రాజు - రాజ్యం
అధ్యాయం - 16
ఉదారత మరియు లోభితనం గురించి
ఇప్పుడు పైన చెప్పబడిన లక్షణాలలో మొదటి దానితో ప్రారంభిస్తూ ఉదారత కలిగిన వారిగా ప్రఖ్యాతి పొందటం మంచిదే అని నేను చెబుతాను. అయితే ఉదారుడిగా ప్రఖ్యాతిని పొందలేని విధానంలో నీవు ఉదారతను ఆచరిస్తే అది నీకు హానికరం. ఎందుకంటే ఎవరైనా ఉదారతను నిజాయితీగా మరియు దానిని ఆచరించవలసిన విధానంలో ఆచరిస్తే అది ఇతరులకు తెలియకపోవడం వలన అందుకు వ్యతిరేకమైన (పిసినారి అనే) నిందను తప్పించుకోలేవు. కనుక ఉదారుడిగా ప్రజలలో పేరుపొందాలని కోరుకునే ఎవరైనా వైభవాన్ని, విలాసాన్ని ప్రదర్శించక తప్పదు. ఫలితంగా, అలా కోరుకునే రాజు అటువంటి కార్యాలకు తన సంపదనంతా వినియోగించి, --ఇంకా ఉదారుడు అనే పేరు నిలుపుకోవాలని అతడు కోరుకుంటుంటే-- చివరికి, ప్రజలమీద అక్రమంగా భారాన్ని మోపే విధంగా వత్తిడి చేయబడి, వారిమీద పన్నులు విధిస్తాడు. ఇంకా ధనాన్ని పొందటానికి అతడు చేయగలిగిన ప్రతీపనీ చేస్తాడు. ఇదంతా అతని ఎడల ప్రజలలో ద్వేషం కలుగచేస్తుంది. పేదవాడిగా మారిపోవటం వలన అతని కెవ్వరూ విలువనివ్వరు. ఆ విధంగా తన ఉదారతతో కొద్దిమందిని సంతోష పెట్టి, అనేక మందికి ఆగ్రహం తెప్పించడంతో, అతడు తాను యెదుర్కొనే మొట్టమొదటి కష్టంతోటే సతమతమైపోతాడు, మొదటి ప్రమాదానికే కృంగిపోతాడు. ఈ విషయాన్నంతా గ్రహించినమీదట, దానినుండి వెనుకకు మరలాలలనే ప్రయత్నంలో పిసినారితనం అనే నిందలో చాలా త్వరగా కూరుకుపోతాడు.
రాజు తాను కష్టాలపాలవటానికి సిద్ధమైతే తప్ప -ఇతరుల గుర్తింపు పొందేవిధంగా ఉదారత అనే నీతిని ఆచరించలేని స్థితిలో ఉంటాడు కనుక- అతనికి వివేకం ఉన్నట్లైతే పిసినారి అనే పేరు పొందడానికి భయపడకూడదు. ఎందుకంటే అతడు కాలక్రమంలో తాను ఉదారుడిగా ప్రవర్తించిన దానికన్నా ఎక్కువగా పరిగణించబడతాడు. దీనికి కారణం పొదుపు మూలంగా అతనికి ఆదాయం సరిపడినంతగా ఉంటుంది. దానివలన అతడు తన రాజ్యంమీద దండెత్తేవారిని స్వయంగా ఎదుర్కోగలుగుతాడు. అలాగే యుద్ధాలను ప్రజలమీద పన్నులు విధించకుండానే నడపగలుగుతాడు. అంటే ఎలా చెప్పవచ్చంటే ఎవరి నుండి ఏమీ తీసుకోడో, వారి అందరి యెడల ఇతడు ఉదారంగా ఉన్నట్లే. వీరు సంఖ్యలో లెక్కకు మిక్కిలిగా ఉంటారు. ఎవరికి ఇతడు ఏమీ ఇవ్వడో, వారి యెడల ఇతడు పిసినారితనాన్ని ఆచరించినట్లుగా చెప్పవచ్చు. వీరు సంఖ్యలో కొద్దిమందే ఉంటారు.
పిసినిగొట్టుగా (లోభి) పేరుపొందిన వారి వలన తప్ప మన కాలంలో మరెవరి వలనా ఘన కార్యాలు జరిగినట్లు మనం చూడలేదు. వారు తప్ప మిగతా వారంతా వైఫల్యాన్నే చవి చూశారు. పోప్ జూలియస్II పోప్ అవడం కొరకు ఉదారుడిగా తనకున్న ప్రఖ్యాతిని అడ్డు పెట్టుకున్నాడు. కానీ పోప్ అయిన తరువాత దానిని నిలుపుకోవడానికి అతడు కృషి చేయలేదు, ఫ్రాన్సు రాజు మీద యుద్ధం చేసినపుడు అతడు తన ప్రజల మీద అధిక పన్నులు వేయకుండానే అనేక యుద్ధాలను చేశాడు. ఎందుకంటే అతనికున్న అదనపు ఖర్చులకు కావలసిన ధనాన్ని అతడు తను దీర్ఘకాలం ఆచరించిన పొదుపు ద్వారా సమకూర్చుకున్నాడు. ఇప్పటి స్పెయిన్ రాజు ఒకవేళ ఉదారుడిగా కనుక పేరు పడి ఉంటే అన్ని యుద్ధాలను చేయగలిగేవాడే కాదు, వాటిలో గెలిచేవాడే కాదు. కనుక ఒక రాజు తన అనుచరులను దోచుకోకుండా ఉండటానికీ, తనను రక్షించుకోవడానికీ, తాను పేదరికానికీ, చులకనకూ లోనుకాకుండా ఉండటానికీ, దురాశాపరుడిగా మారవలసిన అగత్యం లేకుండా చేసుకోవడానికీ… ఇలా వీటన్నింటి కొరకు లోభిగా పేరుపొందడానికి సంకోచించకూడదు. ఎందుకంటే తాను పరిపాలన సాగించడానికి సహాయపడే దుష్ట కార్యాలలో (vices) అది ఒకటి.
సీజర్ ఉదార గుణం వలననే సామ్రాజ్యన్ని పొందగలిగాడు. అలానే అనేకమంది ఇతరులు ఉదారంగా ఉండటం వలన మరియు ఆ విధంగా పరిగణింపబడటం వలనే అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని ఎవరైనా అన్నట్లైతే దానికి నా సమాధానం: నిజంగా నీవు రాజువైనా లేక రాజు కావడనికి ప్రయత్నిస్తున్న వాడివి అయినా సరే. మొదటి పరిస్థితిలో ఈ ఉదార గుణం చాలా ప్రమాదకరం. రెండవ పరిస్థితిలో ఉదారంగా పరిగణించబడటం చాలా అవసరం. సీజర్ రోమ్ మొత్తంలోనే సర్వోన్నతుడిగా (చక్రవర్తిగా) రూపొందాలని అభిలషించిన వారిలో ఒకడు. కానీ అలా అయిన తరువాత అతడు ఖర్చులను అదుపులో ఉంచకుండా జీవించినట్లైతే అతడు తన ప్రభుత్వాన్ని నాశనం చేసుకొని ఉండేవాడు. దీనికి ఎవరైనా ఇలా బదులిస్తే: ఎందరో రాజులు ఉన్నారు. వారంతా ఉదారులుగా పరిగణింపబడుతూనే సైన్యంతో ఎన్నో ఘనకార్యాలు చేశారు. దీనికి నా బదులు: ఒక రాజు తనకు మరియు తన అనుచరులకు చెందిన దానిని ఖర్చు చేస్తాడు లేక ఇతరులకు చెందిన దానినైనా ఖర్చు చేస్తాడు. మొదటి పరిస్థితిలో అతడు చాలా పొదుపుగా ఉండాలి, రెండవ పరిస్థితిలో ఉదారంగా ఉండే ఏ అవకాశాన్ని అతడు వదులుకోకూడదు. ఏ రాజైతే తన సైన్యాన్ని దోపిడీలు, లూటీలు, బలవంతపు వసూళ్ళ ద్వారా పోషిస్తూ ముందుకు నడిపిస్తుంటాడో -ఇతరులకు చెందిన ధనం అతడి వద్ద ఉంటుంది కనుక- అతడికి ఈ ఉదారగుణం అవసరం. లేదంటే సైనికులు అతడిని అనుసరించరు. ఏదైతే నీది, నీ అనుచరులది కాదో దానిని నీవు సులువుగా ఇచ్చివేయవచ్చు …సైరస్, సీజర్, అలెగ్జాండర్ మాదిరిగా. ఎందుకంటే ఇతరులకు చెందిన దానిని విచ్చలవిడిగా పంచిపెట్టడం వలన నీకున్న ప్రఖ్యాతి పోదు, పైగా ఇంకా పెరుగుతుంది. నీ స్వంత ధనాన్ని విచ్చలవిడిగా పంచిపెట్టడం మాత్రమే నీకు నష్టదాయకం.
ఉదారత అంత త్వరగా వృధా అయిపోయే లక్షణం మరోటిలేదు. ఎందుకంటే నీవు దానిని ఆచరించే సమయంలోనే అలా ఆచరించగల సామర్థ్యాన్ని కోల్పోయి, పేదరికాన్నీ మరియు అగౌరవాన్నీ మూటగట్టుకుంటావు, లేదంటే ఆ పేదరికాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో దోపిడీదారుడిగా మారి ద్వేషాన్నైనా మూటగట్టుకుంటావు. రాజనేవాడు అన్నిటి కన్నా ముఖ్యంగా అగౌరవానికీ, ద్వేషానికీ గురికాకుండా తనను కాపాడుకోవాలి. ఉదారత ఈ రెంటికీ నీవు గురయ్యేటట్లు చేస్తుంది.
కనుక ఉదారుడుగా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటంలో దోపిడీదారుడనే చెడ్డ పేరునూ, దానితో పాటు ద్వేషాన్నీ కొనితెచ్చుకునేకన్నా, పిసినారి అనే పేరు తెచ్చుకోవడం వివేకం. ఎందుకంటే ఇది చెడ్డపేరును మాత్రమే తెస్తుంది కానీ ద్వేషానికి గురిచేయదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి