యుద్ధకళ
2వ అధ్యాయం: యుద్ధ సన్నాహం
సన్–జు
చెప్పాడు:
1) సాధారణంగా యుద్ధానికి అవసరమైనవి ఈ విధంగా ఉంటాయి. త్వరితగతిన
కదలగలిగే ఒకవేయి రథాలు, అంతే
సంఖ్యగల భారీ రథాలు, రక్షణ కవచాలు ధరించిన
లక్షమంది సైనికులు, ఇంత సైన్యం ఒక వేయి ‘లీ’ల దూరం పోగలిగేంత వరకు సరిపోయే ఆహారపదార్థాలు, అతిథులవినోదం, జిగురు మరియు రంగు వంటి చిన్న చిన్న వస్తువులు, రథాలు, రక్షణ కవచాల మీద వ్యయం చేసే మొత్తం; ఇలా వీటన్నింటితో కలుపుకుని రాజ్యంలోనూ, యుద్ధ రంగంలోనూ అయ్యే ఖర్చు రోజుకి వేయి ఔన్సుల వెండికి
చేరుకుంటుంది. ఒక లక్షమంది సైనికులతో కూడిన సైన్యం పెంపొందించడానికి అయ్యే ఖర్చు
ఆవిధంగా ఉంటుంది..
(‘లీ’ అనునది
చైనాలో పొడవును కొలిచే ఒక ప్రమాణం. 2.78 ‘లీ’లు
ఒక మైలుకు సమానం)
2) యుద్ధం చేసేటపుడు విజయాన్ని త్వరగా సాధించాలని కోరుకో. విజయం
ఆలస్యం అయ్యేకొలదీ సైనికుల ఆయుధాల పనితీరు మందగించడంతోపాటు వారి ఉత్సాహం నీరుగారి
పోతుంది. నీవు కోట ఉన్న ఒక పట్టణాన్ని ముట్టడిస్తే కాలయాపన వలన నీ బలం క్షీణించిపోతుంది.
3) అంతేగాక,
యుద్ధాన్ని సాగదీసే కొలదీ రాజ్యంలోని వనరులు యుద్ధభారానికి చాలవు.
4) నీ ఆయుధాలు సక్రమంగా పనిచేయని, నీ ఉత్సాహం నీరుగారి పోయి, నీ బలం క్షీణించి పోయి, నీ ఖజానా ఖర్చయి పోయి ఉన్న ఈ సమయంలో పొరుగు రాజులు నీ కష్టాలను
తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కార్యరంగంలోకి దూకుతారు. అప్పుడు ఎటువంటి
వివేకవంతుడు కూడా అనివార్యమైన కొన్ని పరిణామాలను జరగకుండా ఆపలేడు.
5) యుద్ధంలో తెలివితక్కువ తొందరపాటు గురించి మనం విని ఉన్నప్పటికీ,
సుదీర్ఘమైన కాలవిలంబన తెలివితో కూడి
ఉండటాన్ని మనం ఎప్పుడూ చూడలేదు.
(యుద్ధంలో తొందరపాటు ఒక్కోసారి తెలివితక్కువతనం కావచ్చు. కానీ
ఆలస్యం ఎప్పుడూ తెలివైనపని కాదు.)
6) దీర్ఘకాల యుద్ధం ద్వారా ఏదైనా దేశం ప్రయోజనం పొందిన సందర్భాలు
లేనేలేవు.
7) ఏ వ్యక్తి అయితే యుద్ధంలోని కష్టనష్టాల గురించి బాగా అవగాహన
కలిగి ఉంటాడో అతడు మాత్రమే యుద్ధాన్ని లాభదాయకమైన మార్గంలో నడపడాన్ని బాగా అర్థం
చేసుకోగలడు.
8) యుద్ధంలో నైపుణ్యం కలిగిన యోధుడు రెండవసారి సైన్యాన్ని భర్తీ
చేయడు. అలాగే నిత్యావసరాలను మూడవసారి రవాణా చేయడు.
(తగినంత సైన్యాన్ని, సరఫరాలను ఒకేసారి ఏర్పాటు చేసుకుంటారు. వీటిని దఫదఫాలుగా చేస్తూ కాలహరణం చేయరు)
9) యుద్ధ సామాగ్రిని ఇంటివద్దనుండి నీతోపాటు తీసుకెళ్ళు. కానీ ఆహార
పదార్థాలను మాత్రం శత్రువునుండి కొల్లగొట్టు. అలాచేస్తే సైన్యం తన అవసరాలకు
సరిపడినంత ఆహారాన్ని కలిగి ఉంటుంది.
10) రాజ్య ఖజానా పేదరికం సైన్యాన్ని దూరంనుండి అందే విరాళాల ద్వారా
పోషించడానికి కారణమవుతుంది. దూరాన ఉన్న ఒక సైన్యాన్ని పోషించడంలో పాలుపంచుకోవడం
ప్రజల పేదరికానికి కారణమవుతుంది.
11) మరోపక్క సైన్యం సమీపంలో కనుక ఉంటే ధరలు పెరుగుతాయి. అధిక ధరలు
ప్రజల సంపద హరించుకుపోవడానికి కారణమవుతాయి.
12) వారి సంపద హరించుకు పోయినపుడు పన్నుకట్టడం రైతాంగానికి
భారమైపోతుంది.
13) &14) ఆస్తి నష్టపోవడంతోనూ,
బలం క్షీణించిపోవడంతోనూ ప్రజల ఇళ్ళు పేదరికంతో బోసిపోతాయి. వారి ఆదాయంలో పదింట ఏడు
వంతులు వ్యర్థమైపోతుంది. విరిగిన రథాలకు, పూర్తిగా
అలసిపోయి, శక్తి క్షీణించిన
గుఱ్ఱాలకు, రక్షణ కవచాలకు,
శిరస్త్రాణాలకు, బల్లాలు, డాళ్ళు.
బాణాలు, విల్లంబులు, భారీగా ఉండే సరఫరా బళ్ళు, వాటిని లాగే ఎద్దులు మొదలైన వాటి కొరకు
ప్రభుత్వానికయ్యే ఖర్చులు దాని ఆదాయంలో పదింట ఆరు వంతులుంటుంది.
15) కనుక వివేకవంతుడైన సేనాని శత్రువు నుండి ఆహారాన్ని స్వాధీనం
చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు. శత్రువుకు చెందిన ఆహార పదార్థాలతో నిండిన
ఒక బండి, స్వంత ఆహార
పదార్థాలతో నిండిన ఇరవై బళ్ళతో సమానం. అలాగే ఒక ‘పికల్’ బరువున్న
శత్రువుకు చెందిన పశుగ్రాసం దానికి ఇరవై రెట్లున్న మన స్వంత పశుగ్రాసంతో సమనం.
(పికల్ అనేది చైనాలో ఒకప్పటి బరువు ప్రమాణం. ఒక పికల్ 65.5kg
లకు సమానం)
16) శత్రువును చంపడానికి సైన్యంలో ఆగ్రహాన్ని రెచ్చగొట్టాలి. శత్రువును
ఓడించడంలో సైన్యానికి లాభం కనబడాలంటే వారికి తగిన బహుమతులను ప్రకటించాలి.
17) కనుక రథ యుద్ధంలో పది లేక అంతకన్నా ఎక్కువ రథాలు
పట్టుబడినపుడు మొదటి రథాన్ని స్వాధీనం చేసుకున్న వారిని సత్కరించాలి. శత్రురథాల మీద ఉన్న జెండాల స్థానంలో
మన జెండాలను అమర్చాలి. పట్టుబడిన రథాలను మన రథాలతో కలిపి ఉపయోగించాలి. పట్టుబడిన
సైనికుల యెడల దయతో ప్రవర్తించాలి.
18) జయించిన శత్రువును స్వంతబలాన్ని పెంపు చేసుకోవడానికి
ఉపయోగించుకోవడంగా దీనిని పిలుస్తారు.
19) కనుక, యుద్ధంలో
నీ అతిముఖ్యమైన లక్ష్యం విజయమే గానీ, దీర్ఘకాలపు
యుద్ధం కాదు.
20) ఈ విధంగా సేనానాయకుడు అనేవాడు ప్రజల భాగ్యవిధాత. అతడు –ఒక జాతి సుఖశాంతులతో ఉండాలా…లేక కష్టాల పాలవ్వాలా– అన్నది ఆధారపడి ఉండే వ్యక్తి అని మనకు
తెలుస్తున్నది.