావిస్తాను. అయితే, అర్థం చేసుకునే వారికి ఉపయోగకరం గా ఉండే విషయం గురించి రాయడం నా ఉద్దేశ్యం కనుక, ఒక విషయం గురించి ఊహలు చేయడం కన్నా, దాన్ని గురించిన వాస్తవాలను, నిజాలను అనుసరించడం మరింత సముచితంగా నాకు కనపడుతున్నది. ఎందుకంటే అనేక మంది రిపబ్లిక్‌ల గురించి, సంస్థానాల గురించి ఎంతో వర్ణించారు కానీ, వాస్తవంలో ఎన్నడూ, ఎవరూ వాటిని ఆ విధంగా కనలేదు, వినలేదు. ఎందుకంటే ఒకవ్యక్తి ‘ఏ విధంగా జీవించాలి’ అన్నదానికీ, ‘ఏ విధంగా జీవిస్తాడు’ అన్నదానికీ చాలా భేదం ఉంటుంది. ఎవరైతే ‘ఏమి జరిగితే బాగుంటుంది’ అన్నదాని కొరకు ‘ఏమి జరిగింది’ అన్నదానిని నిర్లక్ష్యం చేస్తారో అతడు తనను రక్షించుకోవడనికి బదులుగా త్వరలోనే వినాశనానికి దగ్గరౌతాడు. ఎందుకంటే ఎవరైతే ప్రతీ విషయంలోనూ పూర్తి ఆదర్శవంతంగా, పూర్తి మంచిగా ఉండాలని కోరుకుంటారో వారు అనేక మంది చెడ్డవారి మధ్యన త్వరలోనే పతనమైపోతారు.
దీనిని బట్టి తన స్థానాన్ని నిలుపుకోవాలనుకునే రాజెవరికైనా చెడుగా ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండవలసిన అవసరం ఉన్నది. అవసరాన్ని బట్టి ఆవిధంగా ఉండాలా లేక ఉండకూడదా అన్నది కూడా తెలిసి ఉండాలి. కనుక ఒక రాజుకు సంబంధించిన ఊహాత్మకమైన విషయాలన్నింటినీ పక్కనబెట్టి వాస్తవమైన వాటినే చర్చిస్తూ నేను ఓ విషయం చెబుతాను. మనుషులెవరి గురించైనా మనం మాట్లాడేటపుడు -మరీ ముఖ్యంగా రాజుల గురించి, ఎందుకంటే వారు చాలా ఉన్నత స్థానంలో ఉంటారు గనుక- వారికి అపనిందనో లేక ప్రశంసనో కలుగజేసే ప్రత్యేక లక్షణాలను కలిగిన వారిగా వారిని మనం గుర్తిస్తాము. ఈ విధంగా ఒక మనిషి ఉదారుడుగా ప్రఖ్యాతిని పొందుతాడు. మరో మనిషి పిసినారిగా పేరు పొందుతాడు (పేరాశపరుడుకు బదులు పిసినారి అనే పదం ఎందుకు వాడానంటే పేరాశ కలిగినవాడు ధనం మీద వ్యామోహంతో ఇతరుల సొమ్మును సైతం కాజేయలని చూస్తాడు. కానీ పిసినిగొట్టు అదే ధన వ్యామోహంతో తన సొమ్మును ఖర్చు చేయకుండా మాత్రమే ఉంటాడు). ఒక మనిషి దానగుణానికి పేరుపొందుతాడు, మరో మనిషి దోపిడీదారుడుగా పేరుపొందుతాడు. ఒకడు క్రూరుడు, మరొకడు దయామయుడు. ఒకడు నమ్మదగిన మనిషి, మరొకడు నమ్మదగని మనిషి. ఒకడు పిరికి వాడు, మగటిమి లేనివాడు, మరొకడు ధైర్యసాహసాలు కలిగినవాడు. ఒకడు సౌజన్యమూర్తి, మరొకడు గర్విష్ఠి. ఒకడు కాముకుడు, మరొకడు నీతివర్తనుడు. ఒకడు అమాయకుడు, మరొకడు జిత్తులమారి. ఒకడు స్థిరచిత్తుడు, మరొకడు చంచలుడు. ఒకడు గంభీరంగా ఉంటాడు, మరొకడు చిలిపిగా ఉంటాడు. ఒకడు ఆస్తికుడు, మరొకడు నాస్తికుడు… ఇలా ఉంటారు. పైన తెలిపిన లక్షణాలలో మంచివాటన్నింటినీ ఒక రాజు గనుక ప్రదర్శించగలిగితే, అది ఎంతో ప్రశంసనీయంగా ఉంటుందనే విషయం అందరూ ఒప్పుకుంటారని నాకు తెలుసు. కానీ, ఆ లక్షణాలన్నింటినీ కలిగి ఉండటం గానీ, వాటిని ఆచరించడం గానీ –మానవ పరిస్థితులు అందుకు వీలు కల్పించవు కనుక- సాధ్యం కాదు. కనుక తన రాజ్యాన్ని కోల్పోయేంతగా అపఖ్యాతిని తెచ్చిపెట్టే దుష్టకార్యాలకు దూరంగా ఎలా ఉండాలో -తెలుసుకోగలిగే వివేకాన్ని తగినంతగా కలిగి ఉండటం- ఒక రాజుకు అవసరం. సాధ్యమైతే రాజ్యం కోల్పోయేంత ప్రమాదంలేని దుష్టకార్యాలకు కూడా దూరంగా ఉండటం మంచిదేకానీ, అంత నిబద్ధతగా ఉండటం సాధ్యంకాదు కనుక, వాటిని నిస్సంకోచంగా ఆచరించవచ్చు. ఏ దుష్టకార్యాలు చేయకపోతే రాజ్యసంరక్షణ కష్టసాధ్యమౌతుందో వాటిని చేయడం మూలంగా వచ్చిపడే నిందను మోయడానికి రాజు వెనకాడవలసిన అవసరంలేదు. ఎందుకంటే అన్ని విషయాలు జాగ్రత్తగా పర్యాలోచించబడినట్లైతే, పైకి నీతివలే కనిపించే విషయాన్ని ఆచరించినట్లైతే, అది అతని యొక్క పతనానిని కారణమౌతుందనీ, అదే సమయంలో పైకి దుష్టకార్యంగా కనిపించే మరేదైనా విషయాన్ని ఆచరించినట్లైతే అది ఆ రాజుకు భద్రతను, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందనీ మనకు బోధపడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి